Saturday, January 26, 2013

"తల్లి లాంటి ఊళ్ళకు బూజు...హైదరాబాద్ ప్రియురాలిపై మోజు"

 సీమాంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలోనూ ఇతర పట్టణాలనూ, ఊళ్లను పాడు పెడుతున్నారనీ, అభివృద్ధిని అంతటినీ హైదరాబాద్ లోనే కుమ్మరిస్తున్నారనీ,  సీమాంధ్ర ప్రాంతంలో హైదరాబాద్ స్థాయి నగరాలను అభివృద్ధి చేసుకోవలసిన అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలనీ, సీమాంధ్ర జనం తమకు ఒక రాజధాని స్థాయి నగరం లేని చారిత్రకమైన లోటును పూరించుకోవాలనీ నేను వివిధ సందర్భాలలో రాశాను.

ఈ రోజు (26 జనవరి) ఆంధ్రజ్యోతిలో అలోక్ రే అనే ఒక బెంగాలీ గృహిణి 'అత్త తప్పును కోడలు సరిదిద్దేనా?' అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు. ఆమె అభిప్రాయాలు కొన్ని ఒకింత తేడాతో నా అభిప్రాయాలనే సమర్ధిస్తున్నాయి. ఆ వ్యాసం నుంచి కొన్ని relevant భాగాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.

                                                                        ***

"నయా రాయపూర్, చండీగఢ్ ల మాదిరిగా కొత్త రాజధానులని ఎందుకు అంటున్నానంటే ఇలా కట్టడం వల్ల సామాజికంగా, భౌగోళికంగా జరిగే అభివృద్ధి అపారంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి...హైదరాబాద్ లాంటి రాజధాని నగరాలు రెండు అటు తెలంగాణా, ఇటు ఆంధ్రలో వెలిస్తే ఎలా ఉంటుందో. వాటివల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో. ...ఇది ఖర్చుతో కూడుకున్నదే. అయినా తప్పదు.

తల్లి లాంటి ఊళ్లను అభివృద్ధి చేసుకోకుండా ప్రియురాలి వంటి హైదరాబాద్ పై తెలుగువాళ్ళంతా మోజు పడుతున్నారు. అటు ఆంధ్రాప్రాంతీయులు, ఇటు తెలంగాణీయులు అంతా హైదరాబాద్ ను పట్టుకుని వేలాడుతున్నారు. ఇక్కడే సదుపాయాలన్నీ కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. తమ ఊర్లను బంజరు దొడ్లుగా మార్చేస్తున్నారు. ఆంధ్రలోని కొన్ని పట్టణాలు తెలంగాణ లోని పట్టణాల కంటే దారుణంగా ఉన్నాయి. అయినా అక్కడి ప్రజలు ఎందుకని తమ నాయకుల్ని నిలదీయడం లేదో అర్థం కాలేదు నాకు...అదే విధంగా తెలంగాణలోని ప్రాంతాలు కూడా! అంతా హైదరాబాద్ కే వలస. రెండు ప్రాంతాల నేతలూ...ప్రజలూ హైదరాబాద్ నే కౌగిలించుకుంటున్నారు...ఊళ్లను వల్లకాడు చేసి...పిల్లా పాపలతో  ఇక్కడే మకాం పెట్టేయాలని తపిస్తున్నారు."

                                                                        ***

ఇది చదివిన తర్వాత, 'మరి బెంగాల్ లో గోర్ఖా ల్యాండ్ వేర్పాటు ఉద్యమం విషయంలో ఈ బెంగాలీ ఆడబడుచు ఏమంటారో' నన్నప్రశ్న బాణంలా దూసుకొచ్చే మాట నిజమే.  అదెలా ఉన్నా;  ఊళ్లను పాడు పెడుతున్నారనీ, హైదరాబాద్ స్థాయి నగరాలను అన్ని ప్రాంతాలవారూ అభివృద్ధి చేసుకోవాలనీ అన్న మాటలు అర్థవంతంగానే ఉన్నాయి కదా!

మంచి మాటలు... 'వినదగు నెవ్వరు చెప్పిన'...

సంబంధిత పోస్ట్ లు: 1. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది!  2. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్ కావాలి? 3. తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి. 4. తెలుగు సభల్లో తెలుగు 'బహిర్భూమి' గురించి చర్చిస్తారా?




4 comments:

  1. ఏమి అభివృద్దో పాడో, బంగారం లాంటి మా హైదరాబాదును సర్వనాశనం చేసారు. మా చెరువులు మాయం అయినాయి. మా చారిత్రిక కట్టడాలు శిథిలం అయి నగరం బోసిపోయింది. ఐమాక్సులు లుంబినీ పార్కులు వచ్చాక చార్మినారు, గోలుకొండ & సాలార్జంగ్ పట్టించుకునే నాథుడే లేడు.

    ఇరానీ చాయ్ పోయి టీ బండ్లు, సమోసాలు గాయబయి పుణుగులు, ఉడుపీ హోటళ్ళు మూతబడి ఆంధ్రా మెస్సులు, ఇవన్నీ ఎవరిని ఉద్ధరించడానికి?

    ఫ్లైఓవర్లు పాతబస్తీలో ఎందుకు లేవు, వాళ్ళు మనుషులు కారా? సుల్తాన్ బజారుపై మెట్రో కబ్జాలు ఎందుకు?

    మా గుళ్ళు, మా కుంటలు, మా రాళ్ళు రప్పలు, మా బజార్లు, మా బాగులు, చివరికి మా బొందలగడ్డలు అన్నీ భూబకాసురాలకు అంకితం.

    ReplyDelete
  2. >>>>>>>>
    హైదరాబాద్ లాంటి రాజధాని నగరాలు రెండు అటు తెలంగాణా, ఇటు ఆంధ్రలో వెలిస్తే ఎలా ఉంటుందో. వాటివల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో.
    అటు ఆంధ్రాప్రాంతీయులు, ఇటు తెలంగాణీయులు అంతా హైదరాబాద్ ను పట్టుకుని వేలాడుతున్నారు.
    హైదరాబాద్ స్థాయి నగరాలను అన్ని ప్రాంతాలవారూ అభివృద్ధి చేసుకోవాలనీ అన్న మాటలు అర్థవంతంగానే ఉన్నాయి కదా!
    <<<<<<<<<<<

    రెండు వైపులా పదును వున్న కత్తి లాంటి వాదన.
    ఏం బ్రెయిన్స్ అండీ మీవి
    మీతో పాటు మేం కూడా తరతరాల మా హైదరాబాద్ ని కాదని ఇంకో
    రాజధానిని ఏర్పాటు చేసుకోవాలన్న మాట.
    ఎందుకో ?
    మీ గురించే కాదు మా గురించి కూడా ఆలోచించి
    మీ గొప్ప మనసు ను చాటుకున్నారు .
    హాట్స్ ఆఫ్ !

    ReplyDelete
    Replies
    1. "మీతోపాటు మేం కూడా తరతరాల మా హైదరాబాద్ ని కాదని ఇంకో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలన్న మాట." అది ఆ వ్యాస రచయిత్రి అభిప్రాయమే కానీ నా అభిప్రాయం కాదు. జాగ్రత్తగా గమనించగలరు. "ఆమె అభిప్రాయాలు 'ఒకింత తేడాతో' నా అభిప్రాయాలను సమర్థిస్తున్నాయ"ని నేను అన్నాను. ఊళ్లను పాడు పెట్టి, అభివృద్ధిని హైదరాబాద్ లోనే కేంద్రీకరిస్తున్నారనీ; అన్ని ప్రాంతాలూ తమ ప్రాంతంలోని ఒకటి రెండు పట్టణాలనైనా పెద్ద నగరాలుగా అభివృద్ధి చేసుకోవాలనే మేరకే ఆ వ్యాస రచయిత్రితో నా ఏకీభావం. రాజధాని గురించి నేను మాట్లాడలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ గురించీ, పట్టణాభివృద్ధి గురించీ నేను 2007 నుంచీ రాస్తున్నాను. నా ప్రస్తుత అభిప్రాయాలు దానికి కొనసాగింపు మాత్రమే.

      Delete
  3. నూటికి నూరు శాతం మీరు చెప్పినది సరిగ్గా ఉన్నది. హైదరాబాదు మూలంగా ఎన్ని పల్లెలు తాళాలు పడ్డాయి, ఎన్నో పట్టణాలు పాడుబడ్డాయి, బాబు గారు చేసిన పనికి స్వర్న ఆంధ్ర ప్రదేశ్ రాలేదు కాని స్వర్న హైదరాబాదు తయారైంది. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నొ పట్టణాల అభివృద్ధి గత రెండు దశాబ్దాలుగా ఆగిపోయింది. తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని కోస్తాలోని కొన్ని పట్టణాలు నగరాలుగా తయారైనాయి. ఇప్పటికైనా జనం కళ్ళు తెరిచి తమ ఊరిని తాము బాగు చేసుకొన్నట్లైతే ఎవరికీ ఏ హైదరాబాదు అఖర్లేదు. అబివృద్ధి కేంద్రికరణ వలన వచ్చిన వికృత స్వరూపమే హైదరాబాదు.

    ReplyDelete