Sunday, January 20, 2013

రాహుల్ గాంధీ ప్రమోషన్:2

నిజానికి కుటుంబ పాలన  అనేది కాంగ్రెస్ కే పరిమితం కాదు. కాంగ్రెస్ లోనూ నెహ్రూ-గాంధీ కుటుంబం ఒక్కదానికే పరిమితం కాదు. కాంగ్రెస్ లో పాలక కుటుంబాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కుటుంబపాలనను ఆక్షేపిస్తూ, తమదే అసలు సిసలు ప్రజాస్వామిక పార్టీ అని చెప్పుకునే బీజేపీలోనూ పాలక కుటుంబాలు, వారసత్వ రాజకీయాలూ ఉన్నాయి. విజయరాజే సిందియా కుటుంబం ఒక ఉదాహరణ. బీజేపీలో వారసులను రాజకీయాలలోకి తీసుకురారాదన్న నియమం ఏమీ లేదు. అటల్ బిహారీ వాజ్ పేయికి సంతానమే ఉండి, రాజకీయాలపై ఆసక్తి చూపితే వద్దని అంటారని చెప్పలేం. ఒడిస్సాలో బీజేడీ అధినేత నవీన్ పట్నాయిక్ రూపంలో బిజూ పట్నాయిక్ వారసత్వమే అధికారం నెరపుతోంది. బీజేడీ గతంలో బీజేపీకి మిత్రపక్షం. అలాగే మరో మిత్రపక్షమైన శివసేనలో వారసత్వ రాజకీయాలే చీలికను తెచ్చాయి. జమ్ము-కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా వారసులే అధికారచక్రం తిప్పుతున్నారు. హర్యానాలో పాలక వారసత్వం దేవీలాల్ నుంచి ఆయన కొడుకు ఓం ప్రకాశ్ చౌతాలకు ఎలా బదిలీ అయిందో చూశాం. ఇప్పుడు చౌతాలాకూ వారసులు అందివచ్చారు. ద్రవిడ భూమిలో కరుణానిధి ఈ మధ్యనే తన అధికార ఆస్తిని స్టాలిన్ కు ఇస్తూ వీలునామా రాశారు. చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్ యాదవ్ మరికొన్ని ఉదాహరణలు.  తాజాగా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ రాజకీయ వారసుడిగా ముందుకు వస్తున్నారు.

మిగిలిన పార్టీలకూ, కాంగ్రెస్ కూ మధ్య ఒక తేడా మాత్రం ఉంది. కాంగ్రెస్ 125 ఏళ్ళకు పైబడిన పార్టీ కనుక ఆ పార్టీలో  పాలక కుటుంబాల సంఖ్య సహజంగానే ఎక్కువ ఉంటుంది. ఆ పార్టీలో పాలనాధికారం కొడుకులు, కూతుళ్లనూ, మనవలనూ కూడా దాటి మునిమనవల వరకూ చేరుకుని ఉండచ్చు. బీజేపీ తదితర పార్టీలకు అంత చరిత్ర లేదు కనుక ప్రస్తుతానికి కొడుకులు, కూతుళ్ళు, మనవల వరకు రాజకీయ వారసత్వం చేరుకుని ఉండచ్చు. అలాగే కాంగ్రెస్ తో పోల్చితే కాంగ్రెసేతర పార్టీలలో పాలక కుటుంబాల సంఖ్య తక్కువైతే కావచ్చు. మొత్తానికి తేడా రాశిలోనే కానీ వాసిలో కాదు.  ఒకవేళ ముందు ముందు కూడా వారసత్వ రాజకీయాలను జనం సహించగలిగే పరిస్థితి ఉండి; రాజకీయాల కంటే ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ వృత్తులు/ఆదాయమార్గాలు ఏవీ అందుబాటులోకి వచ్చి ఉండకపోతే కాంగ్రెసేతర పార్టీలలో కూడా పాలక కుటుంబాల సంఖ్య పెరిగి తీరుతుందనడంలో సందేహం లేదు.

అయినా సరే, 'పార్టీలలో వారసత్వ రాజకీయాలు ఉండడం వేరు, కాంగ్రెస్ లోలా అత్యున్నత అధికారం ఒకే కుటుంబ వారసత్వంగా ఉండడం వే'రని ఎవరైనా వాదిస్తే వారి తర్కప్రావీణ్యానికి ఒక నమస్కారం చేయడం కన్నా చేయగలిగింది లేదు.

ఈవిధంగా నిష్పాక్షికంగా  చూసినప్పుడు భారతీయ రాజకీయ సంస్కృతిలో కుటుంబపాలనను ప్రత్యేకించి ఒక పార్టీకే ఆపాదించి ఆడిపోసుకునే అవకాశం లేకపోయినా; రాహుల్ గాంధీ విషయంలో ఆ అంశం భూతద్దంలో కనిపించడానికి వేరే కారణాలు ఉన్నాయి. అవి ప్రధానంగా రాహుల్ వ్యక్తిగత ప్రవర్తనాసరళికి సంబంధించినవి.

రాహుల్ గాంధీ, నాకు గుర్తున్నంతవరకు 2004 నుంచీ రాజకీయంగా వార్తలలో ఉంటున్నారు. అప్పట్లో ఆయన భారతదేశ సామాజిక, రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారనీ; విశ్వవిద్యాలయ పండితులతో భేటీ అవుతున్నారనీ వార్తలు వచ్చాయి. భవిష్య నాయకుడిగా తర్ఫీదు అవుతున్నారనే అభిప్రాయం చాలామందికి కలిగింది. ఇప్పుడు 2013లో నిలబడి ఒకసారి వెనుదిరిగి చూస్తే, రాజకీయ శిక్షణకు ఆయన చాలా ఎక్కువ కాలం తీసుకున్నారనే కాక ఇప్పటికీ శిక్షణ పూర్తి కాలేదనే అభిప్రాయమే కలుగుతుంది. ఆయన ఇప్పటికి రెండు పర్యాయాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంట్ చర్చల్లో ఆయన చురుగ్గా పాల్గొన్న సందర్భం కానీ, గుర్తు పెట్టుకోదగిన ప్రసంగం చేసిన సందర్భం కానీ కనబడవు. ఇటీవలి ఢిల్లీ మానభంగ ఘటనపై ఆయన మాట్లాడకపోవడం, నిరసన ప్రదర్శన జరుపుతున్న యువతతో ఒక కీలక యువనేతగా కనెక్ట్ కాకపోవడం విమర్శలను ఆకర్షించాయి. గత కొన్ని ఎన్నికలుగా ఆయన ఉత్తరప్రదేశ్ పై దృష్టిని కేంద్రీకరించడం తెలిసినదే. అయినా చెప్పుకోదగిన ఫలితాలు సాధించలేదన్న విమర్సా ఆయన మీద ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారని అనడమే కానీ అవి ఎలాంటివో తెలియదు. అవి అంతగా  ప్రచారంలో లేవు. 2004 నుంచీ ఇప్పటి వరకూ జరుగుతున్నది రాహుల్ అనే యువనేతకు మెరుగులు దిద్ది షో కేస్ లో పెట్టే ప్రయత్నం మాత్రమే. అది ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందో తెలియదు. ఈ పాటికే స్వయంప్రకాశాన్ని సంతరించుకుని రాజకీయంగా తన ఉనికిని రాహుల్ గట్టిగా చాటుకుని ఉంటే, కుటుంబపాలన కోణం వెనకంజ వేసి ఉండేది. కానీ స్వయంప్రకాశాన్ని తెచ్చుకోడానికే ఆయన అసాధారణ వ్యవధి తీసుకుంటున్నారు. అదీ సమస్య!

మొత్తం మీద పైన చెప్పుకున్నట్టు, పట్టణ ప్రాంత మధ్యతరగతికీ, యువతకూ పార్టీ దగ్గర కావాలన్న సోనియా; అంతలోనే పాత పద్ధతులకు మళ్ళిపోయి  రాహుల్ ను అధినాయక స్థానం దిశగా నడిపించడం ద్వారా వాస్తవానికి ఆ వర్గాలను దూరం చేసుకుంటున్నారా అనిపిస్తుంది. రాహుల్ కు మరికొంత సమయమిచ్చి, తగినంత అనుభవమూ, ఇమేజ్ ఉండి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని  మరొక యువనేతను ఎవరినైనా ఈలోపున  ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో!?

గోడమీది రాతల్ని చదవడంలో రాజకీయ పార్టీలు అన్నీ ఆలస్యం చేస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ మరింత ఎక్కువ ఆలస్యం చేస్తుంది. కాంగ్రెస్-యూపీయే నాయకత్వం క్షేత్రవాస్తవికతకు దూరమవుతున్న సంగతి 2009 ఎన్నికల తర్వాత మరింత స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. వివిధ అవినీతి ఆరోపణలపై దాని స్పందనే అందుకు ఒక నిదర్శనం. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్న నేటి యువత పూర్తిగా భిన్నమైన యువత అన్న సంగతి అన్నా హాజరే ఉద్యమ సందర్భంలోనూ, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కు వ్యక్తమైన మద్దతు సందర్భంలోనూ మరింత బాగా అర్థమైంది.  ఢిల్లీ ఘటనతో కానీ ఆ సంగతి కాంగ్రెస్ కు తలకెక్కలేదు.

కాంగ్రెస్ గుర్తించని అంశం మరొకటి కూడా ఉంది. నేటి యువత అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై బాంబు పేలుళ్ళ వంటి ఘటనల అనంతరకాలానికి చెందిన యువత కూడా. బీజేపీ ఈ పరిణామాన్ని గమనించో గమనించకో తెలియదు కానీ, మూడో కంటికి తెలియనంత నిశ్శబ్దంగా అయోధ్యనుంచి అభివృద్ధికి మళ్ళిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడి ఒక్కరే అభివృద్ధికి కస్టోడియన్ లా ప్రచారం పొందుతున్నారు. నేటి విద్యావంత మధ్యతరగతి యువతను మోడీయే ఎక్కువ ఆకట్టుకుంటే ఆశ్చర్యంలేదు. నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, జగమెరిగిన ఆర్థికవేత్త మన్ మోహన్ సింగ్ పదేళ్లుగా కేంద్రంలో అత్యున్నత అధికారపీఠం మీద ఉన్నారు. అయినాసరే, తన విధానాల ఫలితంగా చెప్పదగిన అభివృద్ధి ని మోడీ తన నినాదంగా చేసుకుంటుంటే మన్ మోహన్ మౌన మోహన్ లా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు. అదే తమాషా!

                                                                                                                        (అయిపోయింది)

తా.క:  'ది హిందూ' దినపత్రిక కొన్ని రోజుల క్రితం రాహుల్ ను 'యువరాజ్' గా సంబోధించడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ రోజు(20 జనవరి) మరోసారి అలాగే సంబోధించడం చూసి మరింత ఆశ్చర్యపోయాను. ఇంకో పత్రికైతే అనుకోవచ్చు...కానీ హిందూ లాంటి పత్రిక! అందులో professional maturity లోపించిన సంగతిని సంపాదకుల దృష్టికి ఎవరూ తేలేదా ?





No comments:

Post a Comment