Saturday, January 26, 2013

బురదలో 'పద్మా'లు

సినీ గాయని ఎస్. జానకి పద్మ అవార్డును తిరస్కరించడం ఒకందుకు ఆనందం కలిగించింది. అయితే అందుకు ఆమె చెప్పిన కారణాలలో ఒక కారణం ఆశ్చర్యం కలిగించింది. ఇంకో కారణం, 'అవును నిజమే కదా' అనిపింపజేసింది.

పద్మ అవార్డు కోసం తెరవెనుక ఎవరెవరు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తారో, వర్షపు చినుకుల కోసం చాతకపక్షుల్లా ఒక జీవితకాలం పాటు ఎలా ఎదురుచూస్తారో తెలుసు కనుక వచ్చిన అవార్డును తిరస్కరించడానికి ఎంతో తెగింపు కావాలి. ఇంతకాలానికి ఒకరైనా ఆ తెగువ చాటుకున్నారు కనుక ఆనందం.

ఇక ఆశ్చర్యం దేనికంటే, 'భారతరత్న' కంటే తక్కువ అవార్డు తీసుకోనని జానకిగారు అన్నందుకు! తన ప్రతిభ పట్ల ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసం ఉండడం అభినందనీయమే. హిందీ గాయని లతా మంగేష్కర్ కు భారతరత్న ఇచ్చారు కనుక నాకు మాత్రం ఎందుకు ఇవ్వరనేది ఆమె ఉద్దేశమని తెలిసిపోతూనే ఉంది. ఇక్కడ ఆమె దక్షిణాది-ఉత్తరాది (లతా మంగేష్కర్ పశ్చిమ భారతీయురాలు కనుక హిందీ-హిందీయేతర అనుకుందాం)తేడా తీసుకురావడం మాత్రం కొంతవరకు సబబుగానే కనిపిస్తుంది.

ఇదే సమయంలో మరికొన్ని నిజాలూ దృష్టిలో పెట్టుకోవాలి. జానకి గారి కంటే ఎక్కువ పాటలు పాడిన మరో ప్రతిభావంత గాయని పీ.సుశీల గారికి కూడా పద్మ భూషణే ఇచ్చారు. ఆమె స్వీకరించారు. జానకిగారూ, సుశీల గారేకాక పద్మ అవార్డుల తీరును గమనించేవారంతా గుర్తించవలసిన మరో విచిత్రం కూడా ఉంది. ఎందరో నేపథ్య గాయకుల, గాయనీమణుల ప్రతిభకు సానపెట్టి శ్రోతలకు పరిచయం చేసిన సినీ సంగీత దర్శక దిగ్గజాలు చాలామందికి పద్మ అవార్డులు వచ్చినట్టు లేదు. కనీసం మనకు తెలిసిన గొప్ప ఉదాహరణ సాలూరు రాజేశ్వరరావుగారు. 1999 వరకు జీవించిన ఆయనకు పద్మ భూషణ్ కాదు సరికదా పద్మశ్రీ కూడా రాలేదు.

ఇక బాపూ గారు ఉన్నారు. ఆయన ప్రముఖ చిత్రకారుడే కాక సినీ దర్శకుడు కూడా. ఆయనకు పద్మ అవార్డు ఇంతవరకు రాకపోవడం కిందటి సంవత్సరం చర్చనీయం అయింది. 'సాక్షి' పత్రిక దానిపై సంపాదకీయం కూడా రాసింది. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఆయన పద్మశ్రీమంతులయ్యారు. చిత్రం ఏమిటంటే ఆయన చిత్రిక పట్టి నటులుగా తీర్చి దిద్దిన నటశిల్పాలు, నటశేఖరులలో కొందరు చాలా కాలం క్రితమే పద్మశ్రీలు, పద్మభూషణ్ లు అయ్యారు.

పౌరాణిక పాత్రల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఎన్టీఆర్ వంటివారు పద్మ అవార్డుకు ఎంతైనా అర్హులే. అయితే,  ఆ పౌరాణిక పాత్రలకు రూపకల్పన చేసి చిరస్మరణీయం చేసిన కేవీ రెడ్డి,  కమలాకర కామేశ్వరరావు  లాంటి దర్శక రత్నాలకు నాకు తెలిసినంతవరకు  పద్మ అవార్డు రాలేదు(ఒక వేళ ఈ సమాచారం తప్పైతే విజ్ఞులు సవరించగలరు).

అంటే ఏమిటన్నమాట? తెరమీద కనిపించి, వినిపించేవారికీ; తెరవెనుక ప్రయత్నాలు చేసుకునేవారికే కానీ తెరవెనుక ప్రతిభావంతులకు  పద్మ అవార్డులు రావడం చాలా అరుదు.

వెలుగు కింద చీకటి ఉన్నట్టుగా, పద్మం కింద పంకం(అంటే బురద) ఉంటుంది. పోలిక ఎంత బాగా కుదిరిందో చూడండి.

ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేవన్నీ ఇలాగే ఉంటాయేమో! అర్హులకు ఇందిరమ్మ ఇళ్లూ రావు. పద్మ అవార్డులూ రావు.

అయినా తెలియక అడుగుతాను...బిరుదులూ, అవార్డులూ ఇచ్చే పని ప్రభుత్వానికి ఎందుకు? అంతకంటే చక్కబెట్టవలసిన ముఖ్యమైన పనులు ప్రభుత్వానికి ఎన్ని లేవు?!


7 comments:

  1. జానకిగారికి తమిళనాడు కోటాలోనే పద్మ అవార్డ్ వచ్చినట్టు తెలుసు కానీ(ఆమె తిరస్కరించారనుకోండి)బాపూగారికి ఆంధ్రప్రదేశ్ కోటాలో వచ్చిందని మొదట్లో అనుకున్నాను.బహుశా కిందటి సంవత్సరం వచ్చిన విమర్శలకు ప్రభుత్వం స్పందించి ఈ ఏడాది సిఫార్సు చేసి ఉంటుందనుకున్నాను. కానీ ఈ రోజు హిందూ చూసిన తర్వాత బాపూగారికి కూడా తమిళనాడు కోటాలోనే వచ్చినట్టు తెలిసింది. పద్మా అవార్డుల మొత్తం జాబితా తిరగేస్తే తమిళనాడు కోటాలో చాలామంది తెలుగువారికి పద్మ అవార్డులు వచ్చినట్టు తెలుస్తుంది. త్యాగరాజస్వామికి ఇంత ప్రసిద్ధి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతోంది. ఆయన తమిళనాడులో ఉండడం వల్లనే అది సాధ్యమై ఉంటుంది. తెలుగువాడికి గుర్తింపు, గౌరవం లభించాలంటే అతడు/ఆమె తెలుగుదేశానికి బయట ఉండడం ఒక అప్రకటితమైన అర్హత అనుకోవాలా?!

    ReplyDelete
  2. > కానీ ఈ రోజు హిందూ చూసిన తర్వాత బాపూగారికి కూడా తమిళనాడు కోటాలోనే వచ్చినట్టు తెలిసింది.

    హిందూలోని ఆ వార్త linkను ఇస్తారా?

    నమస్తే.

    ReplyDelete
    Replies
    1. హిందూ, 29 జనవరి, హైదరాబాద్ ఎడిషన్, మెట్రోప్లస్ మొదటి పేజీలో ఈ వ్యాఖ్య వచ్చింది.
      "The announcement of padma awards evoked mixed emotions in the Telugu film industry. While there was much joy at the announcement of Ramanaidu's name for Padma Bhushan, feeling of embarrassment prevailed when it came to be known that Bapu was given Padma Shri from Tamil Nadu quota."

      Delete
    2. జాబితాలో (http://www.mha.nic.in/pdfs/Padma(E)2013.pdf) "State/Domicile" తమిళనాడు అని ఉంది. అది వారి అడ్రస్సు ప్రకారం ఉండొచ్చు కదా?
      నేను చదివినవాటి ప్రకారం, బాపు పేరుని "పద్మభూషణ్"కై ఆంధ్రప్రదేశ్‍ ప్రభుత్వం ప్రతిపాదించింది.
      http://articles.timesofindia.indiatimes.com/2012-12-04/news-interviews/35593664_1_bapu-padma-bhushan-award-d-ramanaidu
      http://in.movies.yahoo.com/news/veteran-southern-producer-d-rama-naidu-gets-padma-160602395.html

      Delete
    3. అవార్డుల వార్త వచ్చిన రోజున జానకిగారి విషయంలో తమిళనాడు కోటా అని స్పష్టంగా రాశారు. బాపూ గారి విషయంలో ఏ కోటా కిందో రాయకపోవడంతో ఏ.పీ కోటాలోనే ఇచ్చారనుకున్నాను. కానీ హిందూ వ్యాఖ్య చూశాక అదే authentic కావచ్చుననిపించింది. మీ సమాచారమే కరెక్ట్ కానూ వచ్చు. ఏమైనా, తెలుగువారు చాలామందికి తమిళనాడు కోటాలోనే పద్మ అవార్డులు వచ్చాయనీ, ఏ.పీ ప్రభుత్వం విస్మరించిందనే విమర్శ చాలా కాలంగా ఉంది. నేను విన్నంతవరకు రాష్ట్రాల సిఫార్సును బట్టే, ఆ రాష్ట్రం కోటాలో అవార్డులు ప్రకటిస్తారు తప్ప అడ్రస్ కు సంబంధం లేదు.

      Delete
    4. USA, UK, Japan లకు చెందిన కొంతమంది ఆజాబితాలో ఉన్నారు. ఆ దేశాలకు "కోటా" ఉండదనుకొంటాను - అందువల్లనే ఆ కాలమ్‍ అడ్రస్సుకు సంబంధించినది అనటం.
      ఈ అవార్డులకు రాష్ట్ర "కోటా" ఉందని తెలీదు - http://en.wikipedia.org/wiki/Indian_honours_system
      (It is the usual practice is to invite recommendations every year from all State/UT Governments, Ministries/Departments of the Government of India, Bharat Ratna and Padma Vibhushan awardees and Institutes of Excellence by 1 October. Recommendations received from them and also from other sources like Ministers, Chief Ministers/Governors of State, Members of Parliament, as also private individuals, bodies etc., are placed before the Padma Awards Committee. The Awards Committee is constituted by the Prime Minister every year)

      --
      సెలవ్‍ - నమస్తే.

      Delete
    5. 'కోటా' అనే మాట wrong word అయితే కావచ్చు. లేదా ఒక అనధికారిక అవగాహన కావచ్చు. మీడియా చాలాకాలంగా ఆ మాట వాడుతోంది. మొత్తానికి రాష్ట్రప్రభుత్వాలు కూడా సిఫార్సు చేస్తాయి. అంతేకాదు, కేంద్రాన్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ప్రభుత్వాలకే ఉంటుంది కానీ వ్యక్తులకు, సంస్థలకు ఉండదు. అంతిమ నిర్ణయాధికారం కేంద్రానికే ఉంటుంది. భారత్-అమెరికా అణు ఒప్పందం జరగడంలో కొంత పాత్ర నిర్వహించిన వివాదాస్పద హోటళ్ళ యజమాని సంత్ సింగ్ చత్వాల్ కు మన్మోహన్ ప్రభుత్వం; వాజ్ పేయి మోకాలికి శస్త్రచికిత్స జరిపిన చిత్తరంజన్ సింగ్ రణవత్ కు ఎన్డీయే ప్రభుత్వం పద్మభూషణ్ ఇవ్వడం వివాదాస్పదమయ్యాయి. 1996లో అప్పటి ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కమిటీ పురస్కృతుల ఎంపికలో పాటించవలసిన ప్రమాణాలను నిర్దేశించింది. ఎంపికలో జాగ్రత్త పాటించమని 2004లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రధాని వాజ్ పేయికి లేఖ రాశారు. పద్మ అవార్డుల ఎంపికలోనే కాదు, సాహిత్య అకాడెమీ వగైరా సంస్థల అవార్డుల ఎంపికలో కూడా పారదర్శకత ఉండదు. ఇప్పుడిప్పుడు ఆర్.టీ.ఐ పుణ్యమా అని ఎంపిక ప్రక్రియ గురించిన విషయాలు కొంతవరకు వెలుగు చూస్తున్నాయి.

      Delete