Tuesday, January 29, 2013

లైంగిక నేరాలు: కోరికల అణచివేతే కారణమా?

ఏ సమస్యకైనా చాలా ముఖాలు ఉంటాయి. ఒకటి రెండు ముఖాలపైనే దృష్టి పెడితే సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదు. లైంగిక అత్యాచారాలనే చూద్దాం. లైంగిక అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ఎలాంటి చట్టాలు ఉండాలి; వారికి ఉరిశిక్ష వేయాలా, లేక యావజ్జీవశిక్ష చాలా; రసాయనిక ప్రక్రియలో వారి పుంసత్వాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా ఉంటుంది?...వగైరా అంశాల  చుట్టూనే చర్చ ఎక్కువగా తిరుగుతోంది. జస్టిస్ వర్మ కమిటీ నివేదికపై చర్చలో కూడా ఇవే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి.  అత్యాచారాల నేరస్తులను శిక్షించడంపైనే కాక, అత్యాచారాల నివారణపై కూడా దృష్టిని కేంద్రీకరించాలనీ, వాటి సామాజిక మూలాలను కూడా గమనించాలనీ స్వయంగా జస్టిస్ వర్మ కూడా అన్నారు.

అంటే, అత్యాచారాల సమస్యను కేవలం శాంతి, భద్రతల కోణం నుంచి మాత్రమే చూసినందువల్ల ప్రయోజనం ఉండదనీ; సామాజిక సమస్యగా కూడా చూడాలనీ జస్టిస్ వర్మే కాక చాలామంది అభిప్రాయం. సామాజిక సమస్యగా చూసినప్పుడు పరిష్కార మార్గాలను సమాజంలోనే వెతకవలసి ఉంటుంది. పసి పిల్లలని కూడా చూడకుండా అత్యాచారం జరిపే పశుప్రవృత్తి(వేరే మాట దొరకక ఈ మాట వాడుతున్నాను. పశువులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించవు) మనుషుల్లో ప్రకోపించడం వెనుక సామాజిక కారణాలు తప్పనిసరిగా ఉంటాయి. (ఆడ శిశువుల భ్రూణ హత్యలు, పరువు హత్యలు తదితర కారణాలతో) జనాభాలో స్త్రీ-పురుష నిష్పత్తి తగ్గిపోతున్న సంగతి తెలిసినదే. అదే  అత్యాచారాల వంటి సామాజిక వికృతులకు దారి తీయిస్తోందా అని నాకో అస్పష్ట అనుమానం ఉంది. ఉత్తర భారతంలో కొన్ని చోట్ల వధువు దొరకడం చాలా కష్టమైపోయి, సోదరులు పాండవ ఆచారాన్ని పాటిస్తున్నారని ఆమధ్య ఒక వార్త చదివాను. ఆడపిల్లకు పెళ్లి చేయడం ఎంత కష్టమయ్యేదో(ఇప్పుడు కావడం లేదని కాదు) ఇప్పుడు మగపిల్లవాడి పెళ్లి చేయడం అంతే కష్టంగా పరిణమించడం చాలా చోట్ల చూస్తున్నాం. ఇలాంటి వాటికీ అత్యాచారాలకూ ముడి ఏమైనా ఉందా అన్నది సామాజిక శాస్త్రవేత్తలే చెప్పగలరు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ, రచయిత్రి జూపాక సుభద్ర 'మృగాళ్ళు లేని నిర్భయ సమాజానికి...' అనే శీర్షికతో రాసిన(29 జనవరి, ఆంధ్రజ్యోతి)ఒక వ్యాసంలో కొన్ని ఆసక్తికర, చర్చనీయ వ్యాఖ్యలు చేశారు. వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను:

1. పిల్లలు మేజర్లు కాగానే అత్యధికులు ఆర్థిక స్వతంత్రులు కాలేక పోతున్నారు. ఇష్టమొచ్చిన చదువు/నైపుణ్యాలను సంపాదించుకోడానికి, ఇష్టమొచ్చిన జీవితభాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి తగిన ప్రోత్సాహం లేక తరచు తల్లిదండ్రులు, సమాజం నుంచి, కట్టుబాట్ల పేరుతో ఆంక్షలు, నియంత్రణలు, తిరస్కారాలను ఎదుర్కోవలసివస్తోంది. 

2. ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడే తత్వం, సోమరితనం, నిరుద్యోగం యువతలో బాగా పెరిగింది. 

3. యువతుల్లో, ఆడపిల్లల్లో కుటుంబ వ్యవస్థ, సమాజం న్యూనతాభావాన్ని, అశక్తతను పెంచాయి.

4. లైంగిక కోర్కెలను నిగ్రహించుకోవాలి, తీర్చుకోవడం తప్పు అనే సంఘ నీతి వల్ల యువత లైంగిక సహజాతాలను అణచి పెట్టుకోవలసి వస్తున్నది. లేదా వక్రమార్గాలు తొక్కి లైంగిక నేరాలకు పాల్పడుతున్నది. 

5. అతిశయించిన అల్లరి చేష్టల(వేధింపుల)తోనైనా నాయికలను అనుకూలం చేసుకునే హీరో పాత్రలుండే సినిమా దుష్ట సంస్కృతి ప్రభావం యువకుల్లో పెరిగింది. 

6. సోషల్ కాస్ట్రేషన్(సామాజిక లింగాధిపత్యాన్ని తొలగించడం) అవసరమని పాత్రికేయ మిత్రుడు రమేష్ హజారే సరిగానే చెప్పాడు. కూడు, గూడు, గుడ్డ అని నినదించి పథకాలు ప్రవేశపెట్టాయనీ, ఇదే మాదిరిగా నిద్ర, మైథునం కొరవడిన బానిసలకు అవి అందించే పథకాలనూ ప్రవేశపెడితే సమాజంలో లైంగిక నేరాలు తగ్గుతాయేమో ప్రభుత్వాలు పరిశీలిస్తే బాగుంటుందని మరో సీనియర్ పాత్రికేయుడు అభిప్రాయపడ్డాడు. 

7. కొన్ని సమాజాల్లో పిల్లలు యవ్వనంలోకి ప్రవేశించగానే లైంగిక స్నేహాలు చెయ్యడానికి, స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి వ్యక్తిగత స్వేచ్ఛ కలిగి ఉన్నారు. 

8. అరుదైన నేరాలకు ఉరిశిక్ష ఉండాల్సిందే అంటున్న కేంద్రప్రభుత్వం చివరికి తన ఉరి కత్తిని బలహీనమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాలున్న నేరస్తుల మెడ పైకే తెస్తుంది. బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాలున్న నేరస్తులను వదలివేసే ప్రమాదముంది. 

2 comments:

  1. సహజాతానికి అవుట్ లెట్ లేకపోవడము ఖచ్చితంగా ఒక కారణము. అయితే సహజాతాలని సంస్కరించుకోవడమే విద్యా, నాగరికతల లక్ష్యాలు. లైంగిక నేరాల వెనక ఉన్న కారణము కేవలం లైంగికమైనది మాత్రమే కాకుండా ఆహానికి సంబంధించినది కూడానాట. బాధితులపై ఆధిపత్యాన్ని సాధించాలనే కోరిక వల్ల కూడా క్రూరంగా ప్రవర్తిస్తారట. ఈ మధ్య ఒక వార్తా పత్రికలో చదివాను.

    ReplyDelete
  2. సమస్య సంక్లిష్టం. చాలా కోణాలనుంచి పరిశీలించాల్సి ఉంటుంది. చదువుకు, నాగరికతకు దూరంగా ఉన్నారనుకునేవారు కూడా ఇలాంటి విషయాల్లో నాగరికంగా ప్రవర్తిస్తారు. చదువు, నాగరికత ఉన్నాయనుకునేవారు కూడా అనాగరికంగా ప్రవర్తిస్తారు. లోతుకు వెడుతున్న కొద్దీ వ్యవస్థాగత లోపాలే కారణమనిపిస్తుంది.

    ReplyDelete