Saturday, November 10, 2012

మీడియా వివాదోత్సాహం


ఈ మధ్య సెలెబ్రటీల మాటలు తరచు వివాదాస్పదం అవుతున్నాయి. సెలెబ్రటీలు అన్నప్పుడు అందులో రాజకీయనాయకులే కాక; సినీనటులు, దర్శకులు, రచయితలు, వ్యాపారవేత్తలు సహా అనేక వర్గాలవారు చేరతారు. బహుశా మీడియా మనుషుల్ని ఈ జాబితానుంచి మినహాయించవలసి ఉంటుంది. సెలెబ్రిటీల మాటల్ని వివాదాస్పదం చేయడంలో ముఖ్య పాత్ర వీరిదే.  రాజకీయ ప్రముఖులు సరేసరి, ఒక్కోసారి వాళ్ళ మాటలే కాదు, మౌనమూ వివాస్పదమవుతూనే ఉంటుంది. రాజకీయనాయకుల మాట (లేదా మౌనం) చుట్టూ వివాదాల మంట పెట్టి వాళ్ళను వీథిలోకి లాగడానికి ప్రత్యర్థులు అహర్నిశలూ కాచుకుని ఉంటారు. అందులో మీడియా తన వంతు పాత్రను తాను పోషిస్తూ ఉంటుంది.

నితిన్ గడ్కరీలా వేరే భాషల జోలికి పోకుండా  తమకు బాగా తెలిసిన రాజకీయభాషకు పరిమితం కావడం నాయకులకు ఉన్నంతలో సురక్షితమార్గం.  పాపం గడ్కరీ సొంత ఐక్యూను గాలికొదిలేసి వివేకానంద, దావూద్ ఇబ్రహీం ల ఐక్యూల మధ్య పోలిక తెచ్చి అల్లరి పడ్డారు. ఎవరైనా సరే, రాజకీయాలలో ఉన్న తర్వాత తమకు చాలా భాషలు వచ్చునన్న సంగతి మరచిపోవాలి. మరచిపోతేనే మర్యాద దక్కుతుంది.

మిగిలిన సెలెబ్రటీల సంగతి వేరు. వాళ్ళు రాజకీయభాషలో మాట్లాడవలసిన అవసరం లేదు. మాట్లాడదామన్నా ఆ భాష పట్టుబడడం అంత తేలిక కాదు. కనుక వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడతారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి!

ఉదాహరణకు, ప్రముఖ నాటక రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై లిటరరీ ఫెస్టివల్ లో మాట్లాడుతూ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత వి.ఎస్. నైపాల్ పై విమర్శలు చేశారు. ఆయన ముస్లిం వ్యతిరేకి అన్నది ఆ విమర్శల సారాంశం. వెంటనే మీడియా ఆయన మాటల్ని వివాదాస్పదం చేసేసింది. అనేక ఇంగ్లీష్ చానెళ్లు కర్నాడ్ ను తెరమీదికి లాగి మాట్లాడించాయి. పలువురు రచయితలతో చర్చ నిర్వహించాయి. అందులో ఎవరు ఏమన్నారు, కర్నాడ్ తన వాదనను ఎలా సమర్థించుకున్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. రచయితగా నటుడిగా ఎంతో చరిత్ర ఉన్న కర్నాడ్ ఒక్క రాత్రితో సాహితీ విలన్ గా మారిపోయారు. మీడియా పుణ్యం!

కర్నాడ్ విలనిజం అక్కడితో ఆగిందా, లేదు. ఆ వెంటనే ఆయన మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి రవీంద్రనాథ్ ఠాగోర్ కు గురి పెట్టి. రవీంద్రనాథ్ ఠాగోర్ గొప్ప కవే కానీ మంచి నాటక రచయిత కాడన్నారు. ఇంకేముంది...వెంటనే మీడియా రంగప్రవేశం చేసింది.  రెండే రెండు మీడియా ఫోకస్ లతో గిరీష్ కర్నాడ్ వివాదాస్పద వ్యక్తుల జాబితాలో చేరిపోయారు. ఇప్పుడిక ఆయనను నాటక రచయితగా, నటుడుగా కన్నా వివాదాస్పదుడుగానే జనం గుర్తించడం ప్రారంభిస్తారు.

నైపాల్ గురించి అయినా, ఠాగోర్ గురించి అయినా ఆయన తన అభిప్రాయం చెప్పారు.  సాహిత్యవిమర్శ రూపంలో రచనలపై, రచయితలపై అలా అభిప్రాయం చెప్పడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది.  మీడియా చానెళ్లు దానికి  వివాదాస్పద వ్యాఖ్యలు అని కొత్త పేరు పెడుతున్నాయి. పాపం కర్నాడ్ ఠాగోర్ కు కవిగా ఇవ్వవలసిన గౌరవమే ఇచ్చారు. కాకపోతే ఠాగోర్ మంచి నాటక రచయిత కాదన్నారు. మంచి కవి మంచి నాటక రచయిత కావాలనేముంది?

ఇంకా ఆయన నయం. మన శ్రీశ్రీ ఠాగోర్ ను కవిగా కూడా గుర్తించలేదు. ఠాగోర్ ను ఠ కార గురువు గా సంబోధించిన శ్రీశ్రీ, ఠాగోర్  గీతాంజలిలో కంటే బెల్లంకొండ రామరాయకవి రచించిన భక్త చింతామణిలో గొప్ప వేదాంతం ఉందన్నాడు. ఆయన మాటలు అప్పుడూ సంచలనాత్మకం, వివాదాస్పదం అయ్యాయి కానీ ఆయనపై వివాదాస్పదుడన్న ముద్ర పడలేదు. ఇప్పుడైతే కచ్చితంగా పడుండేది.

రాజ్యాంగం కల్పించిన భావప్రకటన హక్కును ఎక్కువగా అనుభవించేది మీడియానే. భావప్రకటన హక్కు ఫలితమే మీడియా కూడా. అటువంటి మీడియా మామూలు మాటల్ని కూడా వివాదాస్పదం చేసి జనాన్ని భయపెట్టేస్తోంది. రాజకీయనాయకులే కాదు, ఇతర సెలెబ్రటీలు కూడా మీడియాకు జంకి తమ భావప్రకటన హక్కును కుదించుకోవలసివస్తోంది.

ఇతరేతర శక్తులవల్ల ఇప్పటికే మన వాక్స్వాతంత్ర్యం జాగా రోజు రోజుకీ తగ్గిపోతోంది. ఉద్దేశించకపోయినా మీడియా వివాదోత్సాహం అందుకు ఎంతో కొంత దోహదం అవుతోందా?!


1 comment:

  1. "...ఇప్పటికే మన వాక్స్వాతంత్ర్యం జాగా రోజు రోజుకీ తగ్గిపోతోంది. ఉద్దేశించకపోయినా మీడియా ‘వివాదో’త్సాహం అందుకు ఎంతో కొంత దోహదం అవుతోందా?!..."

    ముమ్మాటికీ నిజం. మీడియా ఇలాగే కొన్నాళ్ళు కొనసాగితే, అంటె తనంతట తాను నియంత్రించుకునే శక్తి లేనిదిగా కొనసాగితే, నియంత్రించబడాల్సి ఉంటుంది. ఆ పని పాఠకులే చేస్తారా, ప్రభుత్వం చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న కాదు. కాని అలాంటి నియంత్రణ ప్రతిపాదన వస్తే, మీడియాలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తప్ప మరెవ్వరూ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించరు అన్నది ఒక ఖచ్చితమైన నిజం. మీడియా ఎంత తొందరగా అది గ్రహించగలిగితే అంత మంచిది. కాని అలా గ్రహించగల శక్తి మీడియాకు ఉన్నదా! అనుమానమే.

    ReplyDelete