Tuesday, November 6, 2012

దామిని బతికింది...దయ గెలిచింది

హమ్మయ్య! దామిని బతికింది! కడుపు తీపి తెలిసిన తల్లులకు, తండ్రులకు ఇంతకంటే సంతోషాన్ని, సంతృప్తిని కలిగించే వార్త ఇంకేముంటుంది?

దామిని బతకడమే కాదు;  దయ, దానగుణం వంటి మానవీయస్పందనలపై ఆశనూ బతికించింది!

దామిని బతికిందన్న వార్త ఎంత హాయి గొలిపిందంటే, మహాభారతంలోని  ఒక ఘట్టం చటుక్కున గుర్తొచ్చింది. స్వర్గానికి వెళ్ళిన ధర్మరాజుకు అక్కడ తన సోదరులు కనిపించలేదట. పైగా దుర్యోధనుడు కనిపించాడట. ఆశ్చర్యమూ, ఆవేదనతోపాటు అసూయా కలిగిందట. నరకంలో ఉన్న సోదరులను చూడడానికి వెళ్లాడట. ఇంకేముంది, ధర్మరాజు నరకంలోకి అడుగుపెట్టగానే అక్కడ పాపాత్ములు పడుతున్న నరకయాతనలు ఆగిపోయాయి. జుగుప్సావహ దృశ్యాలు అన్నీ అదృశ్యమైపోయాయి. రకరకాల దుర్గంధాలను పోగొడుతూ శరీరానికి ఎంతో హాయి కలిగించే పరిమళవంతమైన గాలి వీచింది.

అలాగే మనం ప్రతిరోజూ మీడియా మనముందు ఆవిష్కరించే అవినీతి, అక్రమాలు, నిర్దయ, నిష్క్రియత్వం వంటి దుర్వాసనలు గుప్పించే వైతరణిలో ముక్కు మూసుకుని మునకలేస్తుంటామా...ఆ స్థితిలో చిన్నారి దామిని బతికి బట్టకట్టడం నడివేసవిలో మలయమారుతంలాంటి చల్లని వార్త.

మీడియా పనితీరుపై సవాలక్ష విమర్శలు ఉండచ్చు. కానీ కొనవూపిరితో ఉన్న దామిని దయనీయస్థితినీ, తండ్రి దుఃఖాన్నీ ప్రపంచానికి చూపించి పుణ్యం కట్టుకున్నది మీడియానే. ఆపైన దామినిని బతికించే కర్తవ్య్యాన్ని స్వచ్ఛంద సంస్థలు మీద వేసుకున్నాయి. ఒక నిరుపేద రిక్షా కార్మికుని కూతురు దామినిని బతికించడాన్ని జైపూర్ లోని ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఒక సవాలుగా తీసుకున్నారు. తమ వైద్యపరిజ్ఞానం మొత్తాన్ని రంగరించారు. అన్ని రోజులూ అక్షరాలా 'వైద్యో నారాయణో హరిః' అనిపించుకున్నారు. తమ చదువును సార్ధకం చేసుకున్నారు. అంతేకాదు, దామిని స్వస్థలమైన భరత్ పూర్ లోని ప్రభుత్వ యంత్రాంగం ఆసుపత్రి ఖర్చు భరించింది. దాతలు ముందుకొచ్చి దామినికి మంచి భవిష్యత్తును కోరుకుంటూ 17 లక్షల రూపాయలు సమకూర్చారు.

ఎంత అరుదైన సన్నివేశం! ఎంత ఆహ్లాదకరమైన దృశ్యం!

దామిని ఉదంతం ఇంకా ఏమేం చెబుతోంది? పాషాణప్రాయంగా పైకి కనిపించే ఈ వ్యవస్థలో కూడా అట్టడుగున గుండెతడి ఉందని చెబుతోంది. సరిగ్గా 'ట్యాప్' చేయగలిగితే దామిని లాంటి కోట్లాది నిరుపేద చిన్నారుల బతుకుల్లో వెలుగు నింపడానికి సిద్ధపడే  అజ్ఞాత దాతలకు, సేవకులకు ఈ దేశంలో కొదవ లేదన్న సంగతిని చెబుతోంది. ఇలాంటి వారందరినీ పూల్ చేసి ఈ దేశంలోని మరెందరో దామినులకు రక్షణ కల్పించే వ్యవస్థను అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్ననూ ముందుకు తెస్తోంది.

ఇంకోవైపు చేదు నింపే వాస్తవాలనూ గుర్తు చేస్తోంది.

దామిని జీవించింది సరే, దామిని ఎదుర్కొన్న పరిస్థితినే ఎదుర్కొంటూ ఏ వైపునుంచీ ఎలాంటి సాయమూ అందక అజ్ఞాతంగా, అన్యాయంగా కన్ను మూస్తున్న లక్షలాది దామినులకు ఎవరు రక్ష? మీడియా ఎంతమందిని ఫోకస్ చేయగలుగుతుంది? చేయడానికి 24 గంటల వార్తా చానెళ్ల కైనా సమయం సరిపోతుందా? ఎంజీవోలైనా ఎంత చేయగలుగుతాయి? జీవో(ప్రభుత్వాసంస్థలు)లు ఏం చేస్తున్నాయి? పనంతా ఎంజీవోలకు అప్పగించి పెత్తనం చేయడానికా జీవోలు ఉన్నది?

దామినిని మృత్యుముఖం లోకి నెట్టినదీ, తల్లి లేని పిల్లను చేసిందీ కూడా పోషకాహారలోపమే. ఆ సమస్యను పరిష్కరించవలసింది ప్రభుత్వమే కానీ ప్రభుత్వేతర సంస్థలు కావు. మరి ఆ దిశగా జరుగుతున్నప్రయత్నం ఏమిటి? దామిని బతికిందన్న చల్లని వార్త వచ్చిన రోజే గుండెల్ని పిండి వేసే ఒక దారుణ వార్త. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో కరెంటు లైవ్ వైరు మీదపడి నలుగురు చిన్నారుల దుర్మరణం! అమెరికాలో ఇళ్లముందు పచ్చిక నిర్ణీత ప్రమాణానికి మించి పెరిగితే జరిమానా విధిస్తారు. ఈ దేశంలో ఇళ్ళలో నిద్రపోతున్న పసిపాపలను కరెంటు వైరుల నుంచి కాపాడే దిక్కు కూడా లేదు. అసలిక్కడ ప్రభుత్వమూ, పాలనా అనేవి ఉన్నాయా?

దామిని లాంటి పసికందుల ప్రాణాలకు అభయమిచ్చే దయగల మారాజులు ఉన్న ఈ దేశంలో పాలనా వ్యవస్థ ఇంత నిర్దయగా, నిష్పూచీగా ఎందుకు అఘోరించింది?


1 comment:

  1. నిజమేనండి. ఒక మనిషిగా మనకు తోచినవిధంగా మనం సహాయం చేయగలం.
    కానీ పాలనా వ్యవస్థ మంచిగా ఉంటే ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు.

    ReplyDelete