బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తీహార్ జైలునుంచి బెయిల్ మీద విడుదలయ్యారన్న వార్త చూసి ఆశ్చర్యపోయాను. ఆయన అరెస్టయిన సంగతి నాకు తెలియకపోవడం అందుకు ఒక కారణం. పూర్తి వివరాలలోకి వెళ్లినప్పుడు ఆయనను ఏప్రిల్ 27న అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అంత ముఖ్యమైన వార్తను మిస్ అయినందుకు ఆశ్చర్యంతోపాటు సిగ్గు కూడా కలిగింది. నేను అప్పుడప్పుడే దేశం విడిచిపెట్టి, ఇప్పటివరకూ దూరంగానే ఉండడం ఇందుకు ఎంతవరకు ఎక్స్యూజ్ అవుతుందో చెప్పలేను.
బంగారు లక్ష్మణ్ విడుదల వార్త చూడగానే మానవ కాలమానం, బ్రహ్మగారి కాలమానం గురించిన ఓ ముచ్చటా గుర్తొచ్చింది. భూలోకంలో రావణాసురుని ఆగడాలు భరించలేక దేవతలు, మునులు వెళ్ళి బ్రహ్మ దగ్గర మొర పెట్టుకున్నారట. నేనిప్పుడే బహిర్భూమికి వెళ్లొచ్చి రావణాసురుని విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పి బ్రహ్మ వెళ్లిపోయాడట. తిరిగి వచ్చి, ఇప్పుడు చెప్పండి రావణాసురుని కథా కమామిషూ అని అడిగాడట. ఇంకెక్కడి రావణాసురుడు అంటూ, దశరథుడి పుత్రకామేష్టి తో ప్రారంభించి రాముడు రావణాసురుని చంపడం వరకు జరిగిన రామాయణమంతా బ్రహ్మగారికి చెప్పారట. దాంతో, 'పోనీలెండి, అల్పాయుష్కుడు' అంటూ బ్రహ్మ పెదవి విరిచాడట.
మనదేశంలో నేరం బ్రహ్మ కాలమానంలో జరుగుతుంది. నేర విచారణ మానవ కాలమానాన్ని అనుసరిస్తుంది. శిక్ష మళ్ళీ బ్రహ్మ కాలమానంలో అమలు జరుగుతుంది. అది కూడా శిక్ష పడడమంటూ జరిగితే.
బంగారు లక్ష్మణ్ కేసు ఏనాటిది! పదేళ్ళు గడిచిపోయాయి. ఆయన వయసు కూడా పదేళ్ళు పెరిగి, వృద్ధాప్యం, అనారోగ్యం వగైరా కారణాలతో బెయిలు కోరుకునే అవకాశం కూడా చిక్కింది. ఆయన ఎవరినుంచో లక్ష రూపాయిలు తీసుకుంటున్న దృశ్యాన్ని తెహల్కా డాట్ కామ్ రహస్య కెమెరాకు చిక్కడం, టీవీ చానెళ్లు దానిని చూపించడం అప్పట్లో పెద్ద సంచలనం. దానిపై చానెళ్లలో, పత్రికల్లో ఎంతో డిబేటు జరిగింది. స్టింగ్ ఆపరేషన్ ఎంతవరకూ నీతిమంతం అన్న మీమాంసా తలెత్తింది. తెహల్కాపై వేధింపుల గురించిన వార్తలూ వచ్చాయి. క్రమంగా తెహల్కా ప్రచురణ మాధ్యమంలోకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు ఒకరి 'అవినీతి'ని ఇంకొకరు కడుక్కునే సందర్భాలలో బంగారు ఉదంతం ప్రస్తావనకు రావడం పరిపాటిగా మారింది. టీవీ డిబేట్లలో తెలుగు రాని మనీష్ తివారీ లాంటి కాంగ్రెస్ అధికార ప్రతినిథులు 'బంగారూ లక్ష్మణ్' అంటూ అదోరకం ఉచ్చారణతో పలకడం ఇప్పటికీ చెవుల్లో ధ్వనిస్తూనే ఉంది.
అలాంటి బంగారు లక్ష్మణ్ ఇలా జైలుకు వెళ్ళినట్టే వెళ్ళి బెయిల్ మీద తిరిగిరావడం ఆశ్చర్యంగానే ఉంటుంది.
మన దేశంలో రూల్ ఆఫ్ లా గురించీ, నేరవిచారణకు పట్టే అసాధారణ కాలం గురించీ ఇంతకంటే ఆశ్చర్యకరమైన ప్రశ్న ఇంకోటి ఉంది...లక్ష రూపాయిలు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన కేసు శిక్ష వరకు రావడానికే పదేళ్ళు పడితే, అలాంటి ప్రత్యక్ష ఆధారాలు ఏవీ లేని కేసుల్లో ఇంకెంత కాలం పడుతుంది?! అసలు శిక్ష పడడమంటూ ఎప్పటికైనా జరుగుతుందా?!
బోఫోర్స్ కేసు చూడండి. ఎనభై దశకం నుంచీ ఆ కేసు వార్తల్లో ఉంది. మామూలు జనంకంటే ఎక్కువగా మీడియా జనం ఇలాంటి కేసులతో సహజీవనం చేస్తుంటారు. బోఫోర్స్ కేసు ఒక కొలిక్కి రాకుండానే ఒక మీడియా తరం వెళ్లిపోయింది. ఎంతోమంది సంపాదకులు రిటైరైపోయారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకుడిగా బోఫోర్స్ కేసు విషయంలో కురుక్షేత్ర యుద్ధం స్థాయిలో అక్షరపోరాటం చేసిన అరుణ్ శౌరి ఇప్పుడు పాత్రికేయ వృత్తిలోనే లేరు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, కేంద్రంలో మంత్రిగా కూడా కొంతకాలం ఉన్నారు. బోఫోర్స్ తో పోటీపడి ఆయన అక్షర శతఘ్నులు పేల్చిన ఎనభై దశకంలో అప్పటికింకా పత్రికా కార్యాలయాలు పూర్తిగా కంప్యూటరైజ్ కాలేదు. ఏ సాయంత్రానికో బోఫోర్స్ పై అరుణ్ శౌరి ఉద్బోధలూ, మేలుకొలుపులూ, ప్రశ్నలూ వ్యాసరూపంలో టేకులకొద్దీ టెలీప్రింటర్ మీద వచ్చేవి. అవి సమరాంగణంలో సైన్యాధికారి సైనికులను ఉత్తేజపరిచే ప్రసంగ శైలిలో ఉండేవి. మధ్య మధ్య భగవద్గీత నుంచి, మహాత్మా గాంధీ నుంచి గంభీరమైన ఉటంకింపులు ఉండేవి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ సోదర పత్రిక ఆంధ్రప్రభ డెస్క్ వాటిని అనువదించి ఫస్ట్ ఎడిషన్ కు అందించడం కూడా 'యుద్ధప్రాతిపదిక'పై జరిగేది. చివరికి ఏమైంది? బోఫోర్స్ పార్లమెంటులో అసాధారణ సంఖ్యాధిక్యత ఉన్న ఒక ప్రభుత్వాన్ని కూల్చి, ఇంకో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తీసుకురాగిలిగింది కానీ ఒక కేసుగా ఇప్పటికీ ఒక కొలిక్కి రాకుండానే; నిందితులలో ఒకడైన ఆ ఇటలీ వ్యాపారిని కత్రోకీ అనాలో, కత్రోచీ అనాలో తేల్చుకోకుండానే అటకెక్కింది.
కాంగ్రెస్ సుఖ్ రామ్ కేసు బంగారు కేసు కన్నా ఏడెనిమిదేళ్ళ పాతది. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావడం, మంత్రివర్గం నుంచి ఆయనను తొలిగించడం జరిగాయి. ఆరోపణలపై విచారణ ఇటు గూడ్సు బండిలా పాకుతుండగానే, ఆయన సొంతరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఒక ప్రాంతీయ పార్టీని పెట్టడం, ఎన్నికలలో తగినన్ని సీట్లు గెలుచుకోవడం, మిశ్రమ ప్రభుత్వంలో మంత్రి కావడం వగైరాలు అటు ఎక్స్ ప్రెస్ వేగంతో జరిగిపోయాయి. పూర్తిగా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి, కాళ్ళూ చేతులూ బుద్ధీ స్వాధీనంలో లేని దశలో కేసు కొలిక్కి వచ్చి ఆయనకు శిక్ష పడింది. 'న్యాయం జరిగింది' అనడానికి ఆయన ఇంతకాలం జీవించి ఉండడమే కారణం కానీ, మన న్యాయవిచారణ వ్యవస్థ కాదు.
రూల్ ఆఫ్ లా అమలు జరగడంలో ఆలస్యం జరిగే ఉదంతాలే కాదు, అసలు దేశంలో రూల్ ఆఫ్ లా ఉందా అన్న సందేహాన్ని రేకెత్తించే ఉదంతాలూ కోకొల్లలు. ఆమధ్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఢిల్లీ లోని ఆంధ్రాభవన్ లో పనిచేసే ఒక ఎస్సీ అధికారిని దుర్భాషలాడుతూ చేయి చేసుకున్న దృశ్యం టీవీలో ప్రసారమైంది. మనిషి సాటి మనిషిపై చేయి చేసుకోవడమే నేరం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగిపై చేయి చేసుకోవడం ఇంకా పెద్ద నేరం. అందులోనూ ఒక ఎస్సీ ఉద్యోగిపై చేయి చేసుకోవడం చట్ట రీత్యా మరింత తీవ్రమైన నేరం. అందులోనూ శాసన నిర్మాణప్రక్రియలో పాలు పంచుకునే శాసన సభ్యుడు ఆ పని చేయడం(దాని వెనుక ఎంత న్యాయమైన కారణమైనా ఉండవచ్చుగాక) మరింత తీవ్రాతి తీవ్రమైన నేరం. కానీ విచిత్రం... కేసు ఏ దశలో ఉందో, అసలు ఉందో లేదో మనకు తెలియదు. దాని గురించిన వార్తలు మీడియాలో కనబడవు. తన అధికారిపై టీవీ కెమెరా సాక్షిగా చేయిచేసుకున్న ఎమ్మెల్యేపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యకూ ఉపక్రమించిన దాఖలాలు కనిపించవు. ఆ అధికారి కేసు పెట్టారా లేదా అన్న సాంకేతిక ప్రశ్న ఇక్కడ వర్తించదు. ఇది ప్రజాజీవితంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ప్రవర్తనాసరళికి సంబంధించిన సామాజికాంశం. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలు సూ మోటో గా విచారణను చేపడుతుంటాయి. ఈ కేసులో అలా ఎందుకు చేయలేదో తెలియదు. ఇది కేవలం ఒక ఎమ్మెల్యేకు, ఒక అధికారికి సంబంధించిన అంశం కాదు. ఈ దేశంలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా లేదా అన్నమౌలిక ప్రశ్నను లేవనెత్తుతున్న సందర్భం.
అంతకంటే వెనక్కి వెడితే, ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే మందిని వెంటబెట్టుకుని కలెక్టరాఫీసులోకి దౌర్జన్యంగా చొరబడి, మహిళా కలెక్టర్ ను దుర్భాషలాడుతుంటే, ఆమె నిశ్చేస్టురాలై ఏడుస్తూ ఉండిపోయిందని వార్త వచ్చింది. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టారో లేదో తెలియదు. పెడితే అది ఏ దశలో ఉందో తెలియదు. ఇక సినీ నటి ప్రత్యూష హత్య/ఆత్మహత్య వంటి కేసుల సంగతి చెప్పనే అవసరం లేదు.
అరుణ్ శౌరి అప్పుడు బోఫోర్స్ పై పత్రికా యుద్ధం చేస్తే అరవింద్ కేజ్రీవాల్ ప్రభృతులు ఇప్పుడు రాబర్ట్ వద్రా ఆస్తులపై ప్రత్యక్షయుద్ధం చేస్తున్నారు. రేపు రాజకీయంగా బోఫోర్స్ చూపించిన ప్రభావమే ఇదీ చూపించవచ్చుననుకున్నా, బోఫోర్స్ లానే ఎప్పటికీ తెమలని కేసులా మిగిలిపోదన్న గ్యారంటీ లేదు. మన దేశంలో రూల్ ఆఫ్ లా మహిమ అలా ఉంటుంది. దొంగ ఇంటికి కన్నం వేసి ఇల్లు చక్కబెట్టడం బ్రహ్మ కాలమానంలో జరుగుతుంది. దానిపై దర్యాప్తు, విచారణ మానవకాలమానాన్ని అనుసరిస్తాయి. చట్టం అమలు జరగడానికి ప్రభుత్వమే ఒక పెద్ద బ్రేకు కావచ్చు, దానితోపాటు జనానికి కనిపించని బ్రేకులు చాలా ఉంటాయి. జనాభా నిష్పత్తిలో జడ్జీలు లేకపోవడం వంటి బ్రేకులూ వాటిలో ఉంటాయి. ఈ దేశంలో చట్టం తన పని తాను చేస్తోందన్ననమ్మకం చాలా తక్కువ. అందుకే రాజకీయనాయకులు అనేకానేక అబద్ధపు హామీల బాణీ లోనే 'చట్టం తన పని తను చేస్తుం'దన్న హామీ ఇస్తుంటారు కాబోలు!

ఇప్పుడిప్పుడే మీకు తత్వం బోధపడుతున్నట్టుగా వుంది. :))
ReplyDeleteతీరిగ్గా విశ్లేషణ చేసుకోవడానికి మీకు బోలెడంత మేటర్ దొరికింది. కంగ్రాట్స్. ;)