Tuesday, January 22, 2013

డైనెస్టీ నేస్టీ... ఎవరికి కాదు టేస్టీ?!

నిన్న(21 జనవరి) రాత్రి ఇంగ్లీష్ వార్తా చానెళ్లలో వారసత్వ అధికారం పై వాడి, వేడి చర్చ జరిగింది. ఒక చానెల్ చర్చలో బీజేపీ నేత ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎద్దేవా చేస్తూ తన సహజశైలిలో 'డైనెస్టీ-నేస్టీ-కొందరికి టేస్టీ' అని చమత్కరించారు. కాంగ్రెస్ ప్రతినిధిగా చర్చలో పాల్గొన్న కేంద్ర సహాయమంత్రి రాజీవ్ శుక్లా సమాధానం చెబుతూ బీజేపీలో కూడా 50 మందికి పైగా రాజకీయ వారసులు ఉన్నారు, వారి మాటేమిటని అడిగారు. రాజ్ నాథ్ సింగ్ కుమారుని గురించి ప్రస్తావించారు. దానిపై వెంకయ్య నాయుడు స్పందిస్తూ, నాయకత్వ స్థానంలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు.

అంటే వెంకయ్య నాయుడి ఉద్దేశంలో పార్టీలలో వారసత్వ రాజకీయాలు ఉండచ్చు. కానీ వారసులు నాయకత్వ స్థానంలో ఉండకూడదు! ఇదెలా సాధ్యమవుతుంది? ఉదాహరణకు, రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు నాయకత్వ స్థానం లో ఉన్నారు. ఆయన కుమారుడు పార్టీలో ఉన్నారు కానీ నాయకత్వ స్థానంలో లేరు. ఒకవేళ రేపు ఆయన నాయకత్వ స్థానానికి చేరుకోరని ఎలా చెబుతారు? వారసులు నాయకత్వస్థానానికి చేరుకోకూడదని ఏమైనా నియమం పెడతారా? పార్టీలో ఎదిగే అవకాశం లేనప్పుడు వారసులు పార్టీలో చేరి వెట్టి చాకిరీ ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తారు? వెంకయ్య నాయుడి గారి తర్కం నాకైతే అర్థం కాలేదు.

అనేక పార్టీలలో ముఖ్యమంత్రులు, మంత్రుల పుత్రరత్నాలు, పుత్రికారత్నాలు ఎమ్మెల్యేలుగానో, ఎం.పీలు గానో ఉన్నారు. వీరు రేపు మంత్రులో, ముఖ్యమంత్రులో, అవకాశాలు కలిసొస్తే ప్రధానమంత్రో అయ్యే అవకాశం ఉండదా? మీరు 'వారసులు' కనుక కావడానికి వీలు లేదని ఎలా అంటారు? ఏ న్యాయసూత్రం ప్రకారం అంటారు?

దేశంలో ఆకర్షణీయమైన ఇతరేతర రంగాలు/ అనాయాస ఆదాయమార్గాలు అభివృద్ధి చెందనంత కాలం రాజకీయరంగంపై వారసుల ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఈ వాస్తవాన్ని విస్మరించి ఒకరి వారసులను ఒకరు ఆడిపోసుకోవడం వల్ల జనానికి అయాచిత వినోదాన్ని అందించడం తప్ప ప్రయోజనం ఏముంటుంది?

మరో చర్చలో సచిన్ పైలట్ మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాల ఆరోపణలో అర్థం లేదని తేల్చారు. వారసత్వం లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగపడచ్చు కానీ, ఆ తర్వాత సొంత ప్రతిభను చాటుకునే ప్రతిసారీ ఎన్నిక కావలసివస్తుందని ఆయన తర్కం. అయ్యా మహాశయా, లాంచింగ్ ప్యాడ్ దొరకడమే కష్టం, దానితో పోలిస్తే ఆ తర్వాత అల్లుకు పోవడం ఎవరికైనా తేలికే నన్న వాస్తవాన్ని వడ్డించిన రాజకీయ విస్తళ్ళ లాంటి వారసుల బుద్ధికి ఎక్కేలా ఎలా చెప్పాలి?

పోనీ వారసత్వ రాజకీయాలను నిరసించే రాజకీయ పార్టీలన్నీ ఒక పని చేస్తే ఎలా ఉంటుంది?

అది-రాజకీయాలలోకి వారసుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆ మేరకు పార్టీ నియమావళిలో నిబంధనను పొందుపరచడం. కనీసం రెండు, మూడు పార్టీలైనా ఆ పని చేస్తే మిగిలిన పార్టీల మీద కూడా ఒత్తిడి పెరిగి రేపు అవి కూడా ఆ మార్గం తొక్కే అవకాశం ఉంటుంది కదా! పిల్లి మెడలో గంట కట్టడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా!


No comments:

Post a Comment