Wednesday, October 31, 2012

మీడియా విశ్వసనీయత మాటేమిటి?



 రాజకీయనాయకులు, వ్యాపారవర్గాలు వగైరాల విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాం. అందులోనూ మీడియా చాలా చురుకైన పాత్ర నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇండియా అగెనెస్ట్ కరప్షన్(ఐఏసీ) చేస్తున్న పనినే మీడియా చాలాకాలంగా చేస్తోంది. అది కూడా ప్రచారానికి దూరంగా. అవినీతి తీవ్రతను ప్రజల దృష్టికి తెచ్చింది మీడియానే. అందులోంచి పుట్టిన ప్రజాగ్రహమే ఐఏసీ ఉద్యమానికి ఇంధనం అందించింది.
మరి అటువంటి మీడియా విశ్వసనీయత మాటేమిటి?
కొంతకాలంగా, ముఖ్యంగా టీవీ చానెళ్లు విస్తరించినప్పటినుంచీ మీడియా ప్రమాదకరమైన మార్గంలో వెడుతోంది. అది ఆత్మహత్యా మార్గం అన్నా తప్పులేదు. విస్తరణతోపాటే పోటీ పెరగడం అందుకు కారణం. పోటీని తట్టుకోడానికి తగిన ఉపాయాలను ఆశ్రయించడాన్ని ఎవరూ ఆక్షేపించనవసరం లేదు. కానీ ఆ ప్రయత్నంలో విశ్వసనీయతను బలి పెడుతుండడమే ఆక్షేపణీయం. మీడియా చేస్తున్నది అదే. ప్రజాక్షేత్రంలో ఉన్నవారికి ఎవరికైనా విశ్వసనీయతే ప్రాణం. మీడియా మినహాయింపు కాదు.
మీడియా విశ్వసనీయత ఎంతగా పలచబడుతోందంటే, ఏదైనా ఒక ఘటన జరుగుతున్న క్రమంలో దానికి సంబంధించిన సమాచారం కోసం చానెళ్లపై ఆధారపడలేని పరిస్థితి వస్తోంది. ఒక ఉదాహరణ చూడండి. ఆ మధ్య శ్రీకాకుళం జిల్లాలో ఒకచోట రైతులపై కాల్పులు జరిగినప్పుడు ముగ్గురు చనిపోయారని చానెళ్లు మొదట ఫ్లాష్ న్యూస్ అందించాయి. తర్వాత హతుల సంఖ్య రెండుకీ, ఆ తర్వాత ఒకటికీ తగ్గింది. వాస్తవాలను ధృవీకరించుకోకుండా ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడానికి కారణం-పోటీ! ఏదో ఒక చానెల్ ముగ్గురు చనిపోయారంటూ  కాల్పుల ఘటనను సంచలనాత్మకం చేయడానికి ప్రయత్నిస్తుంది. మిగిలిన చానెళ్లు దానిని అనుసరిస్తాయి. వాస్తవాల ధృవీకరణ వరకూ ఆగితే తమ రేటింగ్ ఎక్కడ పడిపోతుందోనని వాటి భయం. నిజాలు ఇవ్వడంలో పోటీ పడే బదులు అవాస్తవాలు ఇవ్వడంలో చానెళ్లు పోటీ పడుతున్నాయి. అదీ సమస్య.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఊహాగానాలు తాజా ఉదాహరణ.
మంత్రివర్గ వ్యవస్థీకరణకు ముందు మీడియా వార్తలను గమనిస్తే అసాధారణమైనదేదో జరగబోతోందనే అభిప్రాయమే అందరికీ కలుగుతుంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ జ్యోతిరాదిత్య సిందియా, సచిన్ పైలట్, పురందేశ్వరి తదితర యువ సహాయమంత్రులకు క్యాబినెట్ హోదా కల్పించబోతున్నారన్నాయి. పురందేశ్వరి ఆ వార్తలు నమ్మి ప్రధానికి కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు వార్త వచ్చింది. చివరికి పల్లంరాజు, అజయ్ మాకెన్ లకు మాత్రమే క్యాబినెట్ హోదా లభించింది. యువ సహాయమంత్రులలో పలువురికి ఇండిపెండెంట్ చార్జి మాత్రమే కల్పించారు. అలాగే, జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పిస్తారన్న మీడియా సమాచారం నిజమైనా, ఆయనకు మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖ ఇస్తారన్న ఊహ అబద్ధమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను ఇచ్చారు. ఆనంద్ శర్మ విషయంలోనూ అదే జరిగింది. ఆయనకు విదేశాంగశాఖ ఇవ్వచ్చన్నారు. కానీ ఆయన శాఖ మార్చలేదు.
మీడియా సమాచారంలో కొన్ని నిజాలూ ఉన్న మాట నిజమే. అయితే, అసత్యాలుగా తేలిపోయినవే జనం దృష్టికి ఎక్కువగా ఆనతాయన్న సంగతిని మరచిపోకూడదు. విశ్వసనీయతను దెబ్బ తీసేవి అవే. ఊహించగలిగిన బలమైన ఇతరేతర కారణాలు ఉంటే తప్ప సహాయమంత్రిగా రెండు మూడేళ్ళ అనుభవం మాత్రమే ఉన్నవారికి;  మొదటిసారి, లేదా రెండవసారి పార్లమెంట్ సభ్యులైనవారికి క్యాబినెట్ హోదా కల్పించడం సర్వసాధారణంగా జరగదు. కనుక ఊహాగానాలు చేసేటప్పుడు మీడియా విజ్ఞత, జాగ్రత్త పాటించాలి.
చివరగా ఇంకో సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.  రాజకీయవ్యవస్థపై మీడియా దాడి ఇటీవలికాలంలో బాగా పెరిగింది. అవినీతి, అక్రమాల గుట్టు రట్టు చేయడం ద్వారా తన విశ్వసనీయతారాహిత్యాన్ని వేలెత్తి చూపిస్తున్న మీడియాపై  రాజకీయవ్యవస్థ కక్ష పెంచుకోవడం సహజం. ప్రతీకారంగా మీడియా విశ్వసనీయతను దెబ్బ తీయడానికీ అదీ ప్రయత్నిస్తుంది. కనుక అభిజ్ఞవర్గాలు కావాలనే మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశమూ ఉంది. మీడియా, రాజకీయవ్యవస్థల మధ్య ఒకరకమైన యుద్ధవాతావరణం నెలకొన్న సంగతిని గుర్తించినప్పుడు; యుద్ధంలో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయన్న సంగతినీ అంగీకరించవలసిందే.




No comments:

Post a Comment