Friday, December 21, 2012

ప్రధానిగా మోడీ: ఒక విష్ ఫుల్ థింకింగ్

యాంటీ-ఇన్ కంబెన్సీ (అధికారపక్ష వ్యతిరేకత) ఫ్యాక్టర్ పాతబడుతోందని గత మూడు నాలుగేళ్లుగా నేను ప్రత్యేకించి రాస్తున్నాను. కొన్నేళ్లుగా 'అభివృద్ధి', 'పనితనం' అనేవి రాజకీయ చర్చలో ప్రాధాన్యం వహిస్తుండడమే నా అంచనాకు కారణం.  రాజకీయచర్చా వస్తువు మారిందని సకాలంలో గుర్తించిన బుద్ధికుశలురు పరిపాలనలో అభివృద్ధికి, పనితనానికి చోటిస్తూ నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే సరికొత్త రాజకీయసంస్కృతిని తీసుకొచ్చారు. ఒకే పార్టీకి కాక వేర్వేరు పార్టీలకు చెందినవారు కూడా వీరిలో ఉన్నారు. నితీశ్ కుమార్(జేడీయూ-బీహార్ ముఖ్యమంత్రి), శివరాజ్ సింగ్ చౌహాన్(బీజేపీ-మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి), రమణ్ సింగ్(బీజేపీ-ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి), షీలా దీక్షిత్(కాంగ్రెస్-ఢిల్లీ ముఖ్యమంత్రి), నవీన్ పట్నాయిక్(బీజేడీ-ఒడిస్సా) చెప్పుకోదగిన కొన్ని పేర్లు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ జాబితాలో ఒక ప్రముఖుడే కానీ 'నిశ్శబ్దంగా పనిచేసుకోవడం' అనే మాట ఆయనకు వర్తించదు. కారణాలు ఏమైనాసరే, అభివృద్ధి అనే మాటను అందరికంటే ఎక్కువగా ఇప్పుడు చలామణిలో ఉంచింది ఆయనే. అదొక నినాదంగా జనం నోళ్లలో నానడానికి  అవసరమైనన్ని 'సౌండ్ బైట్స్'  ఇప్పుడు గుజరాత్ నుంచే ప్రసారమవుతున్నాయి.

ఇప్పుడే ఇంకో విషయం కూడా చెప్పుకుని అసలు విషయం లోకి వెడతాను. అభివృద్ధి గురించి చాలాకాలంగా మాట్లాడుతున్న అతి కొద్దిమంది తెలుగు పాత్రికేయులలో నేను ఒకణ్ణి. అంటే మిగిలినవారు అభివృద్ధి వద్దంటున్నారని కాదు. ఒత్తి చెప్పడంలోనూ, అభివృద్ధికి సంబంధించిన నమూనా విషయంలోనూ తేడా ఉందని చెప్పడమే నా ఉద్దేశం. అభివృద్ధి గురించి మాట్లాడి నేను విమర్శలూ ఎదుర్కొన్నాను. ఇప్పుడా అంశంలోకి లోతుగా వెళ్ళను. అయితే, అభివృద్ధి అనే మాటను ఒక తిట్టుపదంగానూ, అవినీతికి పర్యాయపదంగానూ, క్రోనీ క్యాపిటలిజానికి గౌరవప్రదమైన ముసుగుగానూ మార్చి దాని విలువ పోగొట్టారని కూడా నేను ఒప్పుకుంటాను. నా ఉద్దేశంలో, లేదా నా ఇమాజినేషన్ కు అందినంతవరకూ 2004-2009 మధ్యకాలం అభివృద్ధి కేంద్రిత రాజకీయ సంస్కృతిపై ఆశలు రేకెత్తించిన కాలం (దయచేసి ఇక్కడ ఎన్.డీ.ఏ, యూపీఏ తేడాలు తీసుకురావద్దు). 2009 తర్వాత గుజరాత్ మినహా దేశంలో మరెక్కడా అభివృద్ధి అనే మాట ధాటిగా  వినిపించడం లేదు. మన రాష్ట్రం సంగతి చెప్పనే అవసరం లేదు. పైగా ఎవరైనా అభివృద్ధి అంటే మీద పడి కరిచే వాతావరణం ఉంది. అది, బాధ్యతా, జవాబుదారీ, దార్శనికతా లేని రాజకీయ అంగుష్టమాత్రుల పుణ్యం!  అంతర్జాతీయ ఆర్థికసంక్షోభం ప్రభావం  కొంత ఉండచ్చు కానీ అదే ఏకైక కారణమని చెప్పలేం.

స్థూలంగా చెప్పుకుంటే, అభివృద్ధి ప్రాధాన్యాన్ని(లేదా పనితనం ప్రాధాన్యాన్ని) గుర్తించిన పై ముఖ్యమంత్రులు యాంటీ-ఇన్ కంబెన్సీ ఫ్యాక్టర్ నూ అధిగమించగలిగారు. నిర్దిష్ట భావజాలం, క్యాడర్ బేస్ ఉన్నవిగా  వామపక్షాలకు, బీజేపీకి మధ్య ఒక పోలిక ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ముప్పై ఏళ్లపాటు అధిగమించిన యాంటీ-ఇన్ కంబెన్సీ ని, గుజరాత్ లో బీజేపీ వరసగా అయిదుసార్లు (మూడుసార్లు నరేంద్ర మోడీ నాయకత్వంలో) సాధించిన అదే ఫీటునీ ఒకే గాటన కట్టలేం. బీజేపీ ఫీటు వెనుక మారిన రాజకీయ ప్రాధాన్యాల నేపథ్యం ఉంది. గుజరాత్ ఎన్నికల ప్రచారసందర్భంలోనూ, ఎగ్జిట్ పోల్ పై చర్చలోనూ బీజేపీ నాయకులు యాంటీ-ఇన్ కంబెన్సీ ఫ్యాక్టర్ పాతబడిపోయిందని పదే పదే నొక్కి చెప్పడం మూడు నాలుగేళ్లుగా నేను చెబుతున్నదానికి  ధృవీకరణ.

ఫలితాలు వెలువడిన రోజున వార్తా చానెళ్లు(ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ చానెళ్లు) రోజంతా గుజరాత్ మీదే ఫోకస్ చేశాయి. ఏకంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కవర్ చేస్తున్నాయా అన్న అభిప్రాయం కలిగించాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశీయంగానే కాక విదేశీ దృష్టిని కూడా విశేషంగా ఆకర్షించిన మాట వాస్తవం. ఫలితాలపైనే కాక నరేంద్ర మోడీని కూడా టీవీ తెర మీద జనం ఆసక్తిగా చూశారు. నరేంద్ర మోడీ తల్లిని దర్శించి ఆశీస్సులు తీసుకోవడం, విభేదాలను పక్కన పెట్టి తన రాజకీయ గురువు కేశూభాయ్ పటేల్ ఇంటికి వెళ్ళి ఆయనకు  పాదాభివందనం చేయడం సామాన్యజనం అద్భుతంగా కనెక్ట్ అయ్యే దృశ్యాలు. సరే, రాజకీయనాయకుడు అన్నాక ప్రతి చర్య వెనుకా ఎత్తుగడలను, వ్యూహాలను అనుమానించడం సహజం. అలాంటివి ఉండచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ పై చర్యలు మానవ సంబంధాల విలువలను ప్రతిబింబిస్తాయి. రాజకీయనాయకుల నడవడిలో విలువల ప్రతిఫలనం జనానికి ఆరోగ్యకరమైన సంకేతాలను ఇస్తుంది.

ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నరేంద్ర మోడీ ప్రధాని పదవికి ఒక అభ్యర్థిగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది, ఎన్నికల ప్రచార సందర్భంలో ఆ ప్రచారం మరింతగా ఊపందుకుంది. ఫలితాల రోజున చానెళ్ల చర్చలో ఇంకా మారుమోగింది. మోడీని వాజ్ పేయితో కూడా ఒకరిద్దరు పోల్చారు. మొత్తం మీద సైద్ధాంతికంగానూ, 2002 అనుభవాల నేపథ్యంలోనూ మోడీని వ్యతిరేకించేవారు కూడా ఆయనను ప్రధాని పదవిలో కనీసం ఊహించుకోవడమైనా ఇక నుంచీ ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతానికి అది ఊహ మాత్రమే. లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది మూడు మాసాలు వ్యవధి ఉంది. ఈ లోపల ఏం జరుగుతుందో చెప్పలేం. యూపీఏ హ్యాట్ ట్రిక్ సాధించినా సాధించవచ్చు. ఎందుకంటే, 2009 ఎన్నికలలో ఒకే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు ఓటర్ల స్పందనలో తేడా కనిపించింది. ఉదాహరణకు యూ.పీ, గుజరాత్ లలో బీ.ఎస్.పీ, బీజేపీ లకు పట్టం కట్టిన ఓటర్లు లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు ఇచ్చారు. ఒకవేళ ఎన్.డీ.ఏ అధికారం లోకి వస్తుందనుకున్నా ఆ కూటమిలోని పక్షాలు మోడీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించాలి. బీజేపీలోనే అంతర్గత ఏకీభావం ఏర్పడాలి. వింటున్నదే నిజమైతే ఆర్.ఎస్.ఎస్. అభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు.

అవన్నీ అలా ఉంచి మోడీ ప్రధాని అయ్యే సంభావ్యతను కాసేపు ఊహించుకుందాం. మోడీ మరో వాజ్ పేయి కాలేరు. కావాలని ఆశించడమూ న్యాయం కాదు. క్లోనింగ్ ప్రక్రియ ఇంకా ఆ స్థాయికి రాలేదు. బీజేపీలో 'లిబరల్ ఫేస్' అన్న గుర్తింపు ఇప్పటికీ వాజ్ పేయి ఒక్కరికే ఉంది.  వాజ్ పేయికి కలుపుగోలు ఇమేజ్ ఉంటే, మోడీకి ఆటోక్రాట్ ఇమేజ్ ఉందన్న సంగతిని ఎవరూ కాదనలేరు. వామపక్ష తీవ్రవాదుల్లోనూ వాజ్ పేయిని అభిమానించేవారు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అది పక్కన పెట్టి మోడీలో గల అనుకూలాంశాలను, ప్రతికూలాంశాలను నిష్పాక్షికంగా చూద్దాం. వ్యక్తిగత అవినీతి ఆరోపణలు లేకపోవడం, పరిపాలనాదక్షుడుగా గుర్తింపు పొందడం, జనసమ్మోహన శక్తి ఉండడం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుండడం ప్రధానంగా ఆయన అనుకూలాంశాలు. అయితే, పాలనావ్యవస్థలో అవినీతిని ఎంతవరకు తగ్గించగలిగారు, లోకాయుక్తను ఎందుకు ఏర్పాటు చేయలేదు, అభివృద్ధిని అన్ని వర్గాలకూ చేర్చగలిగారా, గ్రామాల పరిస్థితీ, రైతుల పరిస్థితీ ఏమిటి, మానవాభివృద్ధి సూచి ఎలా ఉంది, ప్రజాస్వామిక వాతావరణం ఎలా ఉంది, మీడియా పరిస్థితి ఎలా ఉంది మొదలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటికిప్పుడు వీటిపై సాధికారంగా చెప్పలేను కనుక ఆ జోలికి వెళ్ళను. అయితే ఒకటి గుర్తించాలి.  పై ప్రశ్నలలో అనేకం కాంగ్రెస్ సహా అనేక పార్టీల ప్రభుత్వాలపై కూడా ఉంటాయి కనుక మోడీని ప్రత్యేకించడం న్యాయం కాదు.

ఇక ప్రతికూలాంశాలు... '2002' సంగతి తెలిసినదే. ఆ చీకటిగతం ఆయనను పదేళ్లుగా నీడలా వెంటాడుతూనే ఉంది. దానినుంచి తప్పించుకోడానికి ఇటీవలి కాలంలో ఆయన చాలా ప్రయత్నాలు చేస్తూవచ్చారు. విచారాన్ని స్పష్టంగానో, అస్పష్టంగానో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీ జాతీయనాయకులు కూడా అదొక దురదృష్టకర ఘటన అనీ, దానిని మరచిపోదామనీ కొంతకాలంగా అంటున్నారు. ఆ ఘటనలకు సంబంధించిన న్యాయప్రక్రియ పూర్తిగా ముగియలేదు కనుక ఆ కోణాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. అయితే బీజేపీకానీ, మోడీ కానీ 2002 పై అడపా తడపా విచార సంకేతాలను జారీచేయడంతో సరిపెట్టకుండా  ఇంకొంచెం ముందుకు వెడదామా వద్దా అన్న డోలాయమానంలోనే ఇప్పటికీ ఉన్నట్టు కనిపిస్తున్నారు. అది, 2002 ఘటనలకు బహిరంగంగా విచారం వ్యక్తం చేయడం! మోడీకే కాక, పార్టీ మొత్తానికి(ఇప్పటికంటే ఎక్కువ) ఆమోదయోగ్యత తెచ్చిపెట్టే అంశాలలో అదొకటి అవుతుంది. 1984లో ఢిల్లీలో సిక్కు మతస్థుల ఊచకోతపై కాంగ్రెస్ బహిరంగంగా విచారం వ్యక్తం చేసిన ఉదాహరణ ఉండనే ఉంది.

ఇటువంటి సందిగ్ధాన్ని బీజేపీ నాయకత్వం తన భావజాలం విషయంలోనూ చాలాకాలంగా ఎదుర్కుంటోంది. విభజన స్వభావం కలిగిన తన మౌలిక భావజాలానికి, దేశంలోని అన్ని వర్గాల సమ్మతీ అవసరమైన రాజకీయాధికారానికీ మధ్యనున్న వైరుధ్యాన్ని ఆ పార్టీ 2004 ఎన్నికల ఓటమి తర్వాతనుంచీ మరింత స్పష్టంగా గుర్తించడం ప్రారంభించింది. అద్వానీ జిన్నాను సెక్యులర్ వాదిగా పేర్కొనడం అందులో భాగమే. అలాగే, బీజేపీ గత ఇరవయ్యేళ్ళ రాజకీయప్రస్థానంలో అయోధ్య నినాదం  నుంచి అభివృద్ధి నినాదానికి మళ్లిన క్రమం మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అప్రకటితంగా, చాపకింద నీరులా జరిగిన ఆసక్తికరమైన ఆ పరివర్తనను ఎంతమంది గమనించారో తెలియదు. దానిపై పెద్దగా చర్చ లేకపోవడం ఆ అభిప్రాయానికి కారణం. అయోధ్య,  ఇతర హిందుత్వ అజెండా  ప్రస్తావన ఏ బీజేపీ నాయకుని నోటా ఈ రోజున వినిపించడం లేదు. ప్రతిపక్షస్థానం నుంచి అధికారపక్ష స్థానానికి ఎదిగిన తర్వాత క్రమంగా బీజేపీలో వచ్చిన మార్పు ఇది. అయితే ఈ మార్పును కూడా బహిరంగంగా అంగీకరించడానికి బీజేపీ ఇప్పటికీ సిద్ధంగా లేదు.

మోడీలో ఒక సమర్థ ప్రధానిని చూసి మెజారిటీ జనం ఆయనకు ఆమోదముద్ర  వేయాలంటే నా ఉద్దేశంలో ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి,  బీజేపీ ఈ సందిగ్ధాల నుంచి బయటపడాలి. అయితే, అంతమాత్రంతో సరిపోదు. బీజేపీ భావజాలంతో ప్రజాస్వామిక వాతావరణానికీ, ప్రజాస్వామిక హక్కులకు, సాంస్కృతిక స్వేచ్చకు పొసగదన్న అభిప్రాయం చాలామందికి ఉంది. అది అపోహా, నిజమా అన్న చర్చ లోకి నేనిప్పుడు వెళ్ళను. ఆ అభిప్రాయం సరికాదనే స్పష్టమైన సంకేతాలను ఆ పార్టీ అందించాలి. అలాగే సమ్మిళిత వృద్ధి(inclusive growth)కీ హామీ ఇవ్వాలి, ఒక్క మాటలో చెప్పాలంటే నేటి రైటాఫ్ సెంటర్ లేదా లెఫ్టాఫ్ సెంటర్ పార్టీల తరహా లోకి అది మారాలి. తను కోల్పోయిన వాటికి ప్రత్యామ్నాయంగా అది అవినీతికి తావులేని, విలువలతో కూడిన రాజకీయాలను; ఈ దేశ సామాన్యప్రజానీకంతో కనెక్ట్ అయ్యే ఆదర్శవంతమైన వ్యవహరణను తన ప్రత్యేక ప్యాకేజ్ గా ముందుకు తేవచ్చు.

బీజేపీలో అప్రకటితంగా ఇప్పటికే వస్తున్న పరివర్తన సరళిని గమనిస్తే, ఇది  గొంతెమ్మ కోరిక అనిపించదు. కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బీజేపీ  పైన చెప్పిన సందిగ్ధాలనుంచి బయటపడి, తనపట్ల వ్యతిరేకులలో ఉన్నభయాలను తొలగించి వాజ్ పేయి తరహాలో కలుపుగోలు స్వభావం గల ఒక సరికొత్త మోడీని అవతరింప జేయగలిగితే , మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడానికి అర్హుడే. యూపీఏ లో బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేని నేపథ్యం నుంచి అంటున్న మాట ఇది.

 అదీగాక ఒకరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఇప్పటి మోడీయే ప్రధాని అయ్యే సంభావ్యతనూ నేను కాదనడం లేదు.

దీనిని ఒక విష్ ఫుల్ థింకింగ్ గానే తీసుకోవాలని బీజేపీ అభిమానులను కోరుతున్నాను. బీజేపీ ఎందుకు మారాలి అన్న చర్చను కానీ, సిద్ధాంత చర్చను కానీ తీసుకురావద్దని మనవి.





4 comments:

  1. నా గుజరాతీ స్నేహితులు చెప్పేదాని ప్రకారం, బయట ఊదరగొడుతున్నంత గొప్పంగా ఏమీ లేదు మోడీ జమానా. అయినా ఎందుకు మళ్లీ గెలిచాడంటారా? అతన్ని మించిన ప్రత్యామ్నాయం లేక. ప్రతిపక్షాలు వాళ్లలో వాళ్లు కొట్టేసుకుంటూ కనీసం తమ తరపు ముఖ్యమంత్రి అభర్ధెవరో కూడా ప్రకటించలేనంత దైన్య స్థితిలో ఉంతే మోడీ ముచ్చటగా మూడోసారి గెలవకేం చేస్తాడు?

    ReplyDelete
  2. *గుజరాతీ స్నేహితులు చెప్పేదాని, బయట ఊదరగొడుతున్నంత గొప్పంగా ఏమీ లేదు *

    నిజమే అయ్యుంట్టుంది! గత 10సం|| భారతదేశంలొ వచ్చిన మార్పులు వాళ్లకి తెలియనీయకుండా మోడి పాలించి ఉంటాడు. అందువలన వారికి గొప్పతనం కనపడలేదు. మోడితో పాటుగా అభివృద్ది నినాదం చంకనెత్తుకొన్న చంద్ర బాబు,రాజశేఖర్ రెడ్డి, కరుణానిధి మొద|| వారు, వాళ్ళ రాష్ట్రాలను ఎంత అభివృద్ది చేశారో, వాళ్లేంత అభివృద్ది చెందారో సౌత్ లో అందరికి తెలుసు. అలా తెలుసుకోనవసరం లేకుండా గుజరాత్ ను పదేళ్ల గా మోడి పాలించాడు.ఒక్క మోడీ తప్పించి మిగతా మాజి ముఖ్య మంత్రులు భీభత్సంగా సంపద్ను దొచ్చుకొని, రాష్ట్రలలో పాలనను నాశనం చేశారు.

    ReplyDelete
  3. మోడీ కంటే ముందే గుజరాత్ అభివృద్ధి చెందిన రాష్ట్రం.
    నిజమే. అయితే మోడీ దాని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాడు.
    దేశంలోని చాలామంది మిగతా ముఖ్యమంత్రుల కంటే మోడీ మంచి ముఖ్యమంత్రి (except 2002).
    కాని మోడీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేడు.
    ఎందుకంటే ఇంటా (NDA, BJP), బయటా ఆయన్ని సమర్ధించేవాళ్ళకంటే వ్యతిరేఖించేవాళ్ళే ఎక్కువ.

    ReplyDelete
  4. Develop ayindo ledo naaku telidu kaani...16 hours kante ekkuvaga Gujarat antataa power supply chestunnadu...deeni valla industries.... niraatankangaa panichestunnayi... and infrastructure develop chesadata... ivi chaala pedda achievements ane cheppali..... Even northern grid fail ayyi blackout ayinappudu... daaniki connect ayina Gujarat lo matrame power fail kaaledu...

    ReplyDelete