Tuesday, December 11, 2012

ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది?!

'హైదరాబాద్ ఎవడబ్బ సొత్తూ కాదు; అందరి అమ్మ సొత్తు' అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. 'రాష్ట్రాన్ని విభజించడమంటూ జరిగితే సీమాంధ్రులు హైదారాబాద్ లో అడుగుపెట్టలే'రని కూడా అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తారా, కలిపి ఉంచుతారా అన్నది కాలానికి విడిచిపెడదాం. సీమాంధ్ర నాయకులు ఎంతసేపూ హైదారాబాద్ ను పట్టుకుని వేళ్లాడుతున్నారే...దానిని మాత్రం  సీమాంధ్ర  ప్రజలు ప్రశ్నించవలసి ఉంది.

బాబూ లగడపాటి గారూ...ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు. ఈ రాష్ట్రంలో ఇంకా వందలాది గ్రామాలూ, పట్టణాలూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎక్కడా జీవకళ అంటూ లేకుండా వెల వెల పోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో మురుగుతో దోమలతో అసహ్యంగా దీనంగా దరిద్రంగా ఉన్నాయి. ఎక్కడివరకో ఎందుకు? మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న విజయవాడ నగరాన్నే తీసుకోండి. ఏ పేటలోనైనా ఒక్క రోజు ఫ్యానూ, ఏసీ లేకుండా పడుకుని చూడండి. దోమలతో నిత్య జాగారం చేసే మీ నియోజకవర్గ ప్రజల దుస్థితి ఎలాంటిదో అర్థమవుతుంది. ఎప్పుడైనా మీరు కృష్ణ స్నానానికి వెళ్ళి చూసారా? మానవ మల మూత్రాలను దాటుకుంటూ వెళ్లలేక స్నానం కోరిక విరమించుకుని ఇంటికి తిరిగి వెళ్ళి పోతారు. ఇది స్వానుభవంతో చెబుతున్న మాట.

బహిరంగ మల మూత్రాల సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్న ప్రభుత్వాధినేతలు, ప్రజా ప్రతినిధులు రేపు తమ సాఫల్యాల గురించి, రాజకీయ జీవితం గురించి తమ పిల్లలకు, మనవలకు ఏం చెప్పుకుంటారు?

మీ నగరంలో పురపాలకసంఘం అంటూ (కార్పొరేషన్ అనాలి కాబోలు. తీరు మారకపోయినా పేరు మారుతూ ఉంటుంది) ఒకటున్న ఆనవాలు చాలా చోట్ల కనిపించదు. ఆ సంఘంతో, అది చేయవలసిన పనిని మీరు చేయించలేరు. ఓపెన్ డ్రైనేజీల మురికి కూపాలనుంచి జనారోగ్యాన్ని కాపాడలేరు. మీ పెరడు ఎలా ఉందో పట్టించుకోకుండా  హైదరాబాద్ కోసం మీరు పోరాడుతున్నారు. మీరే కాదు, మీ సీమాంధ్ర సోదర నాయకులు కూడా డిటో. ఇదేమైనా న్యాయంగా ఉందా, చెప్పండి!

పారిశుద్ధ్య లోపమే కాదు మహాశయా...మీ ప్రాంత ప్రజానీకంలో...ఆడా మగా పిల్లా పెద్దా...అందరిలో పోషకాహారలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆంధ్ర ప్రాంతం అన్నివిధాలా అభివృద్ధి చెందిందన్న అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా ఉంటే అది ఎంత అవాస్తవమో వీరిని చూస్తే తెలిసిపోతుంది. మీ నియోజకవర్గంలో పోషకాహారలోపంతో బక్క చిక్కి జీవచ్చవాలను తలపించే  ఇలాంటి జనాన్ని ఎందరినో చూసి ఉంటారు. వారి గురించి ఆలోచించారా? మీ పార్టీ ప్రభుత్వం కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నా వీళ్ళు ఇలా ఎందుకున్నారో పట్టించుకున్నారా?  వీరికోసం ఏమైనా చేయాలని మీకు అనిపించడం లేదా? విజయవాడను పచ్చగా పరిశుభ్రంగా అన్నివిధాలా వాసయోగ్యంగా మార్చడానికి మీరేమైనా ప్లాను తయారుచేశారా?

 మీరు, మీ సోదర నాయకులు, జనమూ కలసి మీ ప్రాంతంలో మీ హైదరాబాద్ ను మీరే  సృష్టించుకోవచ్చు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం లాంటి పట్టణాలు  మీకున్నాయి. ముందు వీటిని అధునాతన పారిశుద్ధ్య సదుపాయాలు వగైరాలతో అభివృద్ధి చేసుకుని ఉపాధి కేంద్రాలుగా  వాసయోగ్యాలుగా మలచుకుంటే; వాటి నుంచి మీదైన హైదరాబాద్ తప్పకుండా అవతరిస్తుంది.

తమిళులకు, కన్నడిగులకు, మరాఠా ప్రజలకు, బెంగాలీలకు, ఇంకా ఎంతోమందికి ఉన్నట్టు మీకంటూ ఒక మహానగరం లేని లోటును ఎప్పుడు గుర్తిస్తారు?  ఎప్పటికి పూరించుకుంటారు?  ఉన్న నగరాలను, పట్టణాలను పాడు పెట్టి ఒకే ఒక నగరాన్ని పట్టుకుని ఎందుకు పాకులాడుతున్నారు?

కాదు, హైదరాబాద్ నగరం మనదే నని మీరంటారు. అది తెలుగువాళ్లందరి ఉమ్మడి సొత్తు అంటారు. వాళ్ళు కాదంటారు. పోనీ ఏదో విధంగా ప్రస్తుతానికి రాజీపడినా; మాకు ఒక రాజధాని స్థాయి నగరం లేకపోయిందే నన్న చింతా చిన్నతనం సీమాంధ్ర ప్రజానీకాన్ని పీడిస్తూనే ఉంటాయి. కనుక ఎప్పటికైనా హైదరాబాద్ స్థాయి నగరాలను ఆ రెండు ప్రాంతాలవారూ నిర్మించుకోనవసరం లేదా?

ఆ దిశగా ఇప్పటికైనా కనీసం ఆలోచనైనా ఎందుకు ప్రారంభించరు?


11 comments:

  1. /మహానగరం లేని లోటును ఎప్పుడు గుర్తిస్తారు? ఎప్పటికి పూరించుకుంటారు? ఉన్న నగరాలను, పట్టణాలను పాడు పెట్టి ఒకే ఒక నగరాన్ని పట్టుకుని ఎందుకు పాకులాడుతున్నారు?/
    నిజమే!!! మాకు ఈ ఐడియానే తట్టలేదు. భలే అవుడియా ఇచ్చారు!! మూసీనీళ్ళు తాగేటోళ్ళకు దమాగ తేజుంటది అని చెప్తరు. మా కళ్ళు తెరిపించారు. మీకు యావదాంధ్రులు ఋణపడివుంటారు.
    కోస్తా, సీమ ప్రాంతాల్లో రెండు రాజధానులు హైదరాబాద్‌ను మించి నిర్మించుకున్నాక ఎలాగూ ఇక్కడ వుండాలనిపించకపోతే, పోవాలనిపిస్తే వెళ్ళి పోతామేమో. అంతవరకూ మీరు ఇమడలేక తెగ ఇబ్బందైపోతావుంటే, ఓరుగల్లు రాజధానిగా చేసుకుని కాకతీయవైభవాన్ని మాకు మరోమారు చాటి సెప్పుడ్రి... కహానీ సునాసో హై, బిల్కుల్ భూల్‌గయే. నేను బత్కమ్మ ఆడటం ప్రాక్టీస్ చేస్తున్నా, ఆ కోర్స్ అయిపోయినాక పోతా.

    ReplyDelete
  2. అవును, మన బతుకులు అలా అయిపోయాయి. అపహాస్యమూ, వెక్కిరింతే మనకు మిగిలాయి. మన సోదరులు అక్కడ కృష్ణ ఒడ్డున, గోదావరొడ్డున మల మూత్రాల మధ్య గోబ్బెమ్మలాడుకుంటూ ఉంటారు. మనం హైదారాబాద్ కోసం ఎడతెగని పోరాటాలు చేసుకుంటూ ఉందాం.

    ReplyDelete
    Replies
    1. అంటే అన్నారో అని లొల్లి జేస్తరు గాని...
      మన బ్రతుకులు అలానే వున్నాయని అరశతాబ్దం పైన ఎవడిమీదో పడి పడి ఏడుస్తూ కూచోవడం వీర పోరాటాల గడ్డ అయిన తెలంగాన లక్షణం కాదు, కాకూడదు. గల్ఫ్ తెలగాన కూలీలను ఇక్కడికి తెప్పించుకుని, గల్ఫ్ లాగా డెవలప్ చేసుకోవచ్చుగా, దొంగ వీసాలతో వెళ్ళి, ఎందుకు అక్కడ జైళ్ళలో మగ్గడం?! మీరన్నట్టు, కృష్ణాగోదావరి ఒడ్డున బోలెడంత అదేపని కల్పించబడింది, 'పనికి ఆహారపథకం' కింద.

      హైదరాబాద్ - కేంద్రపాలిత ప్రాంతంగా లేదా నల్గొండ, మహబూబ్‌నగర్ రంగారెడ్డిలను కలిపి ఓ స్టేట్‌గా చేసేస్తే పడుంటుంది. 'చిన్న రాష్ట్రాలతో' అభివృద్ధి బాగా జరుపుకోవచ్చట కూడా. తక్కినవి ఎలాగూ తెలంగాణ స్టేట్‌లో తెగ డెవలప్ అయిపోతాయి. కావాలంటే ఇంకో నాలుగు స్టేట్లు ఇదే లొల్లి ప్రాతిపదికన విడదీస్తాం, అభివృద్ధే అభివృద్ధి.

      /"మీరు, మీ సోదర నాయకులు, మీ ప్రాంతంలో మీ హైదరాబాద్ ను మీరే సృష్టించుకోవచ్చు ", "లాంటి పట్టణాలు మీకున్నాయి", "మీకంటూ ఒక మహానగరం లేని లోటును ఎప్పుడు గుర్తిస్తారు? ఎప్పటికి పూరించుకుంటారు?/

      మేము నిర్మించుకున్న హైద్రబాద్ చాలు, తృప్తిగానే వుంది. కావాలంటే వేర్పాటువాదులు వేరే అదిలాబాద్/నిజామాబాద్‌లలో నిర్మించుకుంటారు,... IMF అప్పుతో. ;) :)

      Delete
  3. మీరు పెన్నా నదిని వదిలేశారు. ఆ మధ్య ఒక బ్లాగరు నెల్లూరు కి వేళ్ళాడు. ఆయన పెన్నా తీరాన తిక్కన భారతం రాసిన చోట ఉన్న పరిస్థితిని రాశాడు. అది మీరు ఇక్కడరాసిన గోదావరి,కృష్ణ తీరాలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాది.

    ReplyDelete
    Replies
    1. మూసీ తీరాన ఏ కవి చేసి లేదా? ... గదే కవిత్వం రాసి లేదా?!

      ఆ నది పేరే (ముక్కు)మూసీ, ఎరికేనా? :)

      Delete
    2. సందేహమేముంది? నెల్లూరుతో పరిచయం లేదు కానీ, గోదావరి జిల్లాలు, విజయవాడల వైపు ఈమధ్య ఇరవై రోజులు ఉన్నాను. సెల్ ఫోన్లు, టీవీలు, అక్కడక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు రావడం తప్ప పారిశుద్ద్యం, ఇతరేతర అభివృద్ధి విషయంలో ఊళ్ళు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ ను నందనోద్యానంగా తయారు చేసే ప్రయత్నంలో మన రాజకీయ సోదరులు ఊళ్లను పిచ్చిమొక్కల అడవిగా అనామకంగా అసహ్యంగా మార్చేస్తున్నారనిపించింది. ఊళ్ళ మీద ఫోకస్ లేదు. ఫోకస్ రాదు. ఎందుకంటే రాజకీయ కార్యకలాపాలు, మీడియా, సినిమా సహా అన్నీ హైదరాబాద్ లోనే కేంద్రీకృతం అయ్యాయి. విజయవాడనుంచి ఒకప్పుడు రెండు ప్రధాన పత్రికలు వచ్చేవి. వాటిని హైదరాబాద్ తరలించేశారు. అందుకే హైదరాబాద్ లో, ఆ చుట్టుపక్కలా ఉండే చిన్నా చితకా నాయకులకు కూడా మీడియా ప్రచారం లభిస్తూ విశేషంగా లభిస్తూ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంత పెద్ద నాయకుడికైనా అంత ఫోకస్ దొరకదు. కిషోర్ చంద్ర దేవ్ అనే ఆయన కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. ఆయన పేరు ఎంతమంది తెలుగువారికి తెలుసు? ఆయన ఉత్తరాంధ్రవాడు. అసలు సమస్యలో మీడియా ఒక చిన్న కోణం మాత్రమే. ఉదాహరణగానే దానిని చెబుతున్నాను. దశాబ్దాల తరబడిగా హైదరాబాద్ సెంట్రిక్ ఆలోచనలు మిగిలిన ఊళ్లను, పట్టణాలను పాడుబడే స్థితికి తెచ్చాయి. అసమ అభివృద్ధి, అపసవ్య ప్లానింగ్ తెలుగువాళ్లను ఒక నగరంకోసం ఘర్షణకు దిగే పరిస్థితిని సృష్టించాయని చెప్పడమే నా ఉద్దేశం.

      Delete
    3. /దశాబ్దాల తరబడిగా హైదరాబాద్ సెంట్రిక్ ఆలోచనలు మిగిలిన ఊళ్లను, పట్టణాలను పాడుబడే స్థితికి తెచ్చాయి. అసమ అభివృద్ధి, అపసవ్య ప్లానింగ్ తెలుగువాళ్లను ఒక నగరంకోసం ఘర్షణకు దిగే పరిస్థితిని సృష్టించాయని చెప్పడమే నా ఉద్దేశం. /

      అలా అన్నారు ఎంత బాగుందో చూడండి, ఎవరైనా ఏకీభవించకుండా వుండగలరా?

      'మీరు' వెళ్ళిపోండి, 'మీరు' వేరే రాజధాని చేసుకోండి 'మీ' విజయవాడ,'మీ' అనంతపురం, 'మీ' తిరుపతి ఏమిటండి? ఒకే స్టేట్‌లో వుంటూ?! కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్‌ల పరిస్థి అంతే కాదా? ఏమైనా అభివృద్ధితో కళకళ లాడిపోతున్నాయా? లేదే! రాష్ట్ర రాజధాని కాబట్టే అన్ని ప్రాంతాల వారు వచ్చారు, 50ఏళ్ళుగా అభివృద్ధి జరిగింది కాబట్టి మాకిచ్చేసి మీరు మూటా ముల్లె సర్దుకుని మీ రాజధాని కట్టుకుని వెళ్ళిపొండి అనడం అర్థముందా?
      ఒకవేళ స్టేట్ నాలుగుగా విడిపోయినా వెళ్ళడం, వెళ్ళక పోవడం వారి వారి ఇష్టం.

      ఓ సీనియర్ పాత్రికేయులు అనాల్సిన మాటలు కావవి. మేధావులు కూడా ఎంతగా కుళ్ళారో కదా అని కొద్దిగా ఖంగు తిన్నాను, expect చెయలేదు.

      మీరు వర్డ్ వెరిఫికేషన్ తీసేంత వరకూ మేము హైదరాబాద్ ఖాళీ చేయడమంటూ జరగదు. :P

      Delete
    4. మీ లాంటి సీనియర్ పాఠకులు కూడా నా వ్యాసాన్ని అపార్థం చేసుకుని ఆవేశపడిపోవడం నాకూ ఆశ్చర్యం కలిగించింది. 'మీ నియోజకవర్గం' అన్న సరళిలోనే 'మీ విజయవాడ' అన్నాను తప్ప విభజన ఉద్దేశంతో అనలేదు. 'మీ ప్రాంతం', 'మీ ఊళ్ళు' అని అడ్రస్ చేయడం రచనా విధానంలో ఒక పద్ధతిగా తీసుకుంటారనుకున్నాను కానీ దానిని అర్థం చేసుకోకుండా అపార్థాలు ఆపాదించే మేధావులు కూడా ఉంటారని అనుకోలేదు. నా వ్యాసంలోని స్పిరిట్ ను వదిలేసి ఇతరేతర రంధ్రాన్వేషణకు దిగుతారనీ అనుకోలేదు. హైదరాబాద్ ఖాళీ చేయాలని రిమోట్ గా నైనా నేను ఎక్కడైనా సూచించనా? మరోసారి చదివి చెప్పండి. ఊళ్ళ పరిస్థితి గురించీ, ఆంధ్ర రాయలసీమలకు ఒక మంచి నగరం లేని పరిస్థితి గురించీ చెప్పాను. కనీసం ఇప్పటికైనా ఆలోచన ప్రారంభించాలన్నాను. తెలంగాణ పట్టణాలు బాగున్నాయని నేను అనలేదు. మీరు చెప్పిన పట్టణాలు అన్నింటినీ ప్రస్తావించకపోయినా వరంగల్ ను ప్రస్తావించాను. 'తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి'అన్న నా బ్లాగ్ ఒకసారి చూడండి.

      Delete
  4. భాస్కరం గారు,
    ఈ క్రింది వ్యాసాన్ని రాసింది మీరేనా?

    http://archives.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/jeevana-brundavanam-260

    ReplyDelete
    Replies
    1. అవునండి, నేను రాసిందే. గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు.

      Delete
  5. మూసీనీళ్ళు తాగేటోళ్ళకు దమాగ తేజుంటది అని చెప్తరు. .....యాభై ఆరు నుంచి మూసీ నీళ్ళ తాగడానికి అలవాటు పడ్డారు మీరు మామూలుగా ఎక్కడ పోతారు.

    ReplyDelete