Wednesday, January 30, 2013

కలకత్తా కాంగ్రెస్ లో చీపురు పట్టిన గాంధీ

                                                    (ఈ రోజు గాంధీజీ 65వ వర్ధంతి)

గాంధీ కన్నా సుభాస్ చంద్ర బోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గొప్ప నాయకులని కొన్ని రోజుల క్రితం ఎం.ఐ.ఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ ముగ్గురూ గొప్ప నాయకులని అనడం వరకు బాగానే ఉంది. కానీ మధ్యలో గాంధీని తీసుకొచ్చి ఆయన గొప్ప నాయకుడు కాడని అనడం ఎందుకో తెలియదు. సందర్భం, అవసరం లేకపోయినా గాంధీని రెక్క పుచ్చుకుని మరీ మధ్యలోకి  లాగి ఆయన మీద ఓ రాయి వేయడం చాలామందికి  పరిపాటిగా మారింది. పాపం ఆయన పువ్వులూ, రాళ్లూ రెంటినీ స్వీకరించక తప్పడం లేదు.

ఎవరు గొప్ప నాయకులో నిర్ణయించడానికి ఎవరి కొలమానాలు వాళ్లకుంటాయి. ఆ జోలికి పోకుండా చెప్పుకోవాలంటే గాంధీ ఎవరితోనూ పోల్చలేని నాయకుడు. ఆధునిక భారతదేశంలో ఆ చివరినుంచి ఈ చివరివరకు యావన్మందీ నాయకుడిగా గుర్తించిన ప్రథమ నాయకుడు ఆయనే. ఒక మహాసేనానిగా ఎంతో చాకచక్యంగా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేసిన ప్రథమ నాయకుడు కూడా ఆయనే. ఆచి తూచి సహచరులను ఎంపిక చేసుకోవడంలో, వారిని నేర్పుగా వాడుకోవడంలో, వారితో రాజకీయ సంబంధాలే కాక వ్యక్తిగత ఆత్మీయ సంబంధాలను పెంచుకోవడంలో, సహచరుల మధ్య పరస్పర మైత్రిని ప్రోత్సహించడంలో గాంధీ తనకు తనే సాటి అనిపించుకోగల నాయకుడు. గాంధీ గురించి అన్నీ పార్స్వాలనూ తెలుసుకుని ఆయన నాయకత్వ దక్షతను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బుద్ధినీ, హృదయాన్నీ కూడా అంచనా వేయాలంటే ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవాలి.

గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ రచించిన 'మోహన్ దాస్' అలాంటి పుస్తకాలలో ఒకటి. నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో తెలుసుకోడానికి అదొక పాఠ్య గ్రంథం. నేటి నాయకులందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.

ఆ పుస్తకం ఆధారంగా గాంధీ గురించి కొన్ని ముచ్చట్లు...

                                                                        *
కాంగ్రెస్ సభల్లో చీపురు పట్టిన గాంధీ

గాంధీ 1901లో కలకత్తాలో జరిగిన ఏ.ఐ.సీ.సీ సమావేశాలలో పాల్గొన్నాడు. వెళ్ళేటప్పుడు నాటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రయాణిస్తున్న రైలులోనే తనూ ఎక్కాడు. మధ్యలో, ముందుగానే నిర్ణయించుకున్న స్టేషన్ లో దిగి అగ్రనేతల బోగీలోకి వెళ్ళి వాళ్ళను పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన బోగీలోకి వెళ్లిపోయాడు.

కలకత్తా సదస్సులో ఆయన రెండు పాత్రలు నిర్వహించాడు. గోఖలే సాయంతో దక్షిణాఫ్రికా పోరాటంపై తీర్మానం ప్రతిపాదించి అయిదు నిమిషాలు దానిపై మాట్లాడడం మొదటిది. ఒక చీపురు తీసుకుని సమావేశస్థలిని తుడిచి శుభ్రం చేయడం రెండవది. ఆయన ఆ పని చేస్తుంటే అంతా కళ్ళప్పగించి చూశారు తప్ప అందులో పాలుపంచుకోడానికి  ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత, కాంగ్రెస్ కార్యదర్శులలో ఒకడైన జానకీనాథ్ ఘోశాల్ గుట్టలా పోగుబడిన ఉత్తరాలకు సమాధానం రాయడంలో సతమతమవుతుంటే గాంధీ వెళ్ళి ఆయనకు సహకరించాడు. ఇన్ని చేస్తూనే చాలామంది నాయకులను కలసి మాట్లాడాడు. కాంగ్రెస్ పనితీరు గురించి మొత్తం సమాచారం రాబట్టాడు.

                                                                      *

దొరకని వివేకానంద దర్శనం

కలకత్తాలో స్వామీ వివేకానందను దర్శించడానికి ఎంతో ఉత్సాహపడుతూ సుదూరంగా ఉన్న బేలూర్ మఠం వరకూ నడచి వెళ్ళాడు. తీరా అంత దూరం వెళ్ళాక, స్వామి కలకత్తాలోనే ఉన్నారనీ, చాలా అస్వస్థులుగా ఉన్నారనీ, చూడడానికి వీలు పడదనీ మఠంలో వాళ్ళు చెప్పారు. గాంధీ నిరాశతో వెనుదిరిగాడు.

                                                                         *
'చరిత్ర సృష్టించు'

గాంధీ మొదటిసారి పటేల్ ను అహమ్మదాబాద్ లోనూ, నెహ్రూను లక్నోలోనూ, కృపలానీని శాంతినీకేతన్ లోనూ, రాజేంద్రప్రసాద్ ను బీహార్ లోనూ కలుసుకున్నాడు.

కృపలానీ తనను చరిత్ర అధ్యాపకుడిగా పరిచయం చేసుకున్నాడు. 'నాతో కలసి పనిచేస్తూ చరిత్ర సృష్టించ' మని గాంధీ ఆయనతో అన్నాడు.

                                                                        *
ఊళ్ళోలేని రాజేన్ బాబు 

నీలిమందు రైతుల పోరాటానికి మార్గదర్శనం చేయమని రాజ్ కుమార్ శుక్లా అనే రైతు గాంధీని కోరాడు. గాంధీ ఆయనతో కలసి అహమ్మదాబాద్ నుంచి ఉత్తర బీహార్ కు బయలుదేరి వెళ్ళాడు. మార్గమధ్యంలో పాట్నాలో దిగారు. న్యాయవాది రాజేంద్రప్రసాద్ ఇంటికి గాంధీని శుక్లా తీసుకువెళ్లాడు. రాజేంద్రప్రసాద్ ఊళ్ళో లేడు. ఆయన ఇంట్లో పనివారు గాంధీని తక్కువ కులస్తుడిగా భావించి బావినీ, పాయిఖానాను వాడుకోడానికి ఒప్పుకోలేదు. అక్కడినుంచి గాంధీ, శుక్లా ముజాఫర్ పూర్ బయలుదేరారు.

వాళ్ళు వస్తున్నట్టు తెలిసి కృపలానీ కొంతమంది విద్యార్థులతో కలసి అర్థరాత్రి వేళ స్టేషన్ కు వచ్చాడు.  చేతుల్లో లాంతర్లు ఉన్నా గాంధీని పట్టుకోవడం కృపలానీకి కష్టమైంది. కారణం...ఆయన మూడో తరగతి బోగీలోంచి దిగాడు.

పాట్నా తిరిగొచ్చిన రాజేంద్రప్రసాద్ గాంధీ వచ్చి వెళ్ళిన సంగతి తెలిసి నొచ్చుకుంటూ ముజఫర్ పూర్ వచ్చి గాంధీని కలుసుకున్నాడు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని అనువదించి ఇవ్వడం ఆయనకు గాంధీ అప్పగించిన మొదటి  పని.

భవిష్యత్తులో రాజేంద్రప్రసాద్ భారత తొలి రాష్ట్రపతి అయ్యారు.

                                                                     (మోహన్ దాస్ తెలుగు అనువాదం ఎమెస్కో ప్రచురించింది)

సంబంధిత పోస్ట్:  గాంధీ గురించి సరదాగా కొన్ని...(సెప్టెంబర్ 2012)

No comments:

Post a Comment