Wednesday, January 30, 2013

వీరేశలింగం అనుకరణలు, అనుసరణలు

                                ('తెలుగులో తొలి నవల ఏది?' అన్న29 జనవరి  పోస్ట్ కు కొనసాగింపు)

ఇంగ్లీష్ లో తొలి నవల 'పమేలా' వెలువడిన 26 ఏళ్ళకు గోల్డ్ స్మిత్ రాసిన 'వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' వచ్చింది. క్రమంగా జేన్ ఆస్టిన్, థాకరే, జార్జి ఇలియెట్, స్కాట్, హార్లీ, హెచ్ జి వెల్స్, జోసెఫ్ కాన్ రాడ్ లాంటి ప్రతిభావంతులు నవలా ప్రక్రియను పరిపుష్టం చేశారు. వీరిలో కొంతమంది గోపాలకృష్ణమచెట్టి, వీరేశలింగం గార్లకు సమకాలికులే. అయినాసరే, వీరిద్దరూ తమ రచనలను 'నవల'గా ఎందుకు పేర్కొనలేదో తెలియదు.

ఇంకా విచిత్రం ఏమిటంటే, తమ రచనలలోని ఇతివృత్తం ఈ కాలానికి చెందినది కాదని  వీరిద్దరూ ప్రత్యేకంగా చెప్పుకున్నారు. శ్రీరంగరాజచరిత్రలోని కథ 400 ఏళ్లనాటిదని చెట్టిగారు అంటే, రాజశేఖరచరిత్రములోని కథ 200 ఏళ్లనాటిదని వీరేశలింగం అన్నారు.

ఇంతకీ "తెలుగులో మొదటి వచన ప్రబంధమును నేనే చేసితి" నని వీరేశలింగం ఎలా అన్నారు, తన రచన కంటె ముందు శ్రీరంగరాజచరిత్ర అనే 'నవీనప్రబంధము' వచ్చినట్టు ఆయనకు తెలియదా అంటే... తెలుసు. తెలియడమే కాదు, ఆ రచనను ఆయన చదివారని కూడా అక్కిరాజు రమాపతిరావు తేల్చారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన వీరేశలింగం రచనలకు సంపాదకులుగా ఉన్న రమాపతిరావు తొలి తెలుగు నవల ఏదన్న ప్రశ్నపై కొంత చర్చ చేశారు. శ్రీరంగరాజచరిత్ర నవీన ప్రక్రియకు ఆద్యమని చెప్పదగిన ప్రౌఢరచనగా వీరేశలింగం భావించి ఉండకపోవచ్చన్నారు.  400 ఏళ్లనాటి కథగా రచయిత చెప్పడం, నాయకుడు మహాకులీనుడై ఉండాలన్న ఆలంకారిక నియమాన్ని ప్రస్తావించడం, ఇంగ్లీష్ సాహిత్య ప్రక్రియ ప్రభావం ఆ రచనపై ఏమాత్రం ఉండకపోవడం వంటి కారణాల వల్ల చెట్టిగారిని ప్రథమ నవలా రచయితగా వీరేశలింగం ఒప్పుకోలేదని స్పష్టమవుతోందన్నారు. అంటే ఏమిటన్నమాట? వీరేశలింగం ఒప్పుకోలేదు కనుక అనంతర సాహిత్యచరిత్రకారులు, విమర్శకులు కూడా ఒప్పుకోలేదు!

ఆమాటకొస్తే, రాజశేఖరచరిత్రములోని కథ కూడా 200 ఏళ్ల క్రితం జరిగిందని వీరేశలింగం చెప్పుకున్నారు. అందులోని కథానాయకుడు రాజశేఖరుడు కూడా కులీనుడే. మరి చెట్టిగారి రచనను ప్రథమ నవలగా గుర్తించడానికి అడ్డువచ్చిన ఈ కారణాలు వీరేశలింగం రచనను గుర్తించడానికి ఎందుకు అడ్డురాలేదు? కట్టమంచి మొదలుకొని ఇటీవలి సహవాసి వరకూ ఎవరూ ఇందులోని అసంబద్ధతను గమనించలేదు. చెట్టిగారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు.

అంతేకాదు, మరికొన్ని ఆశ్చర్యాలు కూడా ఉన్నాయి. శ్రీరంగరాజచరిత్రను వీరేశలింగం చదవడమే కాదు, అందులోని రెండుమూడు సన్నివేశాలను అనుకరించారు! 'తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము' అనే తన సిద్ధాంతరచనలో కొత్తపల్లి వీరభద్రరావు ఈ సంగతిని సోదాహరణంగా వివరించారు(పేజీలు 494-500). "శ్రీ పంతులుగారు శ్రీరంగరాజచరిత్రను చూడలేదనలేము. చూచినను ఆ విషయమును గూర్చి వ్రాయకుండుట-స్వీయచరిత్రములోనైనను-ఆశ్చర్యమే! శ్రీరంగరాజచరిత్రపై తమకంత గౌరవము లేకున్నను, తామా గ్రంథమును చూచినట్లు పంతులుగారు వ్రాసియుండవలసినది" అని ఆయన వ్యాఖ్య.

ఆపైన, గోల్డ్ స్మిత్ రచన 'వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' కీ, రాజశేఖరచరిత్రముకూ ఉన్న దగ్గరి పోలికల గురించి కూడా వీరభద్రరావు సుదీర్ఘంగా చర్చించారు(పేజీలు 501-524). పాత్రల రూపకల్పనలో, సన్నివేశ కల్పనలో ఉన్న అతి దగ్గర పోలికలను నలభైకి పైగా ఉదహరించారు. గోల్డ్ స్మిత్ రచననుంచి వీరేశలింగం వాక్యాలకు వాక్యాలనే ఎలా ఎత్తి రాశారో చూపించారు.

చివరగా, "ఈ రెండు నవలల నిట్లు పరిశీలించిన తరువాత పంతులుగారు రాజశేఖరచరిత్రము పీఠికలో వ్రాసినట్లు కథను గల్పించుటలో గోల్డ్ స్మిత్తను నింగ్లీషు కవీశ్వరుని గ్రంథ సాహాయ్యమును గొంత పొందినట్లే తెలియును. ఇంకనూ సూక్ష్మముగా పరిశీలించినచో ఆ సాహాయ్యమూ సామాన్యమైనది కాదని కూడా తెలియును" అని వీరభద్రరావుగారి సగౌరవ ఆక్షేపణ.

ఆకాలపు అవగాహన దృష్ట్యా ఇలాంటివి దోషాలుగా వీరేశలింగం భావించి ఉండకపోవచ్చు. అదీగాక, ఆయన గొప్ప సంఘసంస్కర్తా, ఆధునిక యుగ వైతాళికులలో అగ్రగణ్యుడూ అన్న గౌరవంతో  కూడా వీటిని మనం ఉపేక్షించచ్చు. సమస్య అది కాదు. అనంతర సాహిత్య చరిత్రకారులు, విమర్శకులు వీరేశలింగం మాటనే వేదవాక్యంగా తీసుకుని సాహిత్యచరిత్రకూ, చెట్టి గారికీ కూడా అన్యాయం చేయడమే ఆశ్చర్యం.




No comments:

Post a Comment