Sunday, December 23, 2012

'లోపలి మనిషి' ప్రూఫులు దిద్దిన పీవీ

(ఈ రోజు భారత మాజీప్రధాని, రచయిత, బహుభాషావేత్త దివంగత పీవీ నరసింహారావు గారి 8వ వర్ధంతి.  ఆయన  ఆత్మకథాత్మక రచన 'ది ఇన్ సైడర్' (తెలుగులో 'లోపలి మనిషి') ను అనువదిస్తున్న రోజుల్లో నేను ఆయనను అనేకసార్లు కలుసుకున్నాను. అప్పుడు ఆయన వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను ఒకింత దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. కొన్ని విశేషాలను వీక్షకులతో పంచుకోవాలనిపించింది)

ఎన్నో దశాబ్దాల రాజకీయజీవితం నరసింహారావు గారిది. అయితే అంత సుదీర్ఘ రాజకీయజీవితమూ ఆయనలోని సృజనజీవినీ, రచయితను కప్పివేయలేదని తొలి పరిచయం లోనే నాకు అర్థమైంది. రకరకాల చాదస్తాలతో సహా రచయితలకు ఉండే లక్షణాలు అన్నీ ఆయనకు సంపూర్ణంగా ఉన్నాయి.

'ఆంధ్రప్రభ'దినపత్రికలో 'ది ఇన్ సైడర్' అనువాదాన్ని ధారావాహికంగా ప్రచురించాలని యాజమాన్యం నిర్ణయించినప్పుడు అనువాదం ఎవరు చేస్తారని నరసింహారావుగారు అడిగారు. నా పేరు చెప్పారు. 'అనువాదం నాకు నచ్చాలి. మొదట ఒకటి రెండు అధ్యాయాలు చేయించి నాకు పంపం'డని ఆయన సూచించారు. అలాగే పంపించాం. రెండు రోజుల్లోనే ఆయన అనువాద భాగాలను తిప్పి పంపుతూ ఈ సారి నేరుగా నాకే లేఖ రాశారు. అనువాదం మొత్తం మీద బాగుందంటూ కొన్ని సూచనలు చేశారు. నా సహాయం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఆ లేఖతో ఆయన వ్యక్తిత్వంలోని రెండు అంశాలు నాకు అర్థమయ్యాయి. మొదటిది-పని దగ్గర ఆయనకు ప్రోటోకాల్ పట్టింపులేవీ లేవు. రెండవది-అప్పటికే అనువాదకులుగా ప్రసిద్ధులైన కొందరి పేర్లు ఆయన పరిశీలనలో ఉన్నాయి. కానీ ఆయన నా లాంటి ఒక అప్రసిద్ధుని ఎంచుకున్నారు,

ఆ తర్వాత కొన్ని రోజులకు నేను, మా సంపాదకులు వాసుదేవ దీక్షితులుగారు  హైదరాబాద్ లోని రాజ్ భవన్ గెస్ట్ హౌస్ లో  తొలిసారి ఆయనను కలసి మాట్లాడాం. అప్పుడు ఆయనలో నాకు ఒక మాజీ ప్రధానీ, రాజకీయవేత్తా కనిపించలేదు. సాహితీవేత్తే కనిపించాడు. అప్పటికే హాలులో కొందరు రాజకీయ ప్రసిద్ధులు ఉన్నారు. నరసింహారావు గారి సిబ్బంది మమ్మల్ని లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. మేము వచ్చినట్టు చెప్పగానే నరసింహారావుగారు మాకోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే మా దగ్గరికి వచ్చారు. పలకరింపులు అయిన తర్వాత అనువాదం గురించి నాతో మాట్లాడారు. విశ్వనాథ వారి వేయిపడగల అనువాదకునిగా తన అనుభవాలు చెప్పుకుంటూ వచ్చారు. అంతలో ఒక మహిళా గవర్నర్ అక్కడికి వచ్చారు. ఆమె రాకవల్ల మాతో సంభాషణకు అంతరాయం కలిగి ఆయన ఇబ్బంది పడినట్టు అనిపించింది. తన రచనా వ్యాసంగం, ఇన్ సైడర్ అనువాదం మీద తప్ప ఆయనకు ఆ సమయంలో మరి దేనిమీదా ఆసక్తి లేదని ఆ కాసేపటిలోనే నాకు అర్థమైంది. 'మాలోని వాడివే, మా వాడివే నువ్వు' అని ఒక కవి రాసినట్టుగా ఆయన మా రచయితలలో వారే, మా వారే అనిపించి బెరుకు పోయింది.

అనువాదంలో నాకు కొన్ని పద్ధతులూ పట్టింపులూ ఉన్నాయి. అనువాదం పూర్తిగా మూలవిధేయంగా ఉండవలసిందే. అయితే అది స్వతంత్ర రచనలానూ కనిపించాలి. స్వేచ్చానువాదానికి నేను వ్యతిరేకిని. అలాగే అనువాదం మూలాన్ని మించకూడదు. మూలంలోని శైలీ, ఉరవడీ, బిగువూ అన్నీ అనువాదంలోనూ అచ్చుపడాలి. నరసింహారావుగారు నా అనువాదంలోని ఈ లక్షణాలను గుర్తించి మెచ్చుకున్నారు. అయితే, ఇంగ్లీష్ నుడికారాన్ని, సామెతలను తెలుగు చేసేటప్పుడు వాటికి సరిపోయే తెలుగు నుడికారాన్ని, సామెతలను ఉపయోగిస్తే మంచిదని నేను అనుకునవాణ్ణి.  కాదు, ఇంగ్లీష్ నుడికారాన్ని, సామెతలను యథాతథంగా అనువదించాలని పీవీ సూచించారు. ఒకసారి మాటల సందర్భంలో అందుకు కారణం చెప్పారు. ఇంగ్లీష్ నుడికారాన్ని యథాతథంగా అనువదించడం వల్ల తెలుగు భాషకు వ్యక్తీకరణ శక్తి పెరుగుతుందనీ, భాష నునుపెక్కుతుందనీ ఆయన సూత్రీకరణ. ఆయన దూరదృష్టి నన్ను ఆశ్చర్యపరచింది.

ఇంగ్లీష్ తో పోల్చితే తెలుగు భాషకున్న వ్యక్తీకరణ శక్తి స్వల్పమనే అభిప్రాయం అనువాదసమయంలో నాకు అనేకసార్లు కలిగింది. ఒక్క  ఇంగ్లీష్ మాట అనేక అర్థచ్చాయలనూ, భావవైవిధ్యాన్నీ ప్రకటించగలుగుతుంది. అంత అర్థస్ఫూర్తిగల మాటను తెలుగులో వెతికి పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఒక్కోసారి అసంతృప్తితోనే ఏదో ఒక మాట వాడక తప్పేది కాదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇలాంటి అవస్థ ఎదుర్కొన్న తావులోనే  పీవీ గారి దృష్టి పడేది. నాకు తట్టని మరింత మెరుగైన మాటను ఆయన అక్కడ వాడేవారు. భాషపై ఆయనకు గల పట్టు అలాంటిది.

భారత్-చైనా, భారత్-పాకిస్తాన్ యుద్ధఘట్టాలను ఆయన సన్నప్రింట్ లో రక్షణ నిపుణుల ఉటంకింపులతో చాలా విస్తృతంగా రాశారు. ఎంతో సమాచారాన్ని పొందుపరిచారు. పత్రికలో కేటాయించిన స్థలం దృష్ట్యా రోజులతరబడి ఈ వివరాలనే ప్రచురించవలసివస్తుందనీ, కథాగమనం కుంటుపడి సాధారణ పాఠకుని ఆసక్తిని హరించవచ్చుననీ, కనుక పరిహరిస్తే బాగుంటుందనీ ధైర్యం చేసి ఆయనతో అన్నాం. ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాకు లేఖ రాస్తూ ఈ విషయం ప్రస్తావించి, ముందు తరాలవారు తెలుసుకుని తీరాలన్న ఉద్దేశంతో ఆ సమాచారమంతా ఇచ్చాననీ, ఎవరి చాదస్తం వారికి నచ్చుతుంది కనుక మొత్తం ప్రచురించవలసిందేననీ అన్నారు. అది చాదస్తమైతే రచయితలు అందరికీ ఉండే చాదస్తమే.

వినడానికి ఆశ్చర్యంగానే ఉండచ్చు కానీ, భారత మాజీ ప్రధాని పీవీ 'లోపలి మనిషి' అచ్చవుతున్న సందర్భంలో ఓపికగా ప్రూఫులు కూడా దిద్దారు. పైగా ఢిల్లీలో ఆసుపత్రి బెడ్డు మీద ఉన్నప్పుడు కూడా.

ఎమెస్కో అధిపతి విజయకుమార్ గారు విజయవాడ, విశాఖపట్నాలలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన 'లోపలి మనిషి' ఆవిష్కరణ సభల్లో పీవీ గారు పాల్గొన్నారు. విజయవాడ సభలో వక్తలందరూ అనువాదం గురించి ఏమీ మాట్లాడకుండా మూల రచనగురించే మాట్లాడడం నన్నుఒకింత నిరుత్సాహపరచింది. ఆశ్చర్యమేమిటంటే, పీవీ గారు ఆ రోజు పూర్తిగా అనువాదం గురించే మాట్లాడారు. అంతేకాదు, నన్ను చూపించి ఇతడు నా అనువాదకుడు కాదు, నా ఇంటర్ ప్రెటేటర్ అన్నారు. మా  ఇద్దరికీ బాగా కుదిరిందనీ, ఇన్ సైడర్ రెండో భాగాన్ని కూడా ఇతడే అనువదిస్తాడని కూడా సభలో ప్రకటించారు. దురదృష్టం, ఆయన కోరిక తీరలేదు.

ఆయనలో నేను చూసిన రాజకీయపార్స్వంతో సహా  మరికొన్ని విశేషాలు మరోసారి ఎప్పుడైనా...

ఒకటి మాత్రం చెప్పి ముగిస్తాను. పీవీ నరసింహారావు గారి రాజకీయ జీవితంపై, వ్యక్తిత్వంపై ఎవరి అంచనాలు, అభిప్రాయాలు వారికి ఉండచ్చు. నేను అందులోకి వెళ్ళను. అయితే, ప్రముఖ పాత్రికేయులు కరణ్ థాపర్, శేఖర్ గుప్తాలు పీవీని అసాధారణ రాజకీయవేత్తగా పేర్కొంటూ ప్రశంసాపూర్వకంగా రాసిన రెండు వ్యాసాలు నాకు ప్రత్యేకించి గుర్తుండిపోయాయి. సాధారణంగా ఇంగ్లీష్ పాత్రికేయులు ఎవరి విషయంలోనైనా సూపర్లేటివ్స్ వాడడం చాలా అరుదు. విదేశీ వ్యవహారాలమీద నెహ్రూ తర్వాత అంత పట్టు, పరిజ్ఞానం ఉన్న ప్రధాని నేను గమనించినంతవరకు పీవీనే అని శేఖర్ గుప్తా అంటాడు.




2 comments:

  1. పి వి నరసింహా రావు గారు ఇప్పటివరకు మనదేశాన్ని పాలించిన ప్రధానులలో నంబర్ 1 ప్రధాని. కేంద్రంలో బి జె పి గవర్నమేంట్ వస్తే ఆయనకి భారతరత్న అవార్డ్ మొదట ఇస్తారు. ఆయన విలువ, దేశభక్తి కాంగ్రెస్ వారికి తెలియకపోవచ్చేమో గాని మిగతా పార్టిలకు తెలుసు. వాళ్ళెప్పటి నుంచో పి వి కి భారతరత్న అవార్డ్ ఇవ్వాలని అడుగుతున్నారు.
    ఈ కింది వీడియో లో జె పి గారి మాటే నాదికూడాను.

    http://www.youtube.com/watch?v=HwjhCqeMOXk

    ReplyDelete
  2. పీవీ ఏ పదవిలో ఉన్నా కొన్ని మౌలికమైన, సుదూర ప్రభావం చూపగలిగిన పనులు చేశారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు(దీని వ్యతిరేక పార్శ్వాన్ని అలా ఉంచుదాం) రెండు ముఖ్యమైన ఉధాహరణలు.అధికారం ఎందుకు, ఎలా వినియోగించాలో ఒక స్పష్టమైన అవగాహనతో ఆయన పనిచేసినట్టు కనిపిస్తుంది. 'లోపలి మనిషి'లో ఇందుకు సంబంధించిన చర్చ ఆయన చేశారు. మీరు సూచించిన వీడియోలో జెపి అన్నట్టు సొంత రాష్ట్రం కంటే బయటి రాష్ట్రాలవారు, స్వదేశం కంటే ఇతర దేశాలవారే ఆయనను ఎక్కువ గుర్తించి గౌరవించారు. చిన్న ఉదంతం చెబుతాను. పీవీ భారత ప్రధాని అయినప్పుడు, "ఆయనేమిటి, ప్రధాని ఏమిటి?" అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన సొంత ప్రాంతం నుంచే పత్రికా కార్యాలయాలకు లేఖలు వచ్చాయి. నేను ప్రత్యక్ష సాక్షిని. మంచి వీడియో సూచించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete