Monday, December 31, 2012

'అన్నపూర్ణ' రాష్ట్రంలో... పోషకాన్నమో రామచంద్రా!

నా బ్లాగు వీక్షకులకు, నేను రాసిన వివిధ అంశాలపై స్పందించినవారికి, చర్చలో పాల్గొన్నవారికి, నా బ్లాగును ఎక్కువమంది వీక్షకుల దృష్టికి తెచ్చిన కూడలి, మాలిక అగ్రిగేటర్లకు...అందరికీ 2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

                                                                            ***

ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ పెద్ద రాష్ట్రం. జనాభాలో 5వది. తలసరి ఆదాయంలో 4వది. పారిశ్రామికాభివృద్ధిలో 4వది. 100మంది అత్యంత సంపన్న భారతీయులలో 7గురు ఈ రాష్ట్రానికి చెందినవారు. 'అన్నపూర్ణ' అని ఈ రాష్ట్రానికి పేరు. ఇక్కడ 77 శాతం వరి పండిస్తారు.

కానీ మానవాభివృద్ధి సూచిలో ఈ రాష్ట్రం ఎక్కడుందో మీరు గమనించారా? 11వ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ 9, గుజరాత్ 8, తమిళ నాడు 6, హర్యానా 5, మహారాష్ట్ర 4, పంజాబ్ 2, కేరళ 1వ స్థానంలో ఉన్నట్టు ప్రణాళికా సంఘం కిందటి ఏడాది విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక వెల్లడిస్తోంది. ఆదాయం, విద్య, ఆరోగ్యం, అక్షరాస్యత, పోషకాహారం, పారిశుద్ధ్యాలను మానవాభివృద్ధి సూచికి కొలమానాలుగా తీసుకుంటారు.

మానవాభివృద్ధి సూచిలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉండడమే కాదు, జాతీయ సగటు(0.467%)కన్నా తక్కువ మానవాభివృద్ధి ఉన్న బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, అస్సాం ల గ్రూపులో చేరింది.

"ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం కీలకమైన సవాళ్ళు" అని, నివేదికను విడుదల చేస్తూ ప్రణాళికాసంఘం హెచ్చరించింది.

'అన్నపూర్ణ' రాష్ట్రంలో మీరు ఏ ఊరికైనా వెళ్ళి చూడండి...ఆడా, మగా, పిల్లా, పెద్దా అందరిలో పోషకాహారలోపం మామూలు కంటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఎస్సీ జనాభాలో మరీ ఎక్కువగా ఉంది. అయితే,  ఇతర సామాజికవర్గాల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదు. ఊళ్లలో పండ్లు, కూరగాయలు తక్కువ ధరకు లభిస్తాయనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది కానీ, ఇప్పుడు అక్కడ కూడా వాటి ధరలు నగరాల ధరలతో పోటీ పడుతున్నాయి. కనుక పండ్లు, కూరగాయల ద్వారా పోషకాహారాన్ని పెంచుకునే అవకాశం ఊరి జనానికి లేదు.

ఈ రాష్ట్రంలో ఎనభై దశకం నుంచీ(మధ్యలో కొంతకాలం రద్దు, రేటు మార్పుతో)కిలో 2 రూ. బియ్యం పథకం అమలు జరుగుతోంది. భారీ మొత్తాల్లో సబ్సిడీ భారాన్ని మోస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. ఇటీవల కిలో 1రూ. కే బియ్యం పథకాన్ని అమలు చేస్తోంది. అయినా సరే, పోషకాహార లోపం ఇంతగా ఎందుకుందో తెలియదు. బడి పిల్లలకు పుష్టికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ ఊళ్లలో పిల్లల వాలకాలలో ఆ పథకం ఆనవాళ్ళు కనిపించడంలేదు. అసలు ఏం జరుగుతోంది?

ఈ రోజు ఒక వార్త వచ్చింది. రంగారెడ్డి జిల్లా కులకచర్ల గ్రామంలో సరస్వతీ విద్యామందిరంలో 5వ తరగతి చదువుతున్న శ్రావణి అనే బాలిక సరస్వతీ విద్యామందిరాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని-పాఠశాల భవన ప్రారంభానికి వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. అందువల్ల బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గుతుందని కూడా చెప్పింది. మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చింది. ఎప్పుడు? అయిదేళ్ళ క్రితం! శ్రావణి పట్టు వీడకుండా ఈ అయిదేళ్లలో మరో రెండుసార్లు స్కూలుకు వచ్చిన మంత్రికి అదే విజ్ఞప్తి చేసింది. చివరికి మంత్రి ముఖ్యమంత్రిని ఆ మేరకు ఒప్పించింది. జనవరి 1 నుంచీ 480 సరస్వతీ విద్యాలయాలలో ఆ పథకం అమలుకాబోతున్నట్టు వార్త. మంత్రీ, అంతకంటే ఎక్కువగా శ్రావణీ అభినందనీయులు! ఇంతకీ ప్రశ్న ఏమిటంటే, శ్రావణి విజ్ఞప్తి నెరవేరడానికి అయిదేళ్లు పట్టినప్పుడు, 'పోషకాన్నమో రామచంద్రా' అని నోరు తెరిచి అడగని ఊళ్ళలోని  మూగ జనానికి పోషకాహారం అందడానికి ఎన్నేళ్లు పడుతుంది?

దేశంలోని చిన్నారుల పోషకాహార లోపం పై 12వ పంచవర్ష ప్రణాళిక 'ప్రత్యేకంగా' దృష్టి సారించిందట! ఇది కూడా ఈరోజు వార్తే. దేశంలో 18 ఏళ్ల లోపు ఉన్న 43 కోట్లమంది సంక్షేమానికి నడుం కట్టాలంటూ ప్రణాళికాసంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందట. దేశంలో 22 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారనీ, మూడేళ్ళ లోపు పిల్లలలో 40.4 శాతం మంది ఉండవలసినంత బరువు ఉండడంలేదనీ చెప్పిందట. పిల్లలకు విటమిన్-డి పంపిణీ సక్రమంగా జరగడం లేదట. గ్రామస్థాయి వరకు పోషకాహార మండళ్లను, బాలల అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయడం ప్ర.సం. సూచనలలో కొన్ని. దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటి? బాలల పోషకాహారలోపం పై ప్రభుత్వం ఇప్పుడిప్పుడే యుద్ధం ప్రకటిస్తోందని! మరి మిగిలిన వాళ్ళ సంగతి ఎప్పటికీ?! పోషకాహారలోపం అందరిలోనూ అంతరించడానికి ఎన్ని పంచ వర్ష ప్రణాళికలు గడవాలి?

కిందటి సంవత్సరం అంతా ఆహారభద్రతపై చర్చతోనే గడచిపోయింది. ఆహారభద్రతలో పోషకాహారభద్రత భాగం కావాలని ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి జాతీయ సలహా మండలి(ఎన్.ఏ.సీ)లోని నిపుణులకు తల ప్రాణం తోకకు వచ్చింది. చివరికి ఏదో అంగీకారానికి వచ్చారన్నారు. బిల్లు పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు వెళ్లింది. ఏడాది గడచినా దాని అతీ గతీ లేదు.

ఈ లోపల నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేసింది. దాని మీద సవాలక్ష అభ్యంతరాలు, భయాలు వ్యక్తమవుతున్నాయి.

అదలా ఉంచి అన్నపూర్ణ రాష్ట్రపాలకులు ఊరి జనానికి పోషకాన్నం అందించడానికి ఏం చేస్తున్నారు? మానవాభివృద్ధి సూచిలో ఒకటో స్థానంలో ఉన్న కేరళతో పోటీ పడే ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నట్టు ఎలాంటి ఆధారాలూ కనిపించడం లేదు.





No comments:

Post a Comment