Wednesday, January 9, 2013

హైదరాబాద్ కాకపోతే బెంగళూరు!...రెండో రాజధాని అవసరమే

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయడం వల్ల కలిగే లాభనష్టాలను విశ్లేషిస్తూ ఈ రోజు(9-1-13)ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్తావ్యాసం నన్ను ఆకర్షించింది. అయితే, అది 'తెలంగాణ' నేపథ్యంలో రాసినది. అందులోకి వెళ్ళను. దక్షిణభారతంలో రెండో రాజధాని అవసరమా, కాదా  అన్న అంశానికే పరిమితమవుతాను.

నా ఉద్దేశంలో దక్షిణాదిలో ఒక జాతీయ రాజధాని ఉండడం అవసరం. ఉత్తర,దక్షిణాలకు మధ్యలో ఉంది కనుక అందుకు హైదరాబాద్ ఎక్కువ అనుకూలం కావచ్చు. అది కాదనుకుంటే రెండో పక్షంగా బెంగళూరును, మూడో పక్షంగా చెన్నైని పరిశీలించవచ్చు.

దక్షిణాదిలో ఒక జాతీయ రాజధాని ఉండాలనడానికి నా కారణాలు ఇవీ:

1. రాజధాని నగరమంటే  ప్రభుత్వశాఖలు; మంత్రులు, అధికారుల నివాసాలు, దౌత్యకార్యాలయాలు వగైరాలకు వసతులు, హంగులు సమకూర్చే ఒక భౌగోళిక ప్రదేశం అనుకుంటారు.  రాజధాని అంటే రాజకీయాధికారం కేంద్రీకృతమయ్యే చోటని కూడా అనుకుంటారు. ఇవి నిజమే కానీ మరికొన్ని నిజాలు కూడా ఉన్నాయి. రాజధాని అనేది  భౌగోళికప్రదేశం మాత్రమే కాదు,  మానసిక ప్రదేశం కూడా.  ఇంకాస్త తేలికగా చెప్పాలంటే రాజధానికి దేహమే కాక ఆత్మ కూడా ఉంటుంది.  కనిపించే రూపమే కాక కనిపించని వ్యక్తిత్వం కూడా ఉంటుంది. రాజకీయ అధికారంతోపాటు, ఒక జాతికి లేదా ఒక జనసమూహానికి చెందిన సమకాలీన సాంస్కృతిక ధోరణులు, మేధో వ్యాసంగాలు, వైజ్ఞానిక సంస్థలు, మీడియా కూడా రాజధానిలో కేంద్రీకృతమై దానికి  ఆత్మను, వ్యక్తిత్వాన్ని కల్పిస్తుంటాయి. ఇవి దేశం మొత్తాన్నే కాక, తమ దగ్గరలో ఉన్న రాజకీయాధికారాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన స్థితిలో ఉంటాయి. రాజకీయాధికారం విధాన నిర్ణయాలు చేయడానికి తోడ్పడే మేధో వనరులు వీటి ద్వారా కూడా అందుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని అనేది అధికార కేంద్రమే కాక ఆలోచనా కేంద్రం కూడా.

2. ఇటువంటి జాతీయ రాజధాని దేశం మొత్తానికి ఇప్పుడు ఢిల్లీ ఒక్కటే ఉంది. జాతీయ స్థాయినుంచి ఒకసారి దేశాన్ని చూడండి... భారతదేశం అంటే ఉత్తరభారతం మాత్రమే నన్న అభిప్రాయం మీకు కలిగితీరుతుంది. ఉత్తరభారతం  ప్రస్ఫుటంగా కనిపించే సింహం ముఖం లానూ, దక్షిణభారతం సన్నని తోక లానూ కనిపిస్తాయి. ఉత్తరభారతం వెలుగులో ఉన్నట్టు, దక్షిణభారతం చీకటి ఖండంలానూ కనిపిస్తాయి(ఈశాన్య భారతానికి కూడా ఈ తేడా  వర్తిస్తుంది కానీ ప్రస్తుతానికి దక్షిణభారతం గురించే మాట్లాడుకుందాం).  ఎంతో వైవిధ్యం ఉన్న ఈ సువిశాలభారతదేశం మొత్తాన్ని శాసించే జాతీయరాజకీయాధికారం మొత్తం ఢిల్లీలోనే కేంద్రీకృతమైంది. దానితోపాటే జాతీయరాజకీయ కార్యకలాపాలు, విధాన కల్పన వనరులు, మీడియా సహా అన్నీ ఢిల్లీలోనే కేంద్రీకృతమయ్యాయి. ఢిల్లీలో పాతుకుపోయినవాళ్ళే దేశచక్రం తిప్పుతుంటారు. దేశం అజెండాను వాళ్ళే రూపొందిస్తుంటారు. దేశం నాడి వాళ్ళకే బాగా తెలుస్తుంది. జాతీయస్థాయి అవగాహనే కాక, జాతీయ నుడికారం(నేషనల్ ఇడియం)పై పట్టు వాళ్ళకే ఉంటుంది. దక్షిణాదికి వస్తున్నకొద్దీ ఇది పలచబడి పోతుంది. ఏ విషయంలోనైనా సరే ఢిల్లీ గుండె చప్పుడు దక్షిణాది గుండెల్లో ధ్వనించడానికి ఎన్నో 'వింధ్యపర్వతాలు' అడ్డుపడుతుంటాయి. దక్షిణాది నాయకులు ఉత్తరాది నాయకుల వెనుక తద్దినం పెట్టేవాడి తమ్ముడి పాత్రనే సాధారణంగా పోషిస్తుంటారు తప్ప జాతీయ అజెండా కూర్పులో చురుకైన భాగస్వాములు కాలేరు. అలాగే దక్షిణాది ప్రజలు కూడా.

3. మీడియా గురించే చూద్దాం. జాతీయ మీడియాలో ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలు ఫోకస్ అయినంతగా దక్షిణ భారత రాష్ట్రాలు కావు. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలలోని మామూలు ఘటనలు కూడా జాతీయ మీడియా లో విశేష వార్తలు అవుతుంటాయి. దక్షిణభారత రాష్ట్రాలలోని చెప్పుకోదగిన ఘటనలు కూడా సింగిల్ కాలం వార్తలవుతుంటాయి. ఎప్పుడోకానీ అక్బరుద్దీన్ వ్యవహారం లాంటివి జాతీయమీడియాలో ప్రాధాన్యం పొందవు.  చిన్న రాష్ట్రమైన ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ జాతీయస్థాయి కల ఢిల్లీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఫోకస్ అయినంతగా యూపీ లాంటి  పెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి ఫోకస్ అయ్యే అవకాశమే లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయం చెప్పనే అవసరం లేదు. సామీప్యం కూడా ఇందుకు ఒక కారణం. ఉదాహరణకు, మన రాష్ట్రంలో హైదరాబాద్ లోనే మీడియా కేంద్రీకృతం అయినందువల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితిని గమనించండి. ఇందులో హైదరాబాద్, దాని చుట్టుపక్కల వారే ఎక్కువ ఫోకస్ అవుతారు. వారి గొంతే గట్టిగా వినిపిస్తుంది. చిన్న నాయకులకు కూడా పెద్ద  ప్రచారం లభిస్తుంది. రాష్ట్రానికి ఆ చివర ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ నేతల గొంతు కూడా మీడియాలో వినిపించదు. ఇదే పరిస్థితిని ఢిల్లీలోని జాతీయమీడియాకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్వయించి చూడండి.

4. ఉత్తర/దక్షిణాల మధ్య అందరూ తేలిగ్గా గుర్తించగలిగిన ఒక వ్యత్యాసం, దేశ ప్రధానమంత్రిత్వం  ఉత్తరాదివారి అప్రకటిత హక్కుగా చలామణి అవుతుండడం.  ఈ అరవై ఏడేళ్ళ స్వతంత్ర ప్రజాస్వామ్య భారతంలో దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అయి అయిదేళ్లూ అధికారంలో ఉండగలిగింది పీవీ నరసింహారావు ఒక్కరే(దక్షిణాది నుంచి రెండో ప్రధాని దేవెగౌడ గురించి పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు). అటువంటి పీవీ కి ఢిల్లీలో స్మృతి నిర్మాణం చేయకుండా హైదరాబాద్ కు తరిమేసిన దందా ఉత్తరాదివారిది. అయినా సరే, దక్షిణాది వారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం భారతదేశంలో వారి బలహీనమైన ఉనికికి నిదర్శనం.

5. కనుక ఉత్తర, దక్షిణాల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు తగ్గాలంటే, దక్షిణాదిన రెండో రాజధాని ఉండవలసిందే. అప్పుడే జాతీయ అజెండా రూపకల్పనలో చురుగ్గా పాల్గొనే అవకాశం దక్షిణాదివారికి కూడా లభిస్తుంది. దక్షిణాదివారి గొంతు జాతీయస్థాయిలో వినిపిస్తుంది. ఇంకో చిత్రం గమనించండి...విద్య, విజ్ఞానం, మానవాభివృద్ధి, పురోగమనం మొదలైన అనేక విషయాలలో ఎన్నో ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాది రాష్ట్రాలే మెరుగ్గా ఉంటాయి. కానీ ఎన్నో వెనుక బడిన రాష్ట్రాలు ఉన్న ఉత్తరాదిన దేశ రాజధాని ఉంది. ఫలితంగా ఆయా రంగాలలో  దక్షిణాది రాష్ట్రాల పురోగమన అనుభవాన్ని దేశం మొత్తం పంచుకునే అవకాశం లోపించింది. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడినప్పుడు ఆ అవకాశం కలుగుతుంది.

6. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. దక్షిణాదిన అఖిల భారత ప్రసిద్ధి కలిగిన విశ్వవిద్యాలయం ఒక్కటీ లేదు. ఇందుకు భిన్నంగా ఢిల్లీలో జేఎన్ యూ లాంటివి ఉన్నాయి. దేశానికి అవసరమైన థింక్ ట్యాంక్ జేఎన్ యూలోనే  తయారవుతుందని కూడా అంటారు. రాజధానిలో ఉండడమే అందుకు కారణం. దక్షిణాదిన రెండో రాజధాని ఏర్పడితే, అందుకు తగిన స్థాయిలో ఉన్నత విద్యాసంస్థలూ అభివృద్ధి చెందుతాయి.

7. దక్షిణాదిన రాజధాని అవతరిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల మధ్య రాకపోకలు అనూహ్యంగా పెరుగుతాయి. దక్షిణాది భాషల మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఒక భాషా సాహిత్యం ఇంకో భాషలోకి తర్జుమా అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సినిమా, నాటకం తదితర కళారూపాల మధ్య సామీప్యం, పరస్పర ప్రభావం ఇనుమడిస్తాయి. ఉత్తర, దక్షిణాల మధ్యా  సాన్నిహిత్యం పెరుగుతుంది.  కళా, భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆలోచనా  సమ్మేళనం ప్రజల ఆలోచనా సరళిపై ఆరోగ్యకరమైన ప్రభావం చూపుతుంది. సమైక్యతకు దోహదం చేస్తుంది.


2 comments:

  1. ఈ డిమాండ్ ఎప్పటినునుండో ఉన్నాదే.
    హైదరాబాద్ నే రెండో రాజధాని గా చేయాలని అందరు కోరుకుంటున్నారు.

    ReplyDelete
  2. This is totally uncalled for and our current capital is good enough take care of the whole country.

    ReplyDelete