ఊళ్ళకు టీవీలు వచ్చాయి. సెల్ ఫోన్లు వచ్చాయి. కంప్యూటర్లు
వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీలూ వచ్చాయి. ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్
ఇంజనీరింగ్ చదువులతోపాటే విదేశీయానాలూ వచ్చాయి.
ఇన్ని వచ్చినా పరిశుభ్రత ఎందుకు రావడం లేదు?
తమ పరిసరాలను ఆరోగ్యకరంగా ఉల్లాసకరంగా ఉంచుకోవాలన్న స్పృహ ఎందుకు కలగడం లేదు? తమ పిల్ల పాపలు ఆరోగ్యంగా ఆనందంగా పెరిగే వాతావరణం కల్పించమని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్న ఆలోచన ఎందుకు రావడం లేదు?
ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా పశ్చిమగోదావరి జిల్లా
నిడదవోలు బస్ స్టాప్ కు వెళ్ళారా? అక్కడ బస్సు ఎక్కి
ఎటువైపైనా ప్రయాణించి చూసారా? వీలైతే ఒకసారి ప్రయత్నించి
చూడండి. అది బస్సులాగే చోటుకాదు; మురుగులో దోమలు, ఈగలు, ఇంకా నానా రకాల క్రిములు జలకమాడే చోటని
వెంటనే తెలిసిపోతుంది. ఒకవైపు పచ్చగా పాచిపట్టిపోయిన మురుగు నీటి వైతరణి కనిపిస్తుంది. ఆ వైతరణిని
ఆనుకునే ఉన్న బస్ షెల్టర్ లో ఆ మురుగు నీటి మీంచి వచ్చి వాలే దోమలను, ఈగలను తోలుకుంటూ, ఆ మురికి వాసనను ఆస్వాదిస్తూ
కొంతమంది ప్రయాణీకులు నిలబడి ఉంటారు. అక్కడే తినుబండారాల విక్రయమూ జరుగుతూ
ఉంటుంది. ఆ మురుగు దోమలూ, ఈగలూ వాలిన ఆ తినుబండారాలను కొని
జనం అక్కడే ఆరగిస్తున్న దృశ్యమూ కనిపిస్తుంది. పోషకాహారలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ బక్క
చిక్కి నీరసించిన ఆడా, మగా; పిల్లా
పెద్దా చాలామంది కనిపిస్తారు.
అసలా బస్ స్టాపే వెలసిపోయి దైన్యాన్ని,
దరిద్రాన్ని ఓడుతూ ఇక్ష్వాకుల కాలం నాటిదిగా తెలిసిపోతూ ఉంటుంది. ఆపైన ఎత్తు
పల్లాలతో ఉన్న ఆ ప్రాంగణం, కనీసం దానిని చదును చేయించే
దిక్కు కూడా లేని సంగతిని చాటి చెబుతుంది.
ఇటువంటి నికృష్ట పరిసరాలలో బస్సు కోసం ఎదురు
చూడవలసిరావడానికి నిడదవోలు వాసులు, ఆ ఊరి మీదుగా వేరే ఊళ్ళకు వెళ్ళే వాళ్ళు ఏం
పాపం చేశారు? ఏం నేరం చేశారు?
అన్నట్టు ఆ బస్ స్టాప్ కు దగ్గరలోనే పురపాలకసంఘ కార్యాలయం
కనిపిస్తుంది. కానీ నిడదవోలు రోడ్ల మీద ప్రయాణించేవారికి అక్కడ పురపాలన కానీ,
దానికో సంఘం కానీ ఉన్నాయన్న నమ్మకం చచ్చినా కలగదు.
బస్ ఎక్కి మీరు పోలవరం వైపు వెడుతున్నారనుకోండి...రోడ్డు
మీద దుకాణాల ముందు, ఇళ్ల ముందు ఎక్కపడితే అక్కడ చెత్త గుట్టలు
కనిపిస్తాయి. అవి చెదిరి రోడ్డు మీద ప్రవహిస్తూ కాళ్ళకు అడ్డం పడుతుంటాయి. కొంచెం ముందుకు
వెడితే ఒక చోట కొన్ని వందల గజాల ప్రదేశంలో చెత్త పరచుకుని కనిపిస్తుంది. అక్కడే
బహిరంగ కాలకృత్యాలు జరుగుతుంటాయి. మరింత దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాన్ని
ఎదుర్కోడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ మహా చెత్త ప్రదేశాన్ని ఆనుకునే
ప్రభుత్వాసుపత్రి ఉంది!
సర్వకాలాలలోనూ రోగులతో ఆ ఆసుపత్రి కిట కిట లాడుతూ ఉంటే
ఆశ్చర్యమేముంది? అయినా సరే మందులూ,
డాక్టర్లూ లేని ప్రభుత్వాసుపత్రులది వేరే కథ. వేరే వ్యథ.
ఈ ఊరు చూసినా ఏముంది గర్వకారణం?
ఓపెన్ డ్రైనేజీలూ, దోమలూ, ఈగలూ, ఇంకా అనేకానేక క్రిమి కీటకాలూ, బహిరంగ కాలకృత్యాలూ, రోగాలూ, రొష్టులే కదా?
పురపాలన అనేది
అడ్రస్ లేకుండా ఎటు కొట్టుకుపోయింది? జిల్లా మంత్రులూ,
ఇంచార్జి మంత్రీ ఏం చేస్తున్నారు? ఎవరు అడుగుతారు? అడగాలన్న చైతన్యం ఎప్పటికి వస్తుంది?
ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రంలోని నిడదవోలు అనే
ఊరు ఒక్కటే ఇలా అఘోరించిందనుకోకండి. అన్ని ఊళ్లూ ఇదే వరస. ఉదయమో,
సాయంత్రమో అలా గోదావరి గట్టు మీద నడుస్తూ నది మీదనుంచి వీచే పరిశుభ్రమైన గాలిని
పీల్చాలని మీరు అనుకుంటారు. తీరా అందుకు ప్రయత్నిస్తే అది ఒక జీవిత కాలపు కలగా
వెంటనే అర్థమైపోతుంది. మీరు అటూ ఇటూ వ్యాపించిన బహిరంగ పాయిఖానాల మధ్య
నడవవలసివస్తుంది. ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.
ఇంటికొకరైనా విదేశాల్లో ఉంటున్న నేటి అత్యాధునిక కంప్యూటర్
యుగంలో కూడా బహిరంగ కాలకృత్యాలను నిషేధించలేకపోతున్న పరమ చెత్త పాలన గురించీ
పాలకుల గురించీ చెప్పుకోడానికి మాటలు దొరుకుతాయా? ఓపెన్ లావెట్రీని తలపించే ఈ రాష్ట్రాన్ని చూసి
పరాయి రాష్ట్రాల వాళ్ళూ, దేశాల వాళ్ళూ ఏమనుకుంటారు? ఈ మొహం పెట్టుకుని ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి చెప్పుకుంటారు?
సాయంకాలాలలో పదిమందీ చేరి ఉల్లాసంగా గడిపే పచ్చని
పరిశుభ్రమైన పార్కులు పట్టణాలలో ఉన్నాయా, పొరపాటున ఎక్కడైనా ఉంటే, ఏ స్థితిలో ఉన్నాయి? పట్టించుకునే నాథుడు ఉన్నాడా?
ప్రభుత్వాలకూ, మునిసిపాలిటీలకూ నిధుల నిష్ట దరిద్రం
ఎప్పటికీ తీరదు. ఎల్లకాలమూ వాటినే నమ్ముకుంటే పని జరగదు. జనమే పూనుకోవాలి. చందాలు
వేసుకుని అయినా చెత్త నుంచి, మురికి నుంచి బయటపడే మార్గం
చూసుకోవాలి. ఆరోగ్యకర పరిసరాలపై, పరిశుభ్రతపై స్పృహ
పెంచుకోవాలి. మరో మార్గం లేదు. ప్రభుత్వంతో, మునిసిపాలిటీలతోనే పని చేయించాలనుకుంటే ఆ మేరకు సంఘటితంగా డిమాండ్
చేయాలి. ఎన్నికలు అందుకు ఒక అవకాశం.
ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదే అన్నట్టుగా దానికోసం
పోరాడుతున్న రాజకీయనాయకులు ఊళ్ళు తగలబడిపోతున్న సంగతిని ఎప్పటికి గుర్తిస్తారు?
ముఖ్యంగా గోదావరి స్వాదుజలాలను ఆనుకునే ఉండి కూడా మురికి ఓడుతున్న గోదావరి జిల్లాల ఊళ్ళు కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి?!
ఒక్క నిడదవోలనేదేమిటీ, చాలా చోట్ల ఇదే స్థితి ! కంఠశోష తప్పించి, బాగుపడాలనే ఉద్దేశ్యమే లేనప్పుడు, ఎవరిని ఏమని లాభంలెండి?
ReplyDeleteone photo would be explanatory
ReplyDeleteగో.జి.లే కాదు, నాసికాత్రయంబకం నుంచి అదే పరిస్థితి. పవిత్ర గంగ, యమున పరివాహక ప్రాంతలదీ అదే స్థితి.
ReplyDeleteభాస్కరంగారూ
ReplyDeleteమీరుకూడా బ్లాగుతున్నారన్నమాట