Monday, November 5, 2012

రాజకీయ 'వివేక' భ్రష్టత


గడ్కరీకి రోజులు బాగులేవు! ఆయన చేతలే కాదు, మాటలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి.
జాతకాల మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన తన కంపెనీ డైరక్టర్లలో ఒకరిగా సొంత జ్యోతిష్కుని నియమించుకుంటారు? అయినాసరే ఆ జ్యోతిష్కుడు ఆయన జాతకం సరిగా చెప్పినట్టు లేదు. ఎక్కడో లెక్క తప్పింది. వివాదాల ఊబిలో ఇంకా ఇంకా కూరుకుపోతూనే ఉన్నారు. ఆయన రాజకీయభవిష్యత్తుకు రాహువు అడ్డుపడుతున్న సూచనలే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆర్.ఎస్.ఎస్. చక్రం అడ్డేసినా ప్రయోజనం ఉంటుందని తోచడంలేదు.
ఒకే రోజున రెండు ఎదురు దెబ్బలు!
పాపం ఆయన ఏదో సమావేశంలో మాట్లాడుతూ వివేకానందుడికీ, పేరుమోసిన స్మగ్లర్ దావూద్ ఇబ్రహీమ్ కీ పోలిక తెచ్చారు. ఎంత అపచారం అంటూ కాంగ్రెస్ శ్రేణులు వెంటనే బరిలోకి దిగాయి. రాజకీయంగా అంది వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వదలుకుంటారు? ఒకవేళ కాంగ్రెస్ నేత ఎవరైనా అలా మాట్లాడినా బీజేపీ అదే చేస్తుంది. అంతకంటే ఎక్కువే చేస్తుంది. వివేకానందుడు కాంగ్రెస్ కి కన్నా తమకే దగ్గరని బీజేపీ అనుకుంటుంది.
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అలా పోలిక తేవడంలో గడ్కరీకి ఎలాంటి దురుద్దేశమూ ఉండి ఉండదు. ఆయన పూర్వాశ్రమంలో ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ గా ఉన్నారు. బహుశా ఆ క్షణంలో తను బీజేపీ జాతీయ అధ్యక్షుడినన్న సంగతిని మరచిపోయి, కాసేపు ప్రచారక్ పాత్రలోకి మారిపోయి ఉంటారు. ఆర్.ఎస్.ఎస్. బైఠక్ ల లో అలాంటి ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ బైఠక్ లలో కాంగ్రెస్ వాదులు ఉండరు. ఆ ప్రసంగాలు మీడియాలో రిపోర్ట్ కావు. కనుక పేచీ ఉండదు.
ప్రచారక్ భాష ఒక్కటేనా, గడ్కరీ ఆ సమయంలో సైన్సు భాష కూడా మాట్లాడారు. సైన్సు టీచర్ గా మారిపోయారు. సైంటిఫిక్ భాషలో చెబితే వివేకానందుడు, దావూద్ ఇబ్రహీమ్ ల ఐక్యూ ఒకటే. కానీ వివేకానందుడు తన ఐక్యూను సామాజిక శ్రేయస్సుకు ఉపయోగిస్తే, దావూద్ సామాజిక వినాశనానికి ఉపయోగించాడని ఆయన మాటల సారాంశం.
ఆ మాటల్లో తప్పేముందని మామూలు బుర్రలకు అనిపిస్తుంది. ఉదాహరణకు, రాముడు ధర్మాత్ముడు, రావణుడు అధర్మపరుడు అన్నామనుకోండి... అది రావణుడితో రాముణ్ణి పోల్చి అవమానించినట్టు అవుతుందా?! అయితే ఇది మామూలు బుర్రలకు కలిగే సందేహం. రాజకీయ బుర్రలు వేరు.  మీరు ఏం మాట్లాడండి, రాజకీయ బుర్రలు తమకు కావలసిన అర్థాన్నే తీసుకుంటాయి.
ఎంతో కాలంగా రాజకీయాలలో ఉన్నా గడ్కరీ ఆ సంగతి ఆ క్షణంలో మరచిపోయారు. హఠాత్తుగా ప్రచారక్ భాషలోనూ, సైన్సు భాషలోనూ మాట్లాడారు. దాంతో వచ్చింది చిక్కు. ఎందుకలా మాట్లాడారంటే, ప్రస్తుతం ఆయన గ్రహస్థితి బాగులేదుకనుకనే కావచ్చు.
గడ్కరీ మాటలపై శత్రుపక్షంలోనే కాదు, సొంత పార్టీలోనే నిరసన రాజుకుంది. మహేష్ జెత్మలానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గడ్కరీకి ఇది రెండో ఎదురుదెబ్బ.
మామూలు మనుషులతో పోల్చితే రాజకీయనాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారనుకుంటాం. కానీ ఏది పడితే అది మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు లేదు. ఆ ప్రాథమికసత్యాన్ని విస్మరించడమే గడ్కరీ చేసిన తప్పు. రాజకీయనాయకుడు  మాట జారితే చెల్లించుకోవలసిన మూల్యం ఒక్కొక్కసారి భారీగానే ఉంటుంది. అద్వానీయే అందుకు ఉదాహరణ. జిన్నాను లౌకికవాదిగా కీర్తించి ఆయన ఆర్.ఎస్.ఎస్. ఆదరణను, బీజేపీ అధ్యక్షపదవినీ కోల్పోయిన సంగతి తెలిసినదే.
రాజకీయవివేకం కోల్పోయి మాట్లాడినందుకు గడ్కరీ ఎటువంటి ప్రతిఫలం చెల్లించుకుంటారో వేచి చూడవలసిందే.

No comments:

Post a Comment