Sunday, March 31, 2013

డబ్బింగ్ సీరియెల్సేనా? ఎన్నో నిషేధించాలి!

టీవీ చానెళ్లలో డబ్బింగ్ సీరియెల్స్ ను నిషేధించాలని తెలుగు టీవీ కళాకారులు ఆందోళనచేస్తున్నారు.  తెలుగు సినీపరిశ్రమవారు కూడా డబ్బింగ్ సినిమాలను నిషేధించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ డిమాండ్ లు నెరవేరితే వాటినుంచి స్ఫూర్తిని పొంది మరికొన్ని డిమాండ్ లు ఇలా మొదలవచ్చు:

హైదరాబాద్ లాంటి నగరాలలో  పిజ్జాలు, బర్గర్లు వగైరాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దాంతో ఇడ్లీ, సాంబార్,దోస హోటళ్ళ వ్యాపారం దెబ్బతింటోంది. కనుక పిజ్జా,  బర్గర్ వగైరాల అమ్మకాలను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్ దినపత్రికల సర్క్యులేషన్ వల్ల తెలుగు దినపత్రికల సర్క్యులేషన్ దెబ్బతింటోంది. కనుక ఇంగ్లీష్ దినపత్రికలను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీష్  బుక్ మార్కెట్ వల్ల తెలుగు బుక్ మార్కెట్ దెబ్బతింటోంది. కనుక ఇంగ్లీష్ బుక్ మార్కెట్ ను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో శీతలపానీయాల మార్కెట్ వల్ల కొబ్బరి బోండాల వ్యాపారం దెబ్బతింటోంది. కనుక శీతలపానీయాల మార్కెట్ ను నిషేధించాలి.

తెలుగు రాష్ట్రంలో తెలుగేతర కంపెనీల ఉత్పత్తుల వల్ల తెలుగు కంపెనీల ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. కనుక తెలుగేతర కంపెనీల ఉత్పత్తులను నిషేధించాలి.

ఒకటనేమిటి, తెలుగువారి ప్రయోజనాలను దెబ్బతీసే తెలుగేతరమైన వాటిని అన్నింటినీ నిషేధించాలి. ఇలా తెలుగు రాష్ట్రంలో ఆందోళనకారులు అందరికీ అన్ని వేళలా కావలసినంత పని!

టీవీ సీరియెళ్లపై ఎన్నో  ఏళ్లుగా ఆధారపడిన తెలుగు కళాకారులు, సాంకేతికనిపుణులకు డబ్బింగ్ సీరియెళ్ల వల్ల ఉపాధి సమస్యలు ఎదురవడం లేదని కాదు. వాటిని సానుభూతితో అర్థం చేసుకోవలసిందే. కానీ, పోటీ తత్వాన్ని పెంచుకుని మరింత నాణ్యమైన తెలుగు టీవీ సీరియెల్స్ ను నిర్మించడమే సమస్యలకు పరిష్కారం కానీ; పోటీని నిషేధించడం కాదు. పోటీ యుగంలో ఉన్న మనం పోటీకి పోటీతోనే సమాధానం చెప్పాలి. సమస్యలకు కారణాలను లోపల వెతకాలి కానీ బయట కాదు.

ఇందులో ఇంకో జోక్ ఏమిటంటే, తెలుగు చానెళ్లు డబ్బింగ్ సీరియెల్స్ ప్రసారం చేయడం వల్ల తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, మర్యాదలు వగైరాలు తెలుసుకునే అవకాశం  తెలుగు ప్రేక్షకులకు లభించడం లేదట! అందువల్ల తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు తీరని నష్టం జరుగుతోందట. ఆడ విలన్లను, వారిలో అర్థం లేని పగా, ప్రతీకారాలను చిత్రించి విపరీత భావకాలుష్యానికి కారకులవుతున్న టీవీ సీరియెల్స్ వారు సంప్రదాయాలు, మర్యాదల గురించి మాట్లాడడం ఎంత గొప్ప వినోదం!


4 comments:

  1. "ఆడ విలన్లను, వారిలో అర్థం లేని పగా, ప్రతీకారాలను చిత్రించి విపరీత భావకాలుష్యానికి కారకులవుతున్న టీవీ సీరియెల్స్ వారు సంప్రదాయాలు, మర్యాదల గురించి మాట్లాడడం ఎంత గొప్ప వినోదం!". బాగా వ్రాసారు.

    హిరొఇజమ్, కొట్టుకు చావటం అనేదే తెలుగు సంస్కృతీగా చూపిస్తున్న రోజుల్లో, తెలుగులో ఒక్క ఫైటింగు సీను కూడా లేని "ప్రేమాలయం[HUM AAPKE HAIN KOUN] హిందీ డబ్బింగు సినిమా" వచ్చి 100 రోజులు పైగా ఆడింది. అప్పటికీ, ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రి వారికి తెలుగు ప్రజల అసలు సంస్కృతీ ఏమిటో పూర్తిగా అర్ధం కాలేదు. ఇది మన తెలుగు ఇండస్ట్రి వారికి తెలుగు సంస్కృతి పట్ల ఉన్న గౌరవం.


    --
    భారతీయవాసి

    ReplyDelete
  2. Chala Clear ga cheparu...4 yrs kinda modlina telugu serial inka nadusthune vundi........ kani tthandri thana bidda thana munde vunna nenu thndrini ani cheppadu........edi telugu serial gathi

    ReplyDelete
  3. Maamuluga ayite, ippudu idi samskriti sampradayala kosam vachina tippalu kavu, para bhasha vaallu mana laabhalani, vaalla serials to dochestunnaru anna akkasu nunchi puttinde.
    yedina ade durvasane. mana telugulo vache serials mattuku em uddharinchayani kanuka, neti taram ammammalu, ammalu, atta garlu serials ni chusi nija jeevitapu samasyalaki pariskaramulanu andulo vetukkuntunnaru. idi chala vicharincha dagga vishayam.

    ReplyDelete