Saturday, December 29, 2012

యువపాఠకులకు ఎలాంటి తెలుగు ఇస్తున్నాం?

నేటి యువతకు ఆకర్షణీయమైన తెలుగును 'ప్యాక్' చేసి ఇస్తున్నామా అని కిందటి వ్యాసంలో ప్రశ్నించాను. దాని గురించి నా అభిప్రాయాలు మీతో ఇప్పుడు పంచుకుంటాను. అయితే, ప్రస్తుతానికి ఇవి ఏకపక్ష అభిప్రాయాలు మాత్రమే. ఇవి మీ అభిప్రాయాల గీటురాయికి కూడా సరైనవే ననిపిస్తే అప్పుడు అందరం కలసి ఏకాభిప్రాయానికి రావచ్చు.

యువత సంగతి కాసేపు అలా ఉంచుదాం. ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటికీ నూరేళ్ళను మించిన చరిత్ర ఉంది. ఆయా ప్రక్రియలలో అత్యుత్తమమైన రచనలూ వచ్చాయి, ఉత్తమమైనవీ వచ్చాయి, అంత ఉత్తమం కానివీ వచ్చాయి. ఈ వందేళ్లలోనూ వచ్చిన ఓ ఇరవై  నవలలను, ఓ వంద కవితా సంపుటాలను, ఓ వంద కథలను, ఓ వంద వ్యాసాలను వివిధ కోణాల నుంచి అత్యుత్తమమైనవిగా/ఉత్తమమైనవిగా ప్రామాణీకరించి పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నదా? వ్యక్తుల స్థాయిలో అది జరుగుతూ ఉండచ్చు. కానీ నేను అనేది ఆ పని వ్యవస్థల స్థాయిలో జరగాలి. ఉదాహరణకు విశ్వవిద్యాలయాల స్థాయిలో. తెలుగు విశ్వవిద్యాలయం పేరిట మనకో విశ్వవిద్యాలయం ఉంది. ఏటా పురస్కారాలు ఇవ్వడం, ప్రచురణలకు ఆర్థిక సాయం చేయడం వగైరాలు మినహా ఆ విశ్వవిద్యాలయంలో ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? పోనీ వివిధ ఇతర విశ్వవిద్యాలయాలలోని తెలుగు పీఠాలు కనీసం ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయా? కేవలం సాహిత్యాన్ని ప్రచురించి ఇవ్వడం కాదు. ఆ సాహిత్యంలో ప్రతిఫలించిన నూరేళ్ళ తెలుగు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చరిత్రను దానికి జతపరుస్తూ ఇవ్వాలి. నూరేళ్ళ భావ పరిణామ చరిత్రనూ నిర్మించి ఇవ్వాలి. ఇదే సూచన నేను ఎనభై దశకంలో చేశాను. మళ్ళీ 2004 లో చేశాను. ఈ సూచనపై 'పేటెంట్' నాదేనని కూడా చెప్పాను. నిజానికి ఇదేమీ కొత్తది కాదు. సంస్కృతంలో పంచకావ్యాలు, తెలుగులో పంచ ప్రబంధాలు మొదలైన వర్గీకరణలు ఉన్న విషయం మనకు తెలిసినదే.

అసలు విషయమేమిటంటే, నూరేళ్ళ తెలుగు సాహిత్యం ఒక అడవిలా పెరిగిపోయింది. దాని గురించి ఒక అవగాహన ఇచ్చే కొన్ని ప్రాతినిధ్య రచనలు మనం నేటి తరానికి, ముందు తరాలకు అందించాలి. సాహిత్యాభిమానులు వాటిని కొనుక్కుని దగ్గర పెట్టుకునేలా ఉండాలి.

 ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు, దానికి ఒక ఇతివృత్తాన్ని, ఒక కాన్ సెప్ట్ ను ఇచ్చే అలవాటు, క్రమశిక్షణ మనకు అలవడలేదని నాకు అనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమ వారు 75 ఏళ్ల తెలుగు సినిమా  పండుగ జరిపారు. అందులో 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రా, పరిణామాలు ఏవీ ప్రతిఫలించలేదు. కనీసం వెనకటి నటీ నటులను ఎక్కువమందిని రప్పించడం కానీ, వారిని ఫోకస్ చేయడం కానీ, వారితో మాట్లాడించడం కానీ జరగలేదు. అది పూర్తిగా నేటి సినిమా పండుగలానే జరిగింది. ఇప్పటి నటీనటులే వేదిక మొత్తాన్ని కమ్మేశారు. అవే ఐటెమ్ డ్యాన్సులు, అవే వెకిలి హాస్య ప్రదర్శనలతో మోతెక్కించేశారు.

కొంతకాలం క్రితం మిత్రుడు కె.పి. అశోక్ కుమార్ నాతో మాట్లాడుతూ, తెలుగు కథల సూచి తయారు చేసే పని తెలుగు విశ్వవిద్యాలయం నాకూ, 'అంపశయ్య' నవీన్ గారికి అప్పగించిందని చెప్పాడు. ఏం చేస్తారని అడిగాను. కథ పేరు, ప్రచురితమైన సంవత్సరం, పత్రిక పేరు ఇస్తామన్నాడు. దానివల్ల ఉపయోగమేముంటుంది, కథ పేరు తెలిస్తే కథ గురించి తెలిసినట్టు కాదు కదా, కనీసం అందులోని ఇతివృత్తాన్ని రెండు వాక్యాలలోనైనా ఇస్తే బాగుంటుందని నేను సూచించాను. మీ సూచన బాగుంది, నేను ఆ ప్రతిపాదన చేస్తానని అశోక్ కుమార్ అన్నాడు.

ఇప్పుడు యువత విషయానికి వద్దాం. బీటెక్ చదువుతున్న మా రెండో అబ్బాయి సెలవలకు ఇంటికి వచ్చినప్పుడు వాడిలో పాఠనాసక్తి పెరుగుతోందని గమనించాను. వాడి చేత తెలుగు సాహిత్యం చదివించాలని ఉత్సాహపడ్డాను. అయితే, అందులో పడితే వాడి చదువు దెబ్బతినే ప్రమాదాన్ని శంకించి అప్పటికి ఊరుకున్నాను. కానీ, నా షెల్ఫ్ లో ఉన్న ఇంగ్లీష్ నవలలు, కథల సంపుటాలు రోజుకొకటి చొప్పున వాడి మంచం మీద కనబడడం ప్రారంభించాయి. 'ది ఓల్డ్ మన్ అండ్ ది సీ' చదివి చాలా థ్రిల్ అయ్యానని వాడు చెప్పాడు. అలాగే చెఖోవ్ కథలు కూడా బాగున్నాయన్నాడు. ఇలాంటి పాఠనాసక్తి ఉన్న ఈ తరం వారికి మనం ఎలాంటి తెలుగు కథలను, నవలలను అందించాలి? ఇది నాకు ఎదురైన ప్రశ్న. అవి వాళ్ళ ఇమాజినేషన్ కు అందాలి. వాళ్ళలో ఆసక్తి కలిగించాలి. మొదటే నిర్దిష్ట భావజాలం నుంచో లేదా నిర్దిష్ట దృక్పథం నుంచో ఆయా సామాజికపరిణామాలను ప్రతిఫలించే కథలను, నవలలను కాక ఒక తటస్థ స్థితి నుంచి యువత తెలుగు సాహిత్యంలోకి అడుగుపెట్టి ఆసక్తిని పెంచుకునేందుకు తోడ్పడే రచనలను కూర్చి అందించలేమా? అంటే, కేవలం నూతన తరాన్ని మాత్రమే లక్ష్యం చేసుకుని కొన్ని ప్రచురణలు తీసుకు రావలసి ఉంటుంది. అందుకు పూర్వరంగంలో చాలా కసరత్తు చేయవలసి ఉంటుంది. తెలుగును బతికించుకోడం కోసం ఆ శ్రమ తీసుకోవలసిందే. జీవితాన్ని కేవలం ఒక తటస్థ స్థితినుంచి వ్యాఖ్యానించే రచనలు మనకు పాశ్చాత్య సాహిత్యంలో అనేకం కనిపిస్తాయి. తెలుగులోనూ అలాంటివి ఏరి పట్టుకోగలం. ఇలా అన్నానని భావజాల/దృక్పథ ప్రధానమైన రచనలను పక్కన పెట్టమంటున్నాననుకుని అపార్థం చేసుకోవద్దు. యువ పాఠకుడు అభిరుచి పెరిగిన కొద్దీ వాటిలోకి క్రమంగా ప్రవేశిస్తాడు. అన్నట్టు ఇలా యువతను లక్ష్యం చేసుకుని కథా, కవితా,వ్యాస సంపుటాలను; నవలలను తీసుకురావాలన్న సూచనపైనా  పేటెంట్ నాదే.

వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఒక ప్రచురణను ముందుకు తెస్తున్నప్పుడు దాని వెనుక ఎలాంటి  థీమ్ ఉంది, ఎలాంటి పాఠకులను లక్ష్యం చేసుకుంటున్నామని ఆలోచించే అలవాటు చేసుకుంటే పాఠకులలో ఉండే తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి. వేర్వేరు పాఠకులకు వేర్వేరు తరహాలో రచనలను అందించాలనే అవగాహన అప్పుడు ఏర్పడుతుంది.

ఇంగ్లీష్ మీడియం యువతను ఒక స్టీరియో టైప్ లో ఊహించుకోవడం సరికాదు. మా తమ్ముడి కొడుకు ఇంగ్లీష్ మీడియంలో హింది ప్రథమ భాషగా చదువుకున్నాడు. ఒకసారి, "పెదనాన్నా, నాకు రామాయణం, భారతం చదవాలని ఉంది" అన్నాడు. "నీకు తెలుగు అంత నడవదు కదా, ఇంగ్లీష్ లో చదువుకోవలసిందే" అన్నాను. దానిపై వాడిచ్చిన జవాబు నాకు ఆశ్చర్యం కలిగించింది. "లేదు. నేను తెలుగులోనే చదువుతాను. తెలుగు ఇంప్రూవ్ చేసుకుంటాను" అన్నాడు.

ఇలాంటి యువ పాఠకుల్లో తెలుగు పట్ల అభిరుచి, ఆకర్షణ పెరగడానికి మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.

కొసమెరుపుగా ఒక ముచ్చట చెబుతాను. కొడవటిగంటి కుటుంబరావు గారి మునిమనవడు ఒకతను మా అబ్బాయికి పరిచయమయ్యాడు. "మీ ముత్తాతగారి రచనలు ఏవైనా చదివావా?" అని మా అబ్బాయి అతన్ని అడిగాడు. "లేదు. నాకు తెలుగు రాదు" అని ఆ అబ్బాయి జవాబిచ్చాడు. చందమామ లాంటి చక్కని తెలుగు పత్రికకు సంపాదకత్వం వహించిన వ్యక్తి ముని మనవడికి ఆ పిల్లల పత్రికలోని కథలను చదువుకుని తెలుగు కథా దాహాన్ని పెంచుకునే అవకాశం లేకపోయింది.

ఇలాంటివారు తెలుగుపై అభిమానం, రుచీ పెంచుకుని ఇటువైపు చూస్తే, ముందు ఇవి చదవండి అని వారి చేతికి అందించ దగిన ప్రచురణల దిశగా తెలుగు సంస్థలు ఇప్పటికైనా ఆలోచన చేయవద్దా?

(సంబంధిత రచనలు: 1. నిజాల నేల విడిచి తెలుగు సాము 2. తెలుగు సభలు...నిరసనలు...శ్రీశ్రీ...)


No comments:

Post a Comment