Saturday, January 5, 2013

భారత్ భారత్ గానే ఉంది...ఇంకా ఇండియా కాలేదు

"భారత్ లో రేపులు జరగడం లేదు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం వల్ల భారత్ ఇండియా గా మారిపోతున్న పట్టణ ప్రాంతాలలోనే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను భారత్తే కాపాడుతోంది" అన్న ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాటికి  ఇచ్చిన టీకా టిప్పణీ మరింత ఆశ్చర్యం కలిగించింది. ఇదే సమయంలో, "మహిళలు గీత దాటితే సీత గతే" అని మధ్యప్రదేశ్ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్య నిజానికి పై వ్యాఖ్యలలా ఆశ్చర్యం కలిగించలేదు. అయినా సరే, బీజేపీ శ్రేణులు పాపం ఆ మంత్రిని  సమర్థించలేదు. దాంతో ఆయన  ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నారు.

భాగవత్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయనడానికి నా కారణాలు ఇవీ:

1. భారత్ ఇప్పటికీ భారత్ గానే ఉంది. ఇంకా ఇండియా కాలేదు. ఈ భారత్ అనే మహాసముద్రంలో 'ఇండియా' అనేది అక్కడక్కడ చిన్న చిన్న దీవులుగానే ఉంది. గ్రామాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ అనీ; పట్టణాలనూ, నగరాలనూ దృష్టిలో ఉంచుకుని ఇండియా అనీ అనడం చూస్తున్నాం. నేను అనేది ఏమిటంటే, భారత దేశం మొత్తం ఇప్పటికీ ఒక మహాగ్రామమే. మనం ఇప్పుడు గ్రామంగా గుర్తిస్తున్నది చిన్న గ్రామం. పట్టణంగా గుర్తిస్తున్నది అంతకంటే కొంచెం పెద్ద గ్రామం. నగరంగా గుర్తిస్తున్నది ఇంకా పెద్ద గ్రామం. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై లాంటి మహానగరాలు చాలా పెద్ద గ్రామాలు. ఇవన్నీ కలిగిన భారత్ ఒక మహాగ్రామం. కనుక భారతీయుల మందరమూ భారత్ అనే గ్రామంలోనే నివసిస్తున్నాం. జనం చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామానికి, మరింత పెద్ద గ్రామానికి, ఇంకా పెద్ద గ్రామానికి వలస వస్తున్నారు. తమతోపాటు తమ 'సంస్కృతీ, సంప్రదాయా'లను కూడా తీసుకొస్తున్నారు. ఏతావతా చెప్పేదేమిటంటే మానభంగాలు, హత్యలు వగైరాలు అన్నీ భారత్ అనే మహాగ్రామంలోనే జరుగుతున్నాయి. కనుక భారత్/ఇండియా అన్న భాగవత్ గారి వర్గీకరణ వాస్తవిక దృష్టిపై ఆధారపడి చేసింది కాదు. ఆయన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించడానికి అదీ కారణం.  వాస్తవికతను ఏమాత్రం ప్రతిబింబించని ఆ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు  సమర్థించడానికి తంటాలు పడడం రెట్టింపు ఆశ్చర్యం కలిగించడం సహజమే.

భాగవత్ గారి వ్యాఖ్యలతో పోల్చితే మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలో 'భారత్/ఇండియా' గంద్రగోళం ఏమీ లేదు. అది సూటిగా ఉండి, మనకు బాగా తెలిసిన ఓ 'మైండ్ సెట్'ను సూచిస్తోంది, అంతే! కనుక అది ఎలాంటి ఆశ్చర్యమూ కలిగించలేదు. అయినా సరే, పాపం ఆయనకు బీజేపీ నుంచి మద్దతు లభించలేదు.

2. భారత్ లో ఇప్పుడు 'గ్రామం'గా గుర్తించే చిన్న గ్రామంలో రేపులు, బలాత్కారాల లాంటివి ఢిల్లీ లాంటి చాలా పెద్ద గ్రామంలో జరిగినట్టు జరగవు. ఎందుకంటే మరీ చిన్న గ్రామం అవడం వల్ల తప్పించుకోడానికి వీలుండదు. కనుక వేరే పద్ధతుల్లో లొంగదీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. భాగవత్ గారు 'భారతీయ సంస్కృతీ సంప్రదాయా'లను కాపాడేవిగా భావించే భారత్ లోని చిన్న గ్రామాలలో ఖాఫ్ పంచాయతీలు 'పరువు' హత్యలను అమలు చేస్తుంటాయి. ఢిల్లీ లాంటి పెద్ద గ్రామాలలోని పొలిటీషియన్లు ఆ ఖాఫ్ పంచాయతీలను ఖండించే సాహసం చేయరు. భారత్ లోని చిన్న గ్రామాలలో కూడా వరకట్నపు వేధింపులూ, హత్యలూ జరుగుతుంటాయి. భారత్ లోని చిన్న గ్రామం నుంచి యువత పెద్ద గ్రామానికి వెళ్ళడం ఒకవిధంగా ఆటవిడుపుగా ఉంటుంది. పెద్ద గ్రామంలో తమ గ్రామంలో కన్నా విశాలమైన, పరస్పర పరిచయాలు తక్కువగా ఉండే విశాల సమాజాన్ని చూస్తారు కనుక స్వేచ్చకు కళ్లేలు విప్పెస్తారు. ఈవ్ టీజింగ్ లకు వగైరాలకు ఎక్కువగా పాల్పడేది ఇలా చిన్న గ్రామం నుంచి కొత్తగా పెద్ద గ్రామంలోకి అడుగుపెట్టినవారే. రేపులు, ఐటెమ్ డ్యాన్సులు, అశ్లీల సంభాషణలు, హీరో ఓరియెంటెడ్  మసాలా సినిమాలను ఈల వేసి ప్రోత్సహించే మహారాజపోషకులు చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామానికి కొత్తగా  ప్రవహించే  జనాలే. అంతేకాదు, రాష్ట్రాల రాజధానులనే పెద్ద గ్రామాలలోని శాసనసభలను, ఢిల్లీ అనే చాలా పెద్ద గ్రామంలోని పార్లమెంట్ ను ఎక్కువ సంఖ్యలో భర్తీ చేసేది కూడా భాగవత్ గారు చెప్పిన  'భారత్' మహాగ్రామవాసులే.

3. ఇప్పుడు పట్టణాలుగా, నగరాలుగా చెప్పుకునే పెద్ద, ఇంకా పెద్ద గ్రామాలలో కంటే; గ్రామంగా చెప్పుకునే చిన్న గ్రామం జనంలోనే లైంగిక 'చైతన్యం' కూడా ఎక్కువగా ఉంటుంది. నా అనుభవమే చెబుతాను. నేను పట్టణమనే ఒక పెద్ద గ్రామంలో హైస్కూలు చదువు చదువుకున్నాను. నా పది హేనో ఏట గ్రామానికి వెళ్లినప్పుడు, వయసులో చదువులో నాకంటే ఓ ఏడాది జూనియర్ అయిన ఒక మిత్రుడు స్త్రీ-పురుష సంబంధాల గురించి, అందులోనూ తనకు తెలిసిన అక్రమ సంబంధాల గురించీ చెబుతుంటే నేను నోరు వెళ్లబెట్టాను. అప్పటివరకూ నాకు అలాంటి విషయాలు ఏవీ తెలియవు. నేను మొదటిసారి (అదే  చివరిసారి కూడా)'...మేళా'న్ని గ్రామంలోనే చూశాను. రానంటున్నా బలవంతం చేసి ఓ మిత్రుడు తీసుకెళ్ళాడు. '...మేళం' అయిన తర్వాత ఊళ్ళో కామందులు ఒక్కో అమ్మాయిని తీసుకెడతారని కూడా చెప్పాడు. రికార్డింగ్ డ్యాన్సులు కూడా నేను మొదటిసారి గ్రామంలోనే చూశాను. ఇక 'చింతామణి' బూతు నాటకం గ్రామాలలో మహాపాపులర్. ఇలాంటి చిన్నా, పెద్దా గ్రామాలతో నిండిన భారత్తే 'సంస్కృతీ సంప్రదాయా'లను కాపాడుతోందని భాగవత్ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. పైగా అన్యాయంగా పాశ్చాత్యసంస్కృతీ ప్రభావంతో రేపులు ఎక్కువయ్యాయని ఆయన అభాండం వేశారు.

భారత్ లోని గ్రామాలు ఎలా ఉన్నాయో  'బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు' అనే నా పోస్ట్ లోనూ, మరికొన్ని పోస్ట్ లలోనూ  చెప్పడానికి ప్రయత్నించాను. దయచేసి వాటిని ఒకసారి చూడండి.

అలాగే, నేను గ్రామాలను ఏదో అన్నానని అపార్థం చేసుకోవద్దు. మనమందరం భారత్ అనే మహాగ్రామవాసులమే.

                                                                           ****    

సంబంధిత పోస్ట్ లు: 1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీఎంసీల ఫినాయిల్ కావాలి? 2. తెలుగు భాషనే కాదు తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి 3.  తెలుగు సభల్లో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా? 4. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది ? 5. బాహ్యశుద్ధి లేని భక్తి తన్మయంలో తెలుగువారు.


No comments:

Post a Comment