Thursday, December 6, 2012

ఎఫ్.డీ.ఐ చర్చ: కొన్ని ప్రశ్నలు, సందేహాలు

చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐ మంచిదా, చెడ్డదా అన్నది చటుక్కున తేల్చి చెప్పడం కష్టమని కిందటి బ్లాగ్ లో అన్నాను. పార్లమెంట్ లో రెండు రోజుల చర్చను గమనించిన తర్వాత కూడా ఈ  అభిప్రాయాన్ని మార్చుకోవలసిన అవసరం కనిపించలేదు. అయితే  ఏ విషయంలోనైనా వెంటనే అభిప్రాయం చెప్పే వాళ్ళను మీరు  చూస్తుంటారు కనుక  ఆ జాబితాలో చేరని నా మాటలను కేవలం పైకి వినబడేలా చేసే ఆలోచన(లౌడ్ థింకింగ్)గానే తీసుకుంటారని భావిస్తున్నాను.

రాజ్యసభలో అరుణ్ జైట్లీ, సీతారాం ఏచూరీల ప్రసంగాలు విన్న తర్వాత చిల్లర వ్యాపారంలో ఎఫ్.డీ.ఐ ని అనుమతించడంవల్ల నిజంగానే చాలా నష్టాలు ఉంటాయనిపించింది. నిజం చెప్పాలంటే భయం వేసింది. ఎఫ్.డీ.ఐని అనుమతిస్తే చిన్న చిన్న మధ్య దళారులు పోయి సూపర్ దళారులు అవతరిస్తారని జైట్లీ అన్నారు. ప్రస్తుతం దేశంలో పాల వ్యాపారాన్ని తీసుకుంటే, 60 శాతానికి పైగా ఆదాయం ఉత్పత్తిదారులకు అందుతుంటే, మిగిలిన కొద్ది శాతమే దళారులకు,ఇతరులకు పోతోందనీ;  అదే పెద్ద పెద్ద రీటెయిల్ కంపెనీలున్నఇంగ్లండ్, అమెరికా లాంటి దేశాల్లో సరిగ్గా దీనికి తలకిందులుగా జరుగుతోందనీ అన్నారు. మన దేశంలో చక్కెర పరిశ్రమలో మాత్రమే చెరకు రైతులకు, ఫ్యాక్టరీలకూ మధ్య దళారీ వ్యవస్థ లేదనీ, అయినా సరే, చెరకు రైతులు నష్టాల ఊబిలోనే ఉండిపోతున్నారనీ అన్నారు. వాల్ మార్ట్ లు, టేస్కోలు, కర్రెఫోర్లు మౌలిక సదుపాయాలను కల్పించవనీ, ఆ పని ప్రభుత్వమే చేయాలనీ అన్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చెడిపోయే శాతాన్ని ప్రభుత్వం చాలా ఎక్కువ చేసి చెబుతోందనీ; వాస్తవానికి అది చాలా తక్కువ శాతమనీ అంటూ కొన్ని ప్రభుత్వ సంస్థల గణాంకాలను ప్రస్తావించారు. రీటెయిల్ రంగంలోకి ఎఫ్.డీ.ఐని అంగీకరిస్తే అమెరికా, ఇంగ్లండ్, ఫ్రెంచ్ కంపెనీలు దేశంలో తిష్టవేసి చైనా ఉత్పత్తులను మనకు అమ్ముతాయనీ, మనవాళ్లు సేల్స్ బాయస్ గా , సేల్స్ గర్ల్స్ గా మాత్రమే ఉండిపోతారనీ అన్నారు. అసంఘటిత చిల్లర వ్యాపార రంగం నిజానికి చిల్లర వ్యాపారులకు సేఫ్టీ వాల్వ్ అని కూడా అన్నారు.

చివరగా జైట్లీ ఇంకో మాట కూడా అన్నారు...దయచేసి 'ప్రస్తుత పరిస్థితులలో' ఎఫ్.డీ.ఐ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండని దాని సారాంశం. అంటే మరో సమయంలో ఎప్పుడో ఎఫ్.డీ.ఐకి తలుపు తెరిచే అవకాశాన్ని తమ పార్టీకి తెరచి ఉంచుకున్నారన్న మాట. ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ఎఫ్.డీ.ఐ అనుమతికి ఇదే తగిన సమయమని భావిస్తే, విపక్షం ఇది తగిన సమయం కాదంటోంది. ఎవరి అంచనా సరైనదనుకోవాలి?

సీతారాం ఏచూరీ కూడా ఇంతే భీతావహ దృశ్యాన్ని చూపించారు.

అయితే, ఎఫ్.డీ.ఐ వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయని విన్న తర్వాత కూడా కొన్ని ప్రశ్నలు, సందేహాలు అలాగే ఉండిపోయాయి.

1. ఇప్పటికే దేశీయంగా రిలయెన్స్ ఫ్రెష్, మెట్రో లాంటి బడా రీటెయిల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటి వల్ల చిన్న చిన్న కిరాణా వర్తకులకు, రోడ్ల మీద తిరుగుతూ కూరగాయలు అమ్ముకునేవారికి నష్టం జరగడం లేదా? 'ఎఫ్.డీ.ఐ' అన్న మాటే లేదు తప్ప ఇది కూడా 'బడా వ్యాపారులు వర్సెస్ చిన్నవ్యాపారు' ల పరిస్థితే కదా?
2. రోడ్ల మీద పాదచారులకు, సైకిళ్ళమీద వెళ్ళే వారికి అసౌకర్యంగా ఉంటున్నాసరే, కార్ల సంఖ్య పెరిగిపోవడానికి అవకాశమిస్తున్నాం. బీజేపీ హయాంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం సాగించారు. ఆ విషయాన్ని ఆ పార్టీ సగర్వంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. నాలుగు లేన్ ల రోడ్ల నిర్మాణం జరిగిన పల్లెలకు వెళ్ళి చూడండి. కార్లు, లారీలే తప్ప ఎడ్ల బండ్లు కనిపించడంలేదు. గతంలో రోడ్డు దాటడానికి వీలుండేది. డివైడర్ల వల్ల ఇప్పుడా అవకాశం పోయింది. దృశ్యాన్ని ఇంకో వైపు నుంచి చూడండి...  పాదచారులు, సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళూ ఎప్పటికీ అలాగే ఉండిపోవడం లేదు. బైక్ కొనుక్కునే స్థాయికీ, కారు కొనుక్కునే స్థాయికీ ఎదుగుతున్నారు. అలాగే, అసంఖ్యాక ప్రజానీకానికి అందుకొనే స్థోమత లేకపోయినా ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూళ్ళు, సాంకేతిక కళాశాలలు అవతరిస్తూనే ఉన్నాయి. అయినా జరుగుతున్నదేమిటి? రిక్షా కార్మికుడు, రోజు కూలీ దగ్గరనుంచి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆ స్థాయి విద్య అందించాలనుకుంటున్నారు. ఈ మొత్తం సన్నివేశం నుంచి బడా చిల్లర వ్యాపార సంస్థలను మాత్రమే మినహాయించాలనడంలో సహేతుకత ఏమిటి?(ఎఫ్.డీ.ఐ అనే మాటను కాసేపు వదిలేద్దాం)
3. ఇందులో చిన్న చిన్న చిల్లర వ్యాపారుల ఉపాధి సమస్య ఇమిడి ఉంది కనుక పై అంశాలతో ఈ సమస్యను పోల్చలేమని మీరు అనచ్చు. అయితే ఏ కుటుంబమూ ఈ రోజున ఒకే ఉపాధిని పట్టుకుని వేళ్ళాడడం లేదన్న సంగతినీ గుర్తించాలి. 'ఒక చిల్లర వ్యాపారి కుటుంబంలో కనీసం అయిదుగురు సభ్యులు ఉంటారనీ, ఎఫ్.డీ.ఐ వల్ల వాళ్ళందరికీ ఉపాధి పోతుందనీ" అంటున్నారు. జరిగేది ఏమిటంటే, అయిదుగురూ చిల్లర వ్యాపారమే చేయాలనుకోరు. చదువులు వగైరాలతో ఇప్పటి ఉపాధి కంటే ఉన్నతమైన ఉపాధికి మళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ అదే ఉపాధి మార్గం లో ఉన్నా తండ్రిని మించి వ్యాపారాన్ని వృద్ధి చేసే మార్గాలు తొక్కుతారు. ఆ క్రమంలో వాళ్ళు కూడా ఏ సూపర్ బజార్ స్థాయికో వెళ్లాలని అనుకోవచ్చు. ఇంకో సన్నివేశానికీ అవకాశం ఉంది. ఒక కిరాణా వ్యాపారి కొడుకు పై చదువులు చదివి ఏ విదేశంలోనో ఉంటూ వాల్ మార్ట్ లో షాపింగ్ చేస్తూ ఉండచ్చు. ఇలా అనడం ద్వారా   సమస్యను చులకన చేస్తున్నానని దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఊర్ధ్వచలనం ఇలాగే సంభవిస్తుంటుంది. ఇందుకు భిన్నంగా ఎఫ్.డీ.ఐకి వ్యతిరేకంగా వాదించేవారు సమాజాన్ని ఒక చలనశీల దృక్పథం నుంచి చూసే బదులు నిశ్చల చిత్రంగా చూస్తున్నారా?
4. చెడిపోయే పండ్లు, కూరగాయలు వగైరాల శాతం తక్కువే నని వాదించడం గమనిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. ధాన్యం వగైరాలు నిల్వ చేయడానికి తగినన్ని గోదాములు, శీతల గిడ్డంగులు లేకపోవడం ఏటా చర్చకు వస్తూనే ఉంటుంది. వృద్ధి రేటు పెరిగిన దశలో కూడా చాలినన్ని గిడ్డంగులు నిర్మించలేని దుస్థితిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి. ఎన్డీ.ఏ హయాంలో కూడా టన్నుల కొద్దీ ఆహార ధాన్యాలు ఆరుబయట ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పుచ్చిపురుగులు పట్టడం గురించి; ఎలుకలకు, పందికొక్కులకు ఆహారం కావడం గురించి విన్నాం. ఇటీవలి కాలంలో సుప్రీం కోర్ట్ కూడా ఈ సమస్యను తీవ్రంగా తీసుకున్న సంగతి తెలుసు. గిడ్డంగుల నిర్మాణానికి విదేశీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సంగతి అబద్ధం కాదు. ఇక సరఫరా వ్యవస్థ మరింత అధ్వాన్నం. పీడీఎస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాణ్యతకు సరి తూగడం లేదని చెప్పి అమెరికా మన దేశం నుంచి కొంతకాలం పాటు మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన సంగతిని గమనించారా?  వీటన్నిటి నేపథ్యం నుంచి ఎఫ్.డీ.ఐని చూడవలసిన అవసరం లేదా?

ఎఫ్.డీ.ఐనే నమ్ముకుంటారో; లేదా దేశీయ నిధులనో వెచ్చిస్తారో...మొత్తానికి రీటెయిల్ రంగాన్ని సంస్కరించవలసిన అవసరమైతే ఉంది. కాదంటారా?

No comments:

Post a Comment