Thursday, March 28, 2013

సంజయ్ దత్ పై శ్రుతిమించిన చర్చలు

పాఠకులు మన్నించాలి. నెల రోజులుగా వేరే పనులలో కూరుకు పోవడం వల్ల ఏ అంశం మీదా నా అభిప్రాయాలు పోస్ట్ చేయలేకపోయాను. అయినాసరే, ఈ నెల రోజులుగా నా బ్లాగ్ చూస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.
                                                                ***
చట్టవిరుద్ధ ఆయుధాలతో పట్టుబడిన సినీనటుడు సంజయ్ దత్ కు సుప్రీమ్ కోర్టు శిక్ష ఖరారు చేసినప్పటినుంచీ అటు వ్యక్తులలో ఆయనకు అనుకూలంగా వ్యక్తమవుతున్న స్పందనా, ఇటు టీవీ చానెళ్లలో daily basis లో జరుగుతున్న చర్చలూ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా ఆవేదన కలిగిస్తున్నాయి. సంజయ్ దత్ ను క్షమించి విడిచిపెట్టాలని మార్కండేయ కట్జూ లాంటి ఒక మాజీ న్యాయమూర్తి, అందులోనూ ప్రెస్ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి వాదిస్తున్న తీరు మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అన్ని రంగాలలో ప్రమాణాల అథఃపతనాన్నే ఇది సూచిస్తోంది. సంజయ్ దత్ చేసిన నేరం చిన్నదా, పెద్దదా, ఆయనను క్షమించి విడిచిపెట్టవచ్చా అనే విషయంలో వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉండచ్చు. కానీ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసిన తర్వాత తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడంలో హద్దులు పాటించాలి. అనేక అంశాలను, విలువలను దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే, ప్రముఖులకు ఒక న్యాయం, సామాన్యులకు ఇంకో న్యాయం అనే తప్పుడు సంకేతాలు జారీ అవుతాయి. న్యాయవ్యవస్థ ప్రతిష్టను పలచన చేస్తాయి. సంజయ్ దత్ లానే జైబున్నీసా అనే 70 ఏళ్ల సాధారణ మహిళ  కూడా శిక్షను ఎదుర్కుంటోంది. కానీ ఆమె సంజయ్ దత్ లా చర్చలోకి రావడం లేదు. ఆమెపై సానుభూతి సంజయ దత్ స్థాయిలో వ్యక్తం కావడం లేదు. అలాగే, సంజయ్ దత్ ఇంటి నుంచి చట్టవిరుద్ధ ఆయుధాలను ఇంకోచోటికి తరలించిన వ్యక్తికి సంజయ్ దత్ కంటే పెద్ద శిక్ష పడింది. ఇలాంటివి న్యాయస్థానం నాలుగు గోడల మధ్య చర్చించుకోవలసిన విషయాలు. అందులోనూ న్యాయనిపుణులు చర్చించవలసిన విషయాలు. కానీ వీటిని టీవీ చానెళ్లలో daily basis పద్ధతిలో చర్చిస్తున్నారు. టీవీ స్టూడియో లనే కోర్టు రూములుగా మార్చేస్తున్నారు.
టీవీ చానెళ్లు సంజయ్ దత్ పై చర్చలు నిర్వహిస్తున్న తీరూ ఇంతే విషాదకరం. చానెళ్లు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ చర్చలు నిర్వహిస్తున్నాయి. ప్రతి రోజూ అవే ముఖాలు చర్చల్లో పాల్గొంటున్నాయి. యాంకర్లు అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు. చర్చలో పాల్గొనేవారు చేసిన వాదమే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. చానెళ్లు టీయార్పీ రేటింగ్ కోసం పాకులాడుతూ ఈ చర్చలు నిర్వహిస్తున్నాయి తప్ప, శ్రోతలు విసుగొచ్చి టీవీ చూడడం మానేస్తున్నారన్న వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. ఒక చానెల్ అయితే, నిన్న మీడియా ముందుకు వచ్చిన సంజయ్ దత్ ప్రతి కదిలిక మీద వ్యాఖ్యానిస్తూ వెగటు పుట్టించింది. అటు వ్యక్తులూ, మీడియా కూడా తమ వ్యవహారశైలిని పునస్సమీక్షించుకోవడం అవసరం. 

No comments:

Post a Comment