Thursday, November 8, 2012

వాజ్ పేయిగారూ... ఎలా ఉన్నారు?!

భారత మాజీ ప్రధాని...మాజీ ప్రతిపక్ష నాయకుడు...భవిష్యత్తులో భారత ప్రధాని కాదగినవాడుగా జవహర్లాల్ నెహ్రూ అంతటి వ్యక్తి నుంచి అలనాడే ప్రశంసలందుకున్నవ్యక్తి...మంచి పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన మనిషి..  మంచి వక్త...కవి...బీజేపీకి ఇప్పటికీ ఒకే ఒక 'లిబరల్ ఫేస్'...ఆ పార్టీ రాజకీయ 'అస్పృశ్యత'ను ఎదుర్కొంటున్న దశలో ఇరవైకి పైగా పార్టీలతో ఎన్డీయే అవతరణను సుసాధ్యం చేసీన నేత...

అటల్ బిహారీ వాజ్ పేయి ఎలా ఉన్నారు?!

చాలా రోజులుగా ఆసక్తినీ, ఆశ్చర్యాన్నీ కలిగిస్తున్న... జవాబు దొరకని  ప్రశ్న!

వాజ్ పేయి గారు ఉన్నారు! అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఎలా ఉన్నారో తెలియదు. ఏం చేస్తున్నారో తెలియదు. ఏం చేయలేకపోతున్నారో తెలియదు. ఆయన గురించి ఎలాంటి సమాచారమూ పబ్లిక్ డొమైన్ లో లేదు. వాజ్ పేయి గారు ప్రజలకు కనిపించక పోవచ్చు. కనిపించే స్థితిలో లేకపోవచ్చు. అర్థం చేసుకోగలం. కానీ విచిత్రం చూడండి...ఆయన గురించి ఒక్క మాటా వినిపించడం లేదు. మీడియాలో సరే, ఆయన పార్టీ నాయకుల నోట కూడా!

అలాగని మీడియా పాత్రను తక్కువ చేయడం లేదు. నిజానికి వాజ్ పేయి గారి గురించిన  సమాచారాన్నిఅప్పుడప్పుడైనా ఈ దేశప్రజలకు అందించవలసింది ప్రధానంగా మీడియానే. అటువంటి మీడియా కూడా ఆయనపై దీర్ఘ మౌనం పాటిస్తుండడం ఆశ్చర్యకరం. ఇరవై నాలుగు గంటల వార్తా చానెళ్లు అడుగుపెట్టిన తర్వాత మీడియా సమాచారదాహం అనేక రెట్లు పెరిగిన సంగతి మనకు తెలుసు. 'సెలెబ్రటీ'లు అయితే చాలు, సమర్తలూ, సీమంతాలూ కూడా వార్తలు అవుతున్నాయనే విమర్శా వినిపిస్తోంది. నిజంగానే  చాలా అప్రధానమైన, జనానికి అక్కర్లేని సమాచారాన్ని కూడా మీడియా విరివిగా ఇస్తోంది. ఇవ్వనివ్వండి. కానీ ఆరేళ్లపాటు దేశాన్ని ఏలిన ఒక మాజీ ప్రధాని గురించిన సమాచారాన్నికొంచెమైనా ఇవ్వకపోవడ మేమిటి? వినడానికి విడ్డూరంగా లేదా?

ఆ మధ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చికిత్స కోసం అమెరికా వెళ్ళి కొన్ని మాసాలు మీడియా ఫోకస్ కు దూరంగా ఉండిపోయారు. ఆమె అనారోగ్యం ఏమిటో, ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో, దేశానికి తిరిగి ఎప్పుడు వస్తారో ఏమీ తెలియలేదు. తెలుసుకోవడంలో మీడియా వైఫల్యం అప్పుడు చర్చనీయం అయింది కూడా. సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాలలో ఉన్నారు కనుక, అందులోనూ కాంగ్రెస్ లాంటి అతి పెద్ద పార్టీకి అధినేతగా ఉన్నారు కనుక ఆమె కుటుంబసభ్యులు, పార్టీ గోప్యత పాటించడాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.

కానీ వాజ్ పేయి గారి విషయం వేరు. ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు ఊహించుకోవలసిందే తప్ప నికరమైన సమాచారం లేదు. ఆ అనారోగ్యం ఎలాంటిదో తెలియదు. ఏ దశలో ఉందో తెలియదు. ఆయన మాట్లాడుతున్నారా, మనుషుల్ని గుర్తుపడుతున్నారా...ఏమీ తెలియదు. పార్టీ నాయకులు అప్పుడప్పుడైనా ఆయనను చూసి వస్తున్నారా...బొత్తిగా తెలియదు.

బీజేపీ శ్రేణులకు ఆయనను మించిన  'ఐకాన్' ఎవరుంటారు? అయినాసరే, వారి నోట ఆయన గురించిన మాటే ఎందుకు వినిపించడంలేదు? ఏ అజ్ఞాతశక్తులైనా అప్రకటిత నిషేధాన్ని విధించారా? సహేతుకమైన కారణం కనిపించనప్పుడు ఎవరైనా సరే పరిపరి విధాలుగా అనుకుంటారు. తప్పు పట్టడానికి వీలులేదు.

ప్రతిరోజూ జనానికి అందుతున్న బండెడు మీడియా సమాచారం మధ్య... మాజీ ప్రధాని గురించి చిన్న సమాచారం...కనీసం ఇప్పుడైనా....

1 comment:

  1. దేనికైనా వార్తా "విలువ" ఉంటెనే మీడియా రిపోర్ట్ చేస్తుందని అనేకసార్లు నిరూపించబడింది. వాజ్ పేయ్ గారు బాత్ రూం లో కాలు జారి పడితే వార్త. ఆయన ఆరోగ్యంగా ఉంటే వార్తేమిటి అని సంపాదకుల (అలా ఎవరన్నా ఇంకా పత్రిలల్లో ఉంటె) అభిప్రాయం అయ్యి ఉంటుంది. మరొక వ్యక్తి కూడా ఉన్నారు. జార్జ్ ఫెర్నాండేజ్. ఆయన కూడ ఎలా ఉన్నారో తెలియదు. కాన్షీ రాం మరణీంచేవరకూ ఎక్కడ ఉన్నారో ఎవరింట్లో ఉన్నారో కూడ రిపోర్ట్ చెయ్యలేని అశక్తతో ఉన్నది మీడియాగా చెలామణి అవుతున్న మన యాడ్ మానేజ్‌డ్ పత్రికా ప్రపంచం. రెండుసార్లు ఆపధ్ధర్మ ప్రధాన మంత్రిగా ఉన్న గుల్జారీలాల్ నందా గారు బతికి ఉన్నరోజుల్లో ఎన్ని సార్లు ఆయన గురించి వ్రాశారు. మీడియాకు ఉన్న ఒక అలిఖిత సూత్రం ఎమంటె, మాజీలు బతికి ఉంటే వార్త కాదు. వాళ్ళు మరణిస్తేనే వార్త. ఒక సారెప్పుడో (చాలా కాలం అయ్యింది) టైంస్ లోనో న్యూస్ వీక్ లోనో, అప్పటికి బతికి ఉన్న అమెరికన్ మాజీ రాష్ట్రపతులందరి గురించి వాళ్ళు ఇప్పుడు ఏమి చేస్తున్నారు అని ఒక చక్కటి శీర్షిక వ్రాశారు. మనకి కూడ ఇప్పుడు వాజ్‌పేయి దగ్గర నుంచి ఇద్దరు ముగ్గురికి పైగానే మాజీ ప్రధానులు జీవించే ఉన్నారు. వీరందరి మీద ఒక చక్కటి అరగంట కార్యక్రమం తయారు చేసి చూపించవచ్చు. మంచి హ్యూమన్ ఇంటరెస్ట్ ఐటం అవుతుంది. ఆలోచించండి మరి.

    ReplyDelete