ఈ మధ్య నేను కవిత్రయ భారతాన్ని పూర్తిగా చదివాను. ఇదే మాట నేను వెల్చేరు నారాయణ రావు గారితో అంటే, కవిత్రయ భారతం మొత్తాన్ని చదివానని అన్నవారు నా కింతవరకు ఒక్కరూ కనిపించలేదు, మీ నోటే మొదటిసారి ఆ మాట వింటున్నానన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. అదలా ఉంచి, కవిత్రయ భారతం పై నాకు కలిగిన కొన్ని అభిప్రాయాలను మీతో పంచుకోడానికి ఈ చిన్న వ్యాసం.
కవిత్రయ భారతంపై సంప్రదాయ పండితులు, విశ్వవిద్యాలయాలలో బోధన చేసే పండితులు, పరిశోధకులు ఇప్పటికే అనేక విశ్లేషణాత్మక పరిశీలనలు చేశారు. వ్యాసాలు వెలువరించారు. నేను ఈ క్రింద పేర్కొంటున్న అంశాలను వారు ఎంతవరకు గమనించి చర్చించారో తెలియదు. నాకు తెలిసినంతవరకు కవిత్రయ భారతాన్ని సంప్రదాయ పండితులు, వారు ఏర్పరచిన మార్గంలో దానిపై పరిశోధనలు చేసినవారు విమర్శలకు అతీతమైన ఒక ప్రశంసాత్మక దృష్టితో, ఇంకా చెప్పాలంటే ప్రశ్నించడానికి వీలులేని భక్తి ప్రపత్తులతో చూస్తారు. బహుశా కట్టమంచి రామలింగారెడ్డి ఇందుకు మినహాయింపు అనుకుంటాను.
కవిత్రయ భారతంపై సంప్రదాయ పండితులు, విశ్వవిద్యాలయాలలో బోధన చేసే పండితులు, పరిశోధకులు ఇప్పటికే అనేక విశ్లేషణాత్మక పరిశీలనలు చేశారు. వ్యాసాలు వెలువరించారు. నేను ఈ క్రింద పేర్కొంటున్న అంశాలను వారు ఎంతవరకు గమనించి చర్చించారో తెలియదు. నాకు తెలిసినంతవరకు కవిత్రయ భారతాన్ని సంప్రదాయ పండితులు, వారు ఏర్పరచిన మార్గంలో దానిపై పరిశోధనలు చేసినవారు విమర్శలకు అతీతమైన ఒక ప్రశంసాత్మక దృష్టితో, ఇంకా చెప్పాలంటే ప్రశ్నించడానికి వీలులేని భక్తి ప్రపత్తులతో చూస్తారు. బహుశా కట్టమంచి రామలింగారెడ్డి ఇందుకు మినహాయింపు అనుకుంటాను.
సాంప్రదాయికంగా నన్నయ అక్షర రమ్యత,
ప్రసన్న కథ కలితార్ధ యుక్తి; తిక్కన నాటకీయత, నన్నయ వరవడిలో ఎఱ్ఱన పూర్తి చేసిన అరణ్య పర్వ శేషం అనే అంశాలతో పాటు పాత్ర పోషణ, రసం, శిల్పం వగైరాలు చర్చలోకి
వస్తుంటాయి. అయితే, కవిత్రయాన్ని
తులనాత్మకంగా పరిశీలించినవారు ఎవరైనా వున్నారో లేదో తెలియదు. నాకు కలిగిన అభిప్రాయాలు ఇవీ:
- నన్నయ
అనువాదం తిక్కన అనువాదంతో పోలిస్తే ఒక పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా, పరిష్కరణ ప్రధానంగా
జరిగినట్టు అనిపించింది. నన్నయ క్లుప్తతకు కూడా ప్రాధాన్య మిచ్చాడు. అయితే
నన్నయలో మూలాతిక్రమణలూ వున్నాయి.
- నన్నయ అనువాదంతో పోలిస్తే తిక్కన అనువాదం అంత పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా జరిగినట్టు అనిపించలేదు. ముఖ్యంగా కీచకవధాఘట్టాన్ని ఆయన విసుగు పుట్టించేటంతగా సాగదీశాడు. ఇతరత్రా ఆయన చూపించిన దక్షత దృష్ట్యా ఇది ఆశ్చర్యం కలిగించింది. శాంతిపర్వానువాదం అంతకంటే ఎక్కువగా విసుగుపుట్టిస్తుంది. అందులో భావాలేకాదు, అక్కడక్కడ కథలు కూడా పునరుక్తమయ్యాయి. తిక్కన వాటిని ఎందుకు పరిహరించలేదో! బహుశా నన్నయ ఆ పని చేసివుండేవాడనిపించింది. తిక్కన నన్నయకంటే ఎక్కువ పర్వాలను అనువదించడంవల్ల, అనువాదానికే తప్ప, పరిష్కరణకు, ప్రణాళికకు ప్రాధాన్య మిచ్చి వుండకపోవచ్చు. నన్నయ, తిక్కనల మధ్య శైలీ భేదం కూడా ఎక్కువే. నన్నయది ప్రధానంగా పౌరాణిక శైలి అయితే తిక్కన దృశ్యకావ్య శైలిని అనుసరించాడు. నిజానికి మహాభారతానికి నన్నయ పౌరాణికశైలే ఎక్కువగా నప్పిందేమో ననిపించింది.
- అయితే, తిక్కన విశ్వరూపం యుద్ధపర్వాలలో కనిపిస్తుంది. వాటిని ఆయన అత్యద్భుతంగా అనువదించాడు. తిక్కనలో 'నాటకీయ' శిల్పం ఎక్కువన్న అభిప్రాయాన్ని సవరించుకోవాలేమో నని కూడా అనిపించింది. ఎందుకంటే, ఆయన యుద్ధపర్వాల నిర్వహణ నేటి భాషలో చెప్పాలంటే పూర్తిగా సినిమాటిక్. యుద్ధ సమయంలో వుండే ఉద్రిక్తత(టెన్షన్)ను, ఉద్విగ్నతను, ఆవేశ, కావేశాలను, భావావేశాలను తిక్కన అనితర సాధ్యంగా రక్తి కట్టించాడు. ద్రోణ పర్వంలో అది మరింత పరాకాష్టలో కనిపిస్తుది. తిక్కన ప్రతిభకు విరాటపర్వాన్ని ఎక్కువగా ఉదహరిస్తుంటారు. నా ఉద్దేశంలో ఆయన భారతానువాదంలో యుద్ధపర్వాలే హైలెట్.
- తిక్కన చిత్రించిన యుద్ధఘట్టాలు చదువుతుంటే మహాభారతయుద్ధాన్ని సినిమా తెరకు ఎక్కించే ప్రయత్నం ఇంతవరకు ఎవరూ ఎందుకు చేయలేదో నని కూడా అనిపించింది. (తెలుగులో వచ్చిన సినిమాలు తిక్కన చిత్రీకరణ స్థాయికి వేల మైళ్ళ దూరంలో ఉన్నాయి. మహాభారతం లోతు తెలుగు సినిమా దర్శకులకు అంతుబట్టినట్టు తోచలేదు. బహుశా తెలుగు సినిమాకు గల కొన్ని పరిమితులు అందుకు కారణం కావచ్చు). హాలీవుడ్, కనీసం బాలీవుడ్ స్థాయిలో(వార్ ఆఫ్ ట్రాయ్ వగైరా సినిమాల తరహాలో) జరగవలసిన ప్రయత్నం అది. విశేష మేమిటంటే, తిక్కన అనువాదాన్ని యథాతధంగా స్క్రీన్ ప్లేగా వాడుకోవచ్చు. అంతేకాదు, 'స్క్రీన్ ప్లే రచయిత' గా టైటిల్స్ లో ఆయన పేరు ఇచ్చి తీరాలి.
- ఎర్రాప్రగడ అరణ్య పర్వశేషం నిజంగా నన్నయ అనువాద స్థాయిలో ఉండడమే కాదు, ఆయనను మించినదేమో నానిపించింది. ముఖ్యంగా కౌశిక-ధర్మవ్యాధోపాఖ్యానాన్ని ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. దానిపై నేను చేసిన ఒక విశ్లేషణను ఈ బ్లాగులో చేర్చబోతున్నాను.
చాలామందికి కోపం రావచ్చేమోకానీ, మహాభారతాన్ని ఒక పేలవమైన రచనగా పరిగణించేవారూ
ఉన్నారు. ఉదాహరణకు, అది విసుగుపుట్టించే ఒక రూపరహిత రచన అని ప్రముఖ చరిత్రకారుడు డీ.డీ. కోశాంబి అంటాడు.
ఇష్టానుసారం ఉపాఖ్యానాలను చేర్చి అసలు కథారూపాన్ని దారుణంగా చెడగొట్టారని కూడా ఆయన వ్యాఖ్య. మహాభారతంతో పోల్చితే హోమర్ 'ఇలియడ్' కావ్యం అన్నివిధాలా ఉత్తమరచన అని కూడా కోశాంబి అంటాడు. కోశాంబి అభిప్రాయాలే ప్రామాణికాలని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇలాంటి వివిధ దృక్కోణాలనుంచి మహాభారత పరిశీలన
జరిపిన తెలుగు పండితులు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నను ముందుకు తేవడానికే ఈ ప్రస్తావన. అలాగే, తెలుగు భారతాన్ని
సంస్కృత భారతంతో ఎవరైనా తైపారా వేశారో లేదో కూడా తెలియదు. పై అభిప్రాయాలపై మీ
స్పందనతోపాటు, మీకు తెలిసిన సమాచారాన్ని ఆహ్వానిస్తున్నాను.
కవిత్రయ భారతం గురించి మీ పరిశీలనలు ఆసక్తికరంగా ఉన్నాయి!
ReplyDeleteనన్నయ మాత్రమే కాదు; తిక్కన, ఎర్రన కూడా వ్యాసభారతాన్ని యథాతథంగా అనువాదం చేయలేదు.
‘ఆంధ్రమహాభారత పీఠికలు’ అనే పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం రెండేళ్ళ క్రితం ప్రచురించింది. ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. దీనిలో సభాపర్వం గురించి దివాకర్ల వేంకటావధాని రాశారు. నన్నయ విడిచేసిన, సంక్షేపించిన, మూలాన్ని పెంచి, క్రమం సరిగా ఉండేలాగా మార్చి రాసిన భాగాలను దానిలో వివరించారు.
ఎర్రాప్రగడ అనువాదంపై మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తాను.
వేణుగారూ, మీ స్పందనకు, సమాచారానికి కృతజ్ఞతలు. ఎఱ్ఱాప్రగడ అనువాదం మీద కాదుకానీ కౌశిక-ధర్మవ్యాధోపాఖ్యానం మీద నా విశ్లేషణను ఈ రోజే పోస్ట్ చేశాను. చూసి మీ అభిప్రాయం చెప్పండి.
ReplyDeleteకల్లూరి భాస్కరం