Tuesday, January 29, 2013

తెలుగులో తొలి నవల ఏది?

(ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతిగారు ఒక బ్లాగులో కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖరచరిత్రము గురించి రాసిన వ్యాసం చూశాక(23 జనవరి 2013) 2008లో 'సాక్షి'లో నేను రాసిన  వ్యాసాన్ని పోస్ట్ చేయాలనిపించింది. కొన్ని సవరణలతో రెండు భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను)

'కామమ్మ మొగుడంటే కామోసనుకున్నా'నని సామెత. తొలి తెలుగు నవల ఏదన్న వివాదంలోకి ఈమధ్య అనుకోకుండా తలదూర్చినప్పుడు ఈ సామెత గుర్తొచ్చింది. తను రచించిన 'రాజశేఖరచరిత్రము'ను 'వచన ప్రబంధము'గా పేర్కొన్న కందుకూరి వీరేశలింగం, 'తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితి'నని చెప్పుకున్నారు. ఇంకేముంది? ఆ తర్వాతి కాలపు పండితులందరూ ఆ మాటను వేదవాక్యంగా తీసుకున్నారు. అలనాటి కట్టమంచి రామలింగారెడ్డి మొదలుకుని, కిందటి సంవత్సరం(2007) 'నూరేళ్ళ తెలుగు నవల' అనే పుస్తకాన్ని వెలువరించిన సహవాసి వరకూ అందరూ రాజశేఖరచరిత్రమునే తొలి తెలుగు నవల అన్నారు. లోతుల్లోకి వెడితే, సత్యశోధన దృష్టి కన్నా వీరేశలింగంపై భక్తి గౌరవాలే పరిశోధకులను ఎక్కువ ప్రభావితం చేశాయనిపిస్తుంది.

రాజశేఖరచరిత్రము 1878లో వెలువడితే, నరహరి గోపాలకృష్ణమచెట్టి రచించిన 'శ్రీరంగరాజ చరిత్ర' 1872లో వెలువడింది. గోపాలకృష్ణమచెట్టి వీరేశలింగం అంత ప్రసిద్ధుడు కాకపోయినా కొంత చరిత్ర ఉన్నవారే. ఆయన 1832లో నేటి కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జన్మించారు. సంస్కృతం, తెలుగు, తమిళం, ఆంగ్లాలలో పండితుడిగా గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా ఉద్యోగజీవితం ప్రారంభించి, తర్వాత కలెక్టరాఫీసులో గుమస్తాగా చేరి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. నిజాయితీ, సామర్థ్యం, సేవాభావన ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వెంకటగిరి, కొల్లాపురం సంస్థానాధీశులు ఉన్నతపదవి ఇవ్వజూపినా తిరస్కరించారు. ఆంగ్లంలో థామస్ స్ట్రెంజ్ రాసిన న్యాయశాస్త్ర క్రోడీకరణను పరవస్తు చిన్నయసూరితో కలసి తెలుగులోకి అనువదించారు.

ఆయన 'శ్రీరంగరాజ చరిత్ర' రాయడానికి ప్రేరణ -అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ మేయో బెంగాల్ గెజిట్లో చేసిన ఒక ప్రకటన. బెంగాలీ ప్రజల ఆచారవ్యవహారాలను తెలిపే కల్పిత రచన చేసినవారికి బహుమతి ఇస్తామని ఆ ప్రకటన సారాంశం. తెలుగువారి ఆచారవ్యవహారాలను తెలిపే ఉద్దేశంతో గోపాలకృష్ణమచెట్టి శ్రీరంగరాజచరిత్రను వెంటనే రాసి ప్రచురించారు. ఈ రచన వెలువడిన ఆరేళ్ళ తర్వాత తను వెలువరించిన రాజశేఖరచరిత్రమును వీరేశలింగం వచనప్రబంధం అంటే, గోపాలకృష్ణమ చెట్టి శ్రీరంగరాజచరిత్రను 'నవీన ప్రబంధం' అన్నారు. నిజానికి 'నవల' అనే ఊహకు వీరేశలింగం కన్నా గోపాలకృష్ణమ చెట్టే దగ్గరగా ఉన్నారని ఈ పేరునుబట్టి అర్థమవుతుంది.

ఎందుకంటే, లార్డ్ మేయో 'కల్పిత రచన' అన్నప్పుడు  'నవల' నే దృష్టిలో పెట్టుకుని ఉండచ్చు. అప్పటికి ఇంగ్లీష్ లో నవలా, నవల అనే పేరూ ప్రసిద్ధిలోకి వచ్చేశాయి. భారతీయులకు నవల అనే పేరు అప్పటికి అంతగా తెలియదు కనుక మేయో ఆ పేరు ఉపయోగించకుండా 'కల్పిత రచన' అని ఉండచ్చు. ఇంగ్లీష్ లో తొలి నవలగా గుర్తించిన రచన 1740లో, అంటే శ్రీరంగరాజచరిత్ర కన్నా 132 ఏళ్లక్రితం వెలువడింది. అది-శామ్యూల్ రిచర్డ్ సన్ (1689-1761) రాసిన 'పమేలా'. దానికే 'వర్చ్యూ రివార్డెడ్' అనే ఇంకో పేరు కూడా ఉంది. రిచర్డ్ సన్ రాసిన 'క్లారిస్సా' అనే మరో నవలను అతని మాస్టర్ పీస్ గా చెబుతారు. దానికి కూడా 'ది అడ్వెంచర్స్ ఆఫ్ ఏ యంగ్ లేడీ' అనే మరో పేరు ఉంది. నవలకు రెండు పేర్లు పెట్టే ఒరవడిని గోపాలకృష్ణమ, వీరేశలింగం ఇక్కడినుంచే తీసుకుని ఉండచ్చు. శ్రీరంగరాజచరిత్రకు 'సోనాబాయి పరిణయము', రాజశేఖరచరిత్రముకు 'వివేకచంద్రిక' అనే పేర్లు కూడా ఉన్నాయి.

శ్రీరంగరాజ చరిత్రలోని కథకూ, పమేలా నవలలోని కథకూ పోలికలు ఉండడం మరో విశేషం.  ఒక ధనిక కుటుంబంలో సేవకురాలిగా ఉన్న అమ్మాయిని యజమానురాలి కొడుకు పెళ్లి చేసుకోవడం 'పమేలా'లో కథ. శ్రీరంగరాజచరిత్రలో కథానాయకుడు,విద్యానగర యువరాజు అయిన రంగరాజు సోనాబాయి అనే లంబాడీ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. ఆమె లంబాడీ కాదనీ, రాజకన్య అనీ చివరిలో తెలుస్తుంది.

ఇంకా విశేషమేమిటంటే, గోపాలకృష్ణమచెట్టి, రిచర్డ్ సన్ ల మధ్య కూడా పోలికలు ఉండడం. అనంతరకాలంలో వస్తు, శిల్పాలలో ఎంతో అభివృద్ధి చెందిన నవల ముందు రిచర్డ్ సన్ రచనలు వెల వెల పోతాయనీ, అనవసరమైన వివరాలతో సుదీర్ఘంగా  సాగుతూ విసుగు పుట్టిస్తాయనీ ఆంగ్ల సాహిత్య చరిత్రకారులు అంటారు. అయితే, నవలా ప్రక్రియకు ఆద్యుడు అన్న గౌరవం మాత్రం రిచర్డ్ సన్ కే దక్కాలంటారు(An outline History of ENGLISH LITERATURE, By William Henry Hudson).  అలాగే, శ్రీరంగరాజచరిత్రతో పోల్చితే రాజశేఖరచరిత్రము నిస్సందేహంగా నాణ్యమైన రచనే. అనేక ప్రక్రియలలో అసంఖ్యాక రచనలు చేసిన వీరేశలింగం ముందు గోపాలకృష్ణమ చెట్టి రచయితగా వెల వెల పోయే మాటా నిజమే.

కానీ, రిచర్డ్ సన్ ను ఆంగ్ల నవలకు ఆద్యుడిగా గుర్తించి గౌరవించడంలో ఆంగ్ల సాహిత్యచరిత్రకారులు చారిత్రకదృష్టిని , నిష్పాక్షికతను, పెద్ద మనసును చాటుకున్నారు. గోపాలకృష్ణమచెట్టి విషయంలో ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు ఆ పని చేయలేకపోయారు.

అందువల్ల గోపాలకృష్ణమచెట్టికే కాదు, ఆంధ్రసాహిత్య చరిత్రకూ అన్యాయం జరిగింది.

వీరేశలింగం గారి అనుకరణలూ, అనుసరణల గురించి మరో పోస్ట్ లో...

1 comment:

  1. comparing srirangaraya charitra with virtue rewarded is excellent

    ReplyDelete