Saturday, June 1, 2013

కేశవరావు కాంగ్రెస్ 'నిమజ్జనం'

మొన్న కడియం శ్రీహరి...ఈ రోజు కె. కేశవరావు!

పార్టీలు మారడం కొత్త కాదు. పార్టీలు పుట్టినప్పుడే  పార్టీ ఫిరాయింపులూ పుట్టాయి. అందులోనూ ఎన్నికల రుతువులో పార్టీలు మారే కప్పల హడావుడి ఎక్కువగా ఉంటుంది. అదను చూసుకుని దూకడానికి గోడమీద పిల్లులు బారులు కడుతూ ఉంటాయి.

ఎంతోమంది పార్టీలు మారుతున్నప్పుడు పై ఇద్దరినే ఎందుకు వేలెత్తి చూపుతున్నారంటే, పార్టీ ఫిరాయింపుదారుల గుంపులో గోవిందంలా ఒకపట్టాన ఊహించలేని  ప్రత్యేకత లేదా ప్రత్యేక కారణాలు వీరికి ఉండడం వల్లనేమో! ఏమైతేనేం, వీళ్లూ గుంపులో చేరారు కనుక మన పొరపాటు ఊహను మనమే సవరించుకోవాలి.

శ్రీహరి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు కేశవరావు గురించి.

కేశవరావు కూడా విద్యాధికుడు. మేధావుల కోవలో ఆయనను చేర్చి చెప్పుకుంటారు. పాత్రికేయుడిగా కూడా ఉన్నారు. 'నిమజ్జనం' అనే ఆర్ట్ ఫిల్మ్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.  బహుశా చాలాకాలంగా కాంగ్రెస్ ఆయనను ఆదరిస్తూ ఉండడానికి విద్యాధికత వంటి అర్హతలే కారణం కావచ్చు. ఎందుకంటే ఆయనను గొప్ప జనబలం ఉన్న నాయకుడిగా చెప్పలేం. ఆయన ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించినట్టు లేదు. గతంలో శాసనమండలి సభ్యునిగా, శాసనమండలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. చెప్పుకోదగిన జనబలం లేకపోయినా కాంగ్రెస్ రాష్ట్రంలో మంత్రిపదవి ఇచ్చి ఆదరించింది. పీసీసీ అధ్యక్షుని చేసింది. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక వేదిక అయిన వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు పార్టీ పరిశీలకునిగా నియమించింది. ఏ పార్టీ అయినా ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతుంది? అయినాసరే, కేశవరావు కాంగ్రెస్ ను నిమజ్జనం చేసేసి టి‌ఆర్‌ఎస్ లో చేరుతున్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం లేదు కనుక పార్టీ మారుతున్నానని కేశవరావు చెబుతున్నారు. ఇక్కడే కొన్ని సందేహాలు:

1. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న షరతుతో కేశవరావు కాంగ్రెస్ లో చేరలేదు. తెలంగాణా ఇస్తుందన్న కచ్చితమైన హామీ తీసుకునే ఆ పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ పదవులు పొందలేదు. ఎన్నో ఇచ్చిన కాంగ్రెస్ ను తెలంగాణా ఇవ్వడంలేదన్న కారణంతో ఎందుకు వదిలేస్తున్నారు?

2. కాంగ్రెస్ ఇవ్వని తెలంగాణ టి‌ఆర్‌ఎస్ తప్పనిసరిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటే ఆయన పార్టీ ఫిరాయింపును కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ టి‌ఆర్‌ఎస్ తెలంగాణ ఇవ్వగలదా? అది కూడా చేయగలిగింది తెలంగాణకు ఒత్తిడి తేవడమే. కనుక ఇంతవరకూ చేసినట్టే కాంగ్రెస్ లో ఉంటూనే కేశవరావు కూడా తెలంగాణకు ఒత్తిడి తేవచ్చు. ఆయన పార్టీ మారడం వల్ల తెలంగాణ లక్ష్యానికి కొత్తగా ఒరిగేది ఏముంటుంది?

3. ఒకవేళ తెలంగాణ టి‌ఆర్‌ఎస్ వల్లనే సాధ్యమని ఆయన అనుకుంటే ఆయన ఆ పార్టీలో చేరకపోయినా తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా ఆయనకూ గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్ ను వదిలి టి‌ఆర్‌ఎస్ లో చేరడం వల్ల అదనంగా ఏమొస్తుంది? (మరో విడత రాజ్యసభ సభ్యత్వం కాకపోతే)

కనుక మేధావిగా చెప్పుకునే కేశవరావు తను పార్టీ మారడానికి చెబుతున్న కారణం "తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డికోసం" అన్నట్టుగా లేదా?

అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న: దశాబ్దాలుగా ఉన్న పార్టీతో అనుబంధాన్ని ఒక మిథ్యా కారణంతో ఎలా తెంచుకుంటున్నారు? కడియం శ్రీహరి విషయంలో వేసుకున్న అదే ప్రశ్న మళ్ళీ ఇక్కడా....

విద్యావంతులు రాజకీయాలలో చేరితే అవి బాగుపడతాయంటారు. శ్రీహరి, కేశవరావు విద్యావంతులు కారా?!

3 comments:

  1. తెలంగాణలో నిలువునా మునుగుతున్న ఓడ కాంగ్రెస్!రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా రానున్న ఎన్నికలలో బంపర్గా గెలవబోతున్న రాజకీయ పక్షమ్ TRS కనుక రాజకీయాలలో రాటు తేరి పండిపోయిన వ్యక్తులు ఏమి చేస్తారు ఇంకా మడికట్టుకుని కాంగ్రెస్ ఓడలో మునిగిపోతారా!KCR నచ్చినా నచ్చకున్నా తెలంగాణాకోసం గట్టిగా నిలబడిన వ్యక్తి!తెలంగాణా తప్పక కావాలనుకుంటున్న వోటర్లు మూక్కుమ్మడిగా ఎడాపెడా ముద్ర గుడ్డిగా గుద్దిగుద్ది పారేయక గత్యంతరం లేదు!BJP తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటారు!ఇకనేం వారికి నల్లేరుపై బండి నడక!వచ్చే ఎన్నికలలో విజయం గురించి మాత్రమే ఆలోచించేవాడు నాయకుడు కదా!నేను ఎవరి వీరారాధకున్ని కాను!KCR కు నా దర్శనభాగ్యం కలుగలేదు!

    ReplyDelete
  2. మీలా పై పై విశ్లేషణలు చేసే వారంతా తెలంగాణ ప్రజల గుండెల లోతుల్లో నాటుకొనిఉన్న ఆకాంక్షను మాత్రం గుర్తించలేరు. మీరు ఇష్టపడని రాష్ట్ర విభజన అంశం మిమ్మల్ని- "మేధావులయిన రమణాచారి గారు కూడ తమ ప్రజల ఆకాంక్షకు తల వంచా"రని, "విద్యావంతులయిన కేశవరావు, శ్రీహరి కూడ నిబద్ధతగా నమ్ముకొనిఉన్న పార్టీలను కూడ వదిలాల్సిన ఆవశ్యకత ఏర్పడిం"దని - అంగీకరింపనివ్వదు.

    ReplyDelete
    Replies
    1. పై ఇద్దరి స్పందనకూ ధన్యవాదాలు. తెలంగాణలో మీరన్న పరిస్థితే ఉండచ్చు, ఒప్పుకుంటున్నాను. నేను ఎక్కడా తెలంగాణ ఆకాంక్షను కాదనడం కానీ రాష్ట్రవిభజనను వ్యతిరేకించడం కానీ చేయలేదు. సాయి గారు నేను రాష్ట్రవిభజనకు వ్యతిరేకినని ఏ ఆధారంతో అంటున్నారో తెలియదు. కేశవరావు పార్టీ మారడంపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తడమే తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం అనుకుంటే, కేశవరావును వరవడిగా తీసుకుని పార్టీ మారకుండా కాంగ్రెస్ లోనే ఉంటున్న తెలంగాణ కాంగ్రెస్ వాదులందరినీ తెలంగాణ వ్యతిరేకులనాలి. అలా అనగలమా? ఎవరివరకో ఎందుకు, ఇప్పటివరకూ కాంగ్రెస్ లోనే కొనసాగిన కేశవరావును కూడా అలాగే అనాలి. వాస్తవం ఏమిటంటే, కాంగ్రెస్ నుంచి ఎంతమంది టి‌ఆర్‌ఎస్ లో చేరినా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉంటుంది. రద్దయిపోదు. ఆ కాంగ్రెస్ లో తెలంగాణాను కోరుకునే వారూ ఉంటారు.కాంగ్రెస్ లోనే ఉన్నారు కనుక, పార్టీ మారడానికి ఇష్టపడలేదు కనుక వారందరినీ తెలంగాణ వ్యతిరేకులంటామా? కనుక పార్టీ మారడానికీ, తెలంగాణకూ ఎలాంటి ముడీ లేదు. పార్టీ మారడాన్ని సమర్థించుకోడానికి కృత్రిమంగా లేని ముడిని పెట్టుకుంటే అది వేరే విషయం. అదీగాక నేను పార్టీ మారే వారు అందరిగురించీ రాయలేదు. కేశవరావు గురించి, శ్రీహరి గురించి రాయడానికి ప్రత్యేకకారణం ఉంది కనుకే రాశాను. ఆ కారణాలు వివరించాను. ఇక రమణాచారినీ, కేశవరావునూ ఒకే గాటన కట్టలేము. రమణాచారి కొత్తగా రాజకీయాలలోకి వచ్చారు. వస్తూనే టి‌ఆర్‌ఎస్ లో చేరారు. కేశవరావు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు.

      Delete