Wednesday, May 29, 2013

త్రివేణి వక్కపొడి ప్రకటన...క్రికెట్ కవరేజ్...

కొన్నేళ్ళ క్రితం రేడియోలో త్రివేణి వక్కపొడికి సంబంధించిన వాణిజ్య ప్రకటన వస్తుండేది(ఇప్పుడు కూడా వస్తోందేమో, గమనించలేదు). త్రివేణి వక్కపొడి ఇమ్మని దుకాణదారుని వివిధ భాషల్లో అడుగుతూ ఉంటారు. త్రివేణి వక్కపొడిని అన్ని రాష్ట్రాలవారూ ఆదరిస్తున్నారని చెప్పడం ఆ వాణిజ్యప్రకటన ఉద్దేశం. ఇలా ఇంతమంది ఇన్ని భాషల్లో అడగడం గమనించిన ఓ వ్యక్తి, "ఏమిటీ, త్రివేణీ వక్కపొడికి ఇంత డిమాండా?!" అంటూ ఆశ్చర్యంగా నోరు వెళ్లబెడతాడు.

హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేసే ఒకరిద్దరు మిత్రులు చెప్పిన ప్రకారం ఈ ప్రకటన వెనుక ఓ చిన్న తమాషా ఉంది.  ప్రకటనను రికార్డ్ చేస్తున్న సమయంలో ప్రముఖచిత్రకారుడు చంద్ర అక్కడికి వెళ్లారట. త్రివేణీ వక్కపొడిని అంతమంది అన్ని భాషల్లో అడగడం గమనించిన చంద్ర అప్రయత్నంగా ఆ చివరి వాక్యం అన్నారట. రికార్డ్ చేయిస్తున్న వ్యక్తికి ఆ మాట బాగా నచ్చిందట. "బాగుంది, మళ్ళీ అనండి, ప్రకటనలో కలుపుదాం" అని పట్టుబట్టారట. ఆ విధంగా అది ఆ ప్రకటనలో చేరింది. "అలాగా" అనుకోవడమే కానీ ఇందులో నిజానిజాలు ఏమిటో ఎప్పుడూ ఆరా తీయలేదు. చంద్ర బాగా తెలిసిన మిత్రుడే అయినా ఆయననూ ఎప్పుడూ అడగలేదు.

ఇప్పుడు ఈ  త్రివేణి వక్కపొడి ప్రకటన ఎందుకు గుర్తొచ్చిందంటారా? కారణం, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజులతరబడి నిరవధికంగా కొనసాగుతున్న IPL క్రికెట్ బెట్టింగ్/ఫిక్సింగ్ కుంభకోణం కవరేజ్. ఈ దేశంలో క్రికెట్ కు ఎంతో డిమాండ్ ఉన్న సంగతి నిజమే కానీ, మీడియా కవరేజ్ చూస్తుంటే "మరీ ఇంత డిమాండా?!" అని ఆశ్చర్యంతో('దిగ్భ్రాంతి' ఇంకా మంచి మాటేమో!)నోరు వెళ్లబెట్టక తప్పడం లేదు.

మధ్యలో ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలతో సహా పాతికమందిని పైగా హతమార్చిన ఘటన జరిగి ఉండకపోతే వార్తా చానెళ్ల క్రికెట్ కవరేజ్ యజ్ఞం మరింత నిర్విఘ్నంగా, నిరాఘాటంగా కొనసాగి ఉండేది. కానీ దిక్కుమాలిన ఆ ఘటన ఆ కవరేజ్ తపస్సును భగ్నం చేసింది. క్రికెట్ మీద ఫోకస్ తగ్గించకుండానే, వినాయకునితోపాటు ఆయన వాహనమైన ఎలుకను చూపించినట్టుగా, ఛత్తీస్ గఢ్ వార్తనూ చూపించవలసి వచ్చింది. అలా ప్రైమ్ టైమ్ ను సర్దుబాటు చేసుకోవడంలో సంపాదకవర్గం పాపం ఎంత కసరత్తు చేయవలసి వచ్చిందో!

 క్రికెట్ కుంభకోణం పై ఇరవై నాలుగు గంటల వార్తా చానెళ్ల నిరంతర వార్తాప్రసారం ఎప్పటికీ ఆగుతుందో తెలియడం లేదు. బీసీసీఐ ఛైర్మన్ శ్రీనివాసన్ రాజీనామా చేస్తే ఆగుతుందా? ఆ ఆశా కనిపించడం లేదు.క్రికెట్ కుంభకోణాన్ని మించిన రాజకీయ కుంభకోణం ఏదైనా బద్దలైతే తప్ప రాజకీయాలపై ఇప్పట్లో మీడియా ఫోకస్ కు అవకాశం కనిపించడం లేదు. రాజకీయనాయకులు తొందరపడాలి. ఏదో ఉపాయం ఆలోచించాలి. అందులోనూ రానున్నది ఎన్నికల సమయం! 

No comments:

Post a Comment