Sunday, January 6, 2013

వర్ణవ్యవస్థకు మూలం ఆర్యులా, సింధు నాగరికులా?


(ఆర్యులు, ద్రావిడుల గురించి చాలా రకాల ఊహలు, లేదా అపోహలు వాస్తవాలుగా ప్రచారం పొందుతున్నాయని కొందరు ప్రామాణిక చరిత్రకారుల రచనలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అలాంటి ఊహల మీద ఆధారపడి రాసిన ఒక వ్యాసంపై నా స్పందన ఇది. ఇటువంటి అంశాలపై ఆసక్తి గల పాఠకుల కోసం దీనిని  పోస్ట్ చేస్తున్నాను. స్పందననూ ఆహ్వానిస్తున్నాను. ఆర్యులు, ద్రావిడుల గురించి ఉన్న ఇతరేతర వాదాలు, వివాదాలలోకి మరీ అంత లోతుగా వెళ్లకుండా  ఈ వ్యాసానికి పరిమితమై స్పందిస్తే బాగుంటుందని మనవి) 

సింధు నాగరికత- ఆర్యులు- ద్రావిడులు- హిందూ ధర్మం- వర్ణవ్యవస్థ మొదలైన వాటి గురించి చాలాకాలంగా చాలా రకాల ఊహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఊహల మీద ఆధారపడి కొన్ని రాజకీయపక్షాలు పనిచేస్తున్నాయి. ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ ఊహలనుంచి స్ఫూర్తిని పొంది, ప్రస్తుత బహుజనుల ఉద్యమాలకు చేయూతనివ్వడం లక్ష్యంగా మూలవాసీ సమూహాల చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను పునర్నిర్మించుకునే ప్రయత్నానికి కొందరు పూనుకుంటున్నారు(సింధు స్ఫూర్తి ఆవాహన, ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 2 వ్యాసం).

ఊహల మీద ఆధారపడి అని ఎందుకు అంటున్నానంటే, గార్డన్ చైల్డ్, డీ.డీ. కోశాంబి, జోసఫ్ క్యాంప్ బెల్, ఇర్ఫాన్ హబీబ్, (పై వ్యాసకర్తలు పేర్కొన్న) రొమీలా థాపర్ వంటి ప్రామాణిక చరిత్రకారులు, పురాసంస్కృతీ, మత విశ్లేషకుల రాతలు పై ఊహలను సమర్థించడంలేదు. సమర్థించకపోగా వాటికి పూర్తి భిన్నమైన అభిప్రాయాలను అందిస్తున్నాయి.

 పై వ్యాసంలోని ఊహలను ప్రస్తావించుకుని, ప్రామాణిక అధ్యయనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం:

1   .  ఈ దేశ మూలవాసులు ద్రావిడులు. వారు అద్భుతమైన సింధు నాగరికతను సృష్టించారు:  
ద్రావిడులు ఈ దేశ మూలవాసులు అనే ముందు ఈ వివరాలు దృష్టిలో ఉంచుకోవాలి. సింధు శిథిలాలలో కొన్ని అస్థిపంజరాలు దొరికాయి. అవి ప్రోటో-ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్(మధ్యధరాప్రాంత) కవళికలను సూచించాయి. ప్రోటో-ఆస్ట్రలాయిడ్ కవళికలు దక్షిణ, మధ్యభారతాలలోని ఆదివాసులలోనూ; హిందూ సమాజంలోని వెలి కులాలలోనూ కనిపిస్తాయి. ఇక మెడిటరేనియన్ కవళికల జనం స్పెయిన్, పోర్చుగల్, మడగాస్కర్ మొదలుకుని భారత్ వరకూ వ్యాపించి పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీ. పూ. 7500-5500 నాటికే ఈ జాతివారు పాలస్తీనాలో ఉన్నారు. ఉత్తరభారతంలోనూ, ఇతర చోట్లా ఉన్నత సామాజిక వర్గాలలో ఈ కవళికలవారే అధికసంఖ్యాకులు. మొహంజదారో తవ్వకాలలో బయట పడిన ఒక ఆకృతిని పురోహితుడిగా గుర్తించారు. ఇతడిలో మెడిటరేనియన్ కవళికలు ఉన్నాయి. ఇప్పటికీ పురోహితులు దాదాపు ఇతని ఆహార్యాన్నే అనుకరిస్తున్నారు. ఇటువంటి పురోహితుని ఆకృతులే సుమేరియా, మెసపొటేమియా శిల్పాలలోనూ కనిపిస్తాయి. పశ్చిమాసియాలో తొలినాటి వ్యవసాయ జనావాసాలు అంతటా మెడిటరేనియన్ జనం వ్యాపించి ఉండేవారు. చరిత్రపూర్వకాలంలోనే మెడిటరేనియన్ జనం పశ్చిమం నుంచి భారత్ కు వలస వచ్చినట్టు కనిపిస్తుంది. ఆర్యులు భారత్ లోకి అడుగుపెట్టేనాటికే ఈ వలస సంభవించింది. కొంతవరకు ఆర్యులు వీరిని తమలో కలుపుకోవడమూ జరిగింది(ఓరియంటల్ మైథాలజీ: జోసఫ్ క్యాంప్ బెల్). కనుక ప్రోటో-ఆస్ట్రలాయిడ్ జనమే మూలవాసులు అనడానికి అవకాశముంది. వారినీ, మెడిటరేనియన్ వలస జనాన్నీ కలుపుకుని ద్రావిడులు అనదలచుకుంటే, ద్రావిడులలో కొందరే మూలవాసులు, అందరూ కాదు. ద్రావిడులు అద్భుతమైన సింధు నాగరికతను సృష్టించారు అనేటప్పుడు జాగ్రత్త పాటించాలి. పట్టణాలు, తీర్చిదిద్దిన వీథులు, గృహాలు, స్నానశాలలు, మురుగునీటిపారుదల వ్యవస్థ వగైరాలు ఉండడం వరకూ అది అద్భుతమే. కానీ చాలా విషయాల్లో అది అద్భుతమూ కాదు, స్ఫూర్తిని పొందవలసింది అంతకంటే కాదు. ఏమైనా అది వస్తుగత దృష్టినుంచి చూడవలసిన ఒక చారిత్రక వాస్తవికత.

2.   ఆర్యులు సింధు నాగరికతను అంతమొందించారు’:  
ఈ మాట భారతదేశ చరిత్రా, సమాజాల గురించి కనీస అధ్యయనాన్ని, అవగాహనను కూడా ప్రతిబింబించదు. ఈ దేశంలో ఏదీ ఇంకొక దానిని అంతమొందించిన దాఖలా లేదు. బౌద్ధం సంగతేమిటని అనచ్చు. బౌద్ధ తాత్వికతలోని కొన్ని అంశాలను హైందవం లీనం చేసుకున్న సంగతి తెలిసినదే.  బౌద్ధం బహుశా ఈ దేశ స్వభావానికి భిన్నంగా వ్యవస్థీకృత, ఏకశిలాసదృశ మతాన్ని ప్రతిపాదించడం భారత్ లో దాని ఉనికి పలచబడడానికి కారణం కావచ్చు. చరిత్ర పొడవునా ఇక్కడ జరిగింది భిన్న విశ్వాసాలు, ఆచారాల మధ్య అతుకు పెట్టడం; ఒకదానినొకటి లీనం(ఎసిమిలేషన్) చేసుకోవడమే. దీని గురించి విస్తారంగా చర్చించిన కోశాంబి, ఈ దేశ భౌగోళిక అమరికే అందుకు కారణమని అంటాడు. సంథింగ్ వర్సెస్ సంథింగ్ కు ఈ దేశంలో అవకాశం తక్కువ. ఈ కోణంనుంచి చెప్పుకోవలసిన అంశాలు అనేకం ఉన్నాయి.

3.      సింధు నాగరికతలో వర్ణవ్యవస్థ లేదు, ఆర్యులు వర్ణవ్యవస్థను ప్రవేశపెట్టారు. సింధు నాగరికతలో పూజారివర్గానికి ప్రత్యేకస్థానం లేదు:  
చరిత్రకారులు, పురామానవశాస్త్రజ్ఞుల పరిశీలనలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వర్ణవ్యవస్థ(కనీసం బీజరూపంలోనైనా) ఉన్నది సింధు నాగరికతలోనే. ఆర్యులలో మొదట వర్ణవ్యవస్థ లేనేలేదు. వారు సింధు నాగరికత నుంచే వర్ణవ్యవస్థ నమూనా తెచ్చుకున్నారు. దానిని మరింత అభివృద్ధి చేసి వాడుకున్నది మాత్రం వారే. కోశాంబి ప్రకారం, ఆర్యులు పురుషపరంపరకు చెందినవారు. పురుషదేవతారాధకులు. స్త్రీ దేవతలు చాలా తక్కువ. జన్యు, ఆకృతుల రీత్యా ఆర్యులు ఒకే కుదురువారు కారు. అనేక తెగలను తమలో కలుపుకున్నారు. వారికి జాతిస్వచ్ఛత గురించి పట్టింపు లేదు.   వారికి ప్రత్యేకమైన పురోహితవ్యవస్థ కూడా లేదు. ఎవరికివారే దేవతారాధన చేసేవారు. ఆర్యసంప్రదాయానికి చెందిన గ్రీస్, రోమ్ లలో కూడా ఇదే కనిపిస్తుంది. మిగిలిన ఆర్య సంప్రదాయాలలో ఎక్కడా బ్రాహ్మణుల వంటి వృత్తి పురోహితులు లేరు. బ్రాహ్మణశబ్దం పూర్తిగా భారతీయం. వీరితోనే వర్ణవిభజన ప్రారంభమైంది(ఏన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ: డీ.డీ. కోశాంబి). ఇతర ఆర్యసంప్రదాయాలలో  లేని ఈ పరిణామం భారత్ లోనే సంభవించడానికి కారణం, సింధు నాగరికతతో సంపర్కం. సింధు నాగరికతకు; మెసపొటేమియా, సుమేరు సంస్కృతులకు చాలా సంబంధాలున్నాయి. నేటి మన కులవ్యవస్థతో పోల్చదగిన వ్యవస్థ మెసపొటేమియాలో ఉండేది. అక్కడ రెండు రకాల బానిసలు ఉండేవారు. యుద్ధఖైదీలు, రుణం తీర్చలేకపోయినవారు, బానిస సంతానం మొదటి రకం. వీరి బానిసత్వం శాశ్వతం కాదు. డబ్బు చెల్లించో, స్వతంత్రులు దత్తు చేసుకోవడం ద్వారానో బానిసత్వం నుంచి వీరు విముక్తులు కావచ్చు. దేవాలయ బానిసలు రెండో రకం. వీరిని సిర్కుతు లనేవారు.  వీరు శాశ్వత బానిసలు. వీరిలో ఆస్తిపరులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులూ కూడా ఉండచ్చు. అయినా సరే వీరు బానిసలే. మన దేశంలోని పట్టువిడుపులు లేని కులవ్యవస్థతో దీనిని పోల్చవచ్చు. మెసపొటేమియా తరహా బానిసత్వం సింధులో కూడా ఉండేదనుకుంటే, తాము కృష్ణవర్ణులుగా పేర్కొన్న దాసులను, లేదా దస్యులను ఆర్యులు సేవకులను చేసుకోవడం సహజపరిణామమేనని కోశాంబి అంటాడు. ఆర్యులలో బానిసత్వం లేకపోగా, బానిసత్వాన్ని వారు వ్యతిరేకించారని కూడా ఆయన అంటాడు. ఆర్యులు భారతదేశానికి వచ్చేనాటికే సింధు నాగరికతలో అభివృద్ధి చెందిన పురోహితవ్యవస్థ ఉంది. అంతవరకూ ప్రత్యేకపురోహితవ్యవస్థ లేని ఆర్యులు సింధు పురోహితవ్యవస్థను సొంతం చేసుకున్నారు. క్యాంప్ బెల్ ప్రకారం కూడా ఆర్యులు సాదాసీదా రకం. వారిది సంక్లిష్ట సామాజికవ్యవస్థ కాదు. వారిలో అప్పటికి రాజ్యభావన పుట్టలేదు. అధికారం చెలాయించడం, బలప్రయోగం, దోచుకోవడం వారి ప్రధానవ్యాపకాలు. నాటి దేవాలయ కేంద్రిత నగర రాజ్యాలలోని పురోహితవ్యవస్థను అరువు తెచ్చుకుని స్వప్రయోజనాలకు వాడుకున్నారు.

4.   వైదిక మతాన్ని జాతీయమతంగా చిత్రించి, భారతీయసంస్కృతికి హైందవాన్ని అంటగట్టి, ఆర్యేతర, ముఖ్యంగా ద్రవిడ సంస్కృతీ, నాగరికతలను తృణీకరించడం హిందూత్వ తాత్విక భావజాలంలో ప్రధానాంశం. సింధు నాగరికతలో సతి లాంటి దురాచారాలు ఉన్నట్టు కనిపించదు’:
ఇవి కూడా వాస్తవాలను పూర్తిగా తలకిందులు చేస్తున్న ఊహలు. నిజానికి ఇప్పుడు హిందూమతంగా చెప్పుకుంటున్న మతంలోని దాదాపు ప్రతి అంశమూ వైదిక సంబంధమైనది కాదు, ద్రవిడ సంస్కృతికి చెందినది.  క్యాంప్ బెల్ స్పష్టంగా ఇలా అంటాడు: అనంతరకాలంలో భారతదేశంలో అభివృద్ధి చెందిన పురాణగాథలన్నీ సారాంశంలో వేదాలకు సంబంధించినవి కావు. ద్రవిడ సంబంధమైనవి. ఇంకా చెప్పాలంటే, కంచు యుగానికి చెందిన సింధు సంస్కృతినుంచి ఉద్భవించినవి.  గార్డన్ చైల్డ్ ఏమంటున్నాడో చూద్దాం: మట్టితో చేసిన చిన్న స్త్రీ విగ్రహాలు, పూజావస్తువుల మీదా, సీళ్ళ మీదా చిత్రించిన బొమ్మలు, ముఖ్యంగా లింగం, యోని ఆకారం కలిగిన పెద్ద రాతి బొమ్మలు అనేకం ఈ (సింధు) శిథిలాల్లో లభించాయి. ఇవి వంశచిహ్నాల సంప్రదాయం, సృష్టికి గర్భధారణకు సంబంధించిన ఆచారాలు ఇంకా బతికి ఉన్నాయని నిరూపిస్తాయి. ఇంతేగాక వీటినుంచి కొంతమంది దేవతలు కూడా ఉద్భవించారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా తరువాత కాలంలో హిందూమతంలోని కొన్ని ముఖ్యాచారాలను సూచిస్తాయి. లింగం, యోని రూపాలతో తరువాత కాలంలో హిందూ దేవతలు కొందరు చిత్రించబడడం మనం గమనిచవచ్చు(చరిత్రలో ఏం జరిగింది?: గార్డన్ చైల్డ్, అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య).  వామాచారానికి చెందిన తాంత్రిక పూజలు సింధు వారసత్వమని కోశాంబి అంటాడు. సింధు చిత్రాలతో, లిపితో తాంత్రిక చిహ్నాలకు సంబంధం ఉందని కూడా అంటాడు.  సింధు సీళ్ళపై కనిపించే చిత్రాల సరళి హిందూ దేవతావిగ్రహాలలో ఇప్పటికీ కనిపిస్తుందంటాడు. సింధు సంస్కృతిలో మాతృదేవతారాధనలో భాగంగా లింగ పూజ ఉండేదనీ; మాతృదేవతారాధన భారత్ లో అభివృద్ధి చెందినట్టుగా ప్రపంచంలో మరెక్కడా అభివృద్ధి చెందలేదనీ క్యాంప్ బెల్  అంటాడు. భారత్ లో నేటికీ రెండురకాల మాతృదేవతారాధనా పద్ధతులు కొనసాగుతున్నాయి. మొదటిది ప్రోటో-ఆస్ట్రలాయిడ్ వారసత్వం అయితే, రెండోది నూతన శిలాయుగ వారసత్వం. ఈ దేశంలోని భిన్న ఆరాధనా విధానాల మధ్య సహజీవనానికీ, లేదా సంలీనానికీ ఇదొక ఉదాహరణ.  సింధు సంస్కృతిలోని మాతృదేవతారాధనకూ;  మెసపొటేమియా, సమీప ప్రాచ్యం, ఈజిప్ట్, యూరప్ లతో సహా ఇంచుమించు ప్రపంచమంతటా ఒకప్పుడు ఉన్న మాతృదేవతారాధనకూ దగ్గరి సంబంధం ఉంది.  మాతృదేవతారాధన ఉన్న ప్రతిచోటా నరబలి ఉండేదన్న క్యాంప్ బెల్ మాటను గుర్తుపెట్టుకోవాలి. 1835లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించేవరకూ భారత్ లో నరబలి ఆచారం కొనసాగిందని ఆయన అంటాడు. హరప్పాలో లభించిన సీళ్ళు నరబలి ఆచారమూలాలు సింధు సంస్కృతిలో ఉన్నట్టు చెబుతున్నాయి. ఒక సీలుపై ఒక స్త్రీని బలి ఇస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మరో సీలుపై ఒక పురుషుని బలి ఇస్తున్న దృశ్యమూ,  ఏడుగురు స్త్రీల మూర్తులూ కనిపిస్తాయి. ఇది ఆనాడు ఈజిప్ట్ మొదలైన చోట్ల కూడా పాటించిన  రెగిసైడ్’(రాచబలి)ను సూచిస్తుందని క్యాంప్ బెల్ అంటూ, ఆ ఏడుగురు స్త్రీ మూర్తులూ సతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చంటాడు. ఇలాంటి దృశ్యాలున్న సీళ్లే మెసపొటేమియాలోనూ కనిపించాయి. తెలుగునాట ఏడుగురు అక్కలు’, సప్తమాతృకలు అనే పేర్లు ఇప్పటికీ ప్రసిద్ధమే.  మన మతవిశ్వాసాల మూలాలు సింధు సంస్కృతిలో ఉన్నాయనడానికి ఇదొక ఉదాహరణ.  సింధు శిథిలాలలోనే లభించిన అరడజను సీళ్లపై యోగముద్రలో ఉన్న ఒక పురుషుని ఆకృతి కనిపిస్తుంది. ఇది పశుపతి, లేదా శివుని రూపానికి మాతృక.  మెసపొటేమియా దేవాలయవ్యవస్థకూ, మన దేవాలయవ్యవస్థకూ చాలా పోలికలున్నాయి. సింధు సంస్కృతి మీదుగా అందిన వారసత్వం అది. మెసపొటేమియాలోని ఇష్టార్ దేవాలయంలో పవిత్ర వ్యభిచారం జరుగుతూ ఉండేది. మన దేశంలో దేవదాసీ వ్యవస్థకు ఇదే మూలం కావచ్చు.

5.  సింధు నాగరికతలో వ్యక్తి స్థానం వృత్తి, ప్రావీణ్యతలను బట్టి నిర్ణయించబడింది కానీ పుట్టుక మీద కాదు’: వాస్తవాలలోకి వెడితే ఇది కూడా నిరాధారమైన ఊహ గానే తేలిపోతుంది. నిజానికి సింధు సమాజం వ్యత్యాసాలు నిండిన వర్గ సమాజమని కోశాంబి అంటాడు. అంతేకాదు, ఎటువంటి మార్పూ లేకుండా వెయ్యీ, పదిహేను వందల ఏళ్లపాటు గడ్డ కట్టుకుపోయిన శిథిల సమాజమని కూడా అంటాడు. జనంలో తిరగబడే ప్రవృత్తిని కూడా అణచివేసి సమాజాన్ని జడీభూతంగా మార్చింది కూడా మతవిశ్వాసాలూ, మతాధిపత్యమే నంటాడు.

6.     ద్రవిడ సంస్కృతిలోని మతవిధానం సమాజశ్రేయస్సుకు దోహదం చేసింది’:  
ఈ మాటలో ఎంత నిజముందో పై అంశాల వెలుగులో ఎవరికి వారే అంచనాకు రావచ్చు. ఏదిఏమైనా అది మన గతం. చెరుపుకోలేని గతం. అందులోని మంచి, చెడులను కూడా వస్తుగత దృష్టినుంచి చూడాలి. బర్బరదశలో ఉన్న ఆర్యుల కంటె, వ్యవసాయాధారిత పట్టణ నాగరికతను నిర్మించిన సింధు ప్రజలు నిస్సందేహంగా ఉన్నతదశకు చెందినవారు. అయితే ఆ ఉన్నతికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అది కాలంలో ఘనీభవించి అనేకానేక ఆంతరిక లోపాల వల్ల క్షీణదశకు లోనై సహజమరణానికి చేరువైన నాగరికత. ఆర్యుల రాక దానిని మరింత త్వరితం చేసింది. సింధు సమాజ పరిస్థితిని బ్రిటిష్ ఆధిపత్యానికి ముందునాటి భారతదేశ పరిస్థితితో పోల్చవచ్చు. బ్రిటిష్ తో పోల్చితే భారత్ వేల సంవత్సరాల  సాంస్కృతిక, నాగరిక అస్తిత్వం గల దేశం. అయినా సరే, అనేక అంతర్గత వైరుధ్యాలతో బలహీనపడిన కారణంగా పరాధీనతకు తలవంచవలసివచ్చింది. అటువంటి క్షీణ భారతం స్ఫూర్తి దాయకమని ఎవరూ అనరు. అలాగే సింధు స్ఫూర్తికి ఆవాహన అనేటప్పుడూ మెలకువ పాటించాలి.

ఈ దేశంలో కులవ్యవస్థ నిజం. కులదాష్టీకం నిజం. శతాబ్దాలపాటు ఆత్మన్యూనతకు, అణచివేతకు గురైనవారు జరిపే ఆత్మగౌరవ, అస్తిత్వ పోరాటాలను సమర్థించాలనడంలో రెండో అభిప్రాయానికి తావు లేదు. వారు తమ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను పునర్నిర్మించుకునే ప్రయత్నాన్ని ఆహ్వానించవలసిందే. అయితే ఆ నిర్మాణం ఊహల పునాది మీద జరగకూడదు. చారిత్రక వాస్తవాలు చారిత్రక అనుభవాలను ప్రతిఫలిస్తాయి. వాస్తవాలను మరుగు పుచ్చినా, లేదా వక్రీకరించినా  ఆ అనుభవాలనుంచి పొందవలసిన ఉమ్మడి ప్రయోజనాలను నష్టపోతాం.  కులపీడన గురించి చెప్పుకోవలసిన వాస్తవాలు, చర్చించుకోవలసిన అంశాలు  ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా కులపీడనలో గల తారతమ్యాల గురించీ, కులవ్యవస్థకు, వ్యవసాయార్థికతకు పడిన పీటముడి గురించీ ప్రస్తావించుకోవలసిన అంశాలు అసంఖ్యాకం.
                                              (ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6-1-2013న ప్రచురితం)                                        




3 comments:

  1. 'వర్ణవ్యవస్థకు మూలం ఆర్యులా, సింధునాగరికులా?' అన్న నా పోస్ట్ పై ఒక ఆసక్తికర విషయాన్ని పాఠకులతో పంచుకోడానికి ఇది రాస్తున్నాను.
    ఆంధ్రజ్యోతిలో ఈ వ్యాసం చదివిన ఓ పదిమంది పరిచయస్తులు నాకు ఫోన్ చేసి తమ స్పందన తెలియజేశారు. మిగిలినవి అలా ఉంచి, ఇద్దరి స్పందన గురించి చెబుతాను.
    మొదటి వ్యక్తి ఒక సీనియర్ పాత్రికేయమిత్రుడు. సింధు వాదానికి దగ్గరగా ఉండే వ్యక్తి. "ఎంతో కాలంగా ఎంతోమంది విశ్వసిస్తున్న అభిప్రాయాలను ఒక్క వ్యాసంతో అడ్డంగా నరికేశారు. కోశాంబిని ఉటంకించారు. ఆయన ఏ సందర్భంలో అలా అన్నాడో పూర్తిగా మీరు కోట్ చేసి ఉండాల్సింది." అన్నారు. చివరగా, "మీ వ్యాసం ఆర్.ఎస్.ఎస్., బీజేపీ, విశ్వహిందూ పరిషత్ వాళ్ళకు బాగా నచ్చుతుంది లెండి" అన్నారు.
    ఇక రెండో వ్యక్తి ఒక రెటైర్డ్ న్యాయమూర్తి. ఆర్.ఎస్.ఎస్. భావజాలానికి దగ్గరగా ఉండే వ్యక్తి. మా ఇద్దరికీ పరిచయమున్న ఒక ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తకు ఫోన్ చేసి, "ఇంతకీ ఈయన school of thought ఏమిటీ" అని చికాకు పడ్డారు. ఈ సంగతి నాకు ఆ కార్యకర్త ఫోన్ చేసి చెప్పాడు.
    మన బౌద్ధిక జీవితం(intellectual life)తటస్థ పరిశీలననుంచి పూర్తిగా దూరమైపోతోందా?!

    ReplyDelete
    Replies
    1. 'వర్ణవ్యవస్థకు మూలం ఆర్యులా, సింధునాగరికులా?'అన్న నా పోస్ట్ పై ఈ రోజు(29 జనవరి) 'సూర్య'దినపత్రిక సంపాదకీయం(బుర్రకావరం)లో చేసిన పరోక్ష ప్రస్తావనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
      "కులం దక్షిణాదిలో పుట్టిందా, ఉత్తరాదిలో ఆవిర్భవించిందా, స్థానికులే దానికి రూపునిచ్చారా అనే మీమాంస ఈమధ్య కొత్తగా తల ఎత్తింది. కులం భారతీయమేనని చెప్పి కులకర్తలు ఆర్యులు కారనే అభిప్రాయాన్ని ప్రచారంలో పెట్టే యత్నం జరుగుతున్నది. కులం ఎక్కడైనా పుట్టి ఉండవచ్చు. అది చర్చనీయాంశం కాదు. దేశ మెజారిటీ ప్రజలను ఇప్పటికీ హీనవృత్తులు చేసుకొని కనాకష్టంగా బతికే దుస్థితిలో ఉంచడమే కాకుండా అవినీతి అల్పత్వాన్ని ఆ కులాలకే అంటగట్టి ప్రచారం చేసే సామాజిక ఉగ్రవాదం ప్రబలుతూ ఉండడం అత్యంత గర్హనీయమైనది. అణగారిన, వెనుకబడిన కులాల ప్రజల మీద మేధావులనుకేవారు చేస్తున్న ఈ సాంస్కృతికమైన దాడిని ఈ దేశ మూలవాసీ సమాజం, మెజారిటీ ప్రజలు ఒక్క కంఠంతో నిరసించాలి."

      Delete
    2. చిన్న సవరణ: పై పోస్ట్ లో చివరివాక్యాన్ని ఇలా చదువుకోవాలి:"అణగారిన, వెనుకబడిన కులాల ప్రజల మీద మేధావులనుకునేవారు చేస్తున్న ఈ సాంస్కృతికమైన దాడిని ఈ దేశ మూలవాసీ సమాజం, మెజారిటీ ప్రజలు ఒక్క కంఠంతో నిరసించాలి."

      Delete