Friday, January 18, 2013

తెలుగు సినిమాలకు ఈ కథల దరిద్రం ఏమిటి?

రాజమౌళి 'మర్యాదరామన్న' సినిమా గురించి మొన్న రాశాను. ఆ తర్వాత తెలిసింది, ఆ సినిమా 1923లో వచ్చిన 'అవర్ హాస్పిటాలిటీ' అనే ఆంగ్ల సినిమాకు అనుసరణ అని! కొంత నిరాశ చెందాను. అయితే, అనుసరణ సినిమా అయినా మూల కథాంశాన్ని సొంతం చేసుకుని తెలుగు ప్రేక్షకులను హత్తుకునేలా ఉత్కంఠభరితంగా కథను మలచడంలో రాజమౌళి చూపిన ప్రతిభను అంగీకరించవలసిందే.

'మర్యాదరామన్న' అనుసరణ సినిమా అని తెలిసిన తర్వాత నాకు ఎదురైన ప్రశ్న ఏమిటంటే, తెలుగులో ఇంత మంచి దర్శకులు ఉండి కూడా అనుసరణ సినిమాల వైపు ఎందుకు మొగ్గుతున్నారని? ఇంత గొప్ప ప్రతిభ కూడా సొంత కథను ఎందుకు సృష్టించలేక పోతోంది? తెలుగు సినిమాను కథాదారిద్ర్యం ఎందుకు వెంటాడుతోంది? ఈ దారిద్ర్యం మొదటినుంచీ ఉన్నదేనా? లేక మధ్యలో వచ్చిందా? సినీరంగ నిపుణులు ఎవరైనా దీనిమీద పరిశోధన చేశారా? 

అనుసరణ ఆరోపణ సినిమాల మీద తరచు వస్తూనే ఉంటుంది. అయితే, సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు అవి దేనికో అనుసరణ అన్న సంగతీ అంతే తరచుగా మరచిపోతుంటాం. ఏదో ఒక సినిమాకు అనుసరణ కావడం మనలో చాలామంది దృష్టికి చాలా మామూలు విషయం లానూ, ఏమంత తప్పు పట్టనవసరం లేనిదిగానూ కనిపిస్తుంది. కారణమేమిటి? మనదైన కథను మనం సృష్టించుకోలేమనీ, ఎరువు కథలే మనకు గతి అనీ అటు సినిమాలు తీసే వారూ, ఇటు సినిమాలు చూసే వారూ నిర్ణయానికి వచ్చేశారా?

తెలుగులో వచ్చిన ఏ సినిమా ఏ సినిమాకు అనుసరణో తెలుసుకోవడం ఆసక్తికరమే కాదు; విజ్ఞానదాయకమూ, మార్గదర్శకమూ కూడా. అనుసరణ సినిమాల గురించి తెలుసుకున్నప్పుడైనా సొంత కథ మీద కొందరిలోనైనా పట్టుదల పెరిగే అవకాశముంటుంది.  కనీసం సినీ పాత్రికేయులెవరైనా అనుసరణ సినిమాల వివరాలను  పుస్తకరూపంలో అందించే ప్రయత్నం చేశారా? ఇప్పటికే ఎవరైనా చేసి ఉంటే సరే, చేయకపోతే చేయడం చాలా అవసరం. తెలుగు సినిమా చరిత్రలో అది కూడా ఒక ముఖ్య అధ్యాయం కావలసిన అంశం. నన్నడిగితే తెలుగు సినిమా పాటల విషయంలో కూడా అలాంటి ప్రయత్నం జరగాలంటాను. హిందీ సినిమా పాటలు వింటున్నప్పుడు వాటిలో అనేక తెలుగు సినిమా పాటలు ధ్వనిస్తూ ఉండడం చాలామంది  గమనించి ఉంటారు.  ఎవరైనా తెలుగు సినిమా పాటల అనుసరణ చరిత్రకు పుస్తకరూపం ఇచ్చారా?  

ఇంతకీ  తెలుగు సినిమా కథాదారిద్ర్యానికి కారణం ఏమిటి? లోతుకు వెళ్ళిన కొద్దీ ఈ దారిద్ర్యం కేవలం సినిమాలకే పరిమితమైంది కాక అనేక అంశాలకు విస్తరించి కనిపిస్తుంది. తెలుగు జీవితంలోనే కథ లోపించిందా? లేక తెలుగు జీవితంలోని కథను పట్టుకోగల చూపు లోపించిందా?  అదీ కాకపోతే తెలుగువారికి కొత్త కథ అవసరం లేదా? ఇవేకాక  వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు...

ఆలోచించవలసిన ప్రశ్నలే. మరి మీరేమంటారు? 


2 comments:

  1. నిజమే సార్ తెలుగు వాళ్ళలో ఆ Depth తక్కువగా కనపడుతుంది అన్ని రంగాలలో
    మనవాళ్ళుత్తి వెధవాయలోయ్ అని గిరీశం అననే అన్నాడు
    నా అనుమానం ప్రతిభ లేకపోవడం కాదు. దాన్ని గుర్తించే సంస్కృతి లేదేమో మన సమాజంలో .
    లేకుంటే గుర్తించి అణగదొక్కే సంస్కృతే కారణమేమో.
    అన్నట్టు ప్రతిభ గుర్తింపుల విషయాలు వచ్చాయి కనుక మీరు కృష్ణ గారి కూతురు తీసిన షో సినిమా చూశారా సార్.
    సినిమాల మీద కూడా అభిమానం ఉన్నదని రాశారు కనుక ‘సత్యమే శివం’ అనే సినిమాని చూడండి కమలహాసన్, మాధవన్ నటించారు.

    ReplyDelete
    Replies
    1. నిజమే సీతారాంరెడ్డిగారూ, తెలుగువారిలో depth తక్కువగానే కనబడుతుంది. అయితే అందుకు కారణం నిజంగానే depth లేకపోవడమా, లేక ఇతర కారణాలు ఏవైనా దానికి అడ్డుపడుతున్నాయా అనేది చర్చనీయం. నా ఉద్దేశంలో తెలుగు సినీ పరిశ్రమకూ, బయటి intellectual literary and art life కీ మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. ఉభయుల మధ్యా ఆదాన ప్రదానాలు లేవు. ఒకప్పుడు ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉండేదనుకుంటాను. గతంలో కొడవటిగంటి కుటుంబరావు లాంటి సీరియెస్ రచయిత సినిమా సమీక్షలు చేసేవారంటే, ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది.
      మీరన్న షో సినిమా నేను చూడలేదు కానీ 'సత్యమే శివం' చూశాను. చాలా మంచి సినిమా.

      Delete