Monday, October 1, 2012

గాంధీ గురించి సరదాగా కొన్ని...

గాంధీజీతో ఈమధ్య నేను ఏణ్ణర్థంపాటు సహజీవనం చేశాను. అదెలా అనుకుని మీరు ఆశ్చర్య పోతున్నారేమో... మరేం లేదు, గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ రచించిన 'మోహన్ దాస్' అనే ఆంగ్ల రచనను తెలుగులోకి అనువాదం చేస్తూ...ఎమెస్కో ఆ అనువాదాన్ని ప్రచురించింది.

గాంధీ గురించిన ఆ ఉద్గ్రంథాన్నిఅనువాదం చేస్తూ గడపడమంటే, 'అక్షరాలా' గాంధీతో సహజీవనం చేయడమే. ఆ రచన గాంధీ జీవిత, వ్యక్తిత్వాలను అనేక కోణాల నుంచి ఆవిష్కరించింది. కొన్ని కొన్ని ఘట్టాలు నన్ను ఎంత ఆకట్టుకున్నాయంటే, ఇంట్లో పిల్లలతోనూ, ఇంటికొచ్చిన మిత్రులతోనూ అప్పటికప్పుడు వాటిని పంచుకోకుండా ఉండలేకపోయేవాణ్ణి. ఇవాళ అక్టోబర్ 2 కనుక  వాటిలో రెండు మూడు మీతో పంచుకోవాలనిపించింది.
                                                                    ***

గాంధీ నడకలో గొప్ప నాటకీయత ఉట్టిపడుతూ ఉండేది. ఓసారి ఆయన దక్షిణాఫ్రికా నుంచి లండన్ వెళ్ళిన సందర్భంలో జాతీయభావనతో ఉత్తేజితులవుతున్న అక్కడి భారతీయ యువ విద్యార్థి బృందం ఒకటి ఆయనను డిన్నర్ కు ఆహ్వానించింది. భారతీయ యువతను తీవ్రవాద పంథానుంచి తప్పించి తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న గాంధీ, వెంటనే వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. అయితే, నిర్ణీత సమయం కంటే చాలా ముందే అక్కడికి వెళ్ళాడు. అప్పటికి ఆ కార్యక్రమ బాధ్యులెవరూ రానే లేదు. లోపల వంటశాలలో వంటకాలు సిద్ధమవుతున్నాయి. గాంధీ నేరుగా వంట వాళ్ళతో చేరిపోయాడు. వంటలో వాళ్ళకు సాయం చేశాడు. ఆయనే ఆ విందు సమావేశంలో ముఖ్య అతిథి అని వాళ్ళకు తెలియదు.

అంతేకాదు, వంట అయిన తర్వాత భోజనం బల్లలు, కుర్చీలు సర్దడంలో కూడా గాంధీ  సాయం చేశాడు. నిర్వాహకులు వచ్చాక, ఆయనే గాంధీ అనీ, ఆనాటి కార్యక్రమంలో ఆయనే ముఖ్య అతిథి అనీ తెలిసి పనివారు విస్తుపోయారు.

విశేషమేమిటంటే, ఆ విందు సమావేశంలో వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా పాల్గొన్నాడు. అంతకంటే విశేషమేమిటంటే, విద్యార్థి బృందాన్ని ఆ రోజున గాంధీ కంటే సావర్కరే ఎక్కువ ఆకట్టుకున్నాడు!
                                                                      ***

'ఉక్కుమనిషి'గా ప్రసిద్ధుడైన సర్దార్ వల్లభభాయ్ పటేల్ వ్యక్తిత్వానికి మరో పార్శ్వం కూడా ఉందని ఈ తరం వాళ్ళకు ఎంతమందికి తెలుసు? నిజానికి ఆయన గొప్ప హాస్యచతురుడు కూడా. గాంధీని సైతం నిరంతరం నవ్వుల్లో ముంచి తేల్చిన చాతుర్యం ఆయనది. అందుకే జైల్లో ఉన్నప్పుడు పటేల్ తోడుకోసం గాంధీ పరితపించి పోయేవాడు. జైలు జీవితం మిమ్మల్ని కుంగదీయడం లేదా అని ఒక మిత్రుడు గాంధీని అడిగినప్పుడు, పటేల్ తోడున్నప్పుడు బయటి జీవితం కంటే జైలు జీవితమే బాగుంటుందని గాంధీ సమాధానం చెప్పాడు.

ఓసారి గాంధీ, ఆయన సహాయకుడు మహదేవ్ దేశాయ్, పటేల్-ముగ్గురూ జైలులో సహజీవనం చేస్తున్నప్పుడు గాంధీకి ఒక అపరిచితుడి నుంచి ఉత్తరం వచ్చింది. గాంధీని అనేక విధాలుగా ఆడిపోసుకున్న ఆ అపరిచితుడు, 'మీరు జీవిస్తున్న కాలంలో జీవించవలసి వచ్చిన ఒక దురదృష్టవంతుడు' అంటూ ఆ ఉత్తరాన్ని ముగించాడు.

ఈ ఉత్తరానికి జవాబు ఏమని రాయాలని గాంధీ, పటేల్ ను అడిగాడు.

ఇంత విషం పుచ్చుకోమని రాయండని పటేల్ సలహా ఇచ్చాడు.

అంతకంటే నాకే  అతనింత విష మిచ్చి చంపితే మంచిదేమో నని గాంధీ అన్నాడు.

అందువల్ల అతనికి ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఎందుకంటే, మిమ్మల్ని చంపినందుకు అతన్ని ఊరి తీస్తారు. అప్పుడు మీతోపాటే అతనూ మళ్ళీ పుట్టవలసి వస్తుందని పటేల్ అన్నాడు.
                                                                  ***

గాంధీ రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వెళ్లిన సందర్భంలో ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులను బ్రిటిష్ రాజు విందుకు ఆహ్వానించాడు. అయితే, మొదట్లో గాంధీని మాత్రం పిలవడానికి ఇష్టపడలేదు. బాగుండదని విదేశాంగ మంత్రి నచ్చజెప్పిన మీదట ఒప్పుకున్నాడు. గాంధీ తన ఎప్పటి వేషంలోనే విందుకు వెళ్ళాడు. మీరు ఈ చాలీ చాలని దుస్తులతోనే రాజును కలిశారా అని ఒక విలేకరి అడిగినప్పుడు, మా ఇద్దరికీ సరిపోయినన్ని దుస్తులు రాజే ధరించాడు కదా అని గాంధీ చమత్కరించాడు.



No comments:

Post a Comment