Wednesday, April 3, 2013

తెనాలి-మార్కాపురం రైల్లో 'నీరు' గారుతున్న యువశక్తి

                                                     
                                              ఫోటో: ది హిందు(రిపోర్టర్ ఎస్. మురళి) సౌజన్యంతో

నిన్నటి(ఏప్రిల్ 3) హిందూ పత్రికలో ఒక వార్త వచ్చింది. చాలామంది చూసే ఉంటారు. చూడనివాళ్ళు ఎవరైనా ఉండచ్చు కనుక వాళ్ళ కోసం సంగ్రహంగా ఆ వార్తను ఇక్కడ ఇస్తున్నాను. ఈ వార్త చదివిన తర్వాత కూడా, ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేకుండా ఏ పార్టీ ప్రభుత్వమైనా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఏమైనా చేస్తుందని మీకు నమ్మకం కలుగుతుందా? ఇలాంటి ప్రభుత్వాలను దారికి తేవడానికి వోటు హక్కు ఉన్న పౌరులు కొత్త మార్గాలు తొక్కవలసిందే నన్న ఆలోచన రాకుండా ఉంటుందా??

ప్రకాశం జిల్లాలోని  దొనకొండ మండలం చాలాకాలంగా ఫ్లోరైడ్ నీటి సమస్యను ఎదుర్కుంటోంది. జనం ఆర్తరైటిస్, కిడ్నీ సంబంధ రోగాలతో బాధపడుతున్నారు. శుభ్రమైన నీటిని అందించడానికి ఇక్కడ ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. కేవలం రూ. 48 లక్షల వ్యయమైన ఆ ట్యాంకుకు కూడా నెదర్లాండ్స్ నుంచి ఆర్థిక సాయం తీసుకున్నారు. పైప్ లైన్ తుప్పు పట్టడంతో ఈ ట్యాంక్ ఇప్పుడు నిరుపయోగంగా ఉండిపోయింది. ట్యాంక్ ను తిరిగి ఉపయోగకరంగా మార్చడానికి మరోసారి  నెదర్లాండ్స్ బిచ్చం కోసం ఎదురుచూస్తున్నారేమో తెలియదు. బ్రిటిష్ కాలంలో ఇక్కడ అయిదు గొట్టపు బావులు తవ్వారట. ఈ ప్రాంతంలో విచక్షణారహితంగా గొట్టపు బావులు తవ్వడంతో అవి ఎండిపోయాయట.

మొత్తానికి ఈ మండల ప్రజలను అనారోగ్యసమస్యలనుంచి కాపాడే శుభ్రమైన నీటికి ఏవైపునుంచీ దిక్కు లేకుండా పోయింది. దాంతో వారు ఏం చేస్తున్నారో చూడండి. దొనకొండ నుంచి ప్రతి రోజూ ఇంటికి ఒకరు చొప్పున 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజులకొండ అనే ఊరికి తెనాలి-మార్కాపురం పాసింజర్లో వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు! అక్కడ కూడా నాలుగైదు బిందెల నీళ్ళు సంపాదించాలంటే పెద్ద యుద్ధం చేయాలి. అందుకు తగిన కండబలం ఉండాలి. రాను, పోనూ రైలు సకాలంలో అందితే ప్రయాణసమయం గంటన్నర. రైళ్లు సకాలంలో నడవడం అరుదు కనుక ఆలస్యాన్ని కలుపుకుంటే ఎన్ని గంటలు పడుతుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ తిరుగు రైలు తప్పిపోతే మరో రైలు కోసం ఎదురుచూడవలసిందే. 

పైప్ లైన్ తుప్పు పట్టిన ఆ ట్యాంక్ నే ఎలాగో ఉపయోగించుకోవాలంటే కనీసం నాలుగు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అడుగుతున్నారు. అది జరిగే లోపల వేసవి గడచి పోవచ్చు. ఒక వేసవి ఏమిటి, మరెన్నో వేసవులు గడచిపోవచ్చు! ట్యాంక్ మరింత నిరుపయోగంగా మారి దాంట్లో పిచ్చిమొక్కలు లేచి చెట్లుగా ఎదగచ్చు!

ఇంటికొకరు చొప్పున రైల్లో వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే ఈ కార్యక్రమంవల్ల జరిగే ఆర్థిక నష్టం ఎన్నివిధాలుగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇంట్లో ఒకరు రోజు కూలీనో, ఇతరేతర ఆదాయాలనో కోల్పోవలసివస్తుంది. మానవ పని దినాలు ఎన్నో వ్యర్థమవుతాయి. స్కూలు, కాలేజీ దినాలు వ్యర్థమవుతాయి. దేశానికి, దేశ ఉత్పాదకతకు ఉపయోగపడవలసిన విలువైన యువశక్తి తన సమయాన్నీ, శక్తినీ ఇలా నీళ్ళమోతకు వృథా చేస్తుంటే ఆ దేశం అభివృద్ధి పథంలో ఉందనీ, ఆ దేశానికి గొప్ప భవిష్యత్తు ఉందనీ అనగలమా? అసలిక్కడ ఓ ప్రభుత్వమూ, పాలనా అనేవి ఉన్నాయని అనగలమా??

ఏం చేయాలి???

ఎన్నికల ముందు పార్టీలు ఇవి చేస్తామనీ అవి చేస్తామనీ వాగ్దానాలు చేస్తుంటాయి. మేనిఫెస్టోలు విడుదల చేస్తుంటాయి, ఇందుకు భిన్నంగా వోటు హక్కు ఉన్న పౌరులందరూ కలసి ఎన్నికల ముందు తమ డిమాండ్లను ముందుకు తెచ్చి, ఇవి చేస్తేనే తాము వోటు వేస్తామనీ, లేకపోతే వోటింగ్ ను మూకుమ్మడిగా బహిష్కరిస్తామనీ చెబితే?! (బహుశా ఎన్నికలకు చాలాముందునుంచే ఈ డిమాండ్లు ముందుకు తేవలసి ఉంటుంది.) అలాగే, వోటర్లు పార్టీలకు పోటీగా తమ డిమాండ్ల మేనిఫెస్టోను విడుదల చేస్తే?! ప్రస్తుత ఎన్నికల కార్యక్రమం అంతా పార్టీల పరంగానూ, ఏకపక్షంగానూ జరుగుతోంది. వోటర్లు చాలావరకు నిశ్శబ్దపాత్రనే నిర్వహిస్తూ ఉంటారు. వోటు వేసిన తర్వాత కూడా అయిదేళ్లపాటు దాదాపు నిశ్శబ్దపాత్రనే నిర్వహిస్తూ ఉంటారు. అందుకే చాలా సందర్భాలలో ఎన్నికల తీర్పును నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణిస్తుంటారు. ఇలాంటి ఏకపక్ష ఎన్నికల తతంగాన్ని ద్విపక్షంగా మార్చగలమా?! వోటు హక్కు ద్వారా గొప్ప bargaining power ను తెచ్చుకుని కూడా వోటర్లు ఎందుకిలా సమస్యలను మౌనంగా నిశ్శబ్దంగా భరిస్తున్నారు?

ప్రస్తుతానికి ఇదొక అస్పష్ట ఆలోచన మాత్రమే. అందరూ కలసి ఆలోచన చేసి దీనికొక స్పష్టత తేగలమా?

మీరూ ఒకసారి ఆలోచించండి.




No comments:

Post a Comment