Saturday, November 3, 2012

ఉరిమి ఉరిమి మీడియా మీద...


అత్త కొట్టిందని కాదు, తోడికోడలు నవ్విందని ఏడ్చిందట వెనకటికి ఒకామె.  అరవింద్ కేజ్రీవాల్ దాడితో గుక్క తిప్పుకోలేకపోతున్న కాంగ్రెస్, బీజేపీలు మీడియా ఇలాంటివారికి విపరీత ప్రచారం కల్పిస్తోందని తప్పు పడుతున్నాయి. అసలు కేజ్రీవాల్ అనే మనిషి మీడియా సృష్టి తప్ప మరొకటి కాదంటున్నాయి. మీడియాపై అక్కసు, అసహనం ఎంత దూరం వెళ్ళిందంటే; రాజకీయనాయకులు ఇప్పుడు మీడియాకు సరికొత్త హితబోధ కూడా ప్రారంభించారు. ఎంతసేపూ నెగిటివ్ ప్రచారమేనా, అజ్ఞాతంగా ఎంతోమంది ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తున్నారు, వాటిని వెలుగులోకి తీసుకురండని సలహా ఇస్తున్నారు.
బీజేపీ అధికారప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఒక టీవీ చానెల్ చర్చలో పాల్గొంటూ అలాంటి అజ్ఞాత సంఘసేవకుల పేర్లు కొన్ని ఉదహరించారు కూడా. టీవీ చానెళ్లలో తరచు కనిపించే రవిశంకర్ తను జేపీ ఉద్యమం నుంచి వచ్చినవాడినని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. మంచిదే కానీ, అవినీతికి వ్యతిరేకంగా జేపీ లాంటి మహనీయుడి నాయకత్వంలో సాగిన  అంత గొప్ప రాజకీయేతర ఉద్యమంనుంచి వచ్చిన తను ఆ ఉద్యమానికి జేపీతోనే అంత్యక్రియలు ఎందుకు జరిపారో తెలియదు. రాజకీయాలలోకి ఎందుకు వచ్చారో తెలియదు. అందులోనూ పార్టీపై, పార్టీ నాయకులపై సమర్థించుకోలేని ఆరోపణలు వచ్చినా సరే, బాహాటంగా సమర్థించుకుంటూ టీవీ తెరపై తరచు లాఫింగ్ స్టాక్ గా మారే అధికారప్రతినిధి పాత్రను ఎందుకు నిర్వహిస్తున్నారో అంతకంటె తెలియదు.
 జేపీ ఉద్యమంలో పనిచేయడం ద్వారా తెచ్చుకున్న గుర్తింపును రాజకీయాలలో పెట్టుబడి పెట్టి పదవులూ, పరకా సంపాదించి పైకొచ్చి అవినీతి అక్రమాల ఆరోపణలలో  కాంగ్రెస్ నాయకుల రికార్డ్ ను తిరగరాసిన వారు చాలామంది ఉన్నారు. వెంటనే స్ఫురించే ఒక ప్రసిద్ధమైన పేరు లాలూ ప్రసాద్ యాదవ్. వీరంతా జేపీ ఉద్యమ మూలాలనుంచి బయటపడి కూడా మూడు దశాబ్దాలకు పైగా అయింది. ఇన్నేళ్లలో మరోసారి జేపీ తరహా ఉద్యమం(ఇక్కడ ఉద్యమంతోనే కానీ ఉద్యమసారథులతో పోలిక తేవడం లేదు)ప్రారంభమయ్యేసరికి వీరికి కూడా ముచ్చెమటలు పోస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా తమ ఉద్యమగతాన్ని మాటి మాటికీ గుర్తుచేసి, మేమూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవారమేనని నమ్మించవలసి వస్తోంది. ఇంకా తమాషా ఏమిటంటే, కేజ్రీవాల్ తరహా ఊహించని ఉత్పాతంతో బుర్ర చెడి దీనంతటికీ పాపాలభైరువుడు మీడియాయే నంటూ చివరికి వార్తాహరుడిపై కారాలు మిరియాలు నూరవలసివస్తోంది. మరింత విచిత్రంగా, ఎప్పుడూ నెగిటివ్ ప్రచారమేనా అంటూ సరికొత్త నీతి సూత్రాలు కంఠతా పట్టవలసివస్తోంది.
అన్నా హజారే, కేజ్రీవాల్ తదితరులు మీడియా జాగాను తగుమేరకు ఆక్రమించుకుని ఉండకపోతే మీడియా దృశ్యం ఎలా ఉండేదో ఊహించడం కష్టం కాదు. ఎప్పటిలా రాజకీయపక్షాలే మీడియా జాగాను కబ్జా చేసి ఉండేవి. వాటిలోనూ కాంగ్రెస్, బీజేపీలకు సింహభాగం లభించి ఉండేది. వీధి కుళాయి స్థాయి రాజకీయ ఆరోపణలను, కొట్లాటలను కూడా మీడియా యథావిధిగా రిపోర్ట్ చేస్తూ ఉండేది. రవిశంకర్ ప్రసాద్ లాంటి వారు తమ గత ఉద్యమస్మృతులను గుర్తు చేసుకోవలసిన అవసరం తలెత్తేది కాదు. ముఖ్యంగా, నెగిటివ్ ప్రచారంలో కాకలు తీరినవారు కూడా నెగిటివ్ ప్రచారాన్ని తప్పు పట్టి మీడియాపై మేకులు చెక్కవలసిన అవసరమూ ఉండేది కాదు. తనవరకూ వస్తే తప్ప తత్వం బోధపడదని ఊరికే అనలేదు.
అన్నా, కేజ్రీవాల్ ఉద్యమం కాంగ్రెస్ కు గురి పెట్టినన్ని రోజులూ ఆనందాన్ని జుర్రుకోడానికి బీజేపీకి రెండు కళ్ళూ చాలలేదు. ఉద్యమాన్ని సమర్థిస్తూ చివరికి ఉద్యమ వేదికపై ప్రత్యక్షం కావడానికీ వెనుకాడలేదు. అప్పుడు మితిమీరిన ప్రచారం ఇస్తున్నారంటూ మీడియాపై మండిపడడం కాంగ్రెస్ వంతయింది. ఉద్యమం గురి బీజేపీ వైపు తిరిగేసరికి సీను మారిపోయింది. మీడియాపై కాంగ్రెస్ అక్కసునే బీజేపీ అందిపుచ్చుకోవలసివచ్చింది. అటు ఉద్యమమూ ఇటు మీడియా కూడా ఉభయపక్షాలకూ ఉమ్మడిశత్రువుగా పరిణమించాయి. అలాగని శత్రువుకి శత్రువు మిత్రుడన్న నీతిని  పాటించి అవి చేతులు కలపలేని పరిస్థితి.
అన్నా, కేజ్రీవాల్ తరహా ఉద్యమం ఎంతవరకూ లోపరహితం అన్నది వేరే విషయం. అయితే, కేంద్రంలో అధికారపక్షంగా కాంగ్రెస్, ప్రధానప్రతిపక్షంగా బీజేపీల లొసుగులు, వైఫల్యాలే మరో జేపీ తరహా(ఇక్కడ కూడా ఉద్యమంతోనే పోలిక అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి)ఉద్యమాన్ని ముందుకు తెచ్చాయనీ, క్రమంగా రాజకీయ పక్షాలను పక్కకు నెట్టి కేంద్రస్థానాన్ని ఆక్రమించుకున్నాయనీ మరచిపోకూడదు. అలాగే, మీడియా అద్దంపై మచ్చలు లేవని ఎవరూ అనరు. అయినాసరే అది అద్దమే. బయట ఏది ఫోకస్ లో ఉందో అదే అందులోనూ ప్రతిబింబిస్తుంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా కనీసం ప్రస్తుతాంశానికి సంబంధించినంతవరకు, ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది పూర్తిగా మీడియా ప్రాథమిక ఇంగితానికి సంబంధించిన విషయం.  
పోలిటికల్లీ కరెక్ట్ కాదని తెలిసి కూడా రాజకీయపక్షాలు మీడియాపై ఎందుకు కత్తులు నూరుతున్నాయి? మీడియా ప్రాథమిక ఇంగితంలోనే జోక్యం చేసుకుని ఎందుకు ప్రశ్నిస్తున్నాయి? ఎందుకంటే, ఉమ్మడి శత్రువును ఎదుర్కొనే ఉపాయాలు తోచకనే. అందుకే అవి మరింతగా విదూషకపాత్రలోకి జారిపోయి విషాదపు నవ్వులు నిర్విరామంగా పూయిస్తున్నాయి. మరింతగా అల్లరి పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయపక్షాలు ఇప్పుడున్న దుస్థితి పగవాడికి కూడా వద్దు!



1 comment:

  1. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డది అన్న సామెత కరెక్టే కాని, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆ సామెత అన్వయించలేము. ఎందుకు అంటె, మీడియాకు నిస్పక్షపాతత లేదు. బి జె పి లో జరిగితే ఒకలాగున, కాగ్రెస్ లో జరిగితే మరొక రకంగానూ రెపోర్ట్ చెయ్యటం లేకపోతే అసలు రిపోర్టె చెయ్యకపోవటమో చెస్తుంటారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఏ కొంచెం జరిగినా గోరంతలు కొండంతలు చెయ్యటం మీడియాకు ఒక ప్రాధమిక హక్కు అయినట్టుగా భావించుకుంటున్నారు. ఇదంతా కాగ్రెస్ మీడియా మానెజిమెంట్ లో భాగమే అని చిన్న పిల్లవాదికి కూడా తెలుసు. కొన్ని కార్పొరేట్లు ఏమి చేసినా ఏమీ వ్రాయవు పత్రికలు. కారణం! వాళ్ళు భారీగా ప్రకటనలు ఇస్తారు. కూచున్న కొమ్మ ఎవరన్నా నరుక్కుంటారా? మీడియా మానేజిమెంట్్కు అన్ని పెద్ద కార్పొరేట్లల్లోనూ, ప్రత్యేక విభాగాలు ఉన్నాయట. ఇలా మానేజ్ చెయ్యపడుతున్న మీడియా గురించి ఇంత తపన అనవసరం అని సామాన్య పాఠకుల అభిప్రాయం.

    ReplyDelete