Sunday, February 17, 2013

రాజమండ్రి నుంచి నల్లజెర్ల మీదుగా ఎప్పుడైనా ఏలూరు వెళ్ళారా?!

కొన్ని రోజుల క్రితం ఒక పెళ్ళికి వెళ్లడానికి హైదరాబాద్ నుంచి కారులో ఖమ్మం మీదుగా  కాకినాడకు బయలుదేరాం. అది  టూ లేన్ రోడ్డు. చాలావరకు బాగానే ఉంది కానీ కొన్నిచోట్ల దెబ్బతింది. దూరమూ, సమయమూ కలిసొస్తాయని ఈ రూటులో బయలుదేరాం.  అక్కడక్కడ రోడ్ల పరిస్థితి చూసిన తర్వాత అదే  పొరపాటైందనిపించింది. తిరుగు ప్రయాణంలో విజయవాడ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాం.

 అలాగే తిరుగు ప్రయాణంలో రాజమండ్రి, కొవ్వూరు, పంగిడి, నల్లజెర్ల మీదుగా విజయవాడకు బయలుదేరాం. కొంతదూరం వెళ్ళిన తర్వాత,  ఈ రూటు కంటే ఖమ్మం రూటే వెయ్యిరెట్లు నయమనిపించింది.  భీమడోలు వరకూ కొన్ని చోట్ల రోడ్డు తవ్వేశారు.  దాంతో కంకర రాళ్ళు పైకి తేలాయి.  పెద్ద పెద్ద గోతులు, గతుకులు, మట్టి దిబ్బలు  ఏర్పడ్డాయి.  వాటి మీదనుంచి పడుతూ లేస్తూ ప్రయాణించడం మట్టి రోడ్లపై ప్రయాణం కన్నా కూడా అధ్వాన్నం అయింది.  ఎదురుగా ఏముందో కనిపించని స్థాయిలో లారీలు, బస్సుల వంటి భారీ వాహనాలు  కొన్ని అడుగుల ఎత్తున దుమ్ము రేపుతూ వెడుతున్నాయి. కారులో వెళ్ళే వారు విండో తలుపులు మూసుకున్నా, బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాలపై వెళ్ళేవారు ఆ దుమ్ము కొట్టుకుంటూ, దానినే  పీలుస్తూ వెళ్లవలసిందే. అది వాళ్ళ ఆరోగ్యానికి ఎంత చెరుపు చేస్తుందో ఊహించుకోగలం.

దారి పొడవునా సేద్యపు నీటి కాలువలు ఉన్నాయి. వాటిల్లో నీరు ప్రవహిస్తోంది.  ఈ కాలువల నిర్మాణం కోసమే  అటూ ఇటూ కొంత మేర రోడ్డు తవ్వేసినట్టు అర్థమైంది. ఖమ్మం నుంచి వెళ్ళే రూటులో కూడా గోపాలపురం దాటిన తర్వాత  కొన్ని వేల గజాల మేర ఇలాగే రోడ్డు తవ్వేశారు.  విచిత్రం ఏమిటంటే నాలుగైదేళ్ళ నుంచీ ఈ రోడ్డు ఇదే స్థితిలో ఉంది. కాలువల నిర్మాణం పూర్తయినా తవ్వేసిన చోట్ల పక్కా రోడ్డు వేయలేదనీ,  ఈ దుస్థితికి అదే కారణమనీ అర్థమైంది. పక్కా రోడ్డు ఎందుకు వేయలేదంటే, కాలువల నిర్మాణం ఇరిగేషన్ శాఖ బాధ్యత. రోడ్డు నిర్మాణం రోడ్లు-భవనాల శాఖ బాధ్యత. ఆ రెండు శాఖల మధ్య సమన్వయం, సహకారం, ఉమ్మడి టైమ్ టేబుల్  లేవన్న మాట. ఇంతకు మించి మరో కారణం కనిపించడం లేదు. ఈవిధంగా రెండు శాఖలూ కలసి రోడ్డు వినియోగదారులకు నరకం చూపిస్తున్నాయి. వాళ్ళ ఆరోగ్యాలకు చెరుపు తెస్తున్నాయి. ఇరిగేషన్, రోడ్లు-భవనాల శాఖల మంత్రుల మధ్య కూడా సమన్వయం, సహకారం లేవని దీనినిబట్టి అనుకోవాలి.

ఏళ్ల తరబడిగా ఈ రోడ్డుమీద ప్రయాణించే జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు; రాజకీయనాయకులు ఈ సమస్యను ఎందుకు గుర్తించలేదో, పరిష్కారానికి ఎందుకు పూనుకోలేదో అర్థంకాదు. ప్రజల సౌకర్యాలపట్ల, ప్రజారోగ్యం పట్ల  ఖాతరు లేకపోవడం తప్ప ఇందుకు వేరొక కారణాన్ని ఊహించలేం.

ఇంతటితో అయిపోలేదు. ఈ రోడ్డు మీద ఇంతకంటే ఘోరమైన దృశ్యాలు కనిపించాయి. గౌరీపట్నంతో మొదలుపెట్టి  దేవరపల్లి దాటే వరకు తామర తంపరలా ఎన్నో స్టోన్ కటింగ్ యూనిట్లు కనిపించాయి. భారీ ఎత్తున రాళ్ళు కొట్టే కార్యక్రమం జరుగుతోంది. కనుచూపు మేర అంతటా మట్టి, దుమ్ము పేరుకుపోయాయి. రోడ్డు పక్కనే నివాసగృహాలు, పొలాలు, అరటితోటలు ఉన్నాయి. వేలాదిమంది జనం అక్షరాలా దుమ్ములో, మట్టిలో జీవిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అరటితోటల్లో ఎక్కడా ఆకుపచ్చదనం కనిపించలేదు. కొన్ని కిలోమీటర్ల మేర పచ్చని అరటి ఆకులు కాస్తా బూడిదరంగులోకి తిరిగిపోయాయి.

కొండల్ని పిండి చేసే ఇన్ని స్టోన్ కటింగ్ యూనిట్లకు, అందులోనూ నివాస ప్రాంతాల మధ్య ఎలా అనుమతి ఇచ్చారో తెలియదు. పర్యావరణవాదులు, ప్రజారోగ్యసంరక్షణవాదులు ఈ దారుణాన్ని ఎలా సహిస్తున్నారో తెలియదు. ఇక్కడి జనం ఎలా భరిస్తున్నారో అంతకంటే తెలియదు.

అసలు ఈ ప్రాంతంలో ప్రభుత్వమూ, అంచెలంచెల అధికారయంత్రాంగం  అనేవి ఉన్నాయా అన్నది మిలియన్ డాలర్ల సందేహం!

ఇంకో తమాషా చూసారా?! భీమడోలు దాటే వరకు అధ్వాన్నపు రోడ్డు మీద ఒళ్ళు హూనం చేసుకుంటూ, కారుకు దుమ్ముకొట్టుకుంటూ, కారు టైర్లకు నష్టం కలిగించుకుంటూ ప్రయాణం చేసి  ఎట్టకేలకు నాలుగు లేన్ల రోడ్డు మీదికి చేరుకుంటామా...అక్కడినుంచి హైదరాబాద్ వరకు అడుగడుగునా టోల్ గేట్ల చెల్లింపు! రాను పోనూ మొత్తం 600 రూపాయిలు టోల్ చెల్లించుకున్నాం. రోడ్డు సుఖానికి రుసుము వసూలు చేశారు సరే, రోడ్డు కష్టానికి పరిహారం ఎవరు ఇస్తారు?


No comments:

Post a Comment