Sunday, December 30, 2012

ఢిల్లీ యువతి విషాదాంతం: కనెక్టెడ్ జనాలు, డిస్కనెక్టెడ్ పాలకులు

పేరు తెలియని ఒక యువతి మృతి ఒక జాతీయ విషాదం అయింది. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. పేరు తెలియని ఒక యువతి మృతి ఆదివారం నాడు పత్రికలన్నిటిలో పతాకశీర్షిక అయింది. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. పేరు తెలియని ఒక యువతి మృతికి ప్రధాననగరాలలోని పౌరులనేకులు వీధుల్లోకి వచ్చి కోప సంతాపాలను ప్రకటించారు. ఈ దేశంలో అలా ఎప్పుడూ జరగలేదు. ఢిల్లీ సామూహిక మానభంగ ఘటన జరిగినప్పటినుంచీ ఈ దేశంలో ఎప్పుడూ జరగనివి జరుగుతున్నాయి. స్పందనారాహిత్యం కరడుగట్టిన పాషాణవ్యవస్థపై జనం ఎన్నడూ లేనంత మహోద్రిక్తస్థాయిలో, ఎన్నడూ ఎరగని కొత్త పద్ధతుల్లో ఆగ్రహావేదనలు కుమ్మరించుకుంటున్నారు. ఇంతటి విషాదభరిత వాతావరణంలోనూ రేపటికి అది ఒకింత భరోసా!

"అమ్మా నాకు బతకాలని ఉంది" అని ఆ మానభంగ బాధితురాలు తల్లితో అన్నట్టు వార్తల్లో చదివాం. అంతా ముందే ఉన్న జీవితం గురించి పచ్చని కలలు కనే ఓ ఇరవై మూడేళ్ళ యువతి బతకాలని తపించడంలో ఆశ్చర్యంలేదు. చివరికి ఆమె ప్రాణాలతోపాటు ఆమె కోరికా అనంతవాయువుల్లో కలసిపోయింది. "నాకు బతకాలని ఉందమ్మా" అన్న కూతురు మాట తలచుకుని తల్లి బతికినంతకాలం కుమిలిపోతూనే ఉంటుంది. "నాకు బతకాలని ఉం"దన్న ఆ అభాగ్యురాలి మాట గుర్తొచ్చినప్పుడల్లా బతికి ఉన్నవాళ్ల గుండె కలుక్కుమంటూనే ఉంటుంది.

అయితే ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. ఈ పాషాణవ్యవస్థ ఢిల్లీ వీధుల్లో పోలీసులతో పెనుగులాడిన జనసందోహం కంటే ఎన్నో రెట్లు బలవత్తరమైనది. వారితోపాటు ఇతర నగరాలలో కొవ్వొత్తి దీపాలతో నిరసన తెలిపిన జనసమూహాలు అన్నీ కలసి ప్రతిఘటించినా లొంగనంత బలవత్తరమైనది. ఈ పాషాణవ్యవస్థ పది ముఖాలు ఉన్న దశకంఠ రావణుడి లాంటిది. మానభంగాలు దాని ఒకానొక ముఖం మాత్రమే. ఖాఫ్ పంచాయితీలు ఒక ముఖం. వోటు బ్యాంక్ కోసం ఖాఫ్ పంచాయితీలను సమర్థించే సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ యువ పార్లమెంట్ సభ్యులతో సహా రాజకీయనాయకులు ఒక ముఖం. ఆడ శిశువులను కడుపులోనే కడతీర్చే కటికతనం ఒక ముఖం. అవినీతి అక్రమాలు ఒక ముఖం. స్పందనా గుణం లోపించిన ప్రభుత్వాలు ఒక ముఖం. తమ పని తాము చేయని పోలీసులతో సహా అంచెలంచెల ఉద్యోగవ్యవస్థ ఒక ముఖం. వరకట్నపు చావులు ఒక ముఖం. న్యాయప్రదానంలో జరుగుతున్న అసాధారణ జాప్యం ఒక ముఖం...

ఇంత పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికినా దేశంలో మానభంగాలు ఆగలేదు. ఢిల్లీ ఘటన తర్వాత ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే అరడజను మానభంగాలు వార్తలకు ఎక్కాయి. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్న జనాలు తక్షణమే స్పందిస్తూ రోడ్ల మీదికి వస్తున్నారు కానీ, ప్రభుత్వాలు ఎప్పటిలా జనంతో డిస్కనెక్ట్ అయ్యే ఉన్నాయి. సోషల్ మీడియా వ్యాప్తి, సమాచార హక్కు మొదలైన పరిణామాల వెలుగులో ప్రభుత్వాలు జనంతో డిస్కనెక్ట్ అయిన దృశ్యం మరింత ప్రముఖంగా మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కామన్ వెల్త్ క్రీడలపై ఆరోపణలప్పుడూ అదే జరిగింది. 2జీ స్పెక్ట్రమ్ పై  ఆరోపణలప్పుడూ అదే జరిగింది. అన్నా హాజరే ఉద్యమమప్పుడూ అదే జరిగింది. కేజ్రీవాల్ ఉద్యమమప్పుడూ అదే జరిగింది. ప్రతి టామ్ డిక్ అండ్ హారీ రాసే లేఖలకూ ప్రధాని జవాబు ఇవ్వరని సుబ్రమణ్యం స్వామిని ఉద్దేశించి కపిల్ సిబల్ అన్నప్పుడే ప్రభుత్వం జనంతో ఎలా డిస్కనెక్ట్ అయిందో రూపు కట్టింది. ఇవాలిటికి ఇవాళ, "అప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో జనం రోడ్ల మీదికి వచ్చే పరిస్థితిని ప్రభుత్వం ఊహించలేదు. ఇటువంటి పరిణామాన్ని కూడా ఇక ముందు దృష్టిలో పెట్టుకుంటాం" అని మంత్రి చిదంబరం ఢిల్లీ ఘటన నేపథ్యంలో అనడం కూడా ప్రభుత్వం జనంతో, క్షేత్రవాస్తవికతతో ఎంత డిస్కనెక్ట్ అయిందో చెప్పకనే చెప్పింది.

ప్రభుత్వం చట్టాలను బలోపేతం చేస్తామంటోంది...చేస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటోంది...చేస్తుంది. పోలీసు బలగాలను పెంచుతామంటోంది...పెంచుతుంది. కానీ పనికి అంకితమై పని చేసేవారిని ఎక్కడినుంచి తీసుకొస్తుంది? పని సంస్కృతిని ఎలా తీసుకురాగలుగుతుంది? ఇదే ప్రశ్న నేను వెనకటి బ్లాగులో ముందుకు తెచ్చాను. ఈ రోజు హిందూ తన మొదటి పుట సంపాదకీయంలో అన్నది కూడా అదే. "Laws to deal with rape and sexual assault exist but not the police, judiciary, and leaders to work them. It is this leaderless vacuum that ordinary citizens must step into in order to affirm the rights of women."

పేరు తెలియని ఆ యువతి విషాదాంతం పది తలల పాషాణ వ్యవస్థతో ముఖా ముఖీ ఢీకొనవలసిన అవసరాన్ని ప్రబోధిస్తూనే ఆ వ్యవస్థ ఎంత బలవత్తరమైనదో కూడా చెబుతోంది. అనేక ప్రశ్నలూ, సవాళ్ళ రూపంలో అది చాచే విషపు కోరలనూ బయట పెడుతోంది.

(సంబంధిత బ్లాగ్: ఢిల్లీ మానభంగం: చిత్తశుద్ధి లేని చట్ట శుద్ధి ఏల?)

6 comments:

  1. మనకి ఉన్న వ్యవస్థనే ప్రజలు అసహ్యించుకునే స్థితికి అన్ని వ్యవస్థలనీ దిగజార్చారు.
    ఇందుకు ఏ రాజకీయపార్టీ అతీతం కాదు.
    వ్యవస్థలో సమూల మార్పు రావాలి. అందుకు కొత్త రాజకీయం రావాలి.

    ReplyDelete
    Replies
    1. ఏ రాజకీయపార్టీ అతీతం కాదన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న మథనం నుంచే కొత్త రాజకీయం రావాలి. మీ స్పందనకు కృతజ్ఞతలు.

      Delete
  2. In every city and town drunkards drink openly on the road at all the Liquor shops( not restaurants, not hotels). After drinking the hidden beast comes out and attacks be it robbery, murders, rape or rape+murder. No policing no checks then who will stop the beasts.

    Remember the six rapists did that after consuming alcohol and while on a joy ride. India will go to do dogs unless liquor is not controlled.

    ReplyDelete
    Replies
    1. మీరన్నట్టు మద్యం సమాజాన్ని అన్ని విధాలా పీల్చి పిప్పి చేస్తున్న సమస్య. అయితే, మద్యం ఆదాయం మీదే దేశంలో అనేక ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. మద్యం అమ్మకాలు పెరగడానికి దోహదపడే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు కల్పించే వాతావరణం ఉంది. ఉన్న పోలీసింగ్ కూడా కళ్ళు మూసుకుని ఉండడానికి తోడు, పోలీస్ సిబ్బంది సంఖ్యా తక్కువగానే ఉంది. ఒక్క హైదరాబాద్ నగరం లోనే 3,800 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రిక్రూట్మెంట్ జరిపితే 300 పై చిలుకు మందే అర్హత పొందారు. పోలీస్ కమీషనర్ చెప్పిన మాట ఇది. మీ స్పందనకు కృతజ్ఞతలు.

      Delete
  3. ఆమెతో పాటు అన్ని ఆలోచనలు ఆవేశాలు కూడా అంతమైపోతాయి...షరా మామూలే:-(

    ReplyDelete
    Replies
    1. గత అనుభవాల రీత్యా మీరన్నట్టు జరగడానికే అవకాశం ఎక్కువ. ఈసారి అలా జరగరాదనే కోరుకుందాం. మీ స్పందనకు కృతజ్ఞతలు.

      Delete