Friday, February 1, 2013

వివాదాల 'విశ్వరూపం'

'విశ్వరూపం' వివాదం క్రమంగా విశ్వరూపాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం జరిగే చర్చలలో అంగీకారం కుదిరి సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోతే కమల్ హాసన్ అభిమానులే కాక అందరూ సంతోషిస్తారు. అంతకుముందు కమల్ హాసన్ భావోద్వేగ ప్రసంగం ఆయన ఎంత గాయపడ్డాడో, వందకోట్ల రూపాయిల భారీవ్యయంతో నిర్మించిన తన సినిమాను ఆడించుకోడానికి ఎంతటి పోరాటం చేసి అలసిపోయాడో వెల్లడించింది. "నా ఇంటితో సహా ఆస్తులన్నీ ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టాననీ, నష్టం వస్తే వాటన్నిటినీ వదలుకుంటాననీ, ఉండడానికి గూడు లేకపోయినా తనకు తిండి పెట్టే వాళ్ళు ఉన్నారనీ, ఏదైనా సెక్యులర్ రాష్ట్రానికో, దేశానికో వెళ్లిపోతా"ననే స్థాయిలో ఆయన స్పందించాడంటే మానసికంగా ఎంత చిత్రవధను ఎదుర్కొన్నాడో అర్థంచేసుకోవచ్చు. ఆయన రాజకీయ అనుబంధాలు ఏవీ లేని వట్టి కళాకారుడు కావడాన్ని అలుసుగా తీసుకుని తెరవెనుక శక్తులు కొన్ని ఒక ఆట ఆడించాలని చూసినట్టు అర్థమవుతూనే ఉంది. రాజకీయమైన అండ లేకుండా ఒక కళాకారుడు, లేదా మరో రంగానికి చెందిన వ్యక్తి  నెగ్గుకురాలేని  పరిస్థితులు దేశంలో ఉన్న సంగతిని కమల్ హాసన్ ఉదంతం మరోసారి రుజువు చేసింది.

నలభై ఏళ్లుగా సినిమా రంగంలో ఉండి, సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన కమల్ హాసన్ లాంటి అనుభవశాలి ఏ ఒక్క వర్గాన్ని అయినా నొప్పించే సన్నివేశాలు, మాటలు సినిమాలో చొప్పిస్తాడంటే నమ్మడం కష్టం. అందులోనూ మరింత సున్నితమైన మతవిశ్వాసాలను నొప్పించే సాహసానికి పాల్పడడం అసలే ఊహించలేని విషయం. అయితే, ఇంకో వాస్తవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున ఒక సినిమాకో, ఒక కళాకారునికో తుపాకీ గురి పెట్టడానికి  బలమైన, హేతుబద్ధమైన కారణం ఉండనవసరం లేదు. రాజకీయబలం, మందబలం,  రాజకీయంగా లాభించే అవకాశం ఉంటే చాలు. జనబలం ఒకవైపు; ఒంటరి వ్యక్తి ఇంకొకవైపు మోహరించినప్పుడు ఆ వ్యక్తి వైపే న్యాయమూ, హేతుబద్ధతా ఉన్నాసరే, ప్రభుత్వాలు కూడా జనబలం వైపే మొగ్గుతాయన్న చేదునిజాన్ని మరచిపోకూడదు. 'ఎవరు కరెక్టు?' అన్న మీమాంస రాజకీయపక్షాలకు అక్కరలేదు. 'పోలిటికల్ గా ఏది కరెక్టు?' అని మాత్రమే అవి చూసుకుంటాయి.  ప్రత్యేకించి  సినిమాల విషయంలో ప్రతిఘటన ధోరణి ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. చీకట్లో వేటగా పరిణమించింది. కనుక సినిమాలు తీసేవారు మరింత హెచ్చరికను పాటించవలసిన అవసరం ఉంది. అందులోనూ కమల్ హాసన్ లాంటి వారు తీసే  సినిమా క్లాస్, మాస్ అనే  తేడా లేకుండా అన్నివర్గాలవారికీ చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక అసలే ఛాన్స్ తీసుకోకూడదు.

'విశ్వరూపం' సినిమా నాతో సహా చాలామంది చూడలేదు కనుక దాని సంగతి అలా ఉంచి, చాలా  సినిమాలలో కనిపించే  ఒక లోపం గురించి చెప్పుకోవాలి.  సినిమాలవారు తమకు అంతగా తెలియని అంశాలలోకి కథాపరంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు తగిన హోమ్ వర్క్ చేసుకోరు. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా వ్యవహరిస్తారు.

ఉదాహరణకు ఒక సినిమాలో హీరో అజ్ఞాతంగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. పోలీసులు అతనిని పట్టుకోడానికి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న అతని సహాధ్యాయులందరినీ కస్టడీలోకి తీసుకుని, అతని ఆచూకీ చెప్పమని  చిత్రహింసలు పెడతారు. ఏ జానపద కథలోనో,  ఏ నియంతృత్వ దేశంలోనో అలా జరగొచ్చేమో కానీ, ఒక ప్రజాస్వామ్య దేశంలో అలా ఎప్పుడూ జరగదు. ఇంకో సినిమాలో హీరోయిన్ ఒక వారపత్రిక ఆఫీసుకు వెళ్ళి సంపాదకుని కలసి తను రాసిన నవలను ఇచ్చి ప్రచురించమని అడుగుతుంది. ఆ సంపాదకుడు కనీసం ఆమెను కూర్చోమని కూడా అనకుండా అమర్యాదగా, చులకనగా మాట్లాడతాడు. నిజజీవితంలో రచయితలపట్ల ఏ సంపాదకుడూ అంత మొరటుగా  ప్రవర్తించడు.

మిగిలినవారి సంగతి ఎలా ఉన్నా కమల్ హాసన్, ఆమిర్ ఖాన్ లాంటివారు కథాఘట్టంలోనే ఎంతో రీసెర్చ్ చేస్తారనీ, చిత్రీకరణ దశలో కూడా ఎన్నో కోణాలనుంచి జాగ్రత్తలు తీసుకుంటారనే అభిప్రాయం చాలామందిలో  ఉంది. అయినాసరే, విశ్వరూపం  విషయంలో ఇలా జరిగిందంటే;  ఆ సినిమా కథా ఘట్టంలోనో, చిత్రీకరణ దశలోనో  కమల్ హాసన్  తనకు తెలిసిన ఒకరిద్దరు ముస్లిం మేధావులతో  మాట్లాడి ఇప్పుడున్న వాతావరణంలో ముస్లింలు తన సినిమాను వ్యతిరేకించే అవకాశం ఏ కొంచెమైనా ఉంటుందా అన్నది  తెలుసుకునే ప్రయత్నం చేసారా అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది.

విశ్వరూపం వివాదాన్ని పక్కన ఉంచి ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. భావప్రకటన హక్కు ఎంతైనా శిరోధార్యమే కానీ అది పరిమితులు లేనిది మాత్రం కాదు. మీడియా భావ ప్రకటన హక్కుకు ప్రత్యక్ష సాక్ష్యం అని అందరూ అనుకుంటారు. అది అపరిమితమైన స్వేచ్ఛను అనుభవిస్తోందని కూడా భ్రమపడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, మీడియా కూడా భావప్రకటనలో కొన్ని హద్దులు పాటిస్తూనే ఉంటుంది. సెంటిమెంట్లను, మనోభావాలను దృష్టిలో పెట్టుకుంటూనే ఉంటుంది. మీడియా ఒక్కటే కాదు, ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతివారూ భావప్రకటన పరిమితులను గమనించుకుంటూనే ఉంటారు. ఓ సారి ఓ పెద్దమనిషి,  "మీడియా ఎప్పుడూ నెగెటివ్ విషయాలే ఎందుకు ఫోకస్ చేస్తుంది? జనంలో అనుకూల భావనను ప్రోత్సహించే నిర్మాణాత్మకమైన విషయాలను ఎక్కువగా ఇవ్వవచ్చు కదా!" అని ఒక సంపాదకునితో అన్నాడు. అప్పుడా సంపాదకుడు, "అయ్యా, మీకు తెలియదేమో, మీడియా రిపోర్ట్ చేసే విషయాలకంటే, చేయకుండా దాచే విషయాలే చాలా ఎక్కువ. మీడియాకు తెలిసినవన్నీ బయట పెడితే దేశం అల్లకల్లోలమైపోతుంది" అన్నాడు.

సినిమా కూడా ఒక మీడియాయే కనుక భావప్రకటన పరిమితులను గుర్తించక తప్పదు. ఇలా అన్నానని విశ్వరూపం సినిమాలో నిజంగానే ముస్లిం లను గాయపరిచే అంశాలు ఉన్నాయనీ, కనుక ఆ సినిమాను అడ్డుకోవడం న్యాయమేననీ నేను అంటున్నట్టు దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏ చిన్నఅవకాశం దొరికినా సినిమా ప్రదర్శనను అడ్డుకునే ధోరణి ప్రబలిందనీ, అదొక రాజకీయశిక్షణ కార్యక్రమంగా మారిందనీ ముందే చెప్పాను. ఆ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా తమ భావప్రకటన హక్కును వినియోగించుకునే అవకాశం లేదా  అన్నదే నా ప్రశ్న.

ప్రస్తుతానికి ఇది ఊహాప్రాయమైన ప్రశ్న మాత్రమే. ఇంతకీ విశ్వరూపంలో వివాదం రేకెత్తించే అంశాలు ఏమాత్రమైనా ఉన్నాయో లేవో సినిమాను ఆమూలాగ్రంగా  చూస్తే తప్ప తెలియదు. రాజీ కుదిరి అందులో భాగంగా కత్తిరింపులు జరిగితే ఆ అవకాశమూ ఉండదు. ఆ చర్చా ఉండదు.

No comments:

Post a Comment