Tuesday, April 2, 2013

పాపం, దండకారణ్య ముఖ్యమంత్రులు!

కొన్ని వాస్తవాలు  ఎలాంటి లాజిక్కుకూ,  రీజనింగ్ కూ అందక ఆశ్చర్యం కలిగిస్తాయి. అన్యాయంగానూ కనిపిస్తాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లనే తీసుకోండి...

శివ్ రాజ్ సింగ్ చౌహాన్ వయసు 53 ఏళ్ళు. అయిదుసార్లు లోక్ సభకు ఎన్నికయారు. ఒక పర్యాయం బీజేపీ జాతీయ  ప్రధాన కార్యదర్శులలో ఒకరుగా ఉన్నారు. 2005 నుంచీ ఇప్పటికి రెండు పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవినుంచి  అర్థాంతరంగా తప్పుకున్న ఉమాభారతి స్థానంలో ఆయనను ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఇంత అనామకుణ్ణి ఏరి కోరి ఎక్కడినుంచి తెచ్చారనుకుని బయటి రాష్ట్రాల వారు విస్తుపోయిన మాట నిజం. కానీ ఆయన సారథ్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తమ పొరపాటును గుర్తించి ఆయనను సీరియెస్ గా తీసుకోవడం ప్రారంభించారు. ఇన్నేళ్లలో  అభివృద్ధి, సుపరిపాలనలకు చిరునామాగా బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ వంటి వారి నుంచి చౌహాన్  తరచు ప్రశంసలు అందుకుంటూ వచ్చారు. పైకి అనకపోయినా ప్రతిపక్షాలు కూడా కొంతవరకూ ఆ అభిప్రాయంతో ఏకీభవించాయనే అనాలి. ఏది ఏమైనా అవినీతి, దుష్పరిపాలన, ఇతరేతర వివాదాల వంటి తప్పుడు కారణాలతో విశేషంగా వార్తలకు ఎక్కని అరుదైన ముఖ్యమంత్రులలో ఆయన ఒకడు. అలాగని నూటికి నూరుపాళ్లూ ఆయన స్వచ్చమైన పాలన అందిస్తున్నారని అనడంలేదు. ఇప్పుడున్న వ్యవస్థలో అలాంటి పాలనను ఏ ముఖ్యమంత్రి నుంచైనా ఆశించడం కష్టమే. ఆయన  తప్పుడు కారణాలతో  వార్తలకు ఎక్కని అరుదైన ముఖ్యమంత్రి అనుకున్నామా, విచిత్రం ఏమిటంటే, మంచి కారణాలతో కూడా(అవి ఉన్నాసరే) ఆయన అంతగా వార్తలకు ఎక్కకపోవడం!

ఇక ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. ఆయన వయసు 60 ఏళ్ళు. కేంద్రంలో ఒక పర్యాయం వాజ్ పేయి ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉన్నారు. 2003 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. చౌహాన్ లానే అభివృద్ధికి, సుపరిపాలనకు చిరునామాగా ఈయన గురించి కూడా చెప్పుకుంటారు. నిజానికి బీజేపీ నేతలు 'పని తనం' కనబరిచే ఉత్తమ ముఖ్యమంత్రులుగా వీరిని సగర్వంగా ప్రకటించుకోవడం కూడా పరిపాటి అయింది. ఈయన  ప్రభుత్వం మీద కూడా చెప్పుకోదగిన ఆరోపణలు లేవు. అలాగే చౌహాన్ లానే ఈయన కూడా తప్పుడు కారణాలతోనే కాక, మంచి కారణాలతో వార్తలలో కనిపించడమూ  అరుదే. అయితే, ఇంతకు ముందే చెప్పినట్టు నూటికి నూరు శాతమూ మచ్చలేని ప్రభుత్వమని ఈయన ప్రభుత్వాన్నీ అనడం లేదు. shining in contrast గానే తీసుకోవాలి.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడి వయసు 63 ఏళ్ళు. ఆయన ఒక పర్యాయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఒకరుగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఎప్పుడూ లేరు. 2001 నుంచి ఇప్పటికీ నాలుగు పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అభివృద్ధికి చిరునామాగా ఈయనను గుర్తిస్తున్నారు. అది కూడా, అభివృద్ధికి ఏకైక చిరునామా అనే స్థాయిలో బీజేపీ నేతలే (almost at the cost of  Shivraj singh Chauhan and Raman singh) చెబుతున్నారు. ఇక మోడి 2002 నుంచీ మంచి కారణాలతో కన్నా తప్పుడు కారణాలతోనే ఎక్కువగా  వార్తలలో ఉంటున్నారు. ఏమైతేనేం, popularity graph లో అద్వానీనే కాదు, ఈ క్షణాన వాజ్ పేయిని కూడా మించిపోయి భారత ప్రధాని పదవికి బలమైన అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. తాజాగా బీజేపీ అత్యున్నత నిర్ణాయకసంఘమైన పార్లమెంటరీ బోర్డ్ లో మోడీకి సభ్యత్వం ఇవ్వడం ఆ దిశగా ఒక ముఖ్యమైన చర్యగా చెబుతున్నారు. 'పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కా'డనే సామెతనే మోడీ రుజువు చేస్తున్నారా? లేక, negative popularity అయినా సరే, popularity అనేది ఉండడం రాజకీయాలలో ఎదగడానికి అత్యవసరమని రుజువు చేస్తున్నారా?

శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ ల విషయంలో ఎక్కడ విధి వక్రించిందో తెలియదు. పాపం వారిద్దరికీ మోడీకి లభించిన స్థానం లభించలేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లు ఒకప్పటి దండకారణ్యంలో భాగమే కనుక, దండకారణ్య ముఖ్యమంత్రులుగా (అచ్చతెలుగులో చెప్పాలంటే అడవి మాలోకాలుగా) గుజరాత్ లాంటి ఒక సంపన్న, పారిశ్రామిక రాష్ట్ర ముఖ్యమంత్రితో పాపులారిటీలో పోటీ పడలేకపోయారా? వీరిద్దరి దగ్గరా ఇంకో లోపం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అది, 'నిశ్శబ్దంగా పని చేసుకుంటూ' పోవడం! రాజకీయాలలో పనిచేయకపోయినా నష్టం లేదు కానీ నిశ్శబ్దంగా ఉండకూడదు. ఇదే వీరిద్దరి విషయంలో పెద్ద disqualification అయిందా?! ఏమో తెలియదు. లోపలి సంగతులు మనకు తెలియవు కానీ పైకి మాత్రం వీరిద్దరినీ తలచుకుంటే అయ్యో అనిపిస్తుంది.







No comments:

Post a Comment