Wednesday, December 26, 2012

ఢిల్లీ మానభంగం: చిత్తశుద్ధిలేని చట్టశుద్ధి ఏల?

ఢిల్లీలో మానభంగ ఘటన జరిగి పదిరోజులు అయినా దాని మీద ఎందుకు స్పందించలేకపోతున్నానన్న ప్రశ్న నన్ను అప్పటినుంచీ సలుపుతూనే ఉంది. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బిక్క చచ్చిపోతాం. మాటలు రావు, దొరకవు కూడా. ఢిల్లీ ఘటన కేవలం అలాంటిది మాత్రమే కాదు. ఆ ఘటన తీవ్రతను, దానిపై దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ధర్మాగ్రహాన్ని తక్కువ చేస్తున్నానని దయచేసి అపార్థం చేసుకోకండని కోరుతూనే ఒక మాట అంటాను. దేశంలో రోజూ ఎన్నెన్ని మానభంగాలు జరుగుతున్నాయి!  ఇరవై నిమిషాలకు ఒకటి చొప్పున జరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. చివరికి పసికందులను కూడా మగ మృగాలు విడిచిపెట్టడం లేదు. వావి వరసలను కూడా చూడడంలేదు. ఎంతకాలం నుంచీ ఇలాంటి ఘటనల్ని ఖండిస్తున్నాం? ఆవేశాగ్రహాలూ, ఆవేదనా కుమ్మరించుకుంటున్నాం? ఆగ్రహపూరిత ఖండనలూ, శాపనార్థాలూ, పరుష విమర్శల వల్ల ప్రయోజనం ఉంటుందనుకుంటే ఈపాటికి ఈ సమస్య కొంచెమైనా తగ్గుముఖం పట్టాలి కదా! కనుక మాటల ఈటెల వల్ల ఏమీ జరగదు. అవసరమైనవి చేతలు.

దేశంలో మానభంగ ఘటన జరిగిన ప్రతిసారీ ఢిల్లీలోలా జనం స్పందించడం లేదు. రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు జరపడం లేదు. రాజధానిని ముట్టడించడం లేదు. మీడియా పెద్ద ఎత్తున ప్రత్యక్షప్రసారం జరపడం లేదు. చర్చలు నిర్వహించడం లేదు. ఇప్పుడే ఎందుకివి జరుగుతున్నాయన్న  ప్రశ్నఅక్కడక్కడ వినిపిస్తున్న మాట నిజమే. ఆలోచించవలసిన ప్రశ్నే కానీ,  ప్రస్తుతానికి ఇలా అనుకుందాం:  ఢిల్లీ ఘటన జనం ఇమాజినేషన్ ను బాగా ఆకర్షించి ఉండచ్చు. లోపల్లోపల కుత కుత లాడుతున్న ఆగ్రహపు అగ్నిపర్వతం ఇప్పుడు ఒక్కసారిగా బద్దలై ఉండచ్చు. ఎలా జరిగినా ఈ చైతన్యం సమస్య పరిష్కారానికి ఏ కొంచెం దారితీసినా అదే పదివేలు.

ఏం చేయాలన్న చర్చ జరుగుతోంది. సూచనలు వినిపిస్తున్నాయి. పటిష్టమైన చట్టాలు తేవడం, సత్వర విచారణ న్యాయస్థానాల ఏర్పాటు, పోలీస్ బలగాలనూ, పోలీస్ నిఘానూ పెంచడం వగైరా వాటిలో ఉన్నాయి. సంబంధిత చట్టం ఒకటి ఏడేళ్లుగా పెండింగ్ లో ఉండడం కూడా ఆక్షేపణీయం అవుతోంది. మానభంగ నేరస్తునికి ఉరిశిక్ష విధించాలన్న అభిప్రాయం ఒకవైపున వినిపిస్తుండగా; అందువల్ల సమస్య పక్కదారి పట్టి, శిక్ష పడే కేసుల సంఖ్య ఇంకా తగ్గిపోతుందన్న వాదం మరోవైపున వినిపిస్తోంది. ఉరిశిక్ష కన్నా రసాయనిక ప్రక్రియలో అవయవాన్ని నిర్వీర్యం చేయడం మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

పటిష్ట చట్టాలు తేవలసిందే, సత్వర విచారణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయవలసిందే, పోలీస్ బలగాలను, నిఘాను పెంచవలసిందే. ఇంకా అవసరమైన చర్యలన్నీ తీసుకోవలసిందే. అదే సమయంలో కొన్ని అనుబంధప్రశ్నలనూ వేసుకోకుండా ఉండలేం. చట్టాలు లేకనే నేరాలు జరుగుతున్నాయా? ఉన్న చట్టాలు అయినా సక్రమంగా అమలు జరుగుతున్నాయా? సత్వరవిచారణ న్యాయస్థానాల సంఖ్య పెరిగితే, కేసులు త్వరగా పరిష్కారమై నేరస్తులకు శిక్ష పడుతుందని నమ్మడమెలా? రాజస్థాన్ లో సామూహిక అత్యాచారానికి గురైన ఒక ఎనిమిదేళ్ళ బాలిక కేసు సత్వర విచారణ న్యాయస్థానంలోనే నాలుగు నెలలుగా స్తంభించిపోయిందని ఈ రోజు వార్త.  మామూలు న్యాయస్థానాలలో కూడా ఉండవలసినంతమంది న్యాయమూర్తులు లేక కేసులు పెండింగ్ లో పడిపోతున్నప్పుడు సత్వర విచారణ న్యాయస్థానాలకు జడ్జీలను ఎలా అందిస్తారు? ఇక,  చట్టాలూ, కోర్టులూ, ఇతరేతర హంగులూ ఉన్న కేసుల్లోనే శిక్ష పడే కేసుల శాతం అత్యంత హీనంగా ఉందన్న సంగతిని ఎంతమంది గమనిస్తున్నారు?

పోలీస్ బలగాలను పెంచుతారు సరే, పోలీసుల చేత పని ఎలా చేయిస్తారు? వారిని పౌర మిత్రులుగా ఎలా తీర్చిదిద్దుతారు? వారిలో ప్రజారక్షణకు అవసరమైన నిబద్ధతను ఎలా తీసుకొస్తారు? ఈ దేశంలో జనం పిలుపుకు తక్షణమే స్పందించే పోలీస్ వ్యవస్థను మీరు ఎక్కడైనా చూసారా? మహిళలను అలా ఉంచండి, ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే మగవాళ్ళను సైతం మీరు ఎక్కడైనా చూసారా?  ఇంట్లో దొంగతనం జరిగితే పోలీస్ రిపోర్ట్ ఇస్తే పోయిన సొత్తు దొరుకుతుందని నమ్మే వారిని ఎక్కడైనా చూసారా? తన కళ్ల ముందు నేరం జరుగుతుంటే జోక్యం చేసుకున్న పోలీసులను మీరు ఎంతమందిని చూశారు? ఈ దేశంలో పోలీస్ సంస్కరణలనే మాట ఎంతకాలంగా వినిపిస్తోంది? ఇంతవరకు అవి ఎందుకు కార్యరూపం ధరించలేదు?

సందర్భం అలాంటిది కనుక పోలీసుల గురించి చెప్పుకుంటున్నాం కానీ, వాళ్ళను మాత్రమే వేలెత్తి చూపించనవసరం లేదు. అసలు ఏ ఇతర విభాగాలలోనైనా పని మీద వచ్చిన పౌరుల పట్ల మర్యాదగా, కర్తవ్యపరాయణతతో స్పందించే ఉద్యోగులను మీరు ఎంతమందిని చూస్తున్నారు?  సింపుల్ గా చెప్పాలంటే మిత్రులారా, మనదేశంలో పని సంస్కృతి అనేది ఇంతవరకు ఏర్పడలేదు. మేము ప్రజాసేవకులం, వారి బాగోగులు చూడడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికే మేము జీతాలు తీసుకుంటున్నామన్న భావనను ఉద్యోగులలో చొప్పించే ప్రయత్నం ఎక్కడా జరగడం లేదు.  ఉన్న పోలీసులలో పని చేసే ప్రవృత్తిని రంగరించలేనప్పుడు సంఖ్య పెంచితే ఉపయోగమేమిటి?

ఒక కిరాణా కొట్టు యజమాని, ఒక బట్టల వ్యాపారి తమ వద్దకు వచ్చే వినియోగదారుని పట్ల చూపించే మర్యాద ప్రజాధనం నుంచి జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వోద్యోగి ప్రజలపట్ల ఎందుకు చూపించడం లేదు?

మానభంగం వంటి అతి హేయమైన నేరానికి ప్రేరేపించే సామాజిక పరిస్థితులు ఎలాంటివన్నది సామాజికశాస్త్రవేత్తలు పట్టించుకోవలసిన వేరొక ముఖ్యమైన పరిశీలనా కోణం. అది అలా ఉంచి, ఢిల్లీ మానభంగం ఘటన ఎంత కలచివేసేదో, నిరసనప్రదర్శనల సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించడమూ అంతే బాధాకరం. ఆ మరణం ఏ పరిస్థితులలో సంభవించిందన్న విషయంలో భిన్న వాదాలు వినిపిస్తున్నాయి కనుక వాస్తవం ఏమిటో నిర్ధారణ కాకుండా అందులోకి వెళ్లలేం. నాయకత్వం అంటూ ఒకటి లేకుండా అసంఘటితంగా అప్పటికప్పుడు ఉవ్వెత్తున లేచిన ధర్మాగ్రహప్రదర్శనలో విచిన్నకర శక్తులు అడుగుపెట్టి ప్రదర్శనను అవాంఛనీయమైన మలుపు తిప్పే  ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ మరణం పై వచ్చిన ఆరోపణలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్నే హెచ్చరిస్తున్నాయి.

మళ్ళీ అసలు సమస్యలోకి వెడితే, ప్రజలపట్ల సానుకూలంగా సానుభూతితో స్పందించవలసిన వ్యక్తులలోనే స్పందనాగుణం లోపించినప్పుడు ఉన్న వ్యవస్థలను పటిష్టం చేసినందువల్లా, కొత్తవి సృష్టించడంవల్లా ప్రయోజనం ఉంటుందా? వ్యక్తులలో పని చేసే సంస్కృతిని తీసుకురావడానికి ఏం చేస్తారు??





No comments:

Post a Comment