Saturday, October 13, 2012

ఖుర్షీద్ వివాదం: సర్కారీ సొమ్ముతో సొంత ట్రస్టులా?

రాజకీయ పార్టీలలో అన్ని రకాల వాళ్లూ ఉంటారు. ఉదాహరణకు మర్యాదస్తులూ, నీతిమంతులూ ఉంటారు; లేదా మర్యాదస్తుల్లా, నీతిమంతుల్లా కనిపించేవాళ్లూ ఉంటారు; గూండాలూ, ఫోర్ ట్వంటీలూ ఉంటారు. ఎందుకింత 'వైవిధ్యాన్ని' రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తూ ఉంటాయో తెలియదు. ఎప్పుడు ఎలాంటివాళ్లతో అవసరమవుతుందో నన్న ముందుచూపుతో కాబోలు అన్ని రకాల వాళ్ళనూ రాజకీయ పార్టీలు చేర్చుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు నూరేళ్ళకు పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో టోల్ కట్టమన్నందుకు తుపాకీ చూపించి బెదిరించిన పోర్ బందర్ ఎం.పీ తరహా రౌడీ ఎలిమెంట్లూ ఉంటాయి; మన్మోహన్ సింగ్, ఆంటోనీ, ప్రణబ్ ముఖర్జీ(ఇప్పుడు కాంగ్రెస్ మనిషని అధికారికంగా అనలేకపోయినా)లాంటి పెద్దమనుషులూ ఉంటారు.  బీజేపీలో కూడా డిటో.
కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గురించి ఎక్కువ తెలియదు కానీ, ఆయనకూడా ఎంతో మర్యాదస్తుడిలా, పెద్దమనిషిలా, సౌమ్యుడిలా, సంస్కారవంతుడిలా కనిపిస్తాడు. ఆయనను చూస్తే, అవినీతికి అక్రమాలకు పాల్పడగల మనిషని ఎంతమాత్రం అనిపించదు. ఇప్పుడు ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయనా, ఆయన భార్యా కొన్ని రకాల శారీరక సామర్థ్యాలు లోపించినవారి సహాయార్థం ఉత్తరప్రదేశ్ లో ఒక ట్రస్టు నిర్వహిస్తున్నారు. కేంద్ర సామాజిక, సాధికార మంత్రిత్వశాఖ ఆ ట్రస్టుకు 70 లక్షల రూపాయిలకు పైగా గ్రాంటు ఇచ్చింది. ఆ గ్రాంటు వినియోగంలో అవకతవకలు జరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ) ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఎన్.డీ.టీ.వీ అనే ఇంగ్లీష్ వార్తా చానెల్ తనకందిన ఆ నివేదికను బయట పెట్టింది. 17 జిల్లాలలో ట్రస్టు శిబిరాలు నిర్వహించవలసి ఉండగా, కొన్ని జిల్లాలలో నిర్వహించకుండానే నిర్వహించినట్టు చూపించిందనీ; అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిందనీ, ముందిచ్చిన గ్రాంటు ఎలా వినియోగమైందో చూడకుండానే పైన చెప్పిన మంత్రిత్వశాఖ మరో 60 లక్షలకు పైగా గ్రాంటు ఇచ్చిందనీ... ఆరోపణలలో కొన్ని.  ఇంతకు ముందే ఒక హిందీ చానెల్ ఖుర్షీద్ దంపతుల ట్రస్టులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించింది. అవి నిరాధారమైన ఆరోపణలంటూ ఖండించిన ఖుర్షీద్ దంపతులు ఆ చానెల్ పై కోర్టుకు వెడతామని కూడా హెచ్చరించారు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటం నేపథ్యంలో ఈ ఆరోపణలు మళ్ళీ తెరమీదికి రావడం వల్ల యావద్దేశం దృష్టినీ మరింతగా ఆకర్షించే అవకాశం ఏర్పడింది.
ఇందులో చెప్పుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అలాగే ప్రశ్నించుకోవలసినవీ ఉన్నాయి.
మొదటిదేమిటంటే, ఇటీవలి కాలంలో  సీఏజీ నివేదికలు తరచు సంచలనాత్మకం కావడం, చర్చలోకి రావడం, అవినీతికి ధృవీకరణ పత్రాలుగా గుర్తింపు పొందుతుండడం! టూ జీ వ్యవహారం ఇందుకు ప్రారంభం. ఇది ఒక విధంగా ఆశ్చర్యం, ఒక విధంగా సంతోషం కలిగించే పరిణామం. ఆశ్చర్యం ఎందుకంటే, ఆయా ప్రభుత్వశాఖలు నిధుల్ని ఎలా వ్యయం చేస్తున్నాయో పరిశీలించి, లోటు పాట్లను బయటపెడుతూ సీఏజీ నివేదికలు ఇవ్వడం ఆ వ్యవస్థ పుట్టినప్పటినుంచీ జరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఏటా అందే సీఏజీ నివేదికల కాపీలు మీడియాకు కూడా అందుతూ ఉంటాయి. వాటిలోకి ఓసారి అలవోకగా తొంగిచూసినా చాలు గుండె గుభేలు మంటుంది. కోట్లాది రూపాయిల ప్రజాధనం వృథా, దుర్వినియోగం అవుతున్న దృశ్యమే కళ్ళకు కడుతుంది. ప్రభుత్వం ప్రజాధనంపై ఎంత  బాధ్యతారహితంగా, ఎంత బేఫర్వాగా వ్యవహరిస్తోందో అనిపిస్తుంది. విచిత్రమేమిటంటే ప్రభుత్వాలు సీఏజీ నివేదికలను మొక్కుబడిగా చట్టసభలో పెట్టి ఊరుకుంటూ ఉంటాయి. వాటిని సీరియస్ గా తీసుకునే సందర్భాలు, వాటిపై చర్చ జరిగే సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ ప్రతిపక్షాలు నివేదిక ఎత్తిచూపించిన లొసుగులు, అవకతవకల గురించి ప్రశ్నిస్తే;  అది ఖరారు నివేదిక కాదనీ,  దానిపై వివరణ ఇచ్చామనీ, లేదా ఇస్తున్నామనీ ప్రభుత్వం చెబుతుంది. అంతటితో ఆ చర్చకు తెరపడుతుంది.  ప్రభుత్వం వివరణ ఇచ్చిందో లేదో, ఇస్తే ఏమని ఇచ్చిందో ఎవరికీ తెలియదు. ఎవరూ అడగరు.
సంతోషం దేనికంటే, ఇప్పుడు సీఏజీ నివేదికలు కూడా చర్చలోకి వస్తున్నాయి, సంచలనాత్మకం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలే. అది వాళ్ళ ప్రభుత్వమే. కానీ ఆ ప్రభుత్వంలో ఏవి ఎలా పనిచేస్తున్నాయో, ఏ పనిచేస్తున్నాయో వాళ్ళకు తెలియదు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన సీఏజీ లాంటి వ్యవస్థలను ప్రభుత్వాలు ఏ మేరకు పట్టించుకుంటున్నాయో తెలియదు. అంతకంటే ముఖ్యం, ప్రభుత్వం ఏది ఎందుకు చేస్తోందో తెలియకపోవడం.
 ఖుర్షీద్ దంపతుల ట్రస్టుకు కేంద్రమంత్రిత్వశాఖ గ్రాంటు ఇవ్వడమే తీసుకోండి. ఇది వింటే మీకు అత్త సొమ్ము అల్లుడు ధారపోసాడన్న సామెత గుర్తురావడం లేదా? వ్యక్తులు నిర్వహించే ట్రస్టుకు అసలు ప్రజల సొమ్ము ఎందుకివ్వాలి? ఇవ్వడంలోని హేతుబద్ధత ఏమిటి? శారీరక సామర్థ్యాలు లోపించినవారికి ఉద్దేశించిన ఆ సాయాన్నిప్రభుత్వం తన అధికారుల ద్వారానే అందించే ఏర్పాటు చేయచ్చుకదా? అధికారులపై ఇప్పటికే పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కనుక ఆ పని చేయలేమనుకుంటే, పూర్తిగా సేవారంగంలోనే ఉన్నవారికి, అది కూడా వాళ్ళ ప్రతిష్టను, చరిత్రను పరిశీలించి మరీ, ఆ గ్రాంటు ఇవ్వడంలో కొంత అర్థముంటుంది. ఖుర్షీద్ అలా కాదు, ఆయన రాజకీయాలలో ఉన్నారు. ట్రస్టు ద్వారా లభించే గుర్తింపు, పేరు ఆయనకు రాజకీయమైన పెట్టుబడిగా మారదా?  వ్యక్తులు రాజకీయంగా 'క్యాష్' చేసుకోడానికి ప్రజల సొమ్మును ప్రభుత్వం ధారదత్తం చేయడం ఎంత హాస్యాస్పదంగా, ఎంత ఆక్షేపణీయంగా ఉంటుంది? ఖుర్షీద్ కేంద్రంలో మంత్రిగా ఉంటారు! ఆ కేంద్రం ఆయనా, ఆయన భార్యా నడిపే ట్రస్టుకు లక్షలాది రూపాయలు గ్రాంటుగా ఇస్తుంది! ఇది ఎలాంటి సంకేతాలిస్తుంది? ప్రభుత్వంలో ఉన్న, లేదా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఒక ప్రత్యేక వర్గం ఆ ప్రభుత్వంనుంచి అన్ని రకాల సాయాన్ని పొందుతూ ఉంటుందన్న అభిప్రాయాన్ని జనంలో కలిగించదా?  అంతేకాదు, ప్రభుత్వం ఒక పెద్ద గూడుపుఠాణీ కేంద్రంలా కూడా కనిపిస్తుంది.
ఖుర్షీద్ ట్రస్టు ఒక్కటే కాదు, ప్రభుత్వం సాయం పొందే అలాంటి రాజకీయగోత్రీకుల ట్రస్టులు ఇంకా చాలా ఉంటాయి. క్రోనీ క్యాపిటలిజంతోపాటు ఇలాంటి క్రోనీ పోలిటికలిజం కూడా  చర్చలోకి  రావాలి. ఆశ్రిత రాజకీయవాదులకు ప్రజాధనం ధారపోయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాలి. ప్రజల దృష్టికి అంతగా రాని,  చట్టం ముసుగులోనే జరిగే ఇలాంటి లోపాయికారీ వ్యవహారాలకు ప్రభుత్వం ఇంతకాలం అలవాటుపడింది. పారదర్శకతకు రోజు రోజుకీ ప్రాధాన్యం పెరుగుతున్న నేటి దశలో ఆ అలవాటును మార్చుకోవాలి. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ఇంధనం అందిస్తున్న వాటిలో ప్రభుత్వంలో వేళ్ళుదన్నుకున్న పారదర్శకతా రాహిత్యం ఒకటన్న సంగతిని మరచిపోకూడదు.
అయితే రాజకీయవాదుల చర్మం దబ్బనం పోట్లకు కూడా లొంగనంతగా గిడసబారిపోయింది. ఖుర్షీద్ దంపతుల ఎదురుదాడే చూడండి. అంతా, తెలిసిన రాజకీయ సినిమా స్క్రిప్ట్ లానే సాగుతోంది. మరో రాబర్ట్ వద్రా తరహా ఘట్టం తయారవుతోంది. ట్రస్టులో అవకతవకలు జరిగాయో లేదో తెలుసుకోవడం మేడీజీ అయ్యే బదులు క్రమంగా  మేడ్ డిఫికల్ట్  అవుతుంది. అవకతవకలు జరగలేదనీ, ఆరోపణలు దురుద్దేశపూరితమనీ నొక్కి చెప్పడంలో చూపించే పూనకం తమ వాదనకు సంబంధించిన ఆధారాలను అప్పటికప్పుడు వెల్లడించడంలో కనబడదు. అది మరో రోజు ఎప్పటికో వాయిదా పడుతుంది. వివాదం చూస్తుండగానే చిక్కుముడులు పడిపోతుంది. జనానికి అసలు నిజం ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎవరు ఎలా ఘర్షణ పడ్డా అంతిమ క్షతగాత్రులు జనాలూ, నిజాలే!

  

No comments:

Post a Comment