Monday, May 13, 2013

రెండు ఆశ్చర్యాలు, ఒక ఆవేదన

మళ్ళీ gap వచ్చినందుకు మన్నించాలి.
                         *

పాక్ ఎన్నికలపై భారత్ మీడియా అత్యుత్సాహం 

పాకిస్తాన్ పై భారత్ మీడియా, ముఖ్యంగా ఆంగ్ల మీడియా కనబరచే ఆసక్తి నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటుంది. సాధారణంగా మీడియా కవరేజ్, వీక్షకులు లేదా పాఠకుల ఆసక్తి, అవసరాల ప్రమాణానికి సరిపోయేలా ఉంటుంది. ఉండాలి కూడా. కానీ భారత్ లోని వీక్షకులు, పాఠకులు పాకిస్తాన్ పై మరీ అంత  గొప్ప ఆసక్తిని కనబరుస్తూ ఉంటారని మీడియా (ఒక్క మినహాయింపు లేకుండా అన్ని మీడియా సంస్థలూ) ఎలా అంచనాకు వచ్చిందో తెలియదు. ఒక పొరుగు దేశం గా పాకిస్తాన్ పరిణామాలను భారతీయులు కొంత ఆసక్తితో గమనించే మాట నిజమే. కానీ ఆ కొంత ఎంత? భారత్ లో పరిమాణాలపై చూపించేటంత ఆసక్తిని కచ్చితంగా పాక్ పరిణామాలపై చూపించరు. కానీ మీడియా పాక్ ఎన్నికలను దాదాపు భారత్ ఎన్నికల స్థాయిలో కవర్ చేసింది. ఆదివారం నాడు ఏ చానెల్ చూసినా నవాజ్ షరీఫ్ విజయంతో అదే పనిగా ఊదరగొట్టింది. సోమవారం నాడు హిందూ 'Lion of Punjab' roars in Pak' అని బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది. ఎవరికి  lion? ఏ పంజాబ్ కు lion? 
పాకిస్తాన్ లో అధికార పరివర్తన భారత్-పాక్ సంబంధాలపై ప్రభావం చూపించగలదనుకోవడం దానికదే తప్పు కాదు. కానీ అనుభవం ఏం చెబుతోంది? పాక్ లో సైనిక ప్రభుత్వం ఉన్నా, ప్రజాప్రభుత్వం ఉన్నా రెండు దేశాల సంబంధాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మెరుగుపడకపోగా మరింత క్షీణిస్తూ వచ్చాయి. ఎన్నికల్లో ప్రజాపక్షం గెలిచి అధికారంలోకి వస్తే సంబంధాలు మెరుగుపడతాయని ఎప్పటికప్పుడు ఆశపడడం లోనూ తప్పులేదు. మనిషి ఆశాజీవి. అయితే ఆ ఒక్క కారణంతో పాక్ ఎన్నికలను భారత్ ఎన్నికలంతగా హడావుడి చేయక్కర్లేదు. కవర్ చేయక్కర్లేదు. అది జనానికి ఆసక్తి కలిగించక పోగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. నిజంగా ఆశావహ సంకేతాలు కనిపించేదాకా మీడియా ఆగచ్చు. భారతీయులు పాక్ పరిణామాలపట్ల పట్టలేనంత ఆసక్తితో ఉత్కంతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారనే  భ్రమ మీడియాను ఎప్పుడు ఎందుకు ఎలా ఆవరించిందో తెలియదు. ఆ భ్రమను వదిలించుకోవడం అవసరం. అందువల్ల విలువైన పత్రికా స్థలం, ప్రసార సమయం ఆదా అవుతాయి. 

యడ్యూరప్పపై బీజేపీలో అంతర్మథనం

రెండో ఆశ్చర్యం, కర్ణాటక ఓటమి నేపథ్యంలో యడ్యూరప్పపై  బీజేపీలో జరుగుతున్న అంతర్మథనం! యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం పార్టీలో ఒక వర్గానికి(మోడి, అరుణ్ జైట్లీ వగైరా) మొదట్లోనే ఇష్టంలేదనీ, అయితే మరో వర్గం( అద్వానీ వగైరా) పట్టుబట్టడంతో తప్పించారని ఎన్నికలఫలితాల రోజున మీడియాలో వ్యాఖ్యలు వినిపించాయి. అందుకు తగినట్లే, అరుణ్ జైట్లీ ఒక చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ యడ్యూరప్పను దూరం చేసుకోవడం 'reasonably high' అనీ, one "must blend governance with some prudent politics" అనీ అన్నారు. యడ్యూరప్పను వెంటనే తొలగించే బదులు మీన మేషాలు లెక్కిస్తూ ఆలస్యం చేయడం వల్లే  ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని అద్వానీ అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, యడ్యూరప్పను ఏ పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారో ఇంతలోనే పార్టీ నాయకులు మరచిపోవడం. బీజేపీ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున పోరాటం జరుపుతున్నప్పుడే యడ్యూరప్ప అవినీతీ చర్చలోకి రావడం ప్రారంభించింది. దాంతో బీజీపీ పదే పదే ఆత్మరక్షణలో పడుతూ వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా తను జరిపే జాతీయస్థాయి పోరాటం యడ్యూరప్ప వ్యవహారంతో డైల్యూట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయనను తప్పించడానికి అసలు కారణం అదీ! 

టిడిపి నుంచి కడియం శ్రీహరి నిష్క్రమణ

ఇక ఆవేదన కలిగించిన విషయం టీడీపీ నుంచి కడియం శ్రీహరి నిష్క్రమించడం. రాజకీయాలలో విలువలను, నీతినియమాలనూ ఆశించడం అత్యాశే కానీ ఒక్కొక్కసారి రాజకీయాలు మరీ ఇంత నీతి బాహ్యాలూ, అవకాశవాదపూరితాలా అనిపించి ఆవేదనా కలుగుతుంది. ఇటువంటి నీతి బాహ్య రాజకీయాలు అంతిమంగా ప్రజల్ని ఏమాత్రం ఉద్ధరిస్తాయనిపిస్తుంది. ప్రత్యేకించి కారణం లేదు కానీ, కడియం శ్రీహరి టీడీపీ నుంచి తప్పుకున్న వార్త చూడగానే ఇలాగే అనిపించింది. ముప్పై ఏళ్లుగా ఆయన టీడీపీలో ఉన్నారు. పార్టీ టిక్కెట్టుపై అసెంబ్లికి ఎన్నికవుతూ వచ్చారు. మంత్రిపదవులు నిర్వహించారు. అటువంటి వ్యక్తి పార్టీతో, అందులోనూ తనకు రాజకీయజీవితాన్ని ఇచ్చి పదవులిచ్చి ఆదరించిన పార్టీతో అన్నేళ్ళ అనుబంధాన్ని తెంచుకుని ఇంకో పార్టీలో ఎలా చేరారో తలచుకుంటే విస్మయం కలుగుతుంది. కడియం శ్రీహరే కాదు ఎవరు ఆ పని చేసినా(మరీ ప్రబలమైన వ్యక్తిగత కారణాలు ఉంటే తప్ప) ఇలాగే అనిపిస్తుంది. రాజకీయ పార్టీతో ఒక వ్యక్తి అనుబంధం మరీ ఇంత మిథ్యా? ముప్పై ఏళ్ళు కాపురం చేసిన భార్య, ముప్పై ఏళ్లపాటు రాజకీయజీవితం ఇచ్చిన పార్టీ ఒకలాంటివి కావా? ముప్పై ఏళ్ల అనుబంధాన్ని ఒక్క క్షణంలో తెంచుకోవచ్చా? ఆలోచించిన కొద్దీ రాజకీయాలు అసహ్యం కలిగిస్తున్నాయి. 

4 comments:

  1. పాక్ మీద అంత ఆసక్తి చూపే ఇంగ్లిష్ మీడియా, బంగ్లాదేశ్ లో జరిగే సంఘటనలపై ఎందుకు ఆసక్తిని చూపదు? గత రెండు వారాలుగా అక్కడ ఎన్నో గొడవలు జరుగుతున్నా మీడియాలో పెద్దగా కవరేజ్ లేదు. కారణాలు ఏమై ఉంటాయో మీకు తెలిస్తే చెప్పండి. పాక్ అంటే మన మీడీయాలో పంజాబ్ ప్రాంతం మాత్రం కవర్ చేస్తారు,సింధ్,బెలుచిస్తాన్, Khyber Pakhtunkhwa, North-West Frontier ప్రావిన్స్ ల గురించి ఏ వార్తలు ఉండవు. ఇంగ్లిష్ మీడీయా కవరేజ్ నిష్పక్షపాతం గా ఉంట్టుందని అనుకోవచ్చా?

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే. అయితే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ల గురించిన కవరేజ్ లో సహజంగానే కొంత తేడా ఉంటుందనుకోండి. భారత్-పాక్ సంబంధాలు ఎప్పుడూ వార్తల్లో, చర్చల్లో ఉంటాయి కనుక. పాక్ అంటే మన మీడియాలో పంజాబ్ ప్రాంతం మాత్రం కవర్ చేస్తారన్న మీ వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. అందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాల్సిందే. ఇక్కడ మీడియా కవరేజ్ పాక్షికమా/నిష్పాక్షికమా అన్న ప్రశ్న కన్నా; proportionalగా ఉందా dis-proportional గా ఉందా అన్నది relevant అనుకుంటాను.

      Delete
  2. proportionalగా ఉందా dis-proportional గా ఉందా అన్నది relevant అనుకుంటాను. మీరు సరిగానే చెప్పారు. అంతే కాకుండా ఈ రోజులలో మీడీయా ప్రజల ఎమోషనల్ అంశాలను ఎత్తి చూపటానికి ప్రాధన్యత నిస్తున్నది. కనుక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదా? అని అడిగాను. బంగ్లాదేశ్ లో విధ్వంసం జరుగుతూంటే దానిని కనీస్మ్ కవర్ చేయకుండా, బంగ్లాదేశ్ ప్రజల అశాంతి అంశాన్ని పక్కన పెడుతున్నాది.అంతటితో ఆగక పాకిస్తాన్ లో జరిగిన ఎన్నికలను ఎక్కువ చేసి చూపిస్తూ, నవాజ్ షరిఫ్ గెలిస్తే ఎదో అద్భుతాలు జరుగుతాయని భ్రమింప చేస్తున్నారు. అసలికి మనదేశానికి పాకిస్తాన్ తో భావోద్వేగాలతో కూడిన సంబందాలు విడిపోయి 65సం||తరువాత కూడా అవసరమా?

    "మన మీడియాలో పంజాబ్ ప్రాంతం మాత్రం కవర్ చేస్తారన్న మీ వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది"
    మీరు సమయం చిక్కినపుడు ఈ ప్రశ్న మీద ఫోకస్ చేయండి. మీకు సంతృప్తి కరమైన సమాధానం లభిస్తే ఒక టపా రాయండి. విశ్లెషణను మీకోణం లో నుంచి చదవాలి.
    ____________________

    బాబు గారి పరిస్థితి చూస్తూంటే షేక్ స్పియర్ నాటకాలన్ని ప్రత్యక్షం గా చూస్తున్నట్లు అనిపిస్తుంది. కడియం శ్రీహరి పార్టి మారటం హర్షించదగ్గ విషయం కాదు.

    ReplyDelete
    Replies
    1. మీడియా పంజాబ్(పాకిస్తాన్) ఫోకస్ పై మీ సూచనకు థాంక్స్. చూద్దాం సమాధానం ఏమైనా దొరుకుతుందేమో.

      Delete