Monday, November 12, 2012

గడ్కరీ సేవలో...

వీక్షకులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
                         ***

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచిస్తుందని మనకు తెలుసు.

కానీ ఇప్పుడు సంఘ్ ఆత్మ మొత్తం ఒకే ఒక మానవుణ్ణి పట్టుకుని పాకులాడుతోంది. ఆ మానవుని పేరు నితిన్ గడ్కరీ.

 గడ్కరీపై వచ్చిన ఆరోపణల వెనుక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి పాత్ర ఉన్నట్టు ఆర్.ఎస్.ఎస్ మేధావి జి.ఎం. వైద్య తన బ్లాగ్ లో అభిప్రాయపడ్డారు.  గడ్కరీ తప్పుకోవడం మర్యాదగా ఉంటుందని రామ్ జెత్మలానీ అంటూనే, మోడీ ప్రధానమంత్రిత్వానికి అర్హుడని అన్నారు కనుక అనుమాన సూచి  మోడీని చూపిస్తోందని ఆయన భాష్యం. సహజంగానే అది బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. గుజరాత్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఘట్టంలో వైద్య మాటలు పార్టీలో అంతర్వివాదాలను రచ్చ కీడ్చి బలహీన పరుస్తాయి కనుక నాయకత్వం వెంటనే నష్టనివారణ చర్యలకు దిగింది. వైద్య అభిప్రాయంలో నిజం లేదనీ, ఎన్నికల యుద్ధఘట్టంలో పార్టీ మొత్తం మోడీకి వెన్నుదన్నుగా ఉందనీ హడావుడిగా ప్రకటించింది. గడ్కరీ కూడా వైద్య అభిప్రాయాన్ని తోసి పుచ్చుతూ ప్రకటన చేశారు.

అటు వైద్య కూడా తనది వ్యక్తిగత అభిప్రాయమే తప్ప సంఘ్ అభిప్రాయం కాదని వివరణ ఇచ్చారు.

తన ఆరోపణ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వైద్యకు తెలియదా అంటే తెలుసుననే అనుకోవాలి. పైగా ఆయన 'సీనియర్ జర్నలిస్ట్'.  వైద్యకు సంఘ్ తో గల సంబంధాలను కప్పిపుచ్చుతూ, ఆయన మాటలు ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్న మాటలుగా చిత్రించడానికి గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్ లాంటివారు ప్రయాసపడ్డారు కూడా. తక్షణమే గుర్తొచ్చే ఇలాంటి మరో ఉదాహరణ గురుమూర్తి. గడ్కరీ వ్యాపారలావాదేవీలలో ఎలాంటి అవకతవకలూ లేవని ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసినదే. సంఘ్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయన్న జగమెరిగిన సత్యాన్ని దాచి ఆయనను పేరుమోసిన చార్టర్డ్ అకౌంటెంట్ గా ఆర్థిక సలహాదారుగా పరిచయం చేయడానికి బీజేపీ నాయకులు ఇలాగే ఆయాసపడ్డారు.

తన మాటలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలిసి కూడా వైద్య ఆ మాటలు ఎందుకన్నారు? అందులోనూ గుజరాత్ ఎన్నికలకు  సంసిద్ధమవుతున్న కీలక ఘట్టంలో పార్టీని బలహీనపరిచే వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎందుకంటే, సంఘ్ ఆత్మ గడ్కరీ అనే ఏకైక మానవుడి కోసం క్షోభిస్తోంది కనుక! గడ్కరీకి ఆపద వచ్చిందేనన్న దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్న సంఘ్ ఆ దుఃఖ పారవశ్యంలో అన్ని ఔచిత్యాలనూ గాలికొదిలేసి వీథి కెక్కింది. తమాషాగా లేదూ?

అంతేకాదు, తన మాటల ప్రభావాన్ని ముందే ఊహించగలిగిన వైద్య రాజకీయనాయకుల తరహాలో 'వ్యక్తిగత' అభిప్రాయంగా పేర్కొని తప్పించుకునే  రూటును కూడా ముందే ఆలోచించుకుని ఉండాలి. అంటే అంత పెద్ద సంఘమూ గడ్కరీ అనే మానవుడి కోసం రాజకీయ స్వయం సేవక్ సంఘ్ గా కూడా మారగలదన్న మాట. భేష్!

గతంలో సంఘ్ అధికారప్రతినిధిగా, రెండేళ్ల క్రితం వరకు సంఘ్ లో క్రియాశీల నేతగా ఉన్న వైద్యకు సంఘ్ కు భిన్నమైన 'వ్యక్తిగత' అభిప్రాయాలు...అందులోనూ బీజేపీ, సంఘ్ లతో ముడిపడిన వివాదాస్పద విషయాల్లో...ఉంటాయా? ఉండచ్చా? ఉన్నప్పటికీ వాటిని బహిర్గతపరచే స్వేచ్ఛ ఉంటుందా? ఇవీ ప్రశ్నలు.

రామ్ జెత్మలానీకి తన అభిప్రాయాన్ని ప్రకటించే హక్కు ఉన్నప్పుడు నాకు ఎందుకుండకూడదని వైద్య ప్రశ్నిస్తున్నారు. రామ్ జెత్మలానీ వివాదాస్పదంగా మాట్లాడే మనిషిగా విఖ్యాతుడు. అందులోనూ రాజకీయవాది. ఆయన మాటల్ని ఎంత మోతాదులో పట్టించుకోవాలో అంత మోతాదులోనే పట్టించుకుంటారు. అటువంటి వ్యక్తితో సంఘ్ వయో వృద్ధుడికి సాపత్యమా? హవ్వ...

ఏం మాట్లాడినా 'వ్యక్తిగతం' అన్న ట్యాగ్ తగిలిస్తే చాలు చెల్లి పోతుందనుకున్నప్పుడు కాంగ్రెస్ నేతల వ్యక్తిగత వ్యాఖ్యలను తప్పు పట్టే నైతిక అర్హత ఎలా ఉంటుంది? ఉదాహరణకు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థను బహుళ  సభ్య వ్యవస్థగా మార్చే ఆలోచన ఉందని మంత్రి నారాయణ స్వామి అన్నందుకు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఒకవేళ  'వ్యక్తిగత' స్థాయిలో ఆ మాట అన్నానని  మంత్రి  అంటే?

గమనించండి...ఎటువంటి వ్యక్తిపై ఆర్.ఎస్.ఎస్. మాతృప్రేమ కట్టలు తెంచుకుంటోదో! ఈ సంఘ్ మాజీ ప్రచారక్  క్విడ్ ప్రోకో, అడ్రస్ లేని షెల్ కంపెనీలు, అనుమానాస్పద పెట్టుబడుల వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినాసరే సంఘ్ నాయకత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. శీల నిర్మాణం గురించి ప్రబోధించే సంఘ్ నిజా నిజాలు తేలేవరకూ ఆయన తప్పుకుంటే మంచిదని అనడం లేదు. అనకపోగా గడ్కరీపై ఆరోపణలను మీడియా కుట్రగా చిత్రించడానికి సాహసించింది. గురుమూర్తి ద్వారా  గడ్కరీకి 'క్లీన్ చిట్' ఇప్పించింది. తాజాగా, గడ్కరీపై ఆరోపణల వెనుక ఏకంగా మరో మాజీ  ప్రచారక్ అయిన మోడీ కుట్ర ఉందనడానికి సిద్ధపడింది.

దీనినిబట్టి ఇంకా ఏం తేలుతోంది? బీజేపీలోనే కాక సంఘ్ లో కూడా ముఠాలు, చీలికలు ఉన్నాయని కాదా?

ఆర్.ఎస్.ఎస్., బీజేపీలను గట్టిగా సమర్థించే ప్రముఖ పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా అన్నట్టు మహారాష్ట్ర బ్రాహ్మణవర్గం గడ్కరీకి ఇలా  గొడుగుపడుతుండడమే నిజమైతే సంఘ్ చెప్పే సాంస్కృతిక జాతీయవాదం మహారాష్ట్రకూ, అందులోనూ ఒక కులానికీ;  ఏకాత్మ మానవతావాదం గడ్కరీ అనే ఏకైక మానవుడికి కాపలా కాసే స్థాయికీ కుంచించుకుపోతున్న దృశ్యమే కొట్టిచ్చినట్టు కనిపించదా?






3 comments:

  1. ఒకవేళ "వైద్య" అనే ఆ ఆర్ ఎస్ ఎస్ మనిషి "'సీనియర్ జర్నలిస్ట్'" అన్న మాటలు నిజమైనా కూడా ఏమిటిట?! ప్రతి పార్టీలో జరిగినట్టే బి జె పి లో కూడా అంతర్గత యుధ్ధాలు జరగ కూడదని ఏమన్నా మీడియా రూల్ పెట్టిందా? మీడియాకు ఎందుకు ఇంత ఆర్ ఎస్ ఎస్ ఫిక్సేషన్! కాగ్రెస్ లో ఏమి జరిగినా అది మీడియా దృష్టిలో అంతర్గత ప్రజాస్వామ్యం, లేదా వారి అంతర్గత వ్యవహారం. కాగ్రెస్ పార్టీ నాయకుల గురించి ముఖ్యంగా ఆ పార్టీ రాయల్ ఫామిలీ గురించి వ్రాసేప్పుడు మీడియా ఎంతో జాగ్రత్తగా "మీడియా విలువలు" అన్నీ పాటిస్తుంది. మిగిలిన పార్టీలు ముఖ్యంగా బి జె పి అంటే చాలు వంటి కాలి మీద ఏమి దొరుకుతుందా అని కోదిగుడ్డు మీది వెంట్రుకల శోధనకి తయారు!! ఎందుకు మీడియాకు కూడా ఈ ద్వంద్వ విధానం. ఒకవేళ బి జె పి అధికారంలోకి వస్తే మీడియాకి ఎమన్నా ఇబ్బందా?! నా దృష్టిలో మీడియా మానేజిమెంట్ కాంగ్రస్ కు తెలిసినంతగా మరే ఇతర పార్టీకి తెలియదు. ఈ మీడియా మానేజిమెంట్ విషయంలో, బి జె పి పరమ అసమర్ధ పార్టీ, అందుకనే ఆ పార్టీ ఎప్పుడూ మీడియా నుంచి నెగటివ్ రిపోర్టింగ్ ఎదుర్కుంటూ ఉంటుంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ లాగా మీడియా మానేజిమెంట్ నేరుచుకోవాలి తప్పదు అని ఈ ఉదంతం మరొకసారి ఆ అవసరాన్ని గుర్తు చేస్తున్నది.

    ReplyDelete
  2. @శివరామప్రసాదు కప్పగంతు,

    బాగా చెప్పారు. ఈ బ్లాగు రచయిత రాసిన లోపలి మనిషి పుస్తకం చదివిన నాకు ఇతని పైన ఒక పాసిటివ్ ఇమేజ్ ఉంది. పి వి గారి మీద అంత గొప్ప పుస్తకం రాసినవారికి ఎంతో అవగాహన పరిధి ఉంటుందని నా అంచనా. ఈ టపా చదివిన తరువాత ఆ ఇమేజ్ తుడిచి పెట్టుకుపోయింది. ఆర్ యస్ యస్ పడని వారు చేసే విమర్శలు వేరే విషయం కాని, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్ యస్ యస్ ను ఒక్క చిన్న సంఘటనతో ఇలా తీసిపారేస్తూ రాసిన వ్యాసం తెలుగులో ఎప్పుడు చదవలేదు. అది చీప్ గా ప్రాంతీయ, కుల కోణలో చూస్తూ ఆరోపణలు చేయటం.కొన్ని విషయాలను అప్పటికప్పుడు విశ్లేషన చేసి అభిప్రాయాలు ఖచితంగా ఇది కారణం అని చెప్పలేం. వాస్తవాలు మెల్లగా కొంతకాలానికి బయటపడతాయి.

    Gurumurti on nitin Gadkari
    http://www.youtube.com/watch?v=OdBjatN4cLs

    ReplyDelete
  3. @ SRINIVAS

    It is not my intention to somehow find Gadkari a good man by some Chartered Accountant's(of all the people)utterings.

    My point is the prejudiced reporting by the Media. If something happens in BJP they magnify it and show RSS as a bogey. These Reporters not only that they do not write anything about the leftist terrorism but write sympathetic pieces may be out of fear or may be because of their leftist leanings or payments from China.Infact,there were much worse riots in Gujarat before when Congress was ruling, when the initiators were the darlings of the Secular fundamentalists and you can guess it, most of the dead were Hindus. Even in the 2002 riots nobody even in the so called media are talking or giving minimum courtesy of reporting about the Karsevaks burnt alive by the Darlings of Secular fundamentalists. Media is reporting only one sided on Gujarat and the happenings and keeping the issue alive even when the victims themselves (both sides) went ahead and resumed their lives.

    The twisted way of reporting by the Media is quite abhorent and most probably the roots of such writing can be traced to the Media Management of Congress. Why this kind of singled minded obsession is not shown regarding 1984 Riots in Delhi at which time Rajiv Gandhi was like a Nero who was not even fiddling but a mute witness till his party's henchmen did what they planned.

    All these Rajdeep Sar Desais, Burkha Dutts who in the process even get themselves Padma award (!) and their ilk are the worst examples of abuse of Press Freedom and prejudiced reporting.

    ReplyDelete