Wednesday, October 17, 2012

'రాబర్ట్ సల్మాన్ గడ్కరీ'

భమిడిపాటి రాధాకృష్ణ రాసిన 'కీర్తిశేషులు' నాటకంలో ఒక 'పంచ్' డైలాగ్ ఉంది.
కవిగారికి సన్మానం చేస్తానంటూ ఓ వ్యక్తి వస్తాడు.
కవిగారికి ఓ  అన్న ఉంటాడు. అతని పేరు మురారి. అతను నటుడు, తాగుబోతు కూడా.  సన్మానం చేస్తానన్న వ్యక్తితో మురారి అంటాడు:
'ఓహో! మీది సన్మానాల వ్యాపారమన్న మాట'
అతనిలా అంటాడు:
'భలేవారే...నాకు పొలం పుట్రా, గొడ్డు గోదే ఉన్నాయండీ'
మురారి అంటాడు:
'అయితే ఇంకేం? బాగా లాభాలు గడించారన్నమాట'

అరవింద్ కేజ్రీవాల్ బృందం నితిన్ గడ్కరీ పై చేసిన ఆరోపణల వెలుగులో పై సంభాషణను ఇలా చెప్పుకోవచ్చు:
మురారి: ఓహో! మీది రాజకీయ వ్యాపారమా?
గడ్కరీ: భలేవారే...నాకు ప్రభుత్వం ఇచ్చిన నూరెకరాల భూమీ, అయిదు పవర్ ప్లాంట్లూ, మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నాయండీ.
మురారి: అయితే ఇంకేం? బాగా లాభాలు గడించారన్నమాట.

తనను వ్యాపారి అన్నందుకు గడ్కరీ అరవింద్ టీం ను ఆక్షేపించారు.
కానీ తనకు పవర్ ప్లాంట్లూ, చక్కెర కర్మాగారాలు లేవని అనలేదు. గడ్కరీ, ఆయన పార్టీ సహచరుల దృష్టిలో అది వ్యాపారం కాదు. విదర్భ రైతులకు ఆయన లాభాపేక్ష లేని సాయం చేస్తున్నారు. అంటే ఎన్.జీ.ఓ తరహా పని చేస్తున్నారన్న మాట.
సామ్యం చూడండి...సల్మాన్ ఖుర్షీద్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటారు...ఉంటూనే ఒక ప్రభుత్వేతర ట్రస్టుకు అధ్యక్షుడిగా ఉండి కొన్ని శారీరక సామర్థ్యాలు లోపించిన వారికి సాయం చేస్తుంటారు. అలాగే, గడ్కరీ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉన్నారు. అవకాశాలు కలిసొస్తే భవిష్యత్తులో కూడా మంత్రి అవుతారు. ఒకప్పుడు కేంద్రంలో, ప్రస్తుతం అనేక రాష్ట్రాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టీకి అధ్యక్షుడుగా ఉంటారు. మరోవైపు కాంగ్రెస్ సల్మాన్ లానే ఎన్.జీ.వో తరహా పని చేస్తూ ఉంటారు. విచిత్రం చూడండి, ప్రభుత్వంలో ఉన్న, లేదా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నవాళ్లే ప్రభుత్వేతర సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వాలకన్నా బాగా అవే పనిచేస్తాయన్న మెసేజ్ ఇస్తుంటారు.
 ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం మనం చూస్తుంటాం. ఇది కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది.

ప్రభుత్వం రైతులనుంచి సేకరించిన భూమిని ఇంకొకరికి ఇవ్వడం చట్టవిరుద్ధం కాదా, అదనంగా సేకరించిన భూమిని తిరిగి రైతులకే అప్పగించాలని నిబంధనలు చెప్పడం లేదా, మరి గడ్కరీ ప్రభుత్వ భూమిని ఎలా తీసుకున్నారని అడిగితే; బీజేపీ అధికారప్రతినిధి నిర్మలా సీతారామన్ జవాబు గమనించండి: ఆ భూమిని ఆయన సొంతానికి వాడుకోడంలేదట...విదర్భ పేదరైతులకు సాయం చేస్తున్నారట...అంటే ఏమిటన్నమాట?  గడ్కరీ లాంటి రాజకీయనాయకులు ప్రభుత్వంలో ఉండి చట్టాలు చేస్తుంటారు. వాళ్ళే మళ్ళీ 'పేదల కోసం' రాబిన్ హుడ్ అవతారమెత్తి చట్టాన్ని ఉల్లంఘిస్తుంటారు!
ప్రజల వివేచనాశక్తి మీద వీళ్ళకెంత చులకనభావమో!

రాజకీయనాయకులు తెర మీద రాజకీయాలు చేస్తుంటారు. తెరవెనుక వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వెనకటి రోజుల్లో నెహ్రూ, పటేల్, టంగుటూరి ప్రకాశం లాంటి వాళ్ళు ఎంతో లాభసాటి వృత్తులు, వ్యాపారాలు విడిచిపెట్టి రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పటి వాళ్ళు వ్యాపారాలు చేసుకోడానికీ, ఉన్న వ్యాపారాలను పెంచుకోడానికీ రాజకీయాలలోకి వస్తున్నారు.  అయితే, వీళ్ళు తెర మీద చేసే రాజకీయాలే ప్రజలకు తెలుస్తాయి. తెర వెనుక చేసే వ్యాపారాలు తెలియవు. తెలియాలని రాజకీయనాయకులు అనుకోరు. చంద్రుడిలా ఈ రాజకీయచంద్రులు కూడా జనానికి తమ ఒక ముఖాన్నే చూపిస్తారు. ఇది ఇంకానా, ఇకపై చెల్లదన్న హెచ్చరికను అరవింద్ బృందం తాజా చర్య అందించగలిగితే అదే పదివేలు.

అసలు వ్యాపారాలు చేసుకునేవాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొస్తారు; లేదా రాజకీయాలలోకి వచ్చి వ్యాపారులుగా ఎందుకు మారుతుంటారన్నది ఎంతో కాలంగా జవాబుకు, చర్చకు దూరంగా ఉన్న ప్రశ్న. ఆ చర్చను ముందుకు తీసుకువెళ్లినా అరవింద్ ప్రభృతులు అభినందనీయులే. నిజానికి 'రాజకీయం-వ్యాపారం' కాంబినేషన్ చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. పారదర్శకత లోపించినప్పుడు అది మరింత అసహ్యంగా ఉంటుంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి వస్తున్నారంటే, రాజకీయాలలో ఖర్చు పెట్టడానికి కావలసినంత 'మిగులు' వ్యాపారంలో, పరిశ్రమల్లో సంపాదిస్తూ ఉండాలి. అలాగే, తెర వెనుక వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోడానికి రాజకీయ బుల్లెట్ ప్రూఫ్ ధరిస్తూ ఉండాలి. ఇంతకన్నా ఊహించగలిగిన కారణాలు కనిపించవు.

ఈ రాజకీయ-వ్యాపార లింకును ఛేదించడం దీనికి ఒక పరిష్కారమా? ఎలాగంటే, రాజకీయాలలో ఉంటూ వ్యాపారాలు చేయకూడదనే నిబంధన తేవచ్చు. అప్పుడు రాజకీయనాయకులు బతకడమెలా అన్న ప్రశ్న వస్తుంది. పార్టీల  ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలన్న సూచనలా, రాజకీయనాయకులకు జీతం ఏర్పాటు చేయాలన్న సూచనను పరిశీలించచ్చు. ఇవి ఆచరణయోగ్యం కావనుకుంటే మరో ఉపాయాన్ని చూడచ్చు. సమస్యను గుర్తించడమంటూ జరిగితే పరిష్కారమార్గంలో సగం దూరం వెళ్ళినట్టే.

కాంగ్రెస్ సల్మాన్ తోనే కాదు, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన రాబర్ట్ వద్రాతో కూడా బీజేపీ గడ్కరీకి ఎంత బాగా పోలిక కుదిరిందో చూడండి... రాబర్ట్ వద్రాకు కావలసిన అనుమతులను హర్యానా ప్రభుత్వం రెండు రోజుల్లోనే ఇస్తే, గడ్కారీకి కావలసిన పనులను ఎన్సీపీకి చెందిన మంత్రి అజిత్ పవార్ నాలుగు రోజుల్లోనే చేసి పెట్టారు!

అరవింద్ టీం ను బీజేపీ బీ-టీం అని ఆరోపిస్తున్నారు కానీ; పై పోలికల దృష్ట్యా చూస్తే బీజేపీని కాంగ్రెస్ బీ-టీం గా అభివర్ణించడం ఎంతైనా న్యాయంగా ఊంటుంది.

రాజా లాంటి కాంగ్రెస్ ఏ-టీం ఉండగా బీజేపీ బీ-టీం దేనికన్నది ఎప్పటినుంచో జనం ముందు వ్రేలాడుతున్న ప్రశ్న!


1 comment:

  1. dongalu, dongalu voorlu panchukovadam ante ide. appudu ippudu ellappudoo saamanyude bali pashuvu.

    ReplyDelete