Wednesday, January 2, 2013

ముద్దులు, కౌగిలింతల 'ధ్యానం': ఆంధ్రలో ఓ దారుణం

ఢిల్లీలో 23 ఏళ్ల యువతి మానభంగం, హత్యలపై యావద్దేశంలో ఇప్పటికీ  ఆగ్రహం జ్వలిస్తూనే ఉంది. మహిళల పట్ల జరిగే ఘాతుకాలకు అడ్డుకట్ట పడేవరకూ ఆగ్రహాగ్ని అలా జ్వలిస్తూనే ఉండాలనీ, ఎత్తిన కత్తి దించడానికి వీలులేదనే పట్టుదల జనంలో కనిపిస్తోంది. మానభంగాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలను అరికట్టే దిశగా కేంద్రమూ, కొన్ని రాష్ట్రప్రభుత్వాలూ నిర్దిష్ట చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. సంతోషమే...

కానీ, ఇదే సమయంలో ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోందో గమనించారా?  ఈరోజు కొన్ని తెలుగు దినపత్రికలు ప్రచురించిన దృశ్యాలు చూస్తే, మహిళల మర్యాదను మంటగలపడంలో అవి ఢిల్లీ యువతి మానభంగ ఘటనకు ఏమాత్రం తీసిపోవనే అభిప్రాయం మీకు కలిగితీరుతుంది. కొన్ని దృశ్యాలలో నెరిసిన గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు కొందరు యువతులను ఆలింగనం చేసుకుంటున్నాడు! ఇంకో దృశ్యంలో, ఆయన శిష్యుడుగా చెబుతున్న ఒక నల్లని గడ్డం మనిషి ఒడిలో ఒక యువతి కూర్చుని ఉంది! మరో దృశ్యంలో ఆ మనిషే మరో యువతిని ముద్దాడుతున్నాడు! 'ఆధ్యాత్మిక ప్రేమతత్వా'న్ని పంచే ప్రక్రియలో ఆ ఆలింగనాలు, ఒడిలో కూర్చోబెట్టుకోవడాలూ, ముద్దాడడాలూ భాగమట!

ఇలాంటి బహిరంగ విశృంఖల దృశ్యాలు చూసిన తర్వాత కూడా మన రక్తం ఉడకకపోతే, మన సాంస్కృతిక విలువలకు అవి చేసే గాయాల నొప్పి అనుభవానికి రాకపోతే ఈ దేశాన్ని దాని ఖర్మానికి విడిచిపెట్టడం తప్ప చేయగలిగింది లేదు. ఈ దృశ్యాలు ఘనత వహించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి కదలిక తెచ్చాయో ప్రస్తుతానికి సమాచారం లేదు. మామూలు కదలిక కాదు, ఆ దృశ్యాలకు బాధ్యులైనవారిపై కఠినచర్య తీసుకోవడంతోపాటు, పిరమిడ్ ధ్యాన కేంద్రంగా ఇటీవలి కాలంలో  విశేషప్రచారం పొందుతున్న ఆ సంస్థపైనా చర్య తీసుకోవడం అవసరం. అయితే, ఆ సంస్థ ఇటీవల నిర్వహించిన ప్రపంచ ధ్యాన సభలకు ఎంతటి ప్రముఖులు హాజరయ్యారో గమనిస్తే, రాష్ట్రప్రభుత్వం చర్యకు సాహసిస్తుందనిపించదు. కడ్తాల్ అనే చోట ఆ ధ్యాన కేంద్రాన్ని సందర్శించినవారిలో తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, కేంద్రమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఉన్నారు. అక్కడ ధ్యానం చేశాక  నాకెంతో మనశ్శాంతి కలిగిందని జైపాల్ రెడ్డి చెప్పుకున్నారు. పత్రికలు ప్రచురించిన దృశ్యాలు చూసిన తర్వాత కూడా మీ మనస్సు అంతే శాంతిని అనుభవిస్తోందా జైపాల్ రెడ్డిగారూ?

ఆసియాలోనే అతి పెద్ద పిరమిడ్ గా దాని గురించి చెబుతున్నారు. పిరమిడ్ నిర్మాతపై అసైన్డ్ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణ వినిపిస్తోంది. పిరమిడ్ నిర్మించిన ప్రాంతం చుట్టుపక్కల రియెల్ ఎస్టేట్ మంచి ఊపులో ఉందంటున్నారు. పిరమిడ్ నిర్మాణ వ్యూహాలలో అది కూడా భాగమంటున్నారు. వినిపించే ఆరోపణలను అలా ఉంచి కనిపించే దృశ్యాల గురించే మాట్లాడుకుందాం.

ఢిల్లీ యువతి మానభంగంతో ఈ దృశ్యాలను ఎలా పోల్చుతారన్న సందేహం ఎవరికైనా ఉండచ్చు.  ఢిల్లీ ఘటనకు భిన్నంగా పై దృశ్యాలలోని మహిళలు ఇష్టపూర్వకంగా ఆలింగనాలు, ముద్దులు, ఒడి లాలింపులు అంగీకరించారన్న వాదన ముందుకు తేవచ్చు. కానీ లోతుగా ఆలోచించి చూడండి...పై దృశ్యాలు ఢిల్లీ ఘటనకంటే కూడా దారుణమైనవని మీకే అనిపిస్తుంది. ఢిల్లీ ఘటనలో క్రౌర్యం ఉంది, పాశవికత్వం ఉంది, దౌర్జన్యం ఉంది. కానీ పై దృశ్యాలలో ఆధ్యాత్మికత ముసుగులో జరిగే బహిరంగ వంచన ఉంది. ప్రేమతత్వం అనే  మత్తు చల్లి  మహిళల్ని లొంగదీసుకుని వారి శరీరంపై ఆధ్యాత్మిక  అత్యాచారానికి పాల్పడే నికృష్టత ఉంది.

ఈ దృశ్యాలు ఈ దేశ సాంస్కృతిక విలువలకు చేసే గాయాల మాటేమిటి? ఇవి ఈ దేశప్రజలకు కలిగించే సాంస్కృతిక ఆఘాతాల సంగతేమిటి? ఇంత గొప్ప ఆధ్యాత్మికసంపన్నత ఉన్న ఈ దేశంలో మహిళల్ని ముద్దాడడం, ఆలింగనం చేసుకోవడం, ఒళ్ళో కూర్చొబెట్టుకోవడం లాంటి నీచమైన చర్యలను ఏ ఆధ్యాత్మిక సంప్రదాయమైనా బోధించిందా? ఎదిగిన కూతురును తాకడానికి కన్నతండ్రి కూడా సందేహించే ఈ దేశంలో పరపురుషుడు బహిరంగంగా యువతులను ఆలింగనం చేసుకునే దృశ్యాన్ని ఊహించగలమా? ఈ దేశంలో ధ్యాన సంప్రదాయాలకు ఎంత చరిత్ర ఉంది? బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్య, అధునాతన కాలంలో రమణమహర్షి, అరవిందుడిలాంటి ఎందరో ప్రవచించిన ఆరోగ్యకరమైన ధ్యాన సంప్రదాయాలు, నమూనాలు మనకు ఎన్ని లేవు? ఏ సంప్రదాయమైనా ఇలాంటి అత్యాచారాలకు తావిచ్చిందా? ఇంత గొప్ప ధ్యానవారసత్వం మనకు ఉండి కూడా ఇలాంటి వెర్రి మొర్రి, నీతిబాహ్య ప్రదర్శనలకు మనవారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ ఆధ్యాత్మిక దారిద్ర్యం, దిక్కులేని తనం జనానికి ఎలా దాపురించింది? సూటిగా అడగాలంటే,  ఈ దేశంలోని రకరకాల పురాతన పంథాలకు చెందిన పీఠాధిపతులు, స్వాములు ఏం చేస్తున్నారు?

ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులకు, శక్తులకు గొడుగు పట్టే రాజకీయనాయకత్వం- వారిని మించిన పెద్ద బెడద. ఎవరు, ఎలాంటివారు, వారి కార్యకలాపాలు ఏమిటన్నది చూడకుండా, పిలిచినదే తడవుగా పంచే, కండువాలు సర్దుకుంటూ వచ్చి వాలే గవర్నర్లు, మంత్రులే ఈ అవాంఛనీయ శక్తులకు కొండంత అండ. తమకు లోతుగా  తెలియని విషయాలు ఉంటాయన్న స్పృహ వీరికి ఉండదు. మహాద్భుత నిర్మాణం ఏదో చేసి, ప్రపంచ స్థాయి సభలు జరుపుతున్నారనేసరికి అక్కడ హాజరై పొగడ్తలతో ముంచెత్తడం ఒక్కటే వీరికి తెలుసు. అదే తమ రక్తబంధువులలో ఎవరైనా అలా ఆలింగన, చుంబనాలు అందుకుంటుంటే వీరి స్పందన ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఆ  పిరమిడ్ నిర్మాతను ప్రశంసలతో ముంచెత్తుతారా??

అన్నింటి కన్నా ఆశ్చర్యం...అంత పెద్ద పిరమిడ్ ఆంధ్రదేశం గుండెలపై ఎలా ప్రత్యక్షమైంది? దానికి ఎవరెవరు ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? అక్కడ జరగబోయే కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా ఆరా తీసిన తర్వాతే ఇచ్చారా? ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి ఇలాంటి ఘోరమైన దృశ్యాలు దృష్టికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు?,,,ఇవన్నీ శేషప్రశ్నలు.

ఢిల్లీ వైపు దృష్టి సారించిన యావద్దేశం ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూపు మళ్లించవలసిన అవసరం లేదా అన్నది ఈ క్షణాన అసలు ప్రశ్న.







1 comment:

  1. This comment has been removed by the author.

    ReplyDelete