Saturday, December 1, 2012

తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి


పబ్లిక్ లావేట్రీలను తలపించే ఆంధ్రప్రదేశ్ గ్రామాలు, పట్టణాల గురించి మళ్ళీ ఏమిటని అనుకోకండి. ఇది మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవలసిన సమస్య. ఈ రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎక్కడున్నా సరే పట్టించుకోవలసిన సమస్య. ఉమ్మడి సమస్య.
ఎందుకంటే, వేరొక రాష్ట్రంలోనో, విదేశాల్లోనో స్థిరపడిన లేదా ఉంటున్న తెలుగువాళ్లు కూడా కన్నతల్లి లాంటి సొంత ఊరుతో పేగుబంధాన్ని తెంచుకోవాలనుకోరు. తీరిక చేసుకుని ఒకసారి సొంత ఊరు వెళ్ళి తమ ఇల్లూ వాకిలీ చూసుకోవాలనుకుంటారు. ఆహ్లాదకరమైన పరిసరాలలో పరిశుభ్రమైన గాలి పీల్చాలనుకుంటారు. కాలుష్యం సోకని ఆకుపచ్చని అందాల మధ్య సేదదీరాలనుకుంటారు. అంతవరకూ కన్న ఆ రంగుల కల కాస్తా ఊళ్ళో అడుగుపెట్టిన తక్షణం పీడకలగా మారిపోతుంది. మురికి కూపంలా చెత్త కుప్పలా మారిన  ఊరి పరిసరాలనుంచి ఎప్పుడు బయటపడదామా అనుకుంటారు. తియ్యని పేగుబంధం కాస్తా పెద్ద రోగబంధంగా మారిపోతుంది.
ఇది కేవలం మీ ఊళ్ళో మీరు ఒక్క రోజైనా హాయిగా ఉండలేకపోవడం గురించిన సమస్యే కాదు. ఆ కలుషిత పరిసరాలలో ఒక జీవితకాలం గడిపే మీ సోదరీ సోదరులందరి సమస్య. మిగిలిన ఊళ్ళు, పట్టణాలు ఒక పెద్ద క్వారంటైన్ లా తయారై ఆంధ్రప్రదేశ్ లో వాసయోగ్యత హైదరాబాద్ (అది కూడా పాక్షికంగానే) లాంటి ఏ ఒక్క నగరానికో కుంచించుకుపోయిన దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి. ఊళ్లను పెంట దిబ్బలుగా మార్చి, యావన్మందీ హైదరాబాద్ నగరాన్ని పట్టుకుని వేల్లాడే దౌర్భాగ్య పరిస్థితిని సృష్టించిన పాలకుల అపసవ్య విధానాలను ఇప్పటికైనా ప్రశ్నించవలసిన అగత్యాన్ని గుర్తించండి.
ఈ నెలలో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపడానికి రాష్ట్రప్రభుత్వం కోట్లాది రూపాయిల వ్యయంతో పెద్ద ఎత్తున సన్నాహాలు జరుపుతోంది. జరపనివ్వండి. ఆ సభల్లో బహుశా తెలుగు వాళ్ళ భాషా సంస్కృతీ సాహిత్యాల గురించి అనర్గళ ఉద్ఘాటనలు జరుగుతాయి. జరగనివ్వండి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్నిఉద్దీప్తం చేయడం లక్ష్యంగా మహోపన్యాసాలు జరిగిపోతాయి. జరగనివ్వండి. కానీ తెలుగు సభల అజెండాలో తెలుగు ఊళ్ళు నానావిధాలుగా భ్రష్టుపట్టిపోవడం గురించి ఉంటుందా? పారిశుద్ధ్యం, పరిశుభ్రత పూర్తిగా లోపించిన రోగాంధ్రప్రదేశ్ గురించిన వైనం ఉంటుందా? ఉంటుందన్న నమ్మకం కలగడం లేదు.
ప్రపంచ తెలుగు సభలు విజయవాడలో కృష్ణ ఒడ్డున తలపెట్టి ఉంటే బాగుండేది. కృష్ణా తీరం అంతా బహిరంగ పాయిఖానాగా మారి కనీసం కృష్ణ స్నానం కూడా చేయలేని నికృష్టపరిస్థితి జనానికి దాపురించిన సంగతి పాలకులకు అర్థమయ్యేది. అది విజయవాడ కాదు, అపరిశుభ్రతా విలయవాడ అన్న వాస్తవం తెలిసొచ్చేది.
విజయవాడ ఒక్కటేనా... రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, వరంగల్, అనంతపురం ప్రతి పట్టణమూ చెత్త డంపింగ్ కేంద్రమే. వెలసిపోయి దైన్యాన్ని దరిద్రాన్ని మురికినీ ఓడుతున్నదే. రాష్ట్రాన్ని ఇలా చెత్తకుండీగా మార్చిన పాలకులు ఆ చెత్తకుండీలో తెలుగువాళ్ళ భాషా సంస్కృతీ సాహిత్యాల మహావృక్షం నాటి ఆత్మగౌరవం, గర్వం అనే పూలు పూయించడానికి సన్నాహాలు జరుపుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి!
భాషా సంస్కృతులు సరే, రాష్ట్రాన్ని పరిశుభ్రాంధ్రప్రదేశ్ గా మార్చాలన్న తీర్మానమైనా ఆ సభల్లో జరుగుతుందా? ఆ మేరకు ఒత్తిడి తేవలసిన అవసరం లేదా?
ఈ సందర్భంలో గాంధీజీని గుర్తుచేసుకోకుండా ఉండలేం. ఆయన అజెండాతో ఈ రోజున ఎవరికి ఎలాంటి అభ్యంతరాలైనా ఉండచ్చు. కానీ ఈ దేశానికి కనీసం రెండువందల సంవత్సరాలకు సరిపోయే అజెండాను ఇచ్చిన నాయకుడు అప్పటికీ ఇప్పటికీ ఆయన ఒక్కడే నన్న సంగతిని గాంధీ వ్యతిరేకులు కూడా అంగీకరించవలసిందే. దక్షిణాఫ్రికాలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అందుకు భారతీయ నాయకులు, పత్రికల మద్దతు కూడగట్టుకోడానికి భారతదేశానికి వచ్చిన గాంధీ ఇక్కడ తనున్న కొద్ది రోజుల్లో ఏం చేశాడో గుర్తుచేసుకుందాం. కలరా మహమ్మారి వ్యాపించిన ఆ సమయంలో ఆయన పాయిఖానాలు శుభ్రం చేసే పని తలకెత్తుకున్నాడు!
అంతేకాదు, దక్షిణాఫ్రికానుంచి శాశ్వతంగా భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత కూడా ఆయన చేపట్టిన ప్రధాన కార్యాలలో పారిశుద్ధ్యం ఒకటి. గోఖలే సలహాపై దేశం చుట్టిరావడానికి సిద్ధమైన గాంధీ, కస్తూర్బాతో కలసి మూడో తరగతి బోగీలో ప్రయాణం చేస్తూ చేసిన పని-తోటి ప్రయాణీకులకు, రైల్వే వారికి పారిశుద్ధ్యాన్ని బోధించడం.
చివరికి జైల్లో ఉన్నప్పుడు కూడా సర్దార్ పటేల్ వంటి సహ ఖైదీలకు పరిశుభ్రత గురించి పాఠాలు చెప్పినవాడు గాంధీ! ఆయన గతించి ఆరున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పారిశుద్ధ్యం పాలకుల అజెండాలో ప్రాముఖ్యం వహించకపోవడం ఎంత ఆశ్చర్యకరం?!
అంతకంటే సూటిగా, ఎకడమిక్ గా వేసుకోవలసిన ప్రశ్న-గాంధీ తర్వాత పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టిన నాయకుడు మరొకడు ఉన్నాడా?!
అజాగళ స్తనాలుగా నిరూపితులైన నేటి నాయకులనే ఇంకా నమ్ముకోవడమా? లేక ప్రజలే పూనుకుని తమ పరిసరాల పరిశుభ్రతకు తామే నడుము కట్టడమా?
ఎన్నారై తెలుగు సోదరులతో సహా అందరూ ఆలోచించుకోవలసిన తరుణం ఇది.
తెలుగు భాషనే కాదు, తగలబడుతున్న తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి.

1 comment:

  1. Everything govt cant do. How many of we know we have responsible for our domestic waste disposal? We have to segregate domestic waste to 3 to 5 types like bio degradable, non-biodegradable. Again in biodegradable wet waste,dry waste. In non biodegradable recyclable, electronics,plastic,glass,metals etc.For domestics waste disposal we don't need much technology. We should do some home work for separating the waste. Then automatically our waste become wealth. To implement this kind of policies our politicians should have some knowledge about environment.I dont think so we have such a politicians. May be JaiRamramesh,Jaipalreddy,SasiThorur few guys. These guys are not public icons, or mass driving. In Bangalore some how corporation decided domestic waste to segregated after collecting from home. Its practically difficult to separate after mixing at home. See the persons fate who will separation of waste after mixing at my home. So this caused delay in collection of waste from homes. So people finding the nearest empty plots at their home an disposing waste there.

    Finding problem is one step finding solution is the final step. We found the problem now we have to find solution. Here constraints for this problem is Human will not technology feasibility or more costlier project.

    ReplyDelete