Wednesday, January 2, 2013

ముద్దులు, కౌగిలింతల 'ధ్యానం': భారతీయాత్మకు నొప్పి లేదా?

ముద్దులు, కౌగిలింతల ధ్యాన దృశ్యాలను కొన్ని తెలుగు పత్రికలు ప్రచురించి 24 గంటలు గడిచిపోయాయి. కానీ విచిత్రం చూడండి...రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు స్పందించిన జాడ లేదు. అంతకంటే చిత్రం, ఈ రాష్ట్ర మహిళా హోం మంత్రి కూడా స్పందించలేదు. ఒక న్యాయవాది మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం, అక్కడక్కడ నిరసన ప్రదర్శనలు జరగడం మినహా ఎక్కడా భూమి కంపించలేదు. ఢిల్లీ ఘటన సృష్టించిన సంచలనంలో, స్పందనలో, ఆగ్రహావేశాలలో వెయ్యో వంతు కూడా ఈ దృశ్యాలు సృష్టించలేదు.

ఈ దేశంలో భారతీయ విలువల పరిరక్షణకే కంకణం కట్టుకున్న సంస్థలు కొన్ని ఉన్నాయి. ఆశ్చర్యం, అవీ వీధికెక్కిన ఆనవాళ్ళు లేవు. ఆధ్యాత్మికత ముసుగులో భారతీయ యువతులను  బహిరంగంగా కౌగిలించుకుని, ముద్దాడి, ఒడిలో కూర్చొబెట్టుకుని లాలిస్తున్నదృశ్యాలు పత్రికలకు ఎక్కిన తర్వాత కూడా భారతీయాత్మకు చీమ కుట్టినట్టు కూడా లేదు.

ఎందువల్ల ఇలా జరిగింది? ఇది నిజంగా చాలా లోతుగా  చాలా కోణాలనుంచి ఆలోచించవలసిన ప్రశ్న!

గుర్తుపెట్టుకోండి, యావద్దేశం ఢిల్లీ వైపు రోజుల తరబడి దృష్టి సారించిన రోజుల్లోనే ఇక్కడ ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో పై దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ ఘటనపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కూడా ఈ మూల ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి దృశ్యాలకు బాధ్యులైనవారిలో భయం పుట్టించలేదు. ప్రభుత్వంలో మెలకువ కలిగించలేదు. ఢిల్లీ స్థాయి నిరసనలు ఎన్నెన్ని, ఎన్నెన్ని రోజులపాటు జరిగితే దేశవ్యాప్తంగా వ్యక్తులలో, వ్యవస్థలలో, ప్రభుత్వాలలో కదలిక వస్తుంది?!

ఈ స్పందనారాహిత్యం చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తోంది. ఈ దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక విలువల పరిరక్షణే ధ్యేయమని చెప్పుకునే సంస్థలు కూడా ఈ కౌగిలింతలను, చుంబనాలను, ఒడి లాలింపులను ఆధ్యాత్మిక 'ప్రయోగం'గానే  భావిస్తున్నాయా? వీటికి బాధ్యులైన ఆధ్యాత్మిక పురుషులకు కూడా-పాపం శమించుగాక-రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణమహర్షి, అరవింద ల సరసన పీట వేయదలచుకున్నారా? అదే నిజమైతే, వారే కాదు, అందరూ  భారతీయ విలువల కళేబరాన్ని నూరు గజాల లోతున పాతిపెట్టి కన్నీటి తర్పణం విడిచి రావచ్చు.

ఇప్పటికీ దీనిని ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసించే అమాయకులు ఎవరైనా ఉంటే వారికి నేను చెప్పేది ఒకటే...మనకు ఇంతకన్నా ఉదాత్తమైన, సభ్యతాసంస్కారవంతమైన, విలువైన ధ్యాన సంప్రదాయాలు ఉన్నాయి. ఇలాంటి తుచ్చమైన ప్రయోగాలు మనకు అవసరం లేదు.

నేను ఇంతకుముందే చెప్పినట్టు, రాజకీయ నాయకత్వానికి ఇటువంటి అవాంఛనీయశక్తులతో ఇతరేతర లాలూచీలు ఏవీ లేకపోతే, కేవలం ఆధ్యాత్మిక అజ్ఞానమే వాటిని అనుమతించడానికి కారణమైతే నాదొక సలహా...ప్రభుత్వానికి రకరకాల సలహాదారులు ఉంటారు. అలాగే అత్యవసరంగా ఒక ఆధ్యాత్మిక సలహాదారును అది ఏర్పాటు చేసుకోవాలి.

ఢిల్లీ స్థాయి ప్రకంపనలు ఇక్కడ పుట్టకపోవడానికి నాకు మరో కారణం కనిపిస్తోంది. అది మీడియా వైఫల్యం. మీరు గమనించారో లేదో, ఢిల్లీ నుంచి పని చేసే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలే ఫోకస్ అవుతుంటాయి. ఢిల్లీలోనే కాదు, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ల లో ఏం జరిగినా జాతీయ మీడియాలో వార్త అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలలో ఎంతటి ఘోరాలు జరిగినా ఎప్పుడో కానీ  అదొక  ప్రముఖ వార్త కాదు. దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగవు. ఇక దక్షిణాది రాష్ట్రాలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు రెండూ ప్రాంతీయ మీడియాగానే పనిచేస్తుంటాయి. ఢిల్లీలోని ఎలక్ట్రానిక్ మీడియాలా జాతీయస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని రూపొందించే శక్తికానీ, ప్రభావితం చేసే శక్తి కానీ దక్షిణాది చానెళ్లకు లేదు. దక్షిణాది చానెళ్లలో ఒక అర్నబ్ గోస్వామి, ఒక రాజ్ దీప్ సర్దేసాయి, ఒక కరణ్ థాపర్, ఒక బర్ఖాదత్, ఒక నిధీ రాజ్దాన్ లాంటివారు కనిపించకపోవడం స్పష్టంగా కనిపించే ఒక తేడా. సమాచారం జాతీయ స్థాయిలో ఫోకస్ కావడానికి సంబంధించినంతవరకు దక్షిణాది రాష్ట్రాలు ఒక చీకటి ఖండం. అదే, ఇక్కడి ప్రభుత్వాలకు, రకరకాల సంఘవిద్రోహశక్తులకు పెద్ద రక్షణ కవచం.

ఢిల్లీ ఘటనపై మీడియా మరీ అతి చేసిందనే అభిప్రాయం ఎవరికైనా ఉండచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ మూల జరిగిన ఘటనల పై స్పందన  చూసినమీదట ఆ డోసు కూడా సరిపోదనే అభిప్రాయం కలుగుతోంది. జాతీయ చానెళ్ల కెమెరా ఫోకస్ ఇటు కూడా మళ్ళవలసిన  అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.



No comments:

Post a Comment