Tuesday, November 20, 2012

ఆంధ్ర రాజకీయాలు: ఒక అబ్సర్డ్ డ్రామా


ఆంధ్రప్రదేశ్ లో అనిశ్చితి, అల్లకల్లోలం ఏర్పడి ఎంతకాలం అయింది?
దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఒకటీ, అనేక కోణాల నుంచి ప్రాధాన్యమూ కలిగిన ఈ రాష్ట్రం అఖిలభారత జాతీయ కాంగ్రెస్ సారథుల ప్రయోగశాలగా మారి ఎంతకాలమైంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆబ్సర్డ్ డ్రామాగా మారి ఎంతకాలమైంది?
మూడేళ్లైంది...వచ్చే ఎన్నికల వరకూ ఈ రాష్ట్రం ఇలాగే ఉండబోతోంది. వెరసి మొత్తం అయిదేళ్లు. ఈ అయిదేళ్ళ కాలం రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఒక రైటాఫ్ కాలంగా నమోదు అవుతుంది. వరసగా రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారమిచ్చి, కేంద్రంలో యూపీయే అధికారానికి వరసగా రెండు పర్యాయాలు ఊతమిచ్చిన ఈ రాష్ట్రప్రజలను కాంగ్రెస్ ఇంతగా ఎందుకు శిక్షిస్తున్నదో తెలియదు. వాళ్ళ ముఖాన ఇంత అనిశ్చితిని, అయోమయాన్ని ఎందుకు లిఖించిందో తెలియదు.
కాంగ్రెస్ సారథ్యం తీసుకున్న ప్రతి ఒక్క చర్యా ప్రయోగమే అయింది.
మొదట రోశయ్యను ముఖ్యమంత్రిని చేశారు. రోశయ్యనే ఎందుకు చేయవలసివచ్చిందో తెలియదు. ఏడాదిలోనే ఆయనను తప్పించారు. కారణం తెలియదు. వృద్ధాప్యం వల్ల ఇంతటి రాష్ట్రభారాన్ని ఆయన మోయలేక పోతున్నారనో, లేదా ఆయనకు సామాజిక వర్గ బలం లేదనో అనుకుంటే ముందే ఆయనకు అవకాశమివ్వకుండా ఉండవలసింది. కానీ అఖిలభారత కాంగ్రెస్ సారథ్యం ఈ రాష్ట్రం గుండెల మీద ప్రయోగాలు చేయాలనుకుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుతో జూదమాడాలనుకుంది.
కిరణ్ కుమార్ రెడ్డిని తెచ్చారు. ఆయననుంచి ఏమి ఆశించి తెచ్చారో తెలియదు. ఈ రెండేళ్లలో అది ఎంతవరకు సఫలమైందో తెలియదు. యువకుడు కనుక ఏదో చేయాలన్న ఉత్సాహమూ, ఓపికా ఆయనకు ఉండచ్చు. కానీ ఈ అధికారం ఆయన సొంతంగా గెలుచుకున్నది కాదు. ఆయనకు జనం మాండేట్ లేదు. కనుక ఆయన గట్టిగా తనదైన ముద్రతో ఏమీ చేయలేరు. చేయాలనుకున్నా పార్టీని కబ్జా చేసిన మోతుబరులు చేయనివ్వరు. మంత్రివర్గంలో ఉంటూనే ముఖ్యమంత్రిపై కత్తి కట్టడం...ప్రభుత్వ విధానాలపై బహిరంగ విమర్శలు చేయడం...ఎవరికి వారు వ్యక్తిగత గుప్త ఎజెండాలను తయారు చేసుకోవడం...ఇదీ ఈ రాష్ట్రమంత్రివర్గంలో చూస్తున్న వింత పోకడ.
ఈ రాష్ట్రంలో ఆకు కూడా కదలని సుదీర్ఘ స్తంభన. సర్వత్రా ఒక నిశ్చల చిత్రం. తెలంగాణ సమస్య ఎక్కడి దక్కడే. సాధారణ పరిపాలన అంటారా...అధికారంలో ఎవరున్నారన్నదానితో నిమిత్తం లేకుండా అది ఏదో ఒక మోతాదులో సాగుతూనే ఉంటుంది.
ఇక రాజకీయంగా చూస్తే అంతా ఒక పెద్ద ఆబ్సర్డ్ డ్రామా. దాదాపు అన్ని ప్రధాన పక్షాలలోనూ అనేకమంది ముఖాలకు మాస్క్ తగిలించుకుని కనిపిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ సొంత ముఖాలే ఇప్పుడు మాస్క్ లుగా మారిపోయాయి. సొంత ముఖం లా కనిపించే ప్రతి మాస్క్ వెనుక మరో ముఖం ఉంది. ఎన్నికల వేడి పెరిగిన కొద్దీ ఆ మాస్క్ కొంచెం కొంచెం గా పక్కకు తొలగుతుంది. ఈ ముసుగు రాజకీయ డ్రామా క్లైమాక్స్ కు చేరుకుంటున్న సూచనలు ఇప్పటికే మొదలయ్యాయి.
మూడేళ్లుగా ఈ రాష్ట్రం ముఖానికే ముసుగు వేలాడుతోంది. ముసుగే కాదు అతి పెద్ద ముసురు పట్టిన రాష్ట్రం ఇది.
ఎన్నికల తర్వాత అయినా ఈ ముసురు తొలగుతుందా? ముసుగు జారుతుందా?
ఇదీ మిలియన్ డాలర్ ప్రశ్న!


No comments:

Post a Comment