Thursday, October 4, 2012

మిథ్యా పోరాటాలతో సాధించేదేమిటి?

చిల్లర వ్యాపారంలోకి 51 శాతం మేరకు విదేశీ పెట్టుబడు(ఎఫ్.డీ.ఐ)లను అనుమతించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. దానిపై జరిగే చర్చ కూడా షరా మామూలుగా వ్యతిరేక, అనుకూల రూపాలను తీసుకుంది. నిజానికి ఏ అంశం పై చర్చకైనా అనేక పార్స్వాలు ఉంటాయి. వర్తమానానికి సంబంధించిన అనేక సమస్యలు, అంశాల మూలాలు దశాబ్దాల, ఇంకా చెప్పాలంటే శతాబ్దాల కాలగర్భంలోనూ, చరిత్రగర్భంలోనూ ఉంటాయి. ఏ వివాదమైనా స్వయంభువు కాదు. దానికి తవ్విన కొద్దీ లోతు, చూడగలిగిన కొద్దీ దూరదూరాలకు విస్తరించే విరివీ ఉంటాయి. కనుక అనేక కోణాలనుంచి చూసి, మూలాలను తరచి  వస్తుగత దృష్టినుంచి చర్చించుకుంటే తప్ప దేనిపైనైనా అవుననీ కాదనీ చటుక్కున సమాధానం చెప్పడం సాధ్యంకాదు. అలాగే, నిశ్చలస్థితినుంచి కాక చలనశీలనతనుంచి ఒక సమస్యను పరిశీలించి అర్థం చేసుకోకుండా  దాని మంచి చెడులపై వెంటనే  తీర్పు చెప్పడం ఆత్మవంచన, మేధో వంచన అవుతుంది.
అయితే, ప్రజాస్వామ్యంలో చర్చ అలా ఉండదు. వస్తుగతచర్చా వేదికను రాజకీయ అవసరాలు, వ్యూహాలు తక్షణమే ఆక్రమించుకుంటాయి. ఆ సంకులసమరంలో సమస్య మూలాలను తరచే ఓపిక, తీరిక రెండూ ఉండవు. అంతకంటే ముఖ్యంగా అలా తరచి చూడడం స్వప్రయోజనాలకు ఉపయోగపడదు. వాస్తవాల జోలికి పోకుండా చర్చ ఎంత ఉపరితలంలో జరిగితే అంత మంచిది. అది కూడా తునకలు తునకలుగా (పీస్ మీల్) జరిగితే మరీ మంచిది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రప్రథమంగా బలయ్యేది వాస్తవమూ, వాస్తవిక దృష్టే. ఇక్కడ దేనిపైనైనా అవుననీ కాదనీ చటుక్కున తేల్చి చెప్పడం చాలా అవసరం. అలాగని   ప్రజాస్వామ్యం పనికిమాలినదని చెప్పడం లేదు. చంద్రుడిపై  ఉన్నట్టే,  ప్రజాస్వామ్యచంద్రుడి పైనా కొన్ని మచ్చలుంటాయి.
 చిల్లర వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడుల అనుమతిపై చర్చ కూడా యథావిధిగా ఉపరితలంలోనూ, పీస్ మీల్ గానే జరుగుతోంది. తొంభై దశకంలోనే ఆర్థిక సంస్కరణల రైలు బండి ఎక్కిన మనదేశం దాని తార్కిక గమ్యానికి చేరనవసరం లేదా అన్న ప్రశ్నను రాజకీయపక్షాలు కన్వీనియెంట్ గా దాటవేస్తాయి. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు ఆ వ్యాపారంపై ఆధారపడిన ఇరవై శాతం మంది పొట్ట కొడతాయని, ప్రభుత్వం చెబుతున్నట్టు ఉపాధి అవకాశాలు పెరగకపోగా ఉన్న ఉపాధి కూడా ఊడిపోతుందని,  400 బిలియన్ డాలర్ల చిల్లర వర్తకం విదేశీ శక్తుల హస్తగతం అయిపోతుందని విపక్షాలు అంటున్నాయి. 10లక్షల జనాభా దాటిన నగరాలలోనే బహుళజాతి చిల్లర కంపెనీలను అనుమతిస్తామనీ, వాటి కనీస పెట్టుబడి కూడా 10 కోట్ల డాలర్లు ఉండాలనీ, వాటిని అనుమతించాలా, మానాలా అన్నది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రప్రభుత్వాలకే ఉంటుందనీ ప్రభుత్వం అంటోంది.  కేవలం 20 శాతం చిల్లర వ్యాపారంలోకే బహుళజాతి సంస్థలు అడుగుపెడతాయనీ అంటోంది. ఆ వాదనను ఖండిస్తూ ఒక్కో శాతానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు పోతాయని ప్రతిపక్షాలు లెక్కలు విప్పుతున్నాయి. దేశీయ వస్తు తయారీ రంగంలో తగినన్ని సంస్కరణలు జరగలేదు కనుక, బ్యాంక్ రుణాల వడ్డీరేట్లు ఎక్కువగా ఉండడంతో ఉత్పత్తుల ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక, కార్మిక చట్టాలూ కఠినం కనుక చిల్లర వర్తకం లోకి ఎఫ్.డీ.ఐ అనుమతీస్తే చైనా లాంటి దేశాలు తమ  ఉత్పత్తులతో దేశాన్ని  ముంచెత్తి లాభ పడతాయని బీజేపీ నుంచి వినిపిస్తున్న వాదం. అయితే, చవకధరల చైనా ఉత్పత్తులు ఇప్పటికే దేశంలో పుష్కలంగా ఉన్నాయని దీనిపై వినిపిస్తున్న ఆక్షేపణ. మరోవైపు ఎఫ్.డీ.ఐని అనుమతించచ్చు కానీ రెండేళ్ళు వాయిదా వేయమని దేశీయంగా చిల్లర వ్యాపారంలో ఉన్న గొలుసు సంస్థలు అడుగుతున్నాయి. ఈ లోపల ఈ సంస్థలకు ఇప్పటికే అనుమతించిన విదేశీ సంస్థాగత పెట్టుబడుల పరిమాణాన్ని 51 శాతానికి పెంచితే, బహుళజాతి సంస్థలతో పోటీ పడే సామర్థ్యాన్ని అవి తెచ్చుకుంటాయని ఆ వర్గాల వాదం. దేశంలో 40 శాతం మేరకు పండ్లు, కూరగాయల ఉత్పత్తులు వినియోగదారులకు చేరేలోపలే పాడైపోతున్నాయనీ, ఎఫ్.డీ.ఐ  వల్ల శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరిగి, సరఫరా వ్యవస్థ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో బలపడి ఇలాంటి సమస్యలను నివారిస్తుందని ప్రభుత్వం అంటోంది. పండ్లు, కూరగాయలు చెడిపోవడం ఎక్కడైనా ఉందనీ, ప్రపంచవ్యాప్తంగా ఇది 34 శాతం ఉందనీ వ్యతిరేకుల వాదం.
ఈ మధ్యలోనే, 65 శాతం ఆహోరోత్పత్తులను ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ నిర్ణయం రైతులకు ఏవిధంగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలంటే ఏం చేయాలనే చర్చా జరుగుతోంది. బహుళజాతి చిల్లర వ్యాపారసంస్థలు నేరుగా రైతులతోనే లావాదేవీలు జరిపే వ్యవస్థను నిర్మించుకోకుండా దళారులపై ఆధారపడితే, ఈ నిర్ణయం వల్ల చిన్న,సన్నకారు రైతులకు ఎలాంటి లాభమూ ఉండదనీ; రైతులు నేరుగా బహుళజాతి సంస్థలతో లావాదేవీలు జరపాలంటే ముందుగా వారు ఒక సమాఖ్యగా సంఘటితం కావడం చాలా ముఖ్యమనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నిజానికి సంస్కరణల తాకిడిని తట్టుకోడానికి ఆయా వర్గాలను తగినంత బలోపేతుల్ని చేయాలన్న ఇలాంటి సూచనలకు చర్చలో ప్రాధాన్యమిస్తే ఆ దారి వేరు. ఆ కోణాన్ని తరచు విస్మరిస్తున్నాయనే ప్రభుత్వాలపై మొదటినుంచీ వినిపించే విమర్శ. కానీ రాజకీయ అనుకూల, వ్యతిరేక ఉద్ఘాటనల హోరు మధ్య ఈ చర్చ అణగారిపోతుంది. అలాగే, చిల్లర వర్తకంలో నూరు శాతం ఎఫ్.డీ.ఐని అనుమతించిన చైనా తదితర దేశాల్లో బహుళజాతి సంస్థల పని తీరూ చర్చలోకి వస్తోంది. వాల్ మార్ట్, టెస్కో, కర్రేఫోర్ లాంటి బహుళజాతి సంస్థలలో కొన్ని  గొప్పగా లాభాలు ఏమీ మూటగట్టడం లేదనీ, ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నాయనీ అంటున్నారు.
దేనిపైనైనా మంచి, చెడుల చర్చ జరగాల్సిందే. అయితే ఆ చర్చ తలా తోకా వదిలేసిన చర్చ కాకూడదు. నిజాల నేల విడిచిన సాము కాకూడదు. ఒకే బ్రాండ్ వస్తువుల చిల్లర వ్యాపారంలోకి 51 శాతం ఎఫ్.డీ.ఐకి ఎప్పుడో గేట్లు తెరిచారు. ఇప్పుడు చేయదలచుకున్నదల్లా దానిని బహుళ బ్రాండ్ల వ్యాపారంలోకి కూడా పొడిగించడమే. భార్తి అనే దేశీయ కంపెనీ భాగస్వామ్యంతో 'బెస్ట్ ప్రైస్' అనే పేరుతో వాల్ మార్ట్  మూడేళ్ళ క్రితమే చిల్లర వ్యాపారంలోకి అడుగుపెట్టి కొన్ని రాష్ట్రాల్లో దుకాణాలు నడుపుతోందన్న సంగతిని మరచిపోకూడదు. ఎంతో కాలంగా మన ఆహార సంస్కృతి విదేశీ వామనుడి మూడో పాదం కింద నలుగుతున్న సంగతినీ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో సబ్ వే, మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, డామినోస్, పిజ్జా హట్, టేకోబెల్, పనేరాబ్రెడ్, చిపోట్లే వంటి బహుళజాతి గొలుసు ఆహారశాలలు; మన ఇడ్లీ, సాంబార్, దోస, పెసరట్, ఉప్మా ఆహారశాలలను ఏమేరకు దెబ్బ తీసాయో, ముందు ముందు దెబ్బ తీయబోతున్నాయో ఎవరైనా లెక్కలు కడుతున్నారా? వాటికి వ్యతిరేకంగా పోరాటాలు లేవదీస్తున్నారా? బర్గర్, పిజ్జాలే కాక  ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్, బీకే వెజ్జీ, చలూపా, బరీటాబౌల్.. ఇలా అనేక కొత్త కొత్త పేర్లు మన ఆహార నిఘంటువులోకి ప్రవేశించి నేటి మన యువత నాలుకలపై నానుతున్న సంగతిని గమనిస్తున్నారా? బహుళజాతి ఆహారశాలలు ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ నే కాదు, మనది కాని రుచుల సంస్కృతినీ చక్కగా 'ప్యాక్' చేసి ఇస్తున్నాయి.
చిన్న చిన్న కిరాణా, కూరగాయల వర్తకుల ఉపాధికి బిగ్ బజార్, రిలయెన్స్ ఫ్రెష్ వంటి దేశీయ గొలుసు సంస్థల వల్లా నష్టం జరుగుతూనే ఉంది. మొన్నటివరకు పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం కూడా ఈ గొలుసు దుకాణాలకు గొడుగు పట్టిందన్న ఆరోపణ ఉంది. విదేశీ తిమింగలాల కంటె దేశీయ తిమింగలాలు నయమని వాదిస్తూ ఇక్కడ కూడా  'స్వదేశీ' 'విదేశీ' తేడాలు తీసుకొచ్చి చర్చను 'దేశభక్తి' వైపు మళ్లించేవారూ ఉంటారు. వాళ్ళకో నమస్కారం.
వాల్ మార్ట్ లాంటి బహుళజాతి చిల్లర సంస్థలు మనదేశంలోకి పెద్ద ఎత్తున అడుగుపెడితే మన ఆహారసంస్కృతితోపాటు షాపింగ్ అలవాట్లు మారి పోయే మాట నిజమే. దేశం పాశ్చాత్యప్రపంచానికి థర్డ్ రేటు అనుకరణగా మారి వ్యక్తిత్వాన్నిమరింత కోల్పోయే మాట అంతకంటె వాస్తవం. అయితే ఈ ప్రక్రియ మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడో బ్రిటిష్ కాలంలోనే ప్రారంభమైందన్నసంగతిని విస్మరించకూడదు. మన సాంప్రదాయిక విద్యలు అంతరించాయి. విద్య అందరికీ అందుబాటులోకి రావడం దాని సానుకూల పరిణామం అనుకున్నా అప్పుడు అడుగంటిపోయిన చేతివృత్తులు ఇంతవరకూ పైకి లేవలేదు. బ్రిటిష్ విద్య, ఉద్యోగ విధానం ఎందరిని భూమికి, చేతువృత్తులకు దూరం చేసిందో, వారంతా క్రమంగా నిరుద్యోగం కోరల్లో చిక్కుకుని ఎలా నలిగిపోయారో, ఇంకా ఎలా నలిగి పోతున్నారో మనకు తెలుసు ఇంగ్లీష్ కాన్వెంట్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ, మునిసిపల్, జిల్లాపరిషత్ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేశాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాటకరంగాన్నిసినిమాలానే, టీవీ సినిమా థియేటర్లను మింగేస్తోంది. ప్రతి మార్పూ ఎంతోమంది బతుకు తరువుపై గొడ్డలి వేటు అవుతూనే ఉంది. ఎవరు ఆపగలిగారు?   కాలువ మీద వంతెన కడితే తన ఉపాధి పోతుందని పడవ నడిపేవాడు దిగులు పడతాడు. అయినా వంతెన కడుతూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కడితే వందలాది గిరిజనగ్రామాలు మునిగిపోతాయి. అయినా ప్రాజెక్ట్ ఆగడంలేదు.
మన కాళ్ళ కింద నేలను ఏ పరాయి శక్తులో పెళ్లగించడానికి ప్రయత్నిస్తే సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటించవలసిందే. అయితే అది మిథ్యా పోరాటం అయితే ప్రయోజనం లేదు. ఉపరితలంగా, పీస్ మీల్ గా, రాజకీయ తక్షణ ప్రయోజనమే లక్ష్యంగా జరిగే ఉత్తుత్తి పోరాటం నవ్వు తెప్పిస్తుంది తప్ప నమ్మకం పుట్టించదు. విపక్షాలు చేస్తున్నది అదే. 1991 నుంచి అవి ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కానీ ఆపలేకపోయాయి. ఇవే పక్షాలు తాము అధికారంలో ఉన్నచోట సంస్కరణ మార్గం పడుతూనే ఉన్నాయి.  ప్రజల సమాచార లోపాన్ని,  భావోద్వేగాలను ఆసరా చేసుకుని పార్టీలు సాగించే రాజకీయ క్రీడ జనంలో గంద్రగోళాన్నిమాత్రమే పెంచుతోంది. పోరాటాలు మిథ్యా పోరాటాలుగా మారి పరువు కోల్పోతున్నాయి.
  మరి దీనికి పరిష్కారమేమిటి? తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచే పరిస్థితినుంచి బయటపడి మన గతిని మనమే శాసించుకునే పరిస్థితి వచ్చే వరకూ ఎదురుచూడడమే కనిపించే పరిష్కారం. ఏ రూపంలోనైనా  దేశం ఆర్థికంగా బలోపేతమైతే అప్పుడు బలాఢ్యస్థ్తితి(పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్)నుంచి మన సొంత అస్తిత్వాన్ని తిరిగి గెలుచుకోగలుగుతామేమో!


No comments:

Post a Comment