కిందటి బ్లాగ్ కు నేను ‘రాబర్ట్ సల్మాన్ గడ్కరి’ అని పీరు పెట్టాను. అది ఆరోపణల వరసక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని. అయితే, ఆరోపణల ‘విలువ’ను దృష్టిలో
పెట్టుకున్నప్పుడు సల్మాన్ ను గడ్కరీ కంటే ముందు పేర్కొనడం అన్యాయమనిపించింది.
పాపం, పూర్ సల్మాన్ మీద వచ్చిన ఆరోపణ ‘విలువ’ 71 లక్షలే. గడ్కరీపై వచ్చిన ఆరోపణ ‘విలువ’ కోట్లలో ఉంది. ఆ విధంగా చూసినప్పుడు ‘రాబర్ట్ గడ్కరీ
సల్మాన్’ అనడమే న్యాయం.
రాజకీయనాయకుడు వ్యాపారి
కావడం గురించి పై బ్లాగ్ లో చెప్పుకున్నాం. రాజకీయనాయకుడు వ్యాపారి కావడమే కాదు; వ్యాపారమంటే ‘సంఘసేవ’ అన్న కొత్త నిర్వచనాన్ని అందించి, రాజకీయ
వ్యాపారిని ‘సంఘసేవకుడు’ గానూ
మార్చగలడు. రాజకీయం మహిమ అలా ఉంటుంది.
తిమ్మిని బమ్మి చేయడం అంటారు చూడండి, అది ఇదే. వెనకటి కొకాయన
రాజకీయనాయకులు ఎలాంటి వారో చెబుతూ, నీళ్ళు లేని కాలువ మీద
వంతెన కట్టిస్తామని చెప్పగల సమర్థులంటాడు. తాము ఏం చెప్పినా జనం నమ్మేస్తారన్న
నమ్మకంతో రాజకీయనాయకులు అలా చెబుతారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
జనం నమ్మడం లేదని తెలిసిన తర్వాత కూడా రాజకీయనాయకులు నమ్మశక్యం కాని మాటలు
మాట్లాడుతూనే ఉంటారు. అలాగే, ఈ విద్యలో నూరేళ్ళకు పైగా
చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘనాపాటి అని చాలామంది అనుకుంటారు. అదీ అర్థసత్యమే. ‘పార్టీ ఆఫ్ డిఫరెన్స్’ గా తనను అభివర్ణించుకునే
బీజేపీ ఈ విద్యలో కాంగ్రెస్ కంటె నాలుగు పన్నాలు ఎక్కువే చదువుతోంది. కావాలంటే శని, ఆదివారాలు(20, 21 అక్టోబర్) ఎన్.డీ.టీ.వీ ప్రసారం
చేసిన గడ్కరీ-శ్రీనివాస్ జైన్ ముఖాముఖీ చూడండి.
‘పార్టీ ఆఫ్
డిఫరెన్స్’ జాతీయ అధ్యక్షుడు తనపై వచ్చిన ఆరోపణలకు ‘సాహసో’పేతంగా సమాధానం చెప్పడంలోనే ‘డిఫరెంట్’ గా వ్యవహరించారు. కాకపోతే ఆ సాహసం ‘బరితెగింపు’ గా ధ్వనించడమే ఆందోళన కలిగించే విషయం.
నేను చేసేది వ్యాపారం కాదు, సంఘసేవ అనడమే కాదు; తన కంపెనీ షేర్లు ఎవరు కొన్నా తనకు అభ్యంతరం లేదనీ;
రాజకీయనాయకులకు వ్యాపారులతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నా తప్పులేదనీ కుండ బద్దలు
కొట్టారు. తన వ్యాపార లావాదేవీలలో భిన్న ప్రయోజనాల మధ్య ఘర్షణ(కాన్ఫ్లిక్ట్ ఆఫ్
ఇంటెరెస్ట్స్) ఎక్కడా లేదని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. నిజంగానే ఆయన
విదర్భ పేద రైతులకు సాయం చేయడానికే చక్కెర కర్మాగారాన్ని స్థాపించారనీ, దానిని లాభసాటి వ్యాపారంగా కాకుండా సంఘసేవ గానే భావించారనీ మాట వరసకు
అనుకుందాం. అయితే,
ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు న్యాయబద్ధంగా,
చట్టబద్ధంగా వ్యవహరించడమే కాదు; వ్యవహరిస్తున్నారన్న
విశ్వాసాన్ని జనానికి కలిగించాలన్న ప్రాథమిక నీతిని విస్మరించడమే ఆశ్చర్యకరం.
అందులోనూ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి!
ఆరోపణల తీరు చూడండి:
1. 1995-99 మధ్యకాలంలో గడ్కరీ మహారాష్ట్రలో ప్రజాపనుల శాఖ మంత్రిగా
ఉన్నారు. అప్పుడే ఐడియల్ రోడ్ బిల్డర్స్ అనే కంపెనీ వ్యాపారం 41 కోట్ల నుంచి 67
కోట్లకు పెరిగింది. మంత్రిపదవి ముగిసిన తర్వాత గడ్కరీ పూర్తీ గ్రూప్ కంపెనీలను
స్థాపించారు. 2001లో ఐడియల్
బిల్డర్స్ పూర్తీ గ్రూప్ కంపెనీలలో 1.85 కోట్ల విలువైన షేర్లు తీసుకుంది. అంటే, ప్రజాపనుల శాఖ మంత్రిగా గడ్కరీ సొంతపనులు చక్కబెట్టుకోడానికి ముందే
పూర్వరంగాన్ని నిర్మించుకున్నారని ఆరోపణ.
2. ఐడియల్ బిల్డర్స్ యజమాని డీ.పీ. మహిస్కర్ గ్లోబల్ సేఫ్టీ విజన్ పేరుతో ఇంకో కంపెనీని
ప్రారంభించారు. ఆ కంపెనీ 2010లో పూర్తీ గ్రూప్ కు 165 కోట్లు రుణం ఇచ్చింది.
అప్పటికి గ్లోబల్ సేఫ్టీ విజన్ ఖాతాలో ఉన్న సొమ్ము లక్ష రూపాయిలు మాత్రమే!
3. పూర్తీ గ్రూప్ కంపెనీలకు ఛైర్మన్ గా ఉన్న గడ్కరీకీ ఆ
కంపెనీలలో ఉన్నది కేవలం 200 షెర్లే! పేరుకి ఆ కంపెనీలలో వాటాదారులు పది వేలమంది
ఉన్నా 70 శాతం యాజమాన్యం 18 కంపెనీలకే ఉంది. తీరా ఎన్.డీ.టీ.వీ విలేఖరులు కోల్కతా, ముంబై లలో ఉన్న ఈ కంపెనీల చిరునామా
వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే, 20 ఏళ్లుగా అదే చిరునామాలో
కాపురం ఉంటున్న వాళ్ళు కూడా అక్కడ ఎలాంటి కంపెనీ లేదని చెప్పారు. దానిపై గడ్కరీని
ప్రశ్నిస్తే, కంపెనీలు తరచు చిరునామా మార్చుకుంటూ ఉంటాయని
చెప్పారు. పదివేల మంది వాటాదారులు
ఉన్నప్పుడు అందరి చిరునామాలు నా కెలా తెలుస్తాయని బుకాయించారు. ఈ కంపెనీల
డైరెక్టర్ల ఆచూకీని కూడా ఎన్.డీ.టీ.వీ విలేఖరులు కనిపెట్టలేకపోయారు. తమాషా ఏమిటంటే, ఒకే
వ్యక్తి చాలా కంపెనీలకు డైరక్టర్ గా ఉన్నాడు. అంతకంటే తమాషా ఏమిటంటే, గడ్కరీ డ్రైవర్ పూర్తి డైరక్టర్లలో ఒకడట!
ఈ దేశంలో కంపెనీల వ్యవస్థ పారదర్శకతకు ఎంత దూరంగా ఉందో పైన పేర్కొన్న ప్రతి
వివరమూ కళ్ళకు కట్టిస్తుంది. అంతేకాదు, అలా ఉండడంలో అన్ని పార్టీలకూ ఒకే విధమైన ‘వెస్టెడ్
ఇంటరెస్ట్’ ఉంది. హర్యానా ప్రభుత్వం రాబర్ట్ వద్రాకు అసాధారణ
వేగంతో ఉపకారాలు చేసిపెట్టలేదా అని డెవిల్స్ అడ్వకేట్ లో కరణ్ థాపర్ ప్రశ్నిస్తే, అందులో ఎక్కడైనా చట్ట విరుద్ధత ఉందా అంటూ దిగ్విజయ్ సింగ్ పదే పదే
రెట్టించి అడిగారు. అలాగే, ప్రజాపనుల మంత్రిగా మీరు ఐడియల్
బిల్డర్స్ కు ఉపకారాలు చేశారనీ, అందుకే ఆ కంపెనీ మీ కంపెనీలో
పెట్టుబడులు పెట్టిందనీ, ఇందులో ‘క్విడ్
ప్రోకో’ ఉందనే ఆరోపణకు మీరేమంటారని శ్రీనివాసన్ జైన్ అడిగితే; మంత్రిగా నేను తీసుకున్న చర్యల్లో చట్ట విరుద్ధత ఎక్కడైనా ఉంటే
చూపించండని గడ్కరీ అన్నారు. పార్టీలు వేరైనా దిగ్విజయ్,
గడ్కరీల ‘భాష’ ఒకటే...గమనించండి.
రాజకీయనాయకులకు,
చివరికీ మంత్రులకు కూడా వ్యాపారులతో, కాంట్రాక్టర్లతో స్నేహ
సంబంధాలు ఉండడంలో తప్పులేదని గడ్కరీ అనడం ఆశ్చర్యం కాదు,
దిగ్భ్రాంతి కలిగిస్తుంది. న్యాయమూర్తులు ఏదైనా కేసు విచారణలో ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ ఉందని భావించే అవకాశం
ఉంటే, ఆ విషయం వెల్లడించి సంబంధిత బెంచ్ నుంచి తప్పుకోవడం
చూస్తుంటాం. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవద్దనీ, పార్టీలు వగైరాలకు వెళ్లవద్దనీ సుప్రీంకోర్ట్ ప్రధానన్యాయమూర్తి జడ్జీలను
హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ ఆఫ్ డిఫరెన్స్ జాతీయ అధ్యక్షుడి ప్రవర్తనా
నియమావళిని అనుసరించి జడ్జీలు కూడా వ్యాపారులతో,
కాంట్రాక్టర్లతో, రాజకీయనాయకులతో పూసుకు తిరగచ్చు!
బ్యూరోక్రాట్లు మాత్రం ఏం పాపం చేశారు? వాళ్ళూ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయనాయకులతో చెట్టపట్టాలు
వేసుకోవచ్చు!
రాజకీయనాయకులు ఎంత దూరం వెళ్లారో చూడండి. వాళ్ళ ప్రవర్తనా నియమావళిలో ‘ఔచిత్యం’ అనే మాట ‘పూర్తి’గా అదృశ్యమైపోయింది. ‘చట్టబద్ధం’గా ఉంటేచాలు, ఏం చేసినా తప్పులేదు! మళ్ళీ చట్టాలు
చేసేదీ వాళ్లే నన్న సంగతిని మరచిపోకూడదు.
అంతవరకు మహారాష్ట్రకు మాత్రమే తెలిసిన గడ్కరీ ఒక్కసారిగా బీజేపీ జాతీయ అధ్యక్ష
స్థాయికి ఎదిగిన తీరు అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ‘ఔట్ ఆఫ్ బ్లూ’ అనే
ఆంగ్ల నుడికారం గుర్తొచ్చింది. గతంలో ప్రచారక్ గా పనిచేసిన గడ్కరీ బీజేపీ
అధ్యక్షుడు కావడంలో ఆర్.ఎస్.ఎస్. పాత్ర ఉందనీ, ఆయన ఆ సంస్థకు
చాలా ఇష్టుడనీ వినిపించింది. ‘శీలనిర్మాణానికి’ ప్రాధాన్యమిచ్చేదిగా భావించే ఆర్.ఎస్.ఎస్; గడ్కరీ ప్రవచించిన ‘దుశ్శీల ప్రవర్తనా నియమావళి’ని ఎంతవరకు ఆమోదిస్తుందన్నది శేషప్రశ్న.
No comments:
Post a Comment