Tuesday, December 25, 2012

బాహ్య శుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు


 ఈ మధ్య అమెరికాలో, చికాగో దగ్గరలోని బ్లూమింగ్టన్ లో కొన్ని మాసాలు ఉన్నాను. మా పొరుగునే ఉన్న ఒక తమిళ జంట ఇక్కడ ప్రతి గురువారం షిర్డీ సాయి సత్సంగ్, భజన ఉంటాయని చెప్పి ఒక గురువారం మమ్మల్ని తీసుకు వెళ్లారు.  మేము వెళ్లేటప్పటికే ఆ ప్రాంగణం కార్లతో నిండిపోయింది. ఒక విశాలమైన హాలులో సాయి చిత్రపటం ఉంచారు. భజన జరుగుతోంది. సాఫ్ట్ వేర్ నిపుణులుగా పని చేసే యువతీ యువకులే అధికసంఖ్యలో ఉన్నారు. వారి చేతుల్లో తెలుగు, ఇంగ్లీష్ లిపుల్లో ఉన్న భజన గీతాలు, హారతి పాటల పుస్తకం ఉంది. హారతి కూడా అయిన తర్వాత అందరూ వరసలో నిలబడి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చివరగా భక్తులు ఇళ్ళలో వండి తెచ్చిన ప్రసాదాలు, పండ్లు ప్లాస్టిక్ బాక్స్ లలో పెట్టి పంపిణీ చేశారు. ఆ హాలూ, ఆ పరిశుభ్రత, భక్తుల క్రమశిక్షణ, ప్రసాద వితరణ అన్నీ అమెరికా ప్రమాణంలో ఉన్నాయి.

అన్నట్టు చెప్పడం మరచిపోయాను...భక్తులలో ఎక్కువమంది తెలుగువారే. బ్లూమింగ్టన్ లోని భారతీయుల్లో  తెలుగు జనాభాయే ఎక్కువ.  సత్సంగ్ లో పాల్గొన్న వాళ్ళలో యువతే అధిక సంఖ్యలో ఉండడం కూడా నా దృష్టిని ఆకర్షించింది. బహుశా పది పదిహేనేళ్లుగా ఈ పరిణామాన్ని చూస్తున్నట్టున్నాం. ఆర్థిక సంస్కరణలకు ముందునాటి యువతలో భక్తిప్రపత్తులు ఇంత ప్రస్ఫుటంగా, బాహాటంగా వ్యక్తమయ్యేవని చెప్పలేను. అప్పటి యువతలో నిస్పృహా, నైరాశ్యాలు ఎక్కువగా ఉండేవి. నిరుద్యోగం లాంటి సమస్యలవల్ల కావచ్చు. కృష్ణా రామా అనుకోవడం, గుడుల చుట్టూ తిరగడం వయసు మీరిన వాళ్ళు చేసేపని అన్న అభిప్రాయమూ, అలా తాము కూడా చేయడంలో ఒకవిధమైన నామోషీ, ముఖ్యంగా చదువుకున్న యువతలో ఉండేవనుకుంటాను. దాంతోపాటు, వామపక్ష/వామపక్ష తీవ్రవాద/నాస్తికవాద ఉద్యమాల ప్రభావమూ ఉండేది. ఆర్థిక సంస్కరణల అనంతరకాలంలో భక్తి ప్రపత్తుల ప్రకటనలో వయోభేదాలు అంతరించాయి. మళ్ళీ సాంప్రదాయిక దేవీదేవతలందరూ యువతను ఆకట్టుకుంటున్నారనీ చెప్పలేం. బహుశా వేంకటేశ్వరస్వామి మినహాయింపు. యువతను అత్యధికంగా ఆకర్షిస్తున్న దైవం షిర్డీ సాయి.

ఆ తర్వాత కూడా రెండు, మూడుసార్లు సత్సంగ్ కు వెళ్ళాం.  సత్సంగ్ నిర్వాహకులు బ్లూమింగ్టన్ లో షిర్డీ సాయి మందిర నిర్మాణం సంకల్పించి విరాళాల సేకరణ ప్రారంభించారు. బ్రేక్ ఫాస్ట్ ల ఏర్పాటు, సినిమా ప్రదర్శనలు వగైరాలు విరాళాల సేకరణలో భాగం. మరో ఏడాదిలో మరోసారి నేను బ్లూమింగ్టన్ కు వెళ్ళడమంటూ జరిగితే అప్పటికి అక్కడ షిర్డీ సాయి మందిరం తయారై ఉంటుందని నిశ్చయంగా అనిపించింది. భక్తి మహిమ అలాంటిది. సత్వర నిర్మాణాలు ఏమైనా జరుగుతున్నాయంటే అది ఆధ్యాత్మికరంగంలోనే. హైదరాబాద్ కు ఇదిగో అదిగో అంటున్న మెట్రో రైలు రావడానికి పదేళ్ళు పట్టచ్చు. ముందే కాలువలు తవ్వి కూర్చున్న పోలవరం ప్రాజెక్టుకు ఇరవయ్యేళ్లు పట్టచ్చు. దేవాలయ నిర్మాణం ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది.

భగవంతుడి మహిమ మూగతో మాట్లాడిస్తుందనీ, కాలు స్వాధీనంలోలేని వ్యక్తిచేత పర్వతాలను లంఘింపజేస్తుందనీ అంటారు. దేశం కాని దేశంలో భారతీయులచేత కూడా భారీ నిర్మాణాలు చేయిస్తుంది. చికాగో దగ్గరలోని అరోరాలో వేంకటేశ్వరస్వామి ఆలయం చూసినప్పుడు అలాగే అనిపించింది. ఎన్నో ఎకరాల విస్తీర్ణం గల పచ్చని ప్రాంగణంలో ఎత్తుగా ఠీవిగా పాలరాయితో కట్టిన భారీ కట్టడం అది. అమెరికా సంపన్నతకు తులదూగేలా ఉంది. అమెరికాలో హిందూ దేవాలయాలకు అనుబంధంగా భోజన, ఫలహార విక్రయశాల కూడా ఉంటుంది. శని, ఆదివారాలలో దూర దూర ఆలయాలకు కూడా కారులో వెళ్ళి దైవదర్శనం చేసుకుని, భోజన ఫలహారాలు చేసి తిరిగి రావడం తెలుగు యువతతో సహా అక్కడి భారతీయులకు పరిపాటిగా మారింది. మన దేవాలయ నిర్మాణవ్యవస్థను అమెరికాకు తీసుకువెళ్లి, ఆ దేశాన్ని విస్తరించిన మన ఆధ్యాత్మిక నడవగా మార్చుతున్న మన వాళ్ళు, అక్కడి పద్ధతులను తిరిగి మన దేశానికి తీసుకువస్తారనడంలోనూ సందేహం లేదు.

అమెరికానుంచి వచ్చాక పశ్చిమగోదావరిజిల్లాలోని సొంతవూరికి, అత్తవారి ఊరికి వెళ్లాల్సివచ్చింది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో చేబ్రోలు వెళ్ళే రైలు కోసం ఎదురుచూస్తున్నాం. ఓ డెబ్భై, ఎనభై ఏళ్ల వృద్ధుడు మా పక్కన కూర్చున్నాడు. తను యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో పుట్టపర్తి వెడుతున్నానని చెప్పాడు. సత్య సాయి జన్మదినం సందర్భంగా సేవాకార్యక్రమంలో పాల్గొనడానికి వెడుతున్నాడట. ఆ వయసులో అంత దూరం వెళ్ళి ఈయన ఎటువంటి సేవలు అందిస్తాడనిపించి ఆశ్చర్యం కలిగింది. అంతలో మరో వృద్ధుడు వచ్చి ఆ పెద్దమనిషిని పలకరించాడు. ఆయనా పుట్టపర్తికే. అయితే రిజర్వేషన్ దొరకలేదట. ఎలా అని అడిగితే, ఏముంది, జెనరల్ కంపార్ట్ మెంట్ ఎక్కేస్తానన్నాడు. అంత దూరం...ఆ వృద్ధుడి ధీమా ఆశ్చర్యం కలిగించింది. ఆ సమీపంలోనే మరో అరడజను మంది సత్యసాయి భక్తులు కనిపించారు. వాళ్లూ పుట్టపర్తికే. సత్యసాయి ట్రస్టు మీద ఆరోపణల సంగతేమిటి, భక్తుల రాకపై వాటి ప్రభావం పడిందా అని అడిగితే, అన్నీ సర్దుకున్నాయి, భక్తుల సంఖ్య ఇంకా పెరిగిందని మొదటి వృద్ధుడు చెప్పాడు.

ఏవో రోగాలతో తీసుకుంటూ, కుటుంబ సమస్యలతో నలుగుతూ, మంచి-చెడుల కలబోతగా కనిపించే మనుషుల్లో కూడా గుప్తంగా తమదైన భక్తి, ఆధ్యాత్మిక జగత్తు ఉంటుంది. విశ్వాసం వయసునీ, అనారోగ్యాన్ని అవలీలగా జయించి పుట్టపర్తివరకూ నడిపిస్తుంది. ఆ విశ్వాసానికి ఆలంబనం సత్యసాయి కావచ్చు, అయ్యప్పస్వామి కావచ్చు, మరో దైవం కావచ్చు. సత్య సాయి ట్రస్టు మీద, ఆయన ఉండగా ఎన్నడూ రాని స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. పత్రికలు ధారావాహికంగా కథనాలు ప్రచురించాయి. అయినా సరే, సాయి భక్తులలో విశ్వాసదీపం కొంచెం కూడా చలించలేదని ఆ వృద్ధుడితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. భక్తి రహస్యం అదే. ఆ సామ్రాజ్యంలోకి లౌకికమైన దేదీ అడుగుపెట్టలేదు.

చేబ్రోలులో రైలు దిగి నడుచుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాం. మట్టి రోడ్డు మీద దుమ్ము రేపుతూ మా పక్కనుంచే లారీలు, ఒకటి రెండు కార్లు వెళ్లిపోయాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనిపించిన ఓ దృశ్యం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఏణ్ణర్థం క్రితం అక్కడ ఒంటి అంతస్తుతో షిర్డీ సాయి మందిరం ఉండేది. ఇప్పుడక్కడ  దాదాపు అన్ని హంగులతో రెండంతస్తుల మందిరం ఉంది. ఆ పక్కనే ఓ తాటాకు కప్పు కింద వంట సామగ్రి ఉంది.  ఇంటికి వెళ్ళాక మందిర నిర్మాణం గురించి చెప్పిన మా అత్తగారు, అక్కడ ప్రతి గురువారం అన్నదానం జరుగుతోందని కూడా చెప్పారు. మొదట్లో అన్నదానానికి పదిహేనువందలు తీసుకునేవారట, సంఖ్య పెరగడంతో ఇప్పుడు మూడువేలు తీసుకుంటున్నారట. ఒకవారం ఖర్చు తను భరిస్తానంటే; మూడు మాసాల దాకా ఖాళీ లేదు, ముందే రిజర్వు చేసేసుకున్నారని మందిర నిర్వాహకులు చెప్పారట.

ఊళ్లలోకి అడుగుపెట్టగానే కుంగదీసే భయం, దోమలు. చుట్టూ పొలాల వల్ల, ఓపెన్ డ్రైనేజ్ వల్ల దోమల దాడి ఎక్కువ. దానికి కరెంట్ కోత కూడా తోడైతే ఇక చెప్పనక్కరలేదు. అయితే అదృష్టం కొద్దీ ఈ మధ్య కరెంట్ ఉంటోందట. అయినాసరే, ఆల్ ఔట్ వంటి దోమల విధ్వంసకాల రక్షణ తప్పదు. తెల్లవారు జామునే మైకు శబ్దంతో భళ్ళున మెలకువచ్చింది. షిర్డీ సాయి మందిరం నుంచి భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపున గాయత్రీదేవి ఆలయం నుంఛీ స్తోత్రాలు మొదలయ్యాయి. మరోవైపున అయ్యప్ప దీక్షలో ఉన్నవారు కూడా మైకు ఆన్ చేశారు. ఒక్కోసారి అన్ని మైకుల శబ్దాలూ కలసిపోయి అస్పష్ట రణగొణధ్వనులను ప్రసారం చేస్తున్నాయి. ఈ మైకు శబ్దాలు క్షణకాలం ఆగితే, దూరంగా ఉన్న శివాలయం మైకు సన్న సన్నగా చెవిన పడుతోంది.  కొన్నేళ్లుగా ఊళ్ళు భక్తి గీతాలతో, దేవతా స్తోత్రాలతో మేలుకుంటున్నాయి. స్తబ్ధుగా, నిశ్శబ్దంగా ఉండే ఊళ్ళ ఉనికిని చాటే శాబ్దిక సాధనాలుగా గుడి మైకులు మారాయి.  హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు  ఊళ్ళకు మైకు సెట్లు ఇచ్చినప్పటినుంచీ ఇది ప్రారంభమైనట్టు జ్ఞాపకం.

గుడి కంటే ముందే లేచి చన్నీటిస్నానం చేసిన మా అత్తగారు ఈ రోజు ఉపవాసమనేవరకూ ఆ రోజు కార్తీక సోమవారమన్న సంగతి గుర్తురాలేదు. లేచి, కాస్త అలా నాలుగు వీధులు తిరిగొద్దామని బయలుదేరాను. స్తబ్ధ వాతావరణమే కాదు, అక్కడక్కడ పాడుబడినట్టున్న ఇళ్లూ కనిపించాయి. మట్టి రోడ్లు. చాలాచోట్ల గతుకులు. వాహనాలు, షాపులతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి మరింత అధ్వాన్నం. అదీ మట్టి రోడ్డే. గోతుల మయం. కొన్నిచోట్ల ఆ మధ్య కురిసిన తుపాను వర్షాల తాలూకు నీరు ఇంకా నిలిచి ఉంది. ఆ బురదనీటిని పాదచారుల మీద చిమ్ముతూ వాహనాలు వెడుతున్నాయి. దానికితోడు రోడ్డు పొడవునా  అటూ ఇటూ చెత్త పోగులు. అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ఆ రోడ్డు మీదే శివాలయం ఉంది. దానికి కొన్ని అడుగుల దూరంలోనే మాంసవిక్రయం జరుగుతోంది. ఆ దృశ్యం, ఆధ్యాత్మిక సామ్రాజ్యంపై ఆధిపత్యం చాటుతూవచ్చిన ఒక సామాజికవర్గం పట్టు సడలిన సంకేతాలు ఇస్తోందా అనిపించింది.  అదే రోడ్డు మీద ముందుకు వెడితే ఒక చర్చి కనిపిస్తుంది.

క్రమంగా కార్తీక సోమవార సంరంభం పుంజుకుంది. ఆలయాల దగ్గర సందడి కనిపిస్తోంది. ఆడా, మగా పూలు, పండ్లు పుచ్చుకుని గుళ్ళకు చేరుతున్నారు. ఉండి ఉండి గుడిగంటలు మోగుతున్నాయి. ఒకటిమాత్రం చాలామందిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, పోషకాహారలోపం! ఊళ్ళో జనం చేతుల్లో సెల్ ఫోన్లు, ఇళ్ళల్లో టీవీలు ఉన్నమాట నిజమే. కానీ తాము జీవించే పరిసరాలు అంత మురికి మురికిగా, అనారోగ్యకరంగా ఉన్నాయే అన్న స్పృహ కానీ; అందుకు బాధ్యత వహించవలసిన వ్యవస్థల ఉనికి గురించిన పట్టింపు కానీ ఉన్నట్టు కనిపించలేదు. గుడి, భక్తి ప్రకటన...ఈ రెండే సామాజిక అభివ్యక్తులుగా కనిపించాయి. ఊరికీ, బాహ్యప్రపంచానికీ మధ్య  కనిపించని ఉక్కుతెరలు ఉన్నాయనిపించింది. శతాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ గ్రామజీవనం నమూనా ఇప్పటికీ చెక్కుచెదరలేదన్న భావన కలిగింది. అపరిశుభ్రత, అసౌకర్యాలు నిండిన పరిసరాలలో వారు జీవిస్తున్న మాట నిజమే. అదే సమయంలో వారు తమదైన భక్తి సామ్రాజ్యంలో జీవిస్తున్నారు. కేవలం విశ్వాసమే వారిని జీవింపజేస్తోంది. అయితే ఆ విశ్వాసం పాలకుల మీద కాదు. తమ భక్తి సామ్రాజ్య అధిపతి అయిన భగవంతుడి మీద.

రెండు రోజుల తర్వాత మా సొంత ఊరికి బయలుదేరాం. నిడదవోలు వెళ్లడానికి చేబ్రోలు స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్నాం.  ఫ్లాట్ ఫారం మీద భవానీదీక్ష పుచ్చుకున్న ఓ పదిమంది కాషాయం దుస్తులతో, ముఖాన గంధం కుంకుమలతో కనిపించారు. అందరూ చిన్న చిన్న వ్యాపారాలో వృత్తులో చేసుకుంటున్నవాళ్లు. అయ్యప్ప దీక్ష పుచ్చుకున్నవారు ఇద్దరో ముగ్గురో కనిపించారు. ఇలాంటి దీక్షావిధానం ఇటీవలికాలంలో అయ్యప్పదీక్షలతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. భవానీ దీక్షలే కాక అన్నవరం సత్యనారాయణస్వామి దీక్షలు, సింహాచల నరసింహస్వామి దీక్షలు, తిరుమల గోవింద దీక్షలు కూడా మొదలయ్యాయి. ఆధ్యాత్మిక సామ్రాజ్యంపై ఒక సామాజికవర్గం పట్టు సడలిందనడానికీ, ఆధ్యాత్మికరంగంలో జరుగుతున్న వికేంద్రీకరణకూ ఈ పరిణామం మరో స్పష్టమైన సూచన అనిపించింది. పూజారి జోక్యం లేకుండా ఎవరికి వారే నేరుగా భగవంతుని పూజించుకునే సౌలభ్యం ఉండడం ఈ దీక్షల ప్రాచుర్యానికి ఒక కారణమని కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు అర్థమైంది. అయితే భిన్న విధానాలు, భిన్న సామాజికవర్గాల మధ్య ఎలాంటి పోటీ కానీ, శత్రువైఖరి కానీ లేదు. ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అధికార వికేంద్రీకరణే కాదు, అద్భుతమైన ప్రజాస్వామ్యమూ వెల్లివిరుస్తోంది. ఎవరూ ఎవరినీ కాదనడం లేదు. ఊళ్లలో చీకటితోనే మేలుకొలిపే గుడి మైకులూ, టీవీ చానెళ్లలో రోజంతా వినిపించే ప్రవచనాల సౌండ్ బైట్స్ లోనే కాదు; తిరువణ్ణామలై రమణాశ్రమం, పుట్టపర్తి ప్రశాంతినిలయం మొదలైనచోట్ల  కనిపించే ప్రశాంత మౌన వాతావరణంలోనూ అన్ని వర్గాలవారూ ఆధ్యాత్మిక శాంతిని ఆస్వాదిస్తున్నారు.

రైలు ఎక్కగానే నా సెల్ లో మెసేజ్ మోగింది. హైదరాబాద్, పంజగుట్టలోని జిడ్డు కృష్ణమూర్తి సెంటర్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఓ మిత్రుడు, మీరు హైదరాబాద్ ఎప్పుడొస్తున్నారు, ఒకసారి వచ్చి సెంటర్ ను చూడాలని అడుగుతున్నాడు. మౌనంలో ఉండడం వల్ల మెసేజ్ ఇచ్చాడట. నిడదవోలులో రైలు దిగి బస్టాండ్ వైపు నడిచాం. గుళ్ళ దగ్గర కార్తీకమాసం హడావుడి కనిపించింది.  బస్టాండ్ చూడగానే కడుపులో దేవినట్టు అయింది. వెలిసిపోయిన గోడలతో  ఇక్ష్వాకుల కాలంనాటిదిలా కనిపిస్తోంది. ప్రయాణికుల షెల్టర్ ను ఆనుకునే పాచి పట్టిన ఒక పెద్ద మురుగు నీటి వైతరణి ఉంది. దానిమీద దోమలు గుంపులుగా విహరిస్తున్నాయి. బస్సులాగే చోటు మిట్టపల్లాలతో ఉంది. పోలవరం బస్సు ఉందా?’ అని కంట్రోల్ రూమ్ లో కూర్చున్న ఉద్యోగిని అడిగితే, వస్తుంది అని శూన్యంలోకి చూస్తూ జవాబిచ్చాడు. ఎన్నింటికి?’ అని అడిగితే, చూపు తిప్పకుండానే, ఇప్పటికే రావాలన్నాడు. అంతలో తాళ్ళపూడి బస్సు వచ్చింది. అందులో వెడితే తాళ్ళపూడిలో దిగి మా ఊరు ప్రక్కిలంకకు మళ్ళీ ఆటో చేసుకోవాలి. పోలవరం బస్సు కోసం ఎదురుచూడడం కన్నా అదే నయమనుకుని బస్సు ఎక్కాం. బస్సు ఊళ్ళోంచి వెడుతుండగా రోడ్డువైపు దృష్టి సారించాను. రోడ్డు పొడవునా చెత్త కుప్పలు. ఒక చోట వెయ్యి గజాల ప్రదేశం అంతటా చెత్త పరచుకుని ఉంది. అక్కడే బహిరంగ కాలకృత్యాలు జరుగుతున్నాయి. దాని పక్కనే ప్రభుత్వాసుపత్రి ఉంది.

ప్రక్కిలంక చేరేసరికి పదకొండు దాటింది. ఊరు అన్ని ఊళ్ళలానే స్తబ్ధుగా ఉంది. మా ఇంటి గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతుంటే, లోపల ఖాళీ స్థలంలో తళతళా మెరిసిపోతున్న రేకులతో ఒక ఎత్తైన షెడ్డూ, అందులో రంగులు పెయింట్ చేసిన ఓ రథమూ కనిపించాయి. తలుపు కొట్టగానే అక్కయ్య తలుపు తీసింది. లోపల టీవీలో టీటీడీ చానెల్ నుంచి భక్తి కీర్తనలు వినిపిస్తున్నాయి. కుశల ప్రశ్నలు, భోజనాలు వగైరాల తర్వాత మాట్లాడుకుంటూ కూర్చుని ఉండగా, అంతలో అక్కయ్య ఏదో గుర్తొచ్చినట్టు లేచి టీవీ ఆన్ చేసి భక్తి చానెల్ పెట్టింది. చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనం వస్తోంది. ఈ రోజు తెలుగు నాట ఇంటింటా తెలిసిన పేరు ఆయన. వివిధ చానెళ్లలో రోజుకు కనీసం నాలుగైదు సార్లు ఆయన కనిపిస్తారు, వినిపిస్తారు. నేటి టీవీ యుగం సృష్టించిన ఒక పౌరాణిక సెలెబ్రటీ గా ఆయనను చెప్పుకోవచ్చు. సాంప్రదాయిక భక్తి, ఆధ్యాత్మికతలనే బోధిస్తున్నా; అసాధారణమైన శ్రావ్యత, తన్మయత ఆయనలో ఆకట్టుకునే ప్రత్యేకతలు. ఆయన ప్రవచనాలు సీడీ ల రూపంలో కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ఇదిగో రోజంతా ఈ భక్తి చానెళ్లతోనే కాలక్షేపం అంటూ అక్కయ్య టీవీ శ్రవణానికి ఒక చెవి అప్పగించి రెండో చెవిని మాకు అప్పగించింది. టీవీ వచ్చాక పురాణకాలక్షేపాలకూ, హరికథలకూ బయటికి వెళ్ళే అవసరమూ, అలవాటూ తప్పిపోయాయి.  అందులోనూ పిల్లల విదేశీ ఉద్యోగాలు వచ్చాకా, ఇతర బాధ్యతలు తీరిపోయిన తర్వాతా గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు టీవీ సాహచర్యంలోనే ఒంటరి తనాన్ని జయిస్తూ భక్తి, ఆధ్యాత్మికతలను పండించుకుంటున్నారు.  ప్రవచనాలూ, దేవతాస్తుతులూ వగైరాలే కాదు; జాతకాలు, గ్రహశాంతులు, జపాలు, వాస్తు, రుద్రాక్షలు, ఉంగరాలలో ధరించే రాళ్ళు సహా అన్ని రకాలకు సంబంధించిన సలహాలు టీవీ చానెళ్ల ద్వారా ఇళ్లలోనే ఉచితంగా లభిస్తున్నాయి. వయోభేదం లేకుండా ఎవరెవరో టీవీ తెర మీద ప్రత్యక్షమై ఉపదేశాలు, సలహాలు ఇస్తున్నారు. వారి అర్హతా, నర్హతల గురించి ఎవరూ అడగడం లేదు. అన్ని చానెళ్లూ రుద్రాక్షలు, ఉంగరాల రాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వాణిజ్య కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిలోని  నిజానిజాలను పరిశీలించేవారు కానీ, ఆ వ్యాపారంపై నిఘా పెట్టిన వ్యవస్థ కానీ ఉన్నట్టు లేదు. తెలుగువారి ఆధ్యాత్మిక సామ్రాజ్యం వికేంద్రీకృతం, ప్రజాస్వామికమే కాదు; విశృంఖలం కూడా.

మధ్యాహ్నం  అలా వీధిలోకి వెళ్లినప్పుడు మా ఇంటి ఎదురుగా ఉండే కిరాణా వ్యాపారి కనిపించి పలకరించాడు. రేకుల షెడ్డు చూపించి రథం కోసం ఈ మధ్యనే చేయించామని చెప్పాడు. ఈ ఏడాది మాఘమాసంలో జరిపిన సౌర యాగానికి, సూర్య నమస్కారాలకు ఊళ్ళనుంచి బళ్ళు కట్టుకుని వచ్చారనీ, 70 వేలు మిగిలాయనీ, శివాలయానికి ఆ డబ్బు ఖర్చు పెడుతున్నామనీ సగర్వంగా చెప్పాడు.

ఉదయమే చీకటితోనే శివాలయం నుంచీ, గోదావరి గట్టునే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచీ వినిపించే మైకు శబ్దాలకు లేచి కూర్చున్నాను. వెలుగు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు వెంబడే గోదావరి గట్టుకు బయలుదేరాను. రోడ్డుకు అటూ ఇటూ అశుద్ధాలు! వాటి మధ్య నడవడానికి కంపరం కలిగింది. గట్టు మీద బాగుండచ్చన్న ఆశతో ఎలాగో ముందుకు నడిచాను. తీరా వెడితే అక్కడా అదే పరిస్థితి. శుభ్రమైన గోదావరి గాలి పీల్చుకోవచ్చునన్న ఆశకు నీళ్లొదిలి తిరుగుముఖం పట్టాను. వస్తుంటే ఒక పక్క నిర్మల్ గ్రామ్ పురస్కార్ కు సంబంధించిన బోర్డు కనిపించింది. బహిరంగ కాలకృత్యాలు నిషిద్ధమనీ, దానిని ఉల్లంఘించినవారిని శిక్షిస్తామనీ  దాని మీద రాసుంది. అంత బాధలోనూ నవ్వొచ్చింది. శిక్షించేదెవరు, శిక్షింపబడేదెవరు? అంతా మాయ!

అంతలో పూజారి మిత్రుడు ఎదురై పలకరించాడు. ఎలాగూ వచ్చారు, లక్షపత్రి పూజకు ఉండి వెళ్లండన్నాడు!

 చేబ్రోలు, ప్రక్కిలంకే ఏమిటి, ఆంధ్రదేశంలోని అన్ని ఊళ్లూ బాహ్య పరిసరాలను విస్మరించి భక్తిగంగలో మునకలేస్తున్న దృశ్యం కళ్ళకు కట్టింది.

ఆధ్యాత్మిక సామ్రాజ్యం అన్నప్పుడు దానికి ఒక రాజధానీ ఉండవలసిందే. ఆ విధంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధానులు రెండు.  హైదరాబాద్ రాజకీయ రాజధాని అయితే,  తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని. ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆకర్షణ గల పదవి బహుశా టీటీడీ అధ్యక్ష పదవే. వార్తల్లో ఉండడంలో టీటీడీ అధ్యక్షుడు ముఖ్యమంత్రితో పోటీ పడుతుంటారు.  అలాగే, రాజధాని అన్న తర్వాత హైదరాబాద్  మీద పెట్టినంత ఫోకస్ నే మీడియా తిరుపతి మీదా పెట్టక తప్పదు. అందుకే మంచివీ, చెడ్డవీ సహా తిరుపతికి సంబంధించిన అన్ని వార్తలనూ  అందించడడంలో ఇటీవలి కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పోటీ పడుతున్నాయి. తిరుమల వేంకటేశ్వరస్వామి సంపన్న దైవం కనుక మీడియా నిఘా మరింత తప్పనిసరి. ఆధ్యాత్మిక రాజధాని అన్నాక తిరుపతిపై  అధికారాన్ని స్థాపించుకోడానికి ఆధ్యాత్మిక నేతలు ప్రయత్నించడమూ సహజమే. వెయ్యి కాళ్ళ మండపం, బంగారపు తొడుగు మొదలైన వివాదాస్పద నిర్ణయాలలో, ఆగమోక్తవిధానాల ఉల్లంఘన వంటి ఆరోపణల సందర్భంలో చిన జియ్యర్, స్వరూపానందేంద్ర సరస్వతి వంటి స్వాముల జోక్యం, వారు తరచు వార్తలకెక్కడం చూస్తున్నాం. అలాగే, రాజకీయ సామ్రాజ్యంలోని ఊళ్లలానే, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోని  ఎన్నో  బడుగు గుడులు వెల వెల పోతుంటాయి. ఎన్నో ఆలయాలలో తగిన వ్యవస్థలు లేక భక్తులు అవస్థల పాలవుతుంటారు. శిఖరాలు, రాజగోపురాలు కుప్ప కూలుతుంటాయి. పర్వదినాలలో భక్తసమూహాల నియంత్రణలో  కనీసం అధునాతన పద్ధతులను కూడా అమలుచేయలేని నిర్వీర్యస్థితిలో ఆలయవ్యవస్థ ఉంటుంది.  

రాజకీయప్రజాస్వామ్యంలో జనం ఓటు మీద ఆధారపడే ప్రభుత్వాలైనా అప్పుడప్పుడు ప్రజలను నొప్పించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యంలో స్వాములు అంతకు మించిన గడుసరులు. అనుచరబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ప్రజల వ్యక్తిగత నడవడిలోకి తొంగి చూడకుండా జాగ్రత్త పడుతుంటారు. రోడ్లు, వీధులు సరే, కనీసం నదీతీరాలలో బహిరంగ కాలకృత్యాలు వద్దని, హృదయాలలానే పరిసరాలను కూడా పరిశుద్ధంగా ఉంచుకోమనీ భక్తులకు ప్రబోధించే స్వాములు, పౌరాణికులు ఎవరైనా ఉన్నారా?!

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అన్నాక అందులో అనుమానాస్పద శక్తులూ ఉంటాయి. భూ కబ్జా వంటి ఆరోపణలు స్వాముల మీదా ఉన్నాయి. అన్నిటా పోలికలు చక్కగా కుదిరాయి. జనంలో రాజకీయ ప్రజాస్వామ్యంపట్ల ఉన్నంత నిర్లిప్తతే ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం మీద కూడా. తిరుపతి హుండీ నిండుతూనే ఉంది. రికార్డులు తిరగ రాస్తూనే ఉంది.

కార్తీక మాసంలో మూడువంతులు ఊళ్లలో భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత, ఇక్కడా కార్తీక మాహాత్మ్యం వెల్లివిరుస్తున్న వాతావరణం కనిపించింది. నగరానికి శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఉన్నారు!
                                                                ****
                                (ఇండియా టుడే, 4వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచికలో ప్రచురితం)
                                                                            

No comments:

Post a Comment