Monday, January 21, 2013

రాహుల్ ప్రసంగం-బీజేపీ స్పందన

ఎన్నికల ఫలితాల రోజున నరేంద్ర మోడీ' తన రాజకీయ గురువు కేశూభాయ్ పటేల్ ఇంటికి వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేయడం, తల్లిని దర్శించి ఆశీస్సులు తీసుకోవడం సామాన్యజనం అద్భుతంగా కనెక్ట్ అయ్యే దృశ్యాలనీ, ఇవి మానవ సంబంధాల విలువలను ప్రతిఫలిస్తాయనీ' సరిగ్గా నెలరోజుల క్రితం(21 డిసెంబర్ 2012), 'ప్రధానిగా మోడీ: ఒక విష్ ఫుల్ థింకింగ్' అనే పోస్ట్ లో రాశాను.

జైపూర్ చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ నూతన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అదే చేశారు. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు:

"నిన్న రాత్రి  మా అమ్మ నా గదిలోకి వచ్చారు. నా పక్కన కూర్చుని ఏడ్చారు. బలహీనులను సాధికారుల్ని చేయలేనప్పుడు అధికారం విషం లాంటి దన్నారు."

"నేను చిన్నప్పుడు బ్యాడ్ మింటన్ ఆడేవాణ్ణి. అది నాకు సమతుల్యత నేర్పింది. మా నాయనమ్మ ఇంట్లో ఆమెకు అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పోలీసులు నాకు బ్యాడ్ మింటన్ నేర్పారు. నాతో చాలా ఆత్మీయంగా ఉండేవారు. వారే ఒక రోజు మా నాయనమ్మను చంపారు. ఆ ఘటన నాలో సమతుల్యతను తీసుకుపోయింది."

"నాయనమ్మ హత్య జరిగిన రోజున నాన్న బెంగాల్ లో ఉన్నారు. వెంటనే తిరిగి వచ్చారు. నాన్న కంట తడి పెట్టడం అంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఆ రోజే మొదటిసారి నాన్న ఏడవడం చూశాను."

రాహుల్ అన్న ఈ మాటలు కూడా జనంతో అద్భుతంగా కనెక్ట్ అయ్యే మాటలు. ఆయన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో కొన్ని రాజకీయ ధ్వనులు మాత్రమే చేశారు. అది కూడా చాలా అరుదుగా. వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యుల ప్రస్తావనలు, భావోద్వేగపూరిత వ్యాఖ్యలు ఆయన నోట ఇంతవరకూ వినలేదు. సాధారణంగా నాయకుల నోట రాజకీయమైన మాటలు, పార్టీ/ప్రభుత్వ విధానాలు, ఆచరణశుద్ధి లేని ఉపదేశాలు వగైరాలు యాంత్రికంగా దొర్లిపోతుంటాయి. అవి జనంలో ఎలాంటి స్పందనా తీసుకురావు. నాయకులన్న తర్వాత జనానికి వారు వ్యక్తిగతంగా కూడా అర్థమవుతుండాలి. వారి ఆలోచనలు, విధానాలు, అభిప్రాయాలు, వాగ్దానాలే కాక: వారి హృదయమూ తెలుస్తూ ఉండాలి. రాహుల్ తన తొలి కీలక ప్రసంగంలోనే  జనంతో కనెక్ట్ కాగల మాటలు మాట్లాడారు. నిజానికి ఆయన దాదాపు దశాబ్దకాలంగా వార్తలలో ఉన్నారు. అయినా సరే, ఇలా తన హృదయం నుంచి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదో తెలియదు. రెండు పర్యాయాల పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీలో సోనియా తర్వాత అంతటి కీలక వ్యక్తిగా, (జనానికి తెలిసేలా) తనదైన ముద్ర ఎందుకు వేయలేదన్న ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉంటుంది.

సరే, రాహుల్ గాంధీ ఇంతటి పార్టీ భారాన్ని మోయడంలో ఎంతవరకు కృతకృత్యులు అవుతారు, తను ఉద్దేశిస్తున్న మార్పులు ఎంతవరకు తీసుకు రాగలుగుతారు, పార్టీనీ, ప్రభుత్వం పని తీరును తను ఆశించిన విధంగా మార్చగలుగుతారా, లేక వాటికి అనుగుణంగా తనే మారతారా,  అధికార వికేంద్రీకరణ లక్ష్యాన్ని ఎంతవరకు నిజం చేయగలుగుతారు, 2014 ఎన్నికలలో పార్టీని విజయతీరంవైపు నడిపించగలుగుతారా అన్న ప్రశ్నలు ఎలాగూ ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి. ఆయన సాఫల్య, వైఫల్యాల చర్చ ఇక మీదట మరింత గట్టిగా జరుగుతుంది. అదలా ఉంచి ఆయన జైపూర్ ప్రసంగానికే పరిమితమైతే అది ఆయన రాజకీయ భవిష్య గీతానికి తగిన పల్లవిగా చెప్పవచ్చు.

రాహుల్ మరికొన్ని గుర్తుపెట్టుకోదగిన మాటలు అన్నారు:

"మన మంత్రులు పంచాయతీ పనులు ఎందుకు చేస్తున్నారు? సుప్రీం కోర్ట్ ఎందుకు సాధారణ కేసుల భారాన్ని మోస్తోంది? ఉపాధ్యాయులను ముఖ్యమంత్రులు నియమించాల్సిన అవసరం ఏమిటి? ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వామైనా కొద్దిమంది నాయకుల చేతిలో ఎండుకుంటుంది? మన దేశంలో అధికారం కేంద్రీకృతమైంది."

"యువతలో ఎందుకీ ఆగ్రహం? ఎర్రబుగ్గ కార్లలో అధికారం పరుగులు తీస్తుంటే, వీరు పక్కన నిలబడి చూస్తారు. ఏ రంగాన్ని తీసుకున్నా తెలివైన వారిని పక్కన పెట్టేలా వాటిని రూపొందించారు. అన్నింటి తలుపులూ బిగించేశారు."

"మనం విజ్ఞానాన్ని గౌరవించం. అధికారానికి మాత్రమే విలువ ఇస్తాం. భారత్ లో ఇదొక విషాదం."

రాహుల్ గాంధీ మామూలు జనానికి కనెక్ట్ అయ్యే మాటలు మాట్లాడడమే కాదు, అన్ని పార్టీల వారినీ ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యకరమైన సంకేతాలు ఏ వైపు నుంచి వచ్చినా గుర్తించే అలవాటు రాజకీయపక్షాలు ఇకనైనా చేసుకోవాలేమో. అలా చేయడం రాజకీయంగా కరెక్ట్ కాదనుకుంటే కనీసం మౌనమైనా పాటించాలి. ఆ దృష్ట్యా చూసినప్పుడు రాహుల్ ప్రసంగం పై బీజేపీ స్పందన నిరాశ కలిగించిందని చెప్పక తప్పదు. అది రాహుల్ ప్రసంగ స్ఫూర్తితో తులతూగక పోగా; ఆయన ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడారనీ, ఆయన ప్రసంగంలో ఉన్నది ఆదర్శవాదం(ఐడియలిజం) మాత్రమేననీ బీజేపీ అధికారప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. విలువల గురించి మాట్లాడే బీజేపీ ఆదర్శవాదం కూడదన్నట్టు మాట్లాడడం ఆశ్చర్యం. ఇక అరుణ్ జైట్లీ ఆనువంశిక అధికారమనే పాత ఆరోపణే మరోసారి చేశారు. మొత్తం మీద రాహుల్ రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే బీజేపీ రాజకీయంగా స్పందించింది.


6 comments:

  1. అయ్యో! అధికారంలోకి రాకముందు అందరూ ఇలాగే మాటాడేరు, ఆతరవాతే......ఈయనేమీ తేడా కాదు, ఆ తానులో ముక్కే

    ReplyDelete
    Replies
    1. కనీసం కొన్ని తాజాదనం ఉన్న మాటలైనా మాట్లాడారు. కాస్త టైమిచ్చి మీరన్న అభిప్రాయానికే వద్దాం.

      Delete
  2. అంటే ప్రజలు సానుభూతితో గద్దె ఎక్కే వాళ్ళంతా కాంగ్రెస్ లో ఉన్నారన్నమాట.

    ReplyDelete
  3. ఇంకో లెక్కన చూసుకుంటే, తల్లి నుంచీ వచ్చిన ద్వంద నాల్కల ధోరణికి వంశోద్ధారకుడు దొరికాడు.

    మీ టపా చూస్తుంటే బానిసత్వం కోరలు చాలా పెద్దవిగా ఉన్నాయి అనిపిస్తుంది, ఒకప్పుడు(అది ఇప్పుడు కూడా ఉంది) ఒక blog విశ్లేషణ అని చెప్పి ఇంకొకరి అభిప్రాయం తన అభిప్రాయంగా చెప్పుకునే వారు - అదో రకం బానిసత్వం మీది ఇంకో రకం బానిసత్వం, ఇక్కడ కూడా అంతే పెద్ద తేడా లేదు ఎందుకంటే ఏడ్చే వాడిని అందలం ఎక్కించడం పరిపాటే కదా.

    ReplyDelete
    Replies
    1. స్పందనకు ధన్యవాదాలు. కానీ సానుభూతి, బానిసత్వం అనే మాటలు మీరు ఇక్కడ ఎందుకు వాడారో అర్థం కాలేదు. ఎవరినో అందలం ఎక్కించమని నేను ఎక్కడా రాయలేదు. ఒక పరిమిత contextలో నేను ఈ టపా రాశాను.

      Delete
    2. ముత్తాత స్వాతంత్రం తెప్పించాను కాబట్టి నేను ఎన్ని మోసాలు చేసినా నాకు మీరు బానిసలు అని చెప్పి పాలించారు.
      నానమ్మ కాలంలో, తండ్రికి వారసురాలు కాబట్టి బానిసత్వం చూపించారు, దోచుకోనిచ్చారు.
      నానమ్మను చపించారు కాబట్టి తండ్రికి సానుభూతి చూపించి అందలం ఎక్కించారు, దాచుకోనిచ్చారు.
      తండ్రిని చంపారు కాబట్టి తల్లికి వారసత్వం కట్ట బెట్టించారు, దోచుకున్న దాంట్లో వాటా ఇప్పించారు.
      ఇక మా ఇంట్లో ఇంతమంది చనిపోయారు కాబట్టి నన్ను సింహాసనం ఎక్కించరూ, నన్ను కూడా మోసం చేయించనివ్వరూ అని ప్రసంగం ఉంటే బాగుండేది.

      Delete